Telugu Global
MOVIE REVIEWS

Pindam Movie Review | పిండం మూవీ రివ్యూ {2/5}

Pindam Telugu Movie Review | ఇటీవల హిట్టయిన ‘పొలిమేర 2’ తర్వాత మరో హార్రర్ ‘పిండం’ అనే ఆసక్తికర టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీరావు వంటి ఇద్దరు ప్రముఖులు నటించారు.

Pindam Movie Review | పిండం మూవీ రివ్యూ {2/5}
X

Pindam Movie Review | పిండం మూవీ రివ్యూ {2/5}

చిత్రం: పిండం

దర్శకత్వం: సాయి కిరణ్ దైద

తారాగణం: శ్రీరామ్, ఖుషీ రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు తదితరులు

కథ: సాయికిరణ్ దైద, కవి సిద్ధార్థ; సంగీతం : కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : సతీష్ మనోహర్

బ్యానర్: కళాహి మీడియా, నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి

విడుదల: డిసెంబర్ 15, 2023

రేటింగ్: 2/5

ఇటీవల హిట్టయిన ‘పొలిమేర 2’ తర్వాత మరో హార్రర్ ‘పిండం’ అనే ఆసక్తికర టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీరావు వంటి ఇద్దరు ప్రముఖులు నటించారు. సాయికిరణ్ దైద అనే కొత్త దర్శకుడు దీనికి బాధ్యత వహించాడు. దర్శకుడితో కలిసి ప్రముఖ కవి సిద్దార్థ అందించిన కథ, వేరే స్వయంగా రాసిన పాటలతో ఈ కొత్త హార్రర్ ఎంత కొత్తగా వుందో చూద్దాం...

కథ

1990లో శుక్లాపేట అనే వూళ్ళో ఆంథోనీ (శ్రీరామ్) రైస్ మిల్లులో అక్కౌంటెంట్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడ వూరి చివర ఓ పాత ఇంటిని కొనుక్కుని భార్య మేరీ (ఖుషీ రవి), ఇద్దరు కూతుళ్ళు, తల్లి సూరమ్మలతో కలిసి దిగుతాడు. మేరీ గర్బవతి. అయితే ఆ ఇంట్లో దిగినప్పటి నుంచి ఏవో భయాలు ఈ కుటుంబాన్ని వెంటాడుతాయి. ఒకటి కాదు, చాలా ఆత్మలు ఈ ఇంట్లో వున్నాయని పసిగడతారు. అయితే ఆత్మలు గర్భంతో వున్న మేరీనేం చెయ్యవు. ఆంథోనీ కుటుంబం ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే ఆత్మలు వెళ్ళనివ్వవు.

దీంతో ఇల్లు అమ్మించిన బ్రోకర్ ని పట్టుకుని తిడతాడు ఆంథోనీ. ఆ బ్రోకర్ ఆత్మల్ని వదిలించే భూత వైద్యురాలు అన్నమ్మ (ఈశ్వరీ రావు) దగ్గరికి తీసుకు పోతాడు. అన్నమ్మతో తాంత్రిక శక్తులపై పరిశోధనలు చేసే లోకనాథ్ (అవసరాల శ్రీనివాస్) వుంటాడు. అన్నమ్మకి ఆ ఇంటి గురించి తెలుసు. ఇల్లు ఖాళీచేయ వద్దని ఆంథోనీకి చెప్పి ఆత్మల్ని పారద్రోలాడానికి బయల్దేరతారు.

ఆ ఆత్మలు ఎవరివి? ఎందుకు ఆ ఇంట్లో వుంటున్నాయి? మేరీ జోలికి రాని ఆత్మలకి ఆమె గర్భంలో పిండంతో సంబంధమేమిటి? ఆత్మల కథేమిటి? అన్నమ్మ, లోకనాథ్ లు ఈ ఆత్మల్ని ఎలా వదిలించారు?ఈ విషయాలు తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాల్సిందే.

ఎలావుంది కథ

పదార్థానికి నాశనం లేదని, మట్టిలో కలిసిన ఏ పదార్థానికైనా దాని శక్తి అలాగే వుంటుందనీ, ఆ శక్తిని నిర్మూలించలేరనీ, అలాగే మనిషి మరణం తర్వాత శరీరం నశించినా అందులోని శక్తి నశించదనీ; అలాగే గర్భస్థ పిండాన్ని విచ్ఛిత్తి చేసే ప్రయత్నం చేసినా అందులోని ఆత్మ శక్తి రూపంలో పరిభ్రమిస్తూ వుంటుందనీ చెప్పే ఉద్దేశంతో ఈ కథ చేశాడు దర్శకుడు. ఇదీ పిండం గురించి కాన్సెప్ట్.

అయితే పిండం కథంటూ కాన్సెప్ట్ కొత్తగా అన్పించిందేమో గానీ, ఆ పిండం చుట్టూ అల్లిన కథ రొటీన్, రెగ్యులర్ హార్రర్ కథలాగే వుంది. గతంలో గర్భంలో వుండగా జరిగిన అన్యాయానికి ఆ మనుషులు ఆత్మలుగా ఇలా ప్రవర్తిస్తున్నారన్న కథలో కొత్తదనం,బలం లేవు. హాలీవుడ్ ‘’ఎంబ్రియో’ (పిండం) లో మానవ పిండంపై ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్త (రాక్ హడ్సన్) కేవలం కొద్ది రోజుల్లో పిండం పరిపక్వత చెందడానికి ఒక పద్ధతిని కనుగొంటాడు. అది వికటించి ఆ పిండం నుంచి ఉద్భవించిన ఆత్మ భయానకంగా పగదీర్చుకుంటుంది.

‘ఇట్స్ ఎలైవ్’ అనే మరో హాలీవుడ్ హర్రర్ లో హీరోయిన్ ప్రసవించడానికి హాస్పిటల్ కి పోతే, పుట్టిన భయానక బిడ్డ మీద పడి అందర్నీ చంపడం మొదలెడుతుంది. ఇలాటివి కొత్త కథలుగా అనిపిస్తాయి.

ఫస్టాఫ్ కథ లేకుండా ఆత్మలు పాల్పడే చేష్టలతో కాలయాపన చేశారు. కథ సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో పెట్టుకున్నారు. ఫస్టాఫ్ ఇంట్లో ఫోటోలు కింద పడిపోవడం, కుర్చీలు కదలడం, ఎవరో మాట్లాడుతున్నట్టు వింత శబ్దాలు విన్పించడం, ఆత్మలు గుంపుగా కనిపించడం లాంటి మూడు నాల్గు సీన్లు భయపెడతాయి. మిగతా చాలా సీన్లు అవే మామూలు సంఘటనలతో రిపీట్ అవుతూ వుంటాయి. ముందుకు కదలకుండా ఎక్కడున్న సినిమా అక్కడే వున్నట్టు చూపించిందే చూపిస్తూ వుంటారు. మరి ఇంత హార్రర్ కి ఇంటర్వెల్ మలుపు చాలా సాదాగా తేలిపోతుంది.

సెకండాఫ్ లో అన్నమ్మ ఎంట్రీతో కాస్త ఆసక్తి కలుగుతుంది. అన్నమ్మ తాంత్రిక విద్యలతో అతి ఎక్కువ వుంటుంది. ఆమె కళ్ళు మూసుకుంటే ఆత్మల గతమంతా కనిపించేస్తుంది. హార్రర్ కి లాజిక్స్ ఏముంటాయి. దెయ్యాల టాపిక్కే లాజిక్ లేనిది. కాబట్టి అన్నమ్మ ఎలాటి విద్యాలనైనా ప్రదర్శిస్తుంది. ఆమె చూసే ఆ గతంలో ఓ కుటుంబానికి జరిగిన అన్యాయం ఫ్లాష్ బ్యాకుగా వస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ కథలో జీవం వుండదు. ఆత్మలంటేనే వాటికేవో బాధలు, న్యాయం కోసం ఆక్రందన వంటి భావోద్వేగాలుంటాయి. ఈ ఎమోషన్స్ లేని అతి హింసతో ఫ్లాష్ బ్యాక్ ఫ్లాట్ గా సాగుతుంది. మనమేం ఫీలవ్వం ఆత్మల కథకి. పైగా హింసకి అఫెండ్ అవుతాం. క్లయిమాక్స్ లో హింసయితే చెప్పనవసరం లేదు. విషయం లేకుండా హింసే చూపిస్తే మిగిలేది శూన్యమే. ఈ హింస వల్ల హార్రర్ ఎలిమెంట్ కూడా అదృశ్యమై పోయింది.

నటనలు -సాంకేతికాలు

హీరోగా శ్రీరామ్ ఫస్టాఫ్ లో ఏమీ చేయని పాసివ్ పాత్ర. సెకండాఫ్ లోనే యాక్షన్ లోకొస్తాడు. సహజంగా నటించాడు. కుటుంబాన్ని కాపాడుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఫర్వాలేదనిపిస్తాడు. పిల్లల తల్లిగా, గర్భవతిగా ఖుషీ రవి హార్రర్ అనుభవాల్ని బాగానే నటించినా, అసలు ఇలాటి దెయ్యాల వాతావరణంలో గర్భవతి వుండడం శ్రేయస్కరమా అన్న లాజిక్ మనకి కొడుతుంది. పిల్లల నటన బాగుంది. అన్నమ్మగా ఈశ్వరీ రావు పాత్రకి తాంత్రిక శక్తులు మరీ ఎక్కువున్నాయి. ఆత్మలపై పరిశోధన చేసే పాత్రగా అవసరాల శ్రీనివాస్ అవసరం తక్కువే.

ఇంటి చుట్టూ లొకేషన్, ఇంట్లో దాని హార్రర్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం వంటి చిత్రీకరణతో కెమెరా మాన్ సతీష్ మనోహర్ ప్రతిభ కనబర్చాడు పరిమిత బడ్జెట్ లోనే. కృష్ణ సౌరభ్ నేపథ్య సంగీతం ఫస్టాఫ్ లో రిపీట్ సీన్లకి, సెకండాఫ్ లో అతి హింసకీ తేడా లేకుండా ఒకే విధంగా సాగడం సినిమాలో ఎమోషన్స్ లేకపోవడం వల్లే. ఎమోషన్స్, హార్రర్, థ్రిల్స్, సస్పెన్స్ వంటివి లేకుండా కేవలం హింస మీద ఆధార పడితే ఇలాగే వుంటుంది. టైటిల్ గా పెట్టిన ‘పిండం’ కి ఆత్మలకీ మధ్య సంబంధం ఏంటనేది కూడా ఆసక్తి కల్గించకుండా పోయింది. వీటన్నిటి కారణంగా ఈ హార్రర్ కథ అబార్షనైంది.



First Published:  15 Dec 2023 10:55 AM GMT
Next Story