Telugu Global
MOVIE REVIEWS

Saindhav Movie Review: సైంధవ్ మూవీ రివ్యూ! {2/5}

Saindhav Review: వెంకటేష్ 75వ సినిమాగా ‘సైంధవ్’ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి సంక్రాంతి సినిమాల బరిలోకి దింపారు.

Saindhav Movie Review: సైంధవ్ మూవీ రివ్యూ! {2/5}
X

చిత్రం: సైంధవ్

రచన- దర్శకత్వం: శైలేశ్ కొలను

తారాగణం: వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, సారా పలేకర్, జయప్రకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ముఖేష్ ఋషి తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం : మణికంఠన్

బ్యానర్: నీహారిక ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : వెంకట్ బోయినపల్లి

విడుదల: జనవరి 13, 2024

రేటింగ్: 2/5

వెంకటేష్ 75వ సినిమాగా ‘సైంధవ్’ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి సంక్రాంతి సినిమాల బరిలోకి దింపారు. ఈ బరిలోకి దింపిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఎలాటి ఫలితాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ‘హనుమాన్’ ఎలా దూసుకెళ్తోందో చూస్తున్నదే. ఇప్పుడు మరోస్టార్ సినిమా ‘సైంధవ్’ సంగతేమిటి? మహేష్ బాబుని ఫాలో అయిందా? నాగార్జునతో ఇంకో స్టార్ సినిమా కూడా ‘హనుమాన్’ తో పోటీపడ బోతోంది. ఎవరొచ్చినా ‘హనుమాన్’ తో పోటీ పడాల్సిందేనా? ‘సైంధవ్’ వచ్చేసి ‘హనుమాన్’ ని చిత్తు చిత్తు చేసిందా? ఈ అమూల్య విషయాలు తెలుసుకుందాం.కథ

సైంధవ్ (వెంకటేష్) చంద్రప్రస్థ అనే కల్పిత నగరం పోర్టులో క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తూంటాడు. అతడికి గాయత్రి (సారా పలేకర్) అనే కూతురు. భార్య వుండదు. పక్కింట్లో మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) కి భర్త వుండడు. గొడవపడి వచ్చేసింది. ఆమె సైంధవ్ కి, గాయత్రికి సన్నిహితంగా వుంటుంది. సైంధవ్ గతంలో మిత్రా (ముఖేష్ ఋషి) అనే డ్రగ్ మాఫియా దగ్గర పనిచేసి మానేశాడు.

ఇలా వుండగా, ఒకరోజు గాయత్రి జబ్బు పడుతుంది. అది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధి. దాని చికిత్సకి 17 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అవసరం. దీనికోసం సైంధవ్ వెళ్ళి మిత్రాని కలుస్తాడు. మిత్రా తన ప్రత్యర్ధి వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధీఖ్) ని చంపమని షరతు పెడతాడు. సైంధవ్ ఏం చేశాడు? కూతుర్ని కాపాడుకోవడం కోసం వికాస్ మలిక్ ని చంపాడా లేదా అన్నది మిగతా కథ.


ఎలావుంది కథ

ఇది కథ కాదు, వధ. తీసుకున్న ముఖ్యమైన పాయింటుని ఇష్టమొచ్చినట్టు వధించి వడ్డించిన వ్యధ. వెంకటేష్ కి కమల్ హాసన్ నటించిన పానిండియా హిట్ ‘విక్రమ్’ లాంటి యాక్షన్ సినిమా చేయాలని కోరిక. దర్శకుడికి ఆ యాక్షన్ లో ఒక ఇంజెక్షన్ ని చొరబెట్టాలని ఆరాటం. దాంతో హైదరాబాద్ లో ఓ పిల్లాడికి ఇదే SMA వ్యాధి చికిత్సకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ. 16 కోట్లు సేకరించి, అమెరికా నుంచి తెప్పించిన ఇంజెక్షన్ తో బతికించిన హ్యూమన్ డ్రామాతో కూడిన నిజ సంఘటనకి ఇన్స్ ఫైర్ అయి, ఈ కథ చేస్తూ మాఫియా గొడవలకి ఎక్కువ, పిల్ల వ్యాధి హ్యూమన్ డ్రామాకి తక్కువా అన్నట్టు సినిమా చుట్టేసి, సంక్రాంతి పోటీల్లో వెంకటేష్ ని గల్లంతు చేశాడు.

వ్యాధుల మీద సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఒక సామాన్యుడి కూతురికి అత్యంత ఖరీదైన వ్యాధి అనే ఈ కథ ప్రపంచ సినిమాల్లోనే మొదటిసారిగా అంది వచ్చిన అరుదైన అవకాశం. దీన్ని ధ్వంసం చేసుకున్నాడు. హైదరాబాద్ ఉదంతంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు సహా ప్రజలు స్పందించి 16 కోట్లు సేకరించి పెట్టిన హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలోని తాదాత్మ్యం, కరుణ, సానుభూతి, ప్రేరణ, ప్రేమ, భయాలూ ఆనందాలూ, తీరా తెప్పించిన ఇంజెక్షన్ తో ఫలిస్తుందా లేదా అన్న ఉత్కంఠ- హై డ్రామా- ఈ సినిమా సక్సెస్ దినుసులన్నీ వదిలేసి మాఫియాల, మరణహోమాలతో అసలు పిల్ల వ్యాధి అన్న సమస్యకే చోటు లేకుండా చేశాడు.సినిమా మొదలు పెడితే ఎడతెరిపిలేని, మనం ఫాలోకాలేని ఏవేవో మాఫియాల గొడవలే. ఎక్కడో ఇంటర్వెల్ ముందు కూతురికి ఖరీదైన వ్యాధి సమస్యతో పాయింటు కొచ్చి, మళ్ళీ సెకండాఫ్ లో మాఫియాల గొడవలే. కుటుంబ సెంటిమెంట్ల సినిమాలెక్కువ చేసిన వెంకటేష్ కైనా కూతురి కథ గల్లంతయిందని తెలియలేదా? కూతురి చికిత్స డబ్బులకోసం హత్యలు చేయడమేమిటి? ఆ కూతురు పెద్దదై తనప్రాణాలు ఎలా కాపాడాడో తెలుసుకుని అసహ్యించుకోదా? సినిమా కథకి నైతిక ప్రశ్నలు అవసరం లేదా? ఇంకో విషయం ఏమిటంటే, కూతురి కథని మింగేస్తూ మాఫియాల గొడవలుండగా, మరో 300 మంది పిల్లలకి ఇదే వ్యాధిని టేసుకొచ్చి కూతురి కథని పూర్తిగా భూస్థాపితం చేసే శారు! సూపర్ ఫైన్ మెంటల్ కథ ఇది.

దీంతో కమల్ హాసన్ ‘విక్రమ్’ నేకాదు, రజనీకాంత్ ‘జైలర్’ లాగా, విజయ్ ‘లియో’ లాగా కూడా తీసి, 75 వ సినిమాకి కనీవినీ ఎరుగని హిట్ కొడుతున్నామని ఫీలైపోయారు.

ఇక దీనికి ఎవరెలా నటించారో, సాంకేతికులు ఎవరెలా పనిచేశారో చెప్పుకోవడం హాస్యాస్పదంగా వుంటుంది. అసలు విషయానికొస్తే, ఇదే నిర్మాతకి వెంకటేష్ కోసం సింగిల్ సిటింగ్ లో ఒక కథ ఓకే చేయించుకున్నాడు ఒక అసోసియేట్. ఆ కథ వెంకటేష్ కి సూటయ్యే ఫన్నీ విలేజి యాక్షన్ థ్రిల్లర్. నిర్మాత దాన్ని పక్కన పెట్టి ‘సైంధవ్’ తీశాడు. లేకపోతే నానితో ‘శ్యామ్ సింఘరాయ్’ హిట్ తీసిన నిర్మాతకి ఈ సంక్రాంతికి ఇంత బ్యాడ్ గా వుండేది కాదు, ‘హనుమాన్’ ఎదురుగా నిలబడి!First Published:  14 Jan 2024 7:04 AM GMT
Next Story