Telugu Global
MOVIE REVIEWS

Yashoda Movie Review: 'యశోద' రివ్యూ {2.5/5}

Samantha's Yashoda Telugu Movie Review: హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్న సమంతా మరో ఇదే జానర్ మూవీ ‘యశోద’ తో ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Yashoda Movie Review
X

Yashoda Movie Review

చిత్రం: యశోద

రచన -దర్శకత్వం : హరి - హరీష్

తారాగణం : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు

మాటలు : పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి; సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్

బ్యానర్ : శ్రీదేవీ మూవీస్

నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్

విడుదల : నవంబర్ 11, 2022

రేటింగ్ : 2.50/5

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్న సమంతా మరో ఇదే జానర్ మూవీ 'యశోద' తో ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ దర్శకులు హరి -హరీష్ కొత్త ప్రయోగాలు చేస్తున్న దర్శకులుగా పేరుంది. సరికొత్తగా 'యశోద' తో ఇంకో ప్రయోగం చేశారు. అయిదు భాషల్లో పానిండియా మూవీగా ప్రతిష్టాత్మకంగా విడుదల చేశారు. ఇది సమంతకి ఎంత వరకు కలిసి వచ్చిందో చూద్దాం...

కథ

నగరంలో యశోద (సమంత) ఓ పేద జీవి. ఆమెకు చెల్లెలి చదువుకి, పెళ్ళికి డబ్బు అవసరం. గర్భకోశాన్ని అద్దెకిచ్చి డబ్బు సంపాదించవచ్చని ఒకరి ద్వారా తెలుసుకుని వెళ్ళి అధునాతన ఈవా సరోగసీ సెంటర్లో చేరుతుంది. అక్కడ తనలాగా వచ్చిన వాళ్ళు చాలా మంది వుంటారు. డాక్టర్ మధు (వరలక్ష్మీ శరత్ కుమార్) అధ్వర్యంలో సెంటర్ నడుస్తూంటుంది. మరోవైపు ఒక హత్య కేసు దర్యాప్తు జరుగుతూ వుంటుంది. ఎవరి హత్య? ఎవరు చేశారు? దీనికి సెంటర్ తో ఏం సంబంధం? ఇంకో డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్), కేంద్ర మంత్రి (రావు రమేష్)లతో బాటు, డాక్టర్ మధుకి ఈ హత్యతో ఏం సంబంధం? సెంటర్ లో చేరిన యువతులు కూడా ఎలా అదృశ్యమైపోతున్నారు? ఈ వ్యవహారంలో యశోద ఎలా ఇన్వాల్వ్ అయింది? ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఈ నేరాల వెనుక వున్న వాళ్ళని ఎలా పట్టుకుంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

స్థూలంగా చెప్పుకుంటే ఇది సరోగసీ మాఫియా నేపథ్యంలో మర్డర్ మిస్టరీ. కథ కొత్తదే. కథనం అక్కడక్కడ అదుపు తప్పింది. ఈ థీమ్ కి మాతృత్వపు భావోద్వేగం ప్రధానం. సమంతా పాత్రతో దీని నిర్వహణ బలహీన పడింది. ఫలితంగా ఎమోషన్ లేని ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ గా మిగిలింది.

ఫస్టాఫ్ లో సెంటర్ లో ఇతర యువతుల బాధలతో సమంత సీన్లు, అవతల హత్య కేసు దర్యాప్తూ సమాంతరంగా సాగుతూ వచ్చే కథనం ఏ మాత్రం బలంగా లేక ఫ్లాట్ గా వుంటుంది. ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు సమంతకి రహస్యం తెలిసినప్పట్నుంచి మాత్రమే థ్రిల్ పెరుగుతుంది. అలాగే ఇంటర్వెల్ దృశ్యం ప్రభావశీలంగా వుంటుంది. సెకండాఫ్ లో సమంత మిస్టరీ ఛేదించడానికి కార్యరంగంలోకి దూకినతర్వాత వచ్చే వరలక్ష్మీ శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ పూర్తిగా బోరు కొడుతుంది.

ఆ తర్వాత ఇంకో ఫ్లాష్ బ్యాక్ కూడా సెకండాఫ్ ని చెడగొడతాయి. ఇక రహస్యాలు బయటపడే క్లయిమాక్స్ మాత్రమే యాక్షన్ తో ఊపందుకుంటుంది. అయితే ఈ క్లైమాక్స్ ట్విస్టులో విషయం మాత్రం ప్రభావ శీలంగా వుండదు. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే ఇది ఎండ్ సస్పెన్స్ కథ. ఎండ్ లో రివీలయ్యే సస్పెన్స్ షాకింగ్ గా లేకపోతే, అంత సేపూ రహస్యాన్ని దాచి కథ నడపడంలో అర్ధం లేదు. ఇందుకే దాదాపు అన్ని ఎండ్ సస్పెన్స్ సినిమాలు ఫ్లాపవుతున్నాయి. సమంతా ఆకర్షణే ఇక దీన్ని నిలబెట్టాలి.

నటనలు - సాంకేతికాలు

సమంత ఎమోషనల్ క్యారక్టర్ గా కంటే యాక్షన్ క్యారక్టర్ గానే ఈ సినిమాతో గుర్తుంటుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో యాక్షన్ సీన్లలో విజృంభింది. ఈ విజృంభణే మాతృత్వపు భావోద్వేగంతో వుండాల్సింది. కానీ ఆమె వున్న సీన్లలో దృష్టినాకర్షిస్తుంది. పైగా పానిండియా లెవెల్ కాబట్టి ఆ స్థాయిలో ప్రొడక్షన్ వుండడం వల్ల సమంతా పాత్ర లోపాన్ని కవర్ చేస్తున్నట్టు వుంటాయి.

సమంత పాత్ర చిత్రణ ఎలా అరకొరగా వుందో, మిగతా అందరి పాత్ర చిత్రణలూ అలాగే వున్నాయి. విలన్ డాక్టర్ గా వరలక్ష్మీశరత్ కుమార్, ఇంకో డాక్టర్ గా ఉన్ని కందన్, పోలీసు అధికారిగా మురళీ శర్మా తమ టాలెంట్స్ ని ధారబోసి బెస్ట్ రిజల్ట్ ఇచ్చారు. కానీ అవి ఆషామాషీ పాత్రచిత్రణలే.

సరోగసీ కథలతో సినిమాలొచ్చాయి. థ్రిల్లర్ గా ఇది కొత్తదనంతో వుంది. అయితే పాత్ర చిత్రణలు, భావోద్వేగాలు, ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు వరకూ కథనం, సెకండాఫ్ ఫ్లాష్ బ్యాకులు ఈ కొత్తదానానికి స్పీడ్ బ్రేకర్లుగా వున్నాయి. పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి డైలాగులు కొన్ని చోట్ల బలంగా వున్నాయి. యాక్షన్ సీన్స్ లో డైలాగులు మరీ మితిమీరకుండా వున్నాయి. మణిశర్మ సంగీతం ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. అలాగే హాస్పిటల్ సెట్ కళాదర్శకత్వం, ఔట్ డోర్స్ లో యాక్షన్ కొరియోగ్రఫీ చెప్పుకోదగ్గవి.

దర్శకులు హరి - హరీష్ పానిండియా లెవెల్లో చేసిన ప్రయత్నం పాక్షికంగా ఫలించింది. సమంతకిది పాక్షిక విజయమే.

Next Story