Telugu Global
MOVIE REVIEWS

Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ {2/5}

Shaakuntalam Movie Review: సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సక్సెస్ అయిందా? తెలుగుగ్లోబల్ రివ్యూ..

Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ
X

Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ

చిత్రం: శాకుంతలం

నటీనటులు: సమంత, దేవ్ మోహ‌న్, మోహన్ బాబు , అల్లు అర్హ, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు

స‌మ‌ర్ప‌ణ : దిల్ రాజు

బ్యాన‌ర్స్ : గుణ టీమ్ వ‌ర్క్స్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : గుణ శేఖ‌ర్‌

నిర్మాత : నీలిమా గుణ‌

సంగీతం : మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ : శేఖ‌ర్ వి.జోసెఫ్‌

మాట‌లు : సాయి మాధ‌వ్ బుర్రా

ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి

రన్ టైమ్: 2 గంటల 22 నిమిషాలు

రేటింగ్: 2/5

ఇతిహాసానికి చెందిన అభిజ్ఞాన శాకుంతలం నుంచి తెరకెక్కిన సినిమా శాకుంతలం. ఇప్పటితరంలో కొంతమందికి ఈ కథ తెలిసి ఉండొచ్చు, మరికొంతమందికి తెలియకపోవచ్చు. అదిక్కడ మేటర్ కాదు, ఓ ఇతిహాసంలో సమంత నటిస్తోందంటే ఈతరం ఆడియన్స్ ఏం ఆశిస్తారనేది మేటర్. మంచి సీన్స్, ఎమోషన్స్, గ్రాఫిక్స్, వీలైతే మంచి పాటలు.. ఇవి ఉంటే చాలు శాకుంతలం హిట్టవుతుంది. కానీ ఇవే లేవు.

అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల-దుష్యంతుడి మధ్య బంధాన్ని కళాత్మకంగా, భావోద్వేగభరితంగా చెప్పాడు కాళిదాసు. ఆ పుస్తకం చదివితే (సంస్కృతం కాదు, తెలుగు వచనంలో) ఓ రకమైన రసాత్మకత, భావావేశం కలుగుతాయి. శాకుంతలం సినిమాలో అదే మిస్సయింది. సమంత-దేవ్ మోహన్ మధ్య ఎమోషన్స్ సరిగ్గా పండలేదు.

ఇదొక అందమైన ప్రేమకావ్యం. కాబట్టి రొమాంటిక్ కెమిస్ట్రీ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ కంటే.. శకుంతల పడే బాధను ఎక్కువగా చూపించడానికే దర్శకుడు తపన పడ్డాడు. దీనికి సరైన ఎగ్జాంపుల్, గర్భం దాల్చిన తర్వాత సమంత పడిన బాధ, ఆమెపై తీసిన సన్నివేశాలు. ఆమె బాధను అంత సాగదీసి చెప్పే బదులు, ఫస్టాఫ్ లో రొమాన్స్ ను కాస్త పెంచితే బాగుండేది.

దీనికితోడు గ్రాఫిక్స్ మరో పెద్ద దెబ్బ. ఇలాంటి సినిమాకు గ్రాఫిక్స్ చాలా కీలకం అనే విషయాన్ని మొదట్నుంచి యూనిట్ సభ్యులే చెబుతున్నారు. అంతెందుకు, 2 రోజుల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆర్ఆర్ఆర్, బాహుబలి-2 చూసిన కళ్లతో శాకుంతలంలో గ్రాఫిక్స్ చూస్తారని, అందుకే చాలా కేర్ తీసుకున్నామని అన్నాడు. కానీ ఆ జాగ్రత్తలు, క్వాలిటీ శాకుంతలంలో కనిపించలేదు. శాకుంతలం సినిమాలో గ్రాఫిక్స్ కంటే, కొన్ని వెబ్ సిరీస్ లో వస్తున్న గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా శాకుంతలం సినిమాను డిస్నిఫైడ్ చేసినట్టు చెప్పుకున్నారు. అంటే, డిస్నీ లెవెల్లో గ్రాఫిక్స్ ఉంటాయని మేకర్స్ మీనింగ్. కానీ డిస్నీ దరిదాపుల్లో కూడా శాకుంతలం గ్రాఫిక్స్ లేవు. త్రీడీ వెర్షన్ లో కూడా కొన్ని టెక్నికల్ లోపాలున్నాయి.

ఇలాంటి సినిమాను భారీ బడ్జెట్ తో తీయాలి, బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ విషయాన్ని కూడా మేకర్సే చెప్పారు. కానీ రాజీపడిన విషయం సినిమాలో క్లియర్ గా కనిపిస్తోంది. దిల్ రాజు కొంత ఆర్థిక సహకారం అందించినప్పటికీ అది సరిపోలేదు. పైగా గ్రాఫిక్స్ కు మరింత సమయం ఇచ్చి ఉండాల్సింది.

ఇక కాస్టింగ్ విషయానికొస్తే, అందరూ సెట్ అయ్యారు కానీ, అసలైన పాత్రధారి దేవ్ మోహన్ తోనే వచ్చింది సమస్య. అతడు బాగా చేశాడు, అతడి నటనను తప్పుబట్టలేం. కానీ దుష్యంతుడి లాంటి కీలకమైన పాత్రను కాస్త ఫేస్ వాల్యూ ఉన్న నటుడితో చేయించి ఉంటే బాగుండేది. టాలీవుడ్ కు చెందిన హీరోను తీసుకొని ఉంటే మరీ బాగుండేది. దీని వల్ల 2 ఉపయోగాలు. ఒకటి శకుంతల-దుష్యంతుడి మధ్య కెమిస్ట్రీ బాగా పండేది, రెండోది దుష్యంతుడిపై తీసిన యాక్షన్ సన్నివేశాలు క్లిక్ అయ్యేవి. ఈ రెండు విషయాల్లో పాస్ అవ్వడానికి దేవ్ మోహన్ ప్రయాసపడ్డాడు తప్ప అది ఫలించలేదు.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకున్న ఎలిమెంట్ సమంత మాత్రమే. ఆమె లుక్, మేనరిజమ్స్, నటన శాకుంతలం సినిమాను ఉన్నంతలో నిలబెట్టాయి. అయితే ఆమె కూడా పూర్తిస్థాయిలో మెప్పించిందని చెప్పలేం. రియల్ లైఫ్ లో ఆమెకున్న ఇమేజ్ వల్ల శాకుంతలం పాత్ర కొన్ని సన్నివేశాల్లో రక్తికట్టలేదు. మరీ ముఖ్యంగా అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లను గర్భంతో చూసి అయ్యో అని జాలిపడిన ప్రేక్షకులు.. బబ్లీ హీరోయిన్ సమంతను గర్భంతో చూడలేకపోయారు. ఆమె కష్టాలకు రిలేట్ అవ్వలేకపోయారు. ఆ ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్సయింది.

ఇతర నటీనటుల విషయానికొస్తే మోహన్ బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన గొంతు, హావభావాలు సరిగ్గా సెట్ అయ్యాయి. ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల, అదితి బాలన్, జిస్సు సేన్ గుప్త, ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే వాళ్ల పాత్రల నిడివి చాలా తక్కువ. ఇక చివర్లో వచ్చిన అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ అదరగొట్టింది. భరతుడిగా మెప్పించింది. పట్టాభిషేకం దృశ్యాలు బాగున్నాయి.

దర్శకుడి రాతలో కూడా లోపాలున్నాయి. చిన్న లైన్ ను 2 గంటల 22 నిమిషాల పాటు సాగదీశాడు గుణశేఖర్. పురాణాలకు చెందిన ఓ ప్రేమకథను కమర్షియలైజ్ చేయడానికి డైరక్టర్ ట్రై చేశాడు. అతడి ప్రయత్నాన్ని అభినందించాలి, కానీ అదే సమయంలో ఆయన కీలకమైన ఎమోషన్ ను పండించడంలో విఫలమయ్యాడు. ఇక కమర్షియాలిటీ కోసం దర్శకుడు పెట్టిన యుద్ధ సన్నివేశాలు కూడా ఏమంత మెప్పించవు.

ఇతర టెక్నీషియ్స్ విషయానికొస్తే.. మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. కానీ కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించదు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు బాగాలేవు. మరీ గ్రాంధికంగా వెళ్లిపోయారు. ఈకాలం, ఇప్పటితరం ఇంత తెలుగును ఓర్చుకోలేదు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగాలేదు. సినిమాను కనీసం 15 నిమిషాలైనా కట్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించిన స్థాయిలో లేవు.

ఓవరాల్ గా.. శాకుంతలం సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. సమంత, గుణశేఖర్, దిల్ రాజు, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మణిశర్మ లాంటి ఉద్జండులు కలిసి చేసిన ఈ సినిమా, చాలా స్లోగా సాగుతూ సహనాన్ని పరీక్షిస్తుంది.

First Published:  14 April 2023 7:54 AM GMT
Next Story