Telugu Global
MOVIE REVIEWS

Ooru Peru Bhairavakona Movie Review: ఊరు పేరు భైరవకోన రివ్యూ {2/5}

Ooru Peru Bhairavakona Movie Review: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ తో తిరిగి వచ్చాడు. సందీప్ కిషన్ తో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమా ఇటీవల ట్రెండ్ గా మారిన రూరల్ హార్రర్స్ లో మరొకటిగా చేరుతోంది.

Ooru Peru Bhairavakona Movie Review: ఊరు పేరు భైరవకోన రివ్యూ {2/5}
X

చిత్రం: ఊరు పేరు భైరవకోన

రచన- దర్శకత్వం : వీఐ ఆనంద్

తారాగణం: సందీప్ కిషన్, కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : రాజ్ తోట, కూర్పు : చోటా కె ప్రసాద్

సమర్పణ : అనిల్ సుంకర, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌

బ్యానర్: హాస్య మూవీస్ నిర్మాత: రాజేష్ దండా

విడుదల ; ఫిబ్రవరి 16, 2024

రేటింగ్: 2/5

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ తో తిరిగి వచ్చాడు. సందీప్ కిషన్ తో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమా ఇటీవల ట్రెండ్ గా మారిన రూరల్ హార్రర్స్ లో మరొకటిగా చేరుతోంది. మరి ఈ రూరల్ హార్రర్ మిగతా వాటికి ఎందులో భిన్నంగా వుంది? ఒక బలమైన పాయింటుతో భావోద్వేగాల జర్నీలా వుందా, లేక మూడు నాల్గు జానర్లు కలిపేసిన కిచిడీలా వుందా తెలుసుకుందాం...

కథ

బసవ (సందీప్ కిషన్) సినిమాల్లో హీరోలకి డూప్ గా పనిచేస్తూంటాడు. ఒక రోజతను ఫ్రెండ్ జాన్ (వైవా హర్ష) తో కలిసి ఓ పెళ్ళిలో పెళ్ళికూతురి నగలు దోచుకుని పారిపోతాడు. పోతూంటే దారిలో గీత (కావ్యా థాపర్) యాక్సిడెంట్ జరిగి పడిపోయి వుంటుంది. ఆమెని కారెక్కుంచుకుని పోతూంటే అడవిలో ఒక వూరు కన్పిస్తుంది. అక్కడ గీతకి వైద్యం చేయించడానికి పోతే ఆ వూళ్ళో అందరూ దెయ్యాలై వుంటారు.

ఎవరీ దెయ్యాలు? ఎందుకు వూరంతా దెయ్యాలు వుంటున్నాయి? భైరవకోన వూరి కథ ఏమిటి? ఆ వూళ్ళో దెయ్యాల మధ్య ఇరుక్కున్న ముగ్గురూ ఎలా తప్పించుకున్నారు? మధ్యలో బసవ ప్రేమించిన భూమి (వర్షా బొల్లమ్మ) ఎవరు? ఆమె ఏమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఫాంటసీ జానర్ కథ. అయితే ఇందులో ఏదో ఒక జానర్ కాకుండా హార్రర్, అతీంద్రయ శక్తులు, పురాణం, జాంబీ హార్రర్ జానర్లన్నీ కలిపేసి ఏదీ ఫీలవకుండా రస భంగం కలిగిస్తూ పోయాడు దర్శకుడు. భైరవకోనకి శ్రీకృష్ణ దేవరాయలి కాలంలో గరుడ పురాణంతో కల్పిత కథ చేసి- దాని చుట్టూ హార్రర్, అతీంద్రయశక్తులు, జాంబీ హార్రర్ జానర్లు తెచ్చి కలిపారు. సజాతి జానర్లతో మల్టీజానర్ కథ చేసి చూపించవచ్చు, విజాతి జానర్లతో కాదు. గరుడ పురాణం కేంద్రంగా కథ వున్నప్పుడు స్పిరిచ్యువల్ థ్రిల్లర్ జానర్ చేస్తే సరిపోయేది. ‘కార్తికేయ2’ లాగానో, ‘హనుమాన్’ లాగానో ఆకట్టుకునేది.

గరుడపురాణం ప్రకారం చచ్చిన వాళ్ళు కర్మల్ని బట్టి స్వర్గ నరకాలకి పోతారని, కోపం, ద్వేషం, పగ వున్న ఆత్మలు భైరవ కోనకి చేరుతాయని, ఇక్కడ పెద్దమ్మ (వడివుక్కరసు) అనే ఆవిడ వాళ్ళని మంచి ఆత్మలుగా మారుస్తుందనీ ఏదేదో కల్పితాలు చేశారు. ఇదేమీ అతకలేదు. శంకర్ తీసిన ‘అపరిచితుడు’ లో గరుడపురాణంలో చెప్పిన శిక్షల ప్రకారం అవినీతి పరుల్ని శిక్షిస్తూ వుంటాడు విక్రమ్. ఇది అతికి సినిమా సూపర్ హిట్టయ్యింది.

రాజప్ప (రవిశంకర్) అనే అతను కూతురి పెళ్ళికి దాచిన నగల్ని పనివాడు (జయప్రకాష్) దోచుకునిపోయి ధనవంతుడవుతాడు. ఆ నగల్నే ఇతడి కూతురి పెళ్ళిలోంచి బసవ దోచుకుపోతాడు. ఆ నగలే భైరవకోనలో దెయ్యమై వున్న రాజప్ప లాక్కుంటాడు. వీటిని తిరిగి సంపాదించి తను ప్రేమిస్తున్న భూమి (వర్ష) కి ఇవ్వాలన్నది బసవ లక్ష్యం. అయితే ఈ స్పష్టంగా వున్న పాయింటుని రకరకాల జానర్ల కథనాలతో అర్ధమవకుండా, ఫాలో అవకుండా గజిబిజి చేశారు. బసవ మొదట రాజప్ప నుంచి నగల కోసమని, తర్వాత ప్రేమిస్తున్న భూమి కోసమనీ అంటూ కథని విరిచి కథనం చేయడంతో మరీ ముఖ్యంగా సెకండాఫ్ తేలిపోయింది.

ఫస్టాఫ్ కథని సెటప్ చేస్తూ సవ్యంగా సాగినా, ఇంటర్వెల్లో భైరవకోనలో ఉన్నవి దెయ్యాలని రివీల్ చేశాక, సెకండాఫ్ పూర్తిగా ఆ దెయ్యాల గోలతో అభాసు అయింది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు కూడా అర్ధం గావు. ముగింపు హడావిడిగా కానిచ్చేశారు. ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయిన సెకండాఫ్ అనాధగా మిగిలింది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన వాళ్ళే కాదు, ఉన్న వూరు విడిచి ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు కూడా అనాధలేలని ఈ సినిమాలో డైలాగు వుంది. కథని రెండుగా విరిచేసిన సెకండాఫ్ కూడా అనాధేనని తెలుసుకుని వుండాల్సింది.

ఇన్ని జానర్లతో ఇంత హడావిడీ చేసే సినిమాలో థ్రిల్లింగ్ దృశ్యాలు, ఎమోషనల్ డ్రామాలు, కట్టి పడేసే సస్పెన్సు కూడా లేకపోవడం విచిత్రం. ప్రారంభంలో సందీప్ కిషన్ క్యారక్టర్ నగలతో పారిపోతున్నప్పుడే వాటికి ప్రేమించిన అమ్మాయితో లింకు వుందని చెప్పేసి వుంటే, ఆ అమ్మాయి కోసం అన్వేషణే ఏకైక లక్ష్యంగా పోరాటమని ఎస్టాబ్లిష్ చేసి కథని కిక్ స్టార్ట్ చేసివుంటే, బలంగా ముందుకు దూసుకుపోయేది.

నటనలు - సాంకేతికాలు

సందీప్ కిషన్ కి చాలాకాలం తర్వాత మంచి పాత్రే దక్కింది. దీన్ని కష్టపడి నటించాడు. అయితే ప్రేమ ప్రధానమైన కథలో ప్రేమికుడుగానే కనిపించకపోవడం పెద్ద లోపం. హీరోయిన్ వర్షతో ప్రేమ ఎక్కడో సెకండాఫ్ లో రివీల్ అవడంతో అప్పటివరకూ రోమాంటిక్ యాంగిల్ లేని డ్రై పాత్రగా మిగిలాడు. రెండో హీరోయిన్ కావ్య, సందీప్ కిషన్ భైరవ కోనకి చేరేందుకు ఒక సహాయపాత్రగా మిగిలింది. సందీప్ కి వైవా హర్షతో కామెడీ ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే యాక్షన్ సీన్లు బావున్నాయి.

హీరోయిన్ వర్షకి లవ్ ట్రాక్ తెగి పోవడంవల్ల హీరోయిన్ గా ప్రభావం చూపించాడు. రెండు పాటల్లో తనే కనిపిస్తుంది. సెకండ్ హీరోయిన్ కావ్య సందీప్ పక్క వాద్యంగా వుంటుంది. ఈ సినిమాలో అత్యంత ఫన్నీ సీన్స్ వెన్నెల కిషోర్- వైవా హర్షల మధ్య వున్నాయి. ఇద్దరి మధ్య డైలాగులు బాగా పేలాయి. ఇక దెయ్యాలుగా నటించిన సీనియర్, జూనియర్ నటులందరూ మామూలే. వూళ్ళో తిరిగే ఈ దెయ్యాలు జాంబీ సినిమాల్లో నడిచే శవాలుగా కన్నా పిచ్చి వాళ్ళుగా కనిపిస్తారు. వూరంతా పిచ్చి వాళ్ళుగా కన్పిస్తూంటారు. 2012లో అక్షయ్ కుమార్ నటించిన ‘జోకర్’ అనే సైన్స్ ఫిక్షన్ లో ఇలాగే వూరంతా పిచ్చి వాళ్ళ పాత్రలుంటాయి. సినిమా ఫ్లాపయ్యింది.

కథా కథనాలు వదిలేస్తే, దర్శకుడు ఆనంద్ చిత్రీకరణ విషయంలో టాలెంట్ చూపించాడు. గ్రాఫిక్స్ కి చాలా పని వున్న ఈ సినిమాలో హైక్వాలిటీ విజువల్స్ ని సృష్టించాడు. అలాగే సెట్స్, కళా దర్శకత్వం బాగా ఖర్చుపెట్టి సమకూర్చాడు. కెమెరా మాన్ రాజ్ తోట, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ సినిమాతో హైలైట్ అవుతారు. ఫస్టాఫ్ ఎంటర్ టైనర్ గా, సెకండాఫ్ అదో టైపుగా వున్న ఈ మిక్సీలో వేసిన ఫాంటసీ బాక్సాఫీసుకి మాత్రం సస్పెన్సే!



First Published:  16 Feb 2024 12:20 PM GMT
Next Story