Telugu Global
MOVIE REVIEWS

Sajini Shinde Ka Viral Video Review | సజినీ షిండే కా వైరల్ వీడియో -రివ్యూ {2/5}

Sajini Shinde Ka Viral Video Review | సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూంటాయి. యూజర్లు తమ అకౌంట్ లోకి వీడియో రాగానే ముందూ వెనుకా ఆలోచించకుండా షేర్ బటన్ నొక్కేస్తారు.

Sajini Shinde Ka Viral Video Review | సజినీ షిండే కా వైరల్ వీడియో -రివ్యూ {2/5}
X

చిత్రం: సజినీ షిండే కా వైరల్ వీడియో

రచన- దర్శకత్వం: మిఖిల్ ముసలే

తారాగణం : నిమ్రత్ కౌర్, రాధికా మదన్, భాగ్యశ్రీ, శృతీ వ్యాస్, సుబోధ్ భావే, సోహామ్ మజుందార్ తదితరులు

సంగీతం : హితేష్ సోనిక్, ఛాయాగ్రహణం : త్రిభువన్ బాబు సాదినేని

బ్యానర్ : మాడక్ ఫిల్మ్స్, నిర్మాత : దినేష్ విజన్

విడుదల : అక్టోబర్ 27, 2023

రేటింగ్: 2/5

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూంటాయి. యూజర్లు తమ అకౌంట్ లోకి వీడియో రాగానే ముందూ వెనుకా ఆలోచించకుండా షేర్ బటన్ నొక్కేస్తారు. అది అసలీయా, నకిలీయా నిమిత్తం వుండదు. అలా ఫేక్ (నకిలీ) వీడియోలు కూడా వైరల్ ఐపోతూంటాయి. మరొకటేమిటంటే, అది మార్ఫ్పింగ్, ఎడిటింగ్ చేసిన ఫేక్ వీడియో కాక పోయినా, స్క్రిప్టెడ్ వీడియోనేమో అని కూడా తెలుసుకోరు. అది రియల్ అనుకుని దాన్నీ వైరల్ చేసేస్తారు. సోషల్ మీడియాలో ఏది రీల్, ఏది రియల్ కనిపెట్టడం కూడా కష్టమే. ఉదాహరణకి, ముంబాయిలో సరైన దుస్తులు ధరించకుండా రెచ్చగొడుతూ విచ్చల విడిగా తిరిగే అలవాటున్న టీవీ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ గురించి తెలిసిందే. ఈమె మొన్న నవంబర్ 3 న తన మీద ఫేక్ అరెస్ట్ వీడియో సృష్టించుకుని వైరల్ చేసింది. ఆ వీడియోలో ముప్పాతిక శాతం నగ్నంగా వున్న ఉర్ఫీని, కాఫీషాప్ లో మహిళా పోలీసులు కస్టడీలోకి తీసుకుని పోతూంటారు. ఇది వైరల్ అయింది. గుడ్ జాబ్ అని పోలీసుల్ని మెచ్చుకుంటూ, తిక్క కుదిరిందని ఉర్ఫీమీద కసి తీర్చుకుంటూ కామెంట్లు కూడా పోస్ట్ చేసుకున్నారు అతి ఉత్సాహపరులు.

తీరా ఈ వీడియో చూసి ఆ ఏరియా పోలీసులు వాళ్ళు పోలీసులుగా నటించడానికి ఉర్ఫీ హైర్ చేసుకున్న మహిళలని కనిపెట్టేశారు. ఉర్ఫీ ఇలా నకిలీ మహిళా పోలీసులతో స్క్రిప్టెడ్ డ్రామా క్రియేట్ చేసినందుకు ఆమెని పట్టుకుని క్రిమినల్ కేసు పెట్టేశారు. సోషల్ మీడియా మూక ఇది కూడా చూసి ఫూల్స్ అయినందుకు కంగుతిన్నారు. కానీ ఉర్ఫీకే మవుతుంది, ఆమెదగ్గర కోట్ల రూపాయలున్నాయి. కానీ ఇలా వైరల్ చేయడం వల్ల దెబ్బ తింటున్న జీవితాలూ వున్నాయి. వెలివేతలున్నాయి, ఆత్మహత్యలూ వున్నాయి. ఈ పరిస్థితినే తీసుకుని ‘సజినీ షిండే కా వైరల్ వీడియో’ తీశాడు దర్శకుడు మిఖిల్ ముసలే.

కథేమిటి?

పుణేలో సజినీ షిండే (రాధికా మదన్), శ్రద్ధా ఓస్వాల్ (శృతీ వ్యాస్) లు ఒక స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూంటారు. ఆ స్కూలుకి కళ్యాణీ పండిట్ (భాగ్యశ్రీ) ప్రిన్సిపాల్. ఒక స్కూలు ఎసైన్మెంట్ లో భాగంగా టీచర్లు ఇద్దరూ సింగపూర్ వెళ్తారు. ఆ రోజు సజినీ బర్త్ డే. రెస్టారెంట్ లో తప్ప తాగి పార్టీ చేసుకుంటూ, అర్ధనగ్నంగా వున్న ఇద్దరు యువకులతో శాండ్ విచ్ డాన్స్ చేస్తుంది సజినీ. దీన్ని ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తారు. దాంతో సజినీని ఇంటిదగ్గరా, స్కూల్లో, బయటా ఘోరంగా అవమానిస్తారు. ప్రిన్సిపాల్ కళ్యాణి ఇద్దర్నీ సస్పెండ్ చేస్తుంది. ఇక సజినీ ఒంటరి అయిపోయి- మానసిక క్షోభ తట్టుకోలేక- సెలవు తీసుకుంటున్నానని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి మాయమైపోతుంది.

ఆమె మిస్సింగ్ కేసుని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ క్టర్ బేలా బారోట్ (నిమ్రత్ కౌర్) తీసుకుని దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఈ దర్యాప్తుతో ఎవరూ సహకరించరు. మాయమై పోయిన సజినీ ఒకవేళ ఆత్మహత్య చేసుకుని వున్నా దానికంటే కూడా తమ పరువు ప్రతిష్టలే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తారు. స్కూలు ప్రిన్సిపాల్ కూడా ఇదే ధోరణితో వుంటుంది. ఇక సజినీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందా, లేక ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా చంపేశారా అన్నది అంతు చిక్కని మిస్టరీగా మారుతుంది. దీన్ని ఇన్స్ పెక్టర్ బేలా ఎలా ఛేదించి నిజాన్ని కనుక్కున్నదనేది మిగతా కథ.

ఏకపక్షంగా విషయం

పుణేని ఆధునిక- ఎక్కువగా సాంప్రదాయ సంస్కృతుల కేంద్రంగా చూపిస్తూ సోషల్ మీడియా బాధితురాలి కథ చెప్పాడు దర్శకుడు. అయితే ఈ బాధితురాలికి వ్యతిరేక పాత్రలే తప్ప, బాధితురాలి తరపున పోరాడే పాత్రలు లేకపోవడంతో కథ ఏకపక్షంగా, చప్పగా సాగు తుంది. దీంతో కథలో బాధ, జీవం లేకుండా పోయాయి. సోషల్ మీడియా దుష్పరిణామాలకి ఒక పరిష్కారం చూపించాల్సిన కథ కాస్తా బాధితురాలిని వదిలేసి, కేవలం ఆమె అదృశ్యం వెనుక వ్యక్తుల్ని పట్టుకునే మామూలు, ఆసక్తి కల్గించని సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయింది. ఇదే ఈ సినిమాని పేలవంగా మార్చింది.

ఆమె తండ్రి స్టేజినటుడు. అభ్యుదయ పాత్రలేస్తాడు. కానీ ఇంటిదగ్గర భార్యతో, కూతురితో క్రూరంగా వుంటాడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలివ్వడు. అతడి తమ్ముడు కూడా మగ దురహంకారంతో వుంటాడు. ఆనర్ కిల్లింగ్స్ ని సమర్ధిస్తాడు. కొడుకు, అంటే బాధితురాలి తమ్ముడు పిరికిపంద. బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె వైరల్ వీడియో చూసి గుడ్ బై కొట్టేస్తాడు. ప్రిన్సిపాల్ సరేసరి. ఇక తోటి టీచరైనా బాధితురాలి పక్షం తీసుకోదు. సైలెంట్ అయిపోతుంది. ఇలా ఇంటా బయటా ఒంటరి అయిపోయి అలాటి నిర్ణయం తీసుకుంది బాధితురాలు.

కనీసం తండ్రిని అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా చూపించి వుంటే, కూతురికి జరుగుతున్న అన్యాయానికి ఏడ్చి పోరాడే పాత్రగా కథకి బలం తీసుకొచ్చేవాడు. సోషల్ మీడియా సమస్య కేంద్ర బిందువయ్యేది. ఇన్స్ పెక్టర్ కూడా స్త్రీ అయి వుండీ ఇలాటి బాధితురాళ్ళ సమస్యకి పరిష్కారం కనుగొనే దిశగా కాక, ఆమె అదృశ్యం వెనుక హస్తాల్ని పట్టుకునే పోలీసు డ్యూటీకే పరిమితమవడంతో జీవం లేని పాత్రగా మిగిలిపోయింది.

ఈ కథలో ప్రధానంగా అల్లరిపాలైంది బాధితురాలి వ్యక్తిత్వమే. ఇన్స్ పెక్టర్ ఇందులో నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం చేసి వుంటే- సింగపూర్ లో ఆమె అలా ప్రవర్తించడానికి మూల కారణం తెలిసి వచ్చేది. తండ్రి వల్ల ఇంటి దగ్గర అణిగిమణిగి వుండే జీవితం. సింగపూర్ లో ఆ క్షణం ఒక్కసారి అలా రెక్కలు విప్పుకుంది. అంతేగానీ ఆమె స్వాభావికంగా తప్ప తాగి తిరిగే మనిషి కాదు. అంటే ఆమె అలా చేయడానికి కారకుడు తండ్రే అవుతాడు. ఇలా కనిపించని దోషుల్ని కూడా బయటపెట్ట వచ్చు ఇన్స్ పెక్టర్.

అసలా వీడియో తీసిందెవరో కూడా పట్టుకుని ఒక ఆడదానిగా నాల్గు తగిలించి- ఇలాటి పోకడకి వైరల్ మూకకి తగిన క్లాసు పీకి వుంటే, ఇన్స్ పెక్టర్ కి రాణింపుగా వుండేది. అసలు ఆడదిగానే ఫీలవ్వదు ఇన్స్ పెక్టర్!

ఇక చుట్టూ సమాజం. ఇలాటి సంఘటనల్లో ఆందోళన లేవదీసే ప్రాణులు వుండకుండా పోవు. నవంబర్ 3 న బనారస్ హిందూ యూనివర్సిటీ ఘటనపై చెలరేగిన ఆందోళనే తార్కాణం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక విద్యార్ధిని, ఆమె స్నేహితుడు క్యాంపస్ లో వాకింగ్ చేస్తూంటే, బయటి నుంచి వచ్చిన ముగ్గురు దుండగులు స్నేహితుడ్ని కొట్టి, ఆమెని ఈడ్చుకెళ్ళి, వివస్త్రని చేసి అసభ్యంగా ప్రవర్తించి, వీడియోలు తీసిన సంఘటనతో వేల మంది విద్యార్ధులతో యూనివర్సిటీ భగ్గుమంది. కానీ మన స్కూలు టీచర్ కథలో టీచర్ వైపు వుండే ప్రాణులెవరూ వుండరు. ఇలావుంది సోషల్ మీడియా కథ!

సస్పెన్స్ థ్రిల్లర్ సంగతులు

టీచర్ సజినీ షిండే అదృశ్యం వెనుక ఎవరు? దర్శకుడే! కానీ దర్శకుడికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ దాగుడుమూతలాట వల్ల కాలేదు. ఇన్స్ పెక్టర్ అనుమానితుల్ని ప్రశ్నించడం, ఉండుండి ఒకో క్లూ పట్టుకోవడం చాలా నత్త నడకలాగా సాగుతుంది. ఆ క్లూలు కూడా కథని వేగంగా పరుగెత్తించవు. ఆ క్లూస్ కూడా సర్ప్రైజ్ చెయ్యవు. ఇంటర్వెల్లో నైతే పేలవమైన మలుపుతో ఉస్సూరంటుంది ప్రాణం.

ఇక సెకండాఫ్ మళ్ళీ ‘అదృశ్యం వెనుక ఎవరు’ సాగతీత కథే. ఇంతకి మించి ఏమీ వుండదు. వెళ్ళి వెళ్ళి క్లయిమాక్స్ లో దోషి అరెస్ట్. ఈ దోషిని, నేర కారణాన్నీ చూసి ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ తో అనుభవమయ్యే నిరాశే ఇక్కడా ఎదురవుతుంది. ఎందుకంటే ఇది ఎండ్ సస్పెన్స్ కథ. ఎండ్ సస్పెన్స్ కథలు సినిమాకి పనికి రావు. చివరివరకూ దోషి ఎవరా అని ఓపికని పరీక్షించే ఇలాటి కథలు- తీరా ఆ దోషినీ, నేర కారణాన్నీ బయట పెడితే కథ పంక్చరై పోతుంది. అది భారీ షాకుతో చాలా డిస్టర్బింగ్ గా వుంటే తప్ప, ఈ పతాక స్థాయిలో వెంటాడే ముగింపుగా వుంటే తప్ప, సినిమా నిలబడదు. దీన్ని ఇంతవరకూ ఎవరూ సాధించలేకపోయారు. ఈ సినిమా కూడా సాధించలేదు.First Published:  6 Nov 2023 6:22 AM GMT
Next Story