Telugu Global
MOVIE REVIEWS

Tiger Nageswara Rao Movie Review | టైగర్ నాగేశ్వర రావు - రివ్యూ {2/5}

Tiger Nageswara Rao Movie Review | మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి జీవిత చరిత్రతో బయోపిక్ నటిస్తే ఎలా వుంటుంది? రవితేజ సినిమాలా వుంటుందా, లేక ఆ వ్యక్తి బయోపిక్ లానే వుంటుందా? మొదటిదే అవుతుందని నిరూపించే తరహాలో ‘టైగర్ నాగేశ్వర రావు’ కి రూపకల్పన చేశాడు దర్శకుడు వంశీ.

Tiger Nageswara Rao Movie Review | టైగర్ నాగేశ్వర రావు - రివ్యూ {2/5}
X

చిత్రం: టైగర్ నాగేశ్వర రావు

రచన -దర్శకత్వం : వంశీ

తారాగణం : రవితేజ, నుపుర్ సానన్, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జిషు సేన్‌గుప్తా తదితరులు

సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : ఆర్. మధి

బ్యానర్ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, నిర్మాత: అభిషేక్ అగర్వాల్

విడుదల : అక్టోబర్ 20, 2023

రేటింగ్: 2/5

మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి జీవిత చరిత్రతో బయోపిక్ నటిస్తే ఎలా వుంటుంది? రవితేజ సినిమాలా వుంటుందా, లేక ఆ వ్యక్తి బయోపిక్ లానే వుంటుందా? మొదటిదే అవుతుందని నిరూపించే తరహాలో ‘టైగర్ నాగేశ్వర రావు’ కి రూపకల్పన చేశాడు దర్శకుడు వంశీ. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రని తెరకెక్కించే ప్రయత్నంలో, రవితేజకే హాని జరిగే తీరు తెన్నులతో కూడా తయారైంది సినిమా. రవితేజ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పానిండియా స్థాయిలో సినిమాని విడుదల చేయించడం వల్ల ఆ లెవెల్లో ప్రతిష్ట కూడా దెబ్బ తింది. ఈ బయోపిక్ ఎలాగో గట్టెక్కడానికి వివాదాస్పదమై ప్రేక్షకుల్ని ఆకర్షించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కరుడుగట్టిన దొంగని సమర్ధించే వర్గాలు వుండవు కాబట్టి.

ఇంతకీ ఏమిటీ సినిమా/బయోపిక్? ‘భగవంత్ కేసరి’, ‘లియో’ ల తర్వాత ఎంతో హడావిడీ చేస్తూ పండక్కి విడుదలైన ఇది మొదటి రెండు సినిమాల పక్కన ఎక్కడ నిలబడుతుంది? దీని కొచ్చే రెస్పాన్స్ ఎంత? ఇవి తెలుసుకుందాం...

కథ

1970 లలో ఢిల్లీలో ఐబీ చీఫ్ రాఘవేంద్ర రాజ్పుత్ (అనుపమ్ ఖేర్) నుంచి బాపట్ల డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి (అనుపమ్ ఖేర్) కి అర్జెంట్ కాల్ వస్తుంది. విశ్వనాధ శాస్త్రి ఢిల్లీ చేరుకుంటే, ఐబీ చీఫ్ ప్రధానమంత్రి భద్రతాదళానికి టైగర్ నాగేశ్వరరావు నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని, ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరని అడుగుతాడు.

విశ్వనాథ శాస్త్రి చెప్పడం మొదలు పెడతాడు... నాగేశ్వరరావు స్టూవర్ట్ పురం దొంగ. అతను పోలీసులకి ఛాలెంజి విసిరి మరీ దోపిడీలు చేస్తాడు. దొరక్కుండా తప్పించుకుంటాడు....అంటూ పూర్తి వివరాలు అందిస్తాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రధాని భద్రతా దళాన్ని ఏమని బెదిరించాడు? ఆ బెదిరింపు ప్రకారం ఏ నేరానికి పాల్పడ్డాడు? అప్పుడేం జరిగింది? ప్రధాని రియాక్షన్ ఏమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

రవితేజ సినిమా కథలా వుంటూ, రవితేజకే అడ్డుపడే సన్నివేశాలతో వుంది. ఒక క్రిమినల్ ని గ్లోరిఫై చేయడానికి కొన్ని జాగ్రత్తలుంటాయి. ‘పుష్ప’ లో కాల్పనిక స్మగ్లర్ క్యారక్టర్ ని గ్లోరిఫై చేయడానికి వ్యక్తిగత జీవితంతో ఆ జాగ్రత్తలు పాటించారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా నిజ వ్యక్తి కథ. ఈ నిజ వ్యక్తి కథ బయోపిక్ గా తీసి గ్లోరిఫై చేయడానికి, రవితేజని ఇంకో స్థాయికి తీసికెళ్ళడానికీ పనికి రాని కథ. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద ఎక్కడా ఒక పుస్తకం వెలువడ లేదు. వాళ్ళూ వీళ్ళూ చెప్పుకునే కథలూ, కొన్ని పోలీస్ రికార్డులూ ఇవే వున్నాయి. సినిమాకి సరిపోను మెటీరీయల్ లేకపోవడం చేత, భారీగా కల్పన చేసిన సన్నివేశాలతో సినిమాని నింపక తప్పలేదు. అడిగే వారెవరుంటారు.

ఈ కల్పితాలు చేయడానికి ఏ పాయింటుని ప్రధానంగా తీసుకుని కథ నడపాలో కూడా తెలుసుకోనట్టుంది. నాగేశ్వరరావు గురించి ప్రచారంలో వున్నవి రెండే అంశాలు- పోలీసులకి దొరక్కుండా చెప్పి మరీ దోపిడీలు చేయడం, దోచుకుంది పేదలకి పంచి పెట్టడం. అంటే పోలీసులకీ నాగేశ్వరరావుకీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంతో- ప్రధాన కథని యాక్షన్ కథగా మార్చి థ్రిల్లింగ్ గా నడుపుతూ, ఉపకథగా పేదలకి డబ్బు పంచే మానవీయ కోణాన్ని ఆవిష్కరించ వచ్చు.

ఇందులో మొదటిది చూపించకుండా, రెండోదే చూపించడంతో ప్రధాన కథ గల్లంతైన సినిమా అయింది. ఏవో కొన్ని దోపిడీలు చూపించారు- కానీ పోలీసులతో వుండాల్సిన ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ పార్టు మర్చిపోయారు. ఇంకేం సినిమా ఆడుతుంది?

చరిత్రలో నాగేశ్వరరావు లాంటి నేరస్థుడే వున్నాడు. అతను ఉన్నత స్థానాల్లో చిటికెలో ఆర్ధిక నేరాలు చేసి తప్పించుకునే ఫ్రాంక్ అబిగ్నేల్. పోలీసులకి దొరక్కుండా ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతడి మీద ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని సినిమా తీశాడు స్టీవెన్ స్పీల్ బెర్గ్. దొంగగా లియోనార్డో డీకాప్రియో, పోలీసుగా టామ్ హాంక్స్. ఫ్రాంక్ అబిగ్నేల్ దేనికి ప్రసిద్ధో ఆ ఎలుకా పిల్లీ చెలగాటాన్నే కథగా చేసి, టైటిల్ కూడా అలాగే పెట్టి తీశాడు స్పీల్ బెర్గ్. ‘టైగర్ నాగేశ్వరరావు’ లో ఈ పాయింటునే పక్కన బెట్టి పానిండియా తీశారు.

డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి చెప్పుకొచ్చే కథ- రైలు దోపిడీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టి పెరిగి దొంగగా మారిన కథ వస్తుంది. ఆ తర్వాత రవితేజ రెగ్యులర్ సినిమా టెంప్లెట్ ప్రారంభమైపోతుంది. బాపట్లలో ఓ కాలేజీ, కాలేజీలో చదివే హిందీ అమ్మాయి- ఆమెని ఆకలిగా చూస్తూ వెంటపడి వేధించి, డిజైనర్ డ్రెస్సుల్లో స్టెప్పులేస్తూ పాటలు పాడి, ఆమె పెళ్ళి చెడగొట్టి తనవైపు తిప్పుకునే కామెడీ లవ్ ట్రాకు! కనీసం 15 మంది ఇక్కడే లేచిపోయారు థియేటర్లోంచి.

తిరిగి ఓ రెండు దోపిడీలు, ఆ తర్వాత సెకండాఫ్ లో సుదీర్ఘంగా సాగే పేదలకి డబ్బులు పంచే రాబిన్ హుడ్ ఎపిసోడ్. టెంప్లెట్ ప్రకారం ఫస్ట్ హీరోయిన్ ఫస్టాఫ్ లోనే దూరమవగా, సెకండాఫ్ లో సెకండ్ హీరోయిన్! పోలీసులతో పోరాటం. చివరికి ఢిల్లీలో ప్రధాని ఇంట్లో దొంగతనం! చాలా సిల్లీగా రాసి తీశాడు సినిమాని. ఎక్కడా థ్రిల్, సస్పెన్స్, మలుపులు అనేవి లేకపోగా, సన్నివేశాలు, డైలాగులు నీరసంగా వుంటాయి. యాక్షన్ పార్టులో తప్ప టాకీ పార్టులో స్పీడు అనేదే వుండదు.

ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ కథని విశ్వనాధ శాస్త్రి చెప్తే- సెకండాఫ్ కథని స్టూవర్ట్ పురం పెద్ద (నాజర్) చెప్తాడు. దీని వల్ల ఫస్టాఫ్ లో చచ్చిపోయిన దుష్ట పాత్రలు సెకండాఫ్ లో మళ్ళీ వస్తాయి. రెండు దృక్కోణాల్లో కథ చెప్తే, కథ ముందు కెళ్ళక అక్కడక్కడే తిరుగుతున్నట్టే గాక, పాత్రలు మళ్ళీ కనిపిస్తూ కన్ఫ్యూజింగ్ గా కూడా వుంటుంది. ఇది కన్ఫ్యూజన్ అనుకోలేదు దర్శకుడు, చాలా క్రియేటివ్ గా కథ చెప్తున్నా ననుకున్నాడు.

నటనలు - సాంకేతికాలు

రవితేజ నాగేశ్వర రావు పాత్రకంటే రవితేజ టైపు టెంప్లెట్ పాత్రే నటించాడు. రక్తంతో రాసే చరిత్రలు వుంటాయి, కన్నీటితో రాసే చరిత్రలు వుంటాయి, ఇది రెండూ కలిపి రాసిన చరిత్ర అని మొదట్లో కొటేషన్ పడుతుంది. రక్తమే తప్ప కన్నీరు లేదు. రక్తాలు పారిస్తూ క్రూరంగా యాక్షన్ సీన్సు నటించి, ‘లియో’ విజయ్ నే మించిపోయాడు రవితేజ. డబ్బులు పంచే మానవీయ కోణం అలా చేయడానికి పురిగొల్పిన సంఘటనేదో చెప్పకపోవడంతో, ఆ ఎపిసోడ్ ఎంత నటించినా, ‘నాయకుడు’ లో కమలహాసన్ ని టచ్ చేయలేక పోయాడు. గ్రాఫిక్స్ తో యంగ్ రవితేజతో వచ్చే సీన్లలో మాత్రం ఆ ఏజిని బాగా నటించాడు.

బాపట్లలో హిందీ అమ్మాయిగా నుపుర్ సానన్ ది ఫస్టాఫ్ లో ఫార్ములా హీరోయిన్ సంక్షిప్త పాత్ర. సెకండాఫ్ లో లోకల్ అమ్మాయిగా గాయత్రీ భరద్వాజ్ కి నిడివి వున్న పాత్ర, దాంతో నటించే అవకాశం.

ఢిల్లీలో ఐబీ చీఫ్ గా నటించిన అనుపమ్ ఖేర్ అయితే కామెడీ పాత్ర అయిపోయాడు. హిందీ వాడైన తను మారువేషంలో బాపట్లలో తిరుగుతూ దంచి కొట్టి తెలుగు మాట్లాడేస్తూంటాడు. ఇక డీఎస్పీగా మురళీ శర్మ పోలీసు విధులు సరే, జీవి ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు అలా వచ్చి వెళ్ళిపోతూంటాయి. 1970 ల కాలపు పీరియడ్ లుక్ కోసం నిర్వహించిన కళాదర్శకత్వం కోసం, పోరాటాల కోసం బాగా ఖర్చు పెట్టారు. కానీ మాధి ఛాయాగ్రహణం సాధారణంగా వుంది. యాక్షన్ సీన్సు లో- ముఖ్యంగా రైలు దోపిడీ సీన్లో గ్రాఫిక్స్ నాసి రకంగా వున్నాయి. 1970 లలో సినిమా తీస్తే ట్రిక్ ఫోటోగ్రఫీ ఇలాగే వుండేది. ఈ సినిమా కథ కూడా 1970 ల నాటిదే కాబట్టి ఇలాగే వుంది.

చివరిగా, వేశ్యావాటికల్లో తిరిగే వాడు, రమ్మంటే రాలేదని వేశ్య కడుపులో తన్నే వాడు, సొంత తండ్రిని తలనరికి చంపేవాడు- హీరోతో తీయాల్సిన సినిమా కాదు. విలన్ పాత్రలేసే ఆర్టిస్టుతో తీసుకోవచ్చు. అసలు ఇది సినిమాగా తీయడానికి పనికిరాని బయోపిక్!First Published:  21 Oct 2023 9:32 AM GMT
Next Story