Telugu Global
MOVIE REVIEWS

Prince Movie Review: 'ప్రిన్స్' - మూవీ రివ్యూ {2.75/5}

Prince Movie Review: 'జాతిరత్నాలు' అనే హిట్ కామెడీ తీసిన తెలుగు దర్శకుడు కెవి అనుదీప్, తమిళ స్టార్ శివ కార్తికేయన్‌తో తెలుగు - తమిళ ద్విభాషా చలన చిత్రంగా మరో కామెడీ తీశాడు.

Prince Movie Review
X

Prince Movie Review: ప్రిన్స్ మూవీ రివ్యూ

Prince Movie Review : చిత్రం: ప్రిన్స్

రచన - దర్శకత్వం : కెవి అనుదీప్

తారాగణం : శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క, కార్ల్ హార్ట్, సత్యరాజ్, ప్రేమ్జీ అమరేన్, ఆనందరాజ్ తదితరులు

సంగీతం : ఎస్ థమన్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస

బ్యానర్స్ : సురేష్, ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్

నిర్మాతలు : డి సురేష్ బాబు, సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు

విడుదల : అక్టోబర్ 21, 2022

రేటింగ్ : 2.75/5

'జాతిరత్నాలు' అనే హిట్ కామెడీ తీసిన తెలుగు దర్శకుడు కెవి అనుదీప్, తమిళ స్టార్ శివ కార్తికేయన్‌తో తెలుగు - తమిళ ద్విభాషా చలన చిత్రంగా మరో కామెడీ తీశాడు. ఇందులో మరియా ర్యాబోషప్క అనే ఉక్రెయిన్ నటి హీరోయిన్. గత నెలలోనే అనుదీప్ కథ అందించిన కామెడీ 'ఫస్ట్ డే ఫస్ట్ షో' దారుణంగా ఫ్లాపయింది. మైండ్ లెస్ కామెడీతో 'జాతిరత్నాలు' హిట్టయ్యిందనీ ఇక మైండ్ లెస్ కామెడీలే తీయాలని నిర్ణయించుకున్నట్టుంది. కానీ దీపావళి సందర్భంగా ఇదే రోజు మరో మూడు సినిమాలు- జిన్నా, ఓరి దేవుడా, సర్దార్ కూడా విడుదలయ్యాయి. పోటీ గట్టిగానే ఉంది.

తమిళంలో శివకార్తికేయన్ వరుస హిట్లు ఇస్తున్న స్టార్. ఇప్పుడతను తమిళంలో కార్తీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'తో పోటీలో వెనుకబడ్డాడు. కార్తీ కూడా వరుస హిట్లు ఇస్తున్న తమిళ స్టారే. తాజాగా 'పొన్నియిన్ సెల్వన్' లో నటించాడు. తమిళంలో 'సర్దార్' కి మార్నింగ్ షో కే హిట్ టాక్ వచ్చేసింది. 'ప్రిన్స్' ట్రైలర్ చూస్తే బలహీనంగా ఉంది. మరి సినిమా ఎలావుంది? ఇది తెలుసుకుందాం...

కథ

ఆనంద్ (శివ కార్తికేయన్) ఓ ఊళ్ళో స్కూలు టీచర్. సోషల్ సబ్జెక్టు చెప్తాడు. సోషల్ నాలెడ్జి ఏమీ ఉండదు. స్కూల్‌ కంటే సినిమాలకి ఎక్కువ వెళుతూ ఉంటాడు. తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) అభ్యుదయవాది. కులాంతర వివాహాలు జరిపిస్తుంటాడు. ఎందుకైనా మంచిదని కొడుకు ఆనంద్ చేత హామీ పత్రం రాయించుకుంటాడు- ఎట్టి పరిస్థితిలో కులాంతర వివాహం చేసుకోవాలని, కులంలో అమ్మాయిని ప్రేమించరాదనీ. అదే స్కూల్లో జెస్సికా (మరియా) అనే బ్రిటీష్ జాతీయురాలు ఇంగ్లీషు టీచరుగా వచ్చి చేరుతుంది. ఈమె తండ్రి విలియమ్స్ (కార్ల్ హార్ట్) తాత ఆస్తిపాస్తులు ఇక్కడే వదిలి వెళ్ళడంతో తను ఇక్కడే సెటిలై పోయాడు. టౌన్లో ఇతడి స్థలం ఒకటి కబ్జా చేయాలన్న పన్నాగంతో ఓ కేడీ భూపతి (ప్రేమ్జీ అమరేన్) వుంటాడు.

స్కూల్లో కొత్తగా చేరిన టీచర్ మరియా ఇంగ్లీషు అందచందాలు చూసి, ఆనంద్ ఇక సినిమాల కెళ్ళడం మానేసి, బుద్ధిగా స్కూలుకొస్తూ.. ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటాడు. అతడి ప్రేమని చూసి ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే కులాల్ని, మతాల్నీ అధిగమించి విశాల ప్రాతిపదికన ఆనంద్ ఓ విదేశీయురాలిని ప్రేమించడం గర్వంగా ఫీలైన తండ్రి విశ్వనాథం, ఆమె బ్రిటిషర్ అని తెలిసి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే స్వాతంత్య్ర‌ పోరాటంలో ఓ బ్రిటిష్ తాత తన తాతని చంపాడు కాబట్టి.

అటు మరియా తండ్రి విలియమ్స్ కూడా ఇండియన్ రక్తంతో సంబంధం వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి, మధ్యలో ఇరుక్కున్న ఆనంద్ - మరియాలు ప్రేమ కోసం ఏం చేశారనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది ప్యూర్ కామెడీ కథ. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నర్సింహా రావు మొదలైన దర్శకులు ఫక్తు కామెడీ సినిమాలే తీసేవాళ్ళు. ఈ కాలంలో రోమాంటిక్ కామెడీలు, హార్రర్ కామెడీలు, క్రైమ్ కామెడీలుగా ప్రేమని, హార్రర్‌ని, క్రైమ్‌ని జోడించుకుని కామెడీలు తీస్తున్నారే తప్ప, ఆ రోజుల్లో ఆ దర్శకులు తీసేలాంటి ఫక్తు కామెడీలు తీయలేకపోతున్నారు. దీనికి చాలా సృజనాత్మకత, ప్రతిభ కావాలి సామాజిక స్పృహతో బాటు. కనుక ఒక జంధ్యాల, ఈవీవీ, వంశీ, రేలంగి అన్పించుకునే దర్శకులు ముందు కాలంలో కూడా రావడం అసంభవమనుకుంటున్నసందర్భంలో అనుదీప్ అనే దర్శకుడు వచ్చాడు.

అనుదీప్ తీస్తున్నవి సిల్లీ కామెడీలే కావొచ్చు, కానీ దీనికాధారం సామాజిక అంశాలే, నేటివిటీయే. కామెడీకి ఆధారమైన అంశం లాజికల్‌గా ఉంటే, దాని మీద ఎంత ఇల్లాజికల్(అబ్సర్డ్) కామెడీ అయినా సృష్టించ వచ్చని అరిస్టాటిల్ చెప్పాడు. అనుదీప్ ఆధారంగా చేసుకున్నవి కులాలు, ఇండో -బ్రిటిష్ వైరం, దేశ భక్తి - మానవత్వం మొదలైనవి. వీటిని వ్యంగ్యం చేసి, హాస్యం పట్టించి, ఎంత కడిగెయ్యాలో అంతా కడిగేసుకుంటూ పోయాడు.

'కులాలు నర్సు చేతిలో ఉన్నాయి, ఇటు పిల్లని అటు మారిస్తే కూలలే మారిపోతాయి'... 'దేశాల్ని ఆక్రమించి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్స్ ని ఇచ్చింది మీరు'... 'ఇంగ్లీషోడికి ఇంకా ఇండియాలో చోటుందా'... వంటి డైలాగులెన్నో పేలుతూంటాయి. కృత్రిమ -కట్ అండ్ పేస్ట్- వాట్సాప్ జోకుల రోమాంటిక్, హార్రర్, క్రైమ్ ప్లాస్టిక్ కామెడీలతో మొహం మొత్తిన అభిరుచిగల ప్రేక్షకులకిది వొక ఊరట.

ప్రతీ సీనూ ఏదో రకంగా హాస్య సంభాషణా బలంతో పేలేదే. నాలుగు సీన్లు హైలైట్‌గా ఉంటాయి- కూరగాయల షాపు దగ్గర సొరకాయ కామెడీ, ఇంట్లో మొబైల్ కాలర్ ట్యూన్ కామెడీ, పోలీస్ స్టేషన్లో యాంటీ ఇండియన్స్- జనరల్ నాలెడ్జి కామెడీ, చివర్లో దేశభక్తి వర్సెస్ మానవత్వం కామెడీ క్లయిమాక్స్.

మంచి కామెడీ తీయాలంటే ఐక్యూ ఎక్కువుండాలి, ఇంటలిజెంట్ రైటింగ్ ఉండాలి. ఇవి ఆద్యంతం కన్పిస్తాయి. ఇలా ఓ ఓన్లీ కామెడీ సినిమాకి ఇంకో బలమైన ఉదాహరణ తమిళంలో యోగిబాబుతో ఎన్నికల వ్యవస్థపై రియలిస్టిక్ జానర్లో తీసిన 'మండేలా' (2020).

నటనలు- సాంకేతికాలు

హీరోగా శివ కార్తికేయన్ కామెడీని చాలా ఈజ్‌తో లాగించేశాడు. అతను చాలా సహజంగా సిట్యుయేషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. తండ్రి పాత్ర పోషించిన సత్యరాజ్‌తో కామెడీ సీన్లు ఎక్కువ. సత్యరాజ్ ఇందులో ప్రధాన కమెడియన్ అనుకోవచ్చు. ప్రారంభంలో సరిహద్దులు గీసుకుని కొట్టుకుంటున్న వూరి జనాల కులాల పిచ్చిని కత్తితో చికిత్స చేసి, అదే కత్తితో దేశభక్తి, మానవత్వం గ్రూపులకి చికిత్స చేస్తాడు. కత్తితో ఎవరి చేతి మీద గీరినా రక్తం ఒకటేనని చూపించడం అతడి హాబీ. తెల్లవాడైన హీరో తండ్రి కూడా చేటిమీద గాటు వేయించుకుంటే రక్తం ఎరుపే.

అలాగే పోలీస్ స్టేషన్ కామెడీలో ఇన్స్ పెక్టర్ పాత్రలో ఆనందరాజ్ నటన. ఇక భూకబ్జాలు చేసే కేడీగా ప్రేమ్జీ అమరేన్ ది కూడా మంచి కామెడీ. ఇవన్నీ ఒకెత్తైతే, హీరోయిన్‌గా నటించిన ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క తెలుగు పాత్రలో పూర్తిగా ఇంకిపోయింది. ఇక్కడే పుట్టి పెరిగిన బ్రిటిష్ అమ్మాయిగా ఆ సహజత్వం ప్రదర్శించింది. క్లయిమాక్స్ కి ముందు సత్యరాజ్‌తో, ఆనాడు బ్రిటన్ చేసిన అన్యాయాలన్నిటికీ క్షమాపణలు చెప్పే భావోద్వేగపూరిత సన్నివేశం కదిలిస్తుంది.

ఈ కామెడీలో స్లో పాటలు, ఫ్లోని దెబ్బతీసే మాంటెజెస్ సాంగ్స్ లేకుండా హుషారు నిచ్చే పాటలున్నాయి. రెండు గ్రూప్ సాంగ్స్ కి భారీ సెట్సే వేశారు. థమన్ సంగీతానికి తగ్గట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కొన్ని చోట్ల పాలిపోయి ఉంది. ఎందుకలా డీఐ చేశారో తెలీదు. పోతే ఇది ద్విభాషా చిత్రమన్నారు గానీ, ఇందులో తెలుగు నటీనటులెవ్వరూ లేరు. తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్ చేసినట్టుంది. అయితే తీసింది తెలుగు దర్శకుడు కావడంతో తెలుగే అన్పించే డైలాగులున్నాయి. కాసేపు తీరిగ్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ కామెడీని.

First Published:  22 Oct 2022 10:44 AM GMT
Next Story