Telugu Global
MOVIE REVIEWS

Satyabhama Movie Review: సత్యభామ - రివ్యూ {2/5}

Satyabhama Movie Review: సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ క్యారక్టర్ గా నటించిన సినిమాలు అప్రధానమైనవిగానే వుండిపోయాయి. కాజల్ కార్తీక, హే సినామికా, ఘోస్టీ మొదలైనవి. తిరిగి ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తూ ‘సత్యభామ’ తో తిరిగి వచ్చింది.

Satyabhama Movie Review: సత్యభామ - రివ్యూ {2/5}
X

చిత్రం: సత్యభామ

రచన- దర్శకత్వం : సుమన్ చిక్కాల

తారాగణం : కాజల్ అగర్వాల్, నేహా పఠాన్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, అంకిత్ కొయ్య, అనిరుద్ పవిత్రన్ తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం : విష్ణు బేసి

నిర్మాతలు: శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి

విడుదల : జూన్ 7, 2024

రేటింగ్: {2/5}

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ క్యారక్టర్ గా నటించిన సినిమాలు అప్రధానమైనవిగానే వుండిపోయాయి. కాజల్ కార్తీక, హే సినామికా, ఘోస్టీ మొదలైనవి. తిరిగి ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తూ ‘సత్యభామ’ తో తిరిగి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ల ట్రెండ్ లో వారం వారం హత్యాపరిశోధనలతో సినిమాలు వచ్చేస్తున్నాయు. ఇవేవీ నిలబడడం లేదు. పైగా హాస్యాస్పదంగా వుంటున్నాయి. వీటి టెక్నిక్ తెలీక ఏదో తంటాలు పడుతున్నారు. ఆ తంటాలు ప్రస్తుత కాజల్ సినిమాలో ఎక్కువై పోయాయి. అవేమిటో తెలుసుకుందామని సినిమా చూస్తే మాత్రం ఇంతే సంగతులు. ఒక స్టార్ హీరోయిన్ సినిమాకిలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం...

కథ

సత్యభామ అలియాస్ సత్య (కాజల్‌ అగర్వాల్) పోలీసు శాఖ షీటీమ్‌లో ఏసీపీగా పని చేస్తూంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అయితే ఇంటికన్నా డ్యూటీయే ఎక్కువగా భావిస్తూ కేసులు చూస్తూంటుంది. హసీనా (నేహా పఠాన్) అనే యువతి వచ్చి భర్త హింసిస్తున్నాడని ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసులో భర్త మీద చర్య తీసుకునేంతలో ఆమెని చంపేస్తాడు. సత్య ఆ భర్తని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూంటే హసీనా తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్ యాద్మ) తప్పిపోతాడు. ఇక్బాల్ మిస్సింగ్ కేసుని దర్యాప్తు చేస్తూంటే అతను హత్యకి గురవుతాడు. ఇతడ్ని ఎవరు చంపారు? హసీనాని చంపిన భర్త ఏమయ్యాడు? ఈ రెండు హత్యలకి ఏమైనా సంబంధముందా? వీటిని ఎలా పరిష్కరించింది సత్య? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇది. అయితే ఓ హత్య జరగడం, హంతకుడెవరో తెలిసి పట్టుకోబోతే హతురాలి తమ్ముడు అదృశ్యమవడం వరకూ ఫర్వాలేదు. ఆ తర్వాత తమ్ముడి అదృశ్యాన్ని, అతడి హత్యనీ టెర్రరిజం లోకి లాగి ముడి పెట్టి ఉప కథని సృష్టించడంతో అసలు కథ పక్కదారి పట్టిపోయింది. ఇంకా యువతుల అక్రమ రవాణా ఉపకథ ఒకటి వచ్చేస్తుంది, ఇలా ఎన్నో ఉపకథలూ వాటి పాత్రలూ వచ్చేస్తూ కన్ఫ్యూజన్ సృష్టిస్తాయి. పోనీ ఈ ఉపకథలు చివరికి ప్రధాన కథతో కలిసి ఏదైనా సస్పెన్స్ ని విప్పుతాయా అంటే అదీ లేదు. ప్రారంభించిన ప్రధాన కథకి కథనం లేనట్టు, జస్ట్ స్పేస్ ఫిల్లర్స్ గా ఉప కథల్ని తెచ్చి నింపేనట్టు వుంటుంది. మధ్యలో ఒక పొలిటీషియన్ కొడుకు పాత్రతో సుదీర్ఘ రియాల్టీ గేమ్ షో పెట్టి ఇతనే విలన్ అన్నట్టు ఒక ఝలక్కిచ్చారు. ఇది కూడా నిజం కాదు, ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడం తప్ప. ఇక చివరికెలాగో హంతకుడు దొరికి చెప్పే మాటలు కూడా తేలిపోతాయి. ముగింపులో కూడా థ్రిల్ చేయని ఒక కథ కాని కథ ఇది. దీన్ని కాజల్ భుజాన వేసుకుని పోలీసు పాత్ర నటించడం విచిత్రం.

నటనలు- సాంకేతికాలు

ఏసీపీ పాత్రలో కాజల్ ప్రారంభంలో ఇచ్చే బిల్డప్ ఆ తర్వాత కథతో వుండదు. దర్యాప్తు కూడా బలహీనంగా చేస్తుంది. హసీనాని భర్త చంపుతూంటే ఆమె ఫోన్లో వేసే కేకలు వింటూ ఆందోళన పడుతున్న కాజల్ మాత్రం కారు నిదానంగా డ్రైవ్ చేస్తూంటుంది. కేకలు ఆగిపోయాక హసీనా ఇంటికి కారు వేగంగా డ్రైవ్ చేస్తుంది! ఇలా వుంటుంది పాత్ర తీరు. ఉపకథల్లో కొన్ని యాక్షన్ సీన్లు బాగా చేసింది. ఇంతకంటే ఛేప్పుకోవడానికి లేదు.

పోలీసు ఉన్నతాధికారిగా ప్రకాష్ రాజ్ ఎందుకున్నాడో తెలీదు. నాల్గు డైలాగులు చెప్పి పోవడం తప్ప. రచయితగా నవీన్ చంద్ర పాత్రకి, మరో పోలీసు అధికారిగా హర్షవర్ధన్ పాత్రకి కూడా ప్రాధాన్యం లేదు. ఇక్బాల్ గా నటించిన ప్రజ్వల్ యద్మ పాత్రకి సంఘర్షణ వుంది. నటించాడు. నాగినీడు పోషించిన పాత్ర కూడా అంతంత మాత్రంగానే వుంది. సీనియర్ నటులు, వాళ్ళ నటనలు కూడా సినిమాకి ఉపయోగపడలేదు.

కాజల్ నటించిన సినిమా కాబట్టి సాంకేతిక విలువలు ఉన్నతంగా వున్నాయి- సంగీతం, కెమెరా వర్క్, యాక్షన్ దృశ్యాలు వగైరా. కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కుండాల్సిన టెంపో, టెన్షన్, స్పీడు, సస్పెన్స్, థ్రిల్ మచ్చుకి కానరావు. సంబంధం లేని ఉపకథలతో ఏదో హడవిడీ చేద్దామనుకున్నాడు కొత్త దర్శకుడు. అది కాస్తా బెడిసి కొట్టింది.First Published:  8 Jun 2024 2:43 PM GMT
Next Story