Telugu Global
MOVIE REVIEWS

'ఒకే ఒక జీవితం' రివ్యూ!

ఆరు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ కొత్త దర్శకుడితో, కొత్త ప్రయత్నంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చాడు.

ఒకే ఒక జీవితం రివ్యూ!
X

చిత్రం: ఒకే ఒక జీవితం

రచన- దర్శకత్వం: శ్రీకార్తీక్

తారాగణం: శర్వానంద్, రీతూ వర్మ, అమలా అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు

సంగీతం: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : సుజిత్ సరంగ్

నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు, ఎస్ఆర్ ప్రభు

విడుదల: సెప్టెంబర్ 9, 2022

రేటింగ్: 2.75/5

ఆరు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ కొత్త దర్శకుడితో, కొత్త ప్రయత్నంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చాడు. కొత్త ప్రయత్నమంటే పాత ప్రయత్నాలనే కొత్త ఫోటో ఫ్రేములో చూపడం. తను చేస్తూ వచ్చిన, వరస పరాజయాలె

దుర్కొన్న అవే ఫ్యామిలీలు, అవే మదర్ సెంటిమెంట్లు, అవే ప్రేమలు, బాధలు, కన్నీళ్లూ ఈసారి టైమ్ మెషీన్లో పెట్టి సైంటిఫిక్ గా, సైన్స్ ఫిక్షన్ గా చూపించడం. అయితే తమిళంలో రెండు సినిమాలు చేసిన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ కొత్త ప్రయత్నం ఏ మేరకు ఫలించింది? ఈ సెంటిమెంటల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో అక్కినేని అమల కేంద్ర బిందువుగా వుంది. చవితికి 'రంగరంగ వైభవం' కి దూరంగా వున్న కుటుంబ ప్రేక్షకులు, ఇప్పుడు అమలని చూసి 'ఒకేఒక జీవితం' కి తరలి వస్తారా?

కథ

ఆది (శర్వానంద్) గిటారిస్టుగా సంగీతంలో రాణించాలని కృషి చేస్తూంటాడు. అతడికి ఇద్దరు స్నేహితులు శీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి) వుంటారు. ఆది మదర్ ఫిక్సేషన్ తో బాధపడుతూంటాడు. స్టేజి ఎక్కి పాడాలంటే భయం. తల్లి వుంటే ఈ భయముండేది కాదు కదాని బాధ. తల్లి ఇరవై ఏళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆదిని ఎంకరేజి చేస్తూ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తుంది అతడ్ని ప్రేమిస్తున్న వైష్ణవి (రీతూ వర్మ). శీనూ చైతూలకి కూడా వాళ్ళ సమస్యలుంటాయి. శీను ఇళ్ళు అద్దెకిప్పించే బ్రోకర్ గా పనిచేస్తూ అసంతృప్తిగా వుంటాడు. చదువుకుని వుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడే వాణ్ణి కదాని బాధ. చైతూకి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చడం లేదని బాధ. చిన్నప్పుడు సీత అనే అమ్మాయిని దూరం పెట్టాడు. ఇప్పుడామెని చూసి ఎందుకు ఆనాడు ప్రేమించలేదని బాధ.

ఇలావుండగా, ముగ్గిరికీ రంగి కుట్ట పాల్ (నాజర్) అనే క్వాంటమ్ ఫిజిసిస్టు పరిచయమవుతాడు. ఇతను ఇరవై ఏళ్ళు కష్టపడి టైమ్ మెషీన్ని తయారు చేశాడు. టైమ్ మెషీన్లో ఈ ముగ్గుర్నీ వాళ్ళ గతంలోకి తీసికెళ్ళి అక్కడ చేసిన తప్పుల్ని సవరించుకుని, భవిష్యత్తుని బాగు చేసుకునే అవకాశం కల్పిస్తానంటాడు. ముగ్గురూ సరేనని బయల్దేరతారు.

టైమ్ మెషీన్లో 1998 లో తమ బాల్యంలోకి ప్రవేశించాక అక్కడేం జరిగింది? ఎవరెవర్ని కలిశారు? ఆది తల్లిని కలుసుకున్నాడా? ఆమెకు రోడ్డు ప్రమాదం జరగకుండా ఆపగలిగాడా? తన మదర్ ఫిక్సేషన్ సమస్య ఎలా పరిష్కరించుకున్నాడు? చిన్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేసిన శీను ఆ తప్పుని ఎలా సవరించుకున్నాడు? సీతని ప్రేమించలేక పోయిన చైతూ ఇప్పుడు సీతని ప్రేమించి పెళ్ళి సమస్య తీర్చుకున్నాడా?

ఇదంతా ఇలావుండగా, 1998 లో తమ చిన్నప్పటి ఆది, శీను, చైతూలు ఆ కాలంలో మాయమైపోయి ఈ కాలంలోకి (2019) ఎలా వచ్చారు? 1998 లోకి వాళ్ళతో పనిబడి వెళ్ళిన ఇప్పటి ఆది, శీను, చైతూలు ఈ వింత పరిస్థితికి ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడేం చేశారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

హాలీవుడ్ నుంచి రెగ్యులర్ గా వచ్చే టైమ్ మెషీన్ సినిమాల్లో 'ఎబౌట్ టైమ్' (2013) ఒకటి. ఇందులో తండ్రీ కొడుకుల కథ. మరణం, పశ్చాత్తాపం గురించి. కంట తడిపెట్టించే కథ. గర్ల్ ఫ్రెండ్ తో ప్రేమ గురించి కూడా. 'ఒకే ఒక జీవితం' తల్లీకొడుకుల కంట తడిపెట్టించే కథ. ఇది కూడా మరణం, పశ్చాత్తాపం గురించే. అయితే ఈ కథలో తేడా ఏమిటంటే ట్విస్ట్. శర్వానంద్ తన ఫ్రెండ్స్ తో 1998 లోకి వెళ్తే, వాళ్ళ చిన్నప్పటి క్యారక్టర్స్ 2019 లోకి వచ్చేసి వాళ్ళ లక్ష్యాల్ని దెబ్బతీయడం. ఇంటర్వెల్లో ఈ ట్విస్ట్ ఇన్నోవేటివ్ గా వుంది.

అయితే ఫస్టాఫ్ ఫన్నీగా సాగే కథ ఈ ట్విస్ట్ తో ఆశ్చర్యపర్చి, సెకండాఫ్ విషాదంగా, భారంగా మారిపోవడం వినోదాత్మక విలువల్ని దెబ్బతీసింది. 1975 లో బాపు - రమణ గార్ల 'ముత్యాల ముగ్గు' కూడా విషాద కథే. ఆ విషాదం దగా పడిన సంగీత పాత్రదే. కానీ ఆమె పిల్లలిద్దరూ తల్లి జీవితాన్ని చక్కదిద్దేందుకు, పాల్పడే కథనం అద్భుత రసంతో పూర్తి హాస్యభరితంగా వుంటుంది. అదే సంగీత పాత్రకున్న శోక రసంతోనే కథ నడిపివుంటే అంత హిట్టయ్యేది కాదు.

శర్వానంద్ గతంలోకి వెళ్ళింది ప్రమాదానికి గురై చనిపోయిన తల్లి అమలని ప్రమాదానికి గురి కాకుండా కాపాడుకునే లక్ష్యంతోనే. ఆ ప్రమాదం జరగడానికి రెండు రోజులే వుంది. ఇంతలో చిన్నప్పటి తను, తన ఫ్రెండ్స్ తాము వచ్చిన టైమ్ మెషీన్ లోనే 2019 లోకి తప్పించుకున్నారు. దీంతో శర్వానంద్ లక్ష్యం ప్రమాదంలో పడింది. ఇప్పుడెలా తల్లిని కాపాడుకోవాలనే కథ నడపకుండా, కనిపించకుండా పోయిన కొడుకు కోసం తల్లి బాధపడే కథగా మార్చడంతో సెకండాఫ్ విషాదభరితమై పోయింది. యూత్ అప్పీల్ కి గండి కొట్టింది.

ఇంకోటేమిటంటే ఈ ట్విస్టుని పరిష్కరించడానికి ఇంకిన్ని ట్విస్టులు వేస్తూ కన్ఫ్యూజ్ చేయడం. పిల్లలు 1998 లోంచి 2019 లోకి వెళ్ళిపోతే, 1998 లో వుండిపోయిన శర్వానంద్ అండ్ ఫ్రెండ్స్ 2019 లోకి వచ్చి యాక్షన్స్ సీన్స్ చేయడం, మళ్ళీ 1998 లో కన్పించడం ఇలా కన్ఫ్యూజన్ కూడా చాలా వుంది.

అంటే మొత్తానికి పైన చెప్పుకున్నట్టు, శర్వానంద్ కి అలవాటైన ఫ్యామిలీలు, మదర్ సెంటిమెంట్లు, ప్రేమలు, బాధలు, కన్నీళ్లూ ఇలా టైమ్ మెషీన్లో పెట్టి సైంటిఫిక్ గా, సైన్స్ ఫిక్షన్ గా చూపించడం జరిగి పోయిందన్న మాట. సైన్స్ ఫిక్షన్ జానర్ మర్యాద శోక రసం కాదు, అద్భుత రసమే. దీంతోనే బాక్సాఫీసు.

నటనలు- సాంకేతికాలు

శర్వానంద్ గతాన్ని తల్చుకుంటూ వర్తమానంలో బాధపడే సంఘర్షణాత్మక పాత్రలో బాగానే నటించాడు గానీ, అస్తమానం బాధపడ్డమే తప్ప, హుషారుగా చేసేదేమీ లేకపోవడంతో మరో పాసివ్ పాత్రగా మారి యూత్ అప్పీల్ కి దూరమయ్యాడు. శర్వానంద్ వరస పరాజయాలకి పాసివ్ పాత్రలే పోషించడం కూడా ఒక కారణం. పైగా ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ ఫన్ తో ఎక్కువ సీన్లున్నాయి. ఇక గతంలోకి వెళ్ళాక పిల్లల కథ ఎక్కువైపోయి, శర్వానంద్ కన్పించడం కూడా తక్కువే. ఈ ముగ్గురు పిల్లల పాత్రల్ని నటించింది తమిళ బాలనటులే. వాళ్ళ టాలెంట్ చూడాలనుకుని వెళ్ళరు కదా ప్రేక్షకులు?

శర్వానంద్ బాధపడే పాత్రకి రీతూ వర్మతో రోమాన్స్ కూడా లేదు. రీతూ వర్మది ఫస్టాఫ్ లో కాసేపు, సెకండాఫ్ లో కాస్సేపు కన్పించే పాత్ర. 2019 లోకి వచ్చేసిన చిన్నప్పటి శర్వానంద్ ని చూసి ఆమె షాకు తినే సీను, ఆమె ఎవరో తెలీక చిన్నప్పటి శర్వానంద్ అక్కా అని పిలిచే సీసూ గమ్మత్తుగా వున్నాయి.

వెన్నెల కిషోర్ తిరుగులేని మహారాజు. 1998 లో చిన్నప్పటి తనని చూసుకుని వాణ్ణి చదివించడం కోసం పడే పాట్లు బాగా నవ్విస్తాయి. ప్రియదర్శి కూడా చిన్నప్పటి తనని చూసుకుని, వాడు స్కూలు పిల్ల సీతని ఫ్రేమించేలా చేయడం కోసం పడే తంటాలు అలరిస్తాయి. ఇక మదర్ పాత్రలో అమల సరే. ఆమెచుట్టే కథ భారంగా వుంటుంది. ఇలాటి పాత్రలామెకి కొత్త కాదు. అయితే కొడుకుగా శర్వానంద్ ఆమె కాలంలోకి వెళ్ళి సంతోష పెట్టడానికి ఫన్ చేస్తూ ఎంటర్ టెయిన్ చేసి వుండాల్సింది. ఫస్టాఫ్ లో తల్లిగురించే బాధపడి, సెకండాఫ్ లో తల్లి గురించే బాధపడితే కథనంలో డైనమిక్స్ లేవు. మోనాటనీ బారిన పడింది.

ఇక సైంటిస్టుగా నాజర్ బ్రిలియెంట్ గా కన్పిస్తాడు. సిరివెన్నెల రాసిన మదర్ సాంగ్ వుంది. ఇది బిట్లు బిట్లు గా వస్తుంది. సిద్ శ్రీరామ్ పీల గొంతుతో పాడడమొకటి. ఇంకో రెండు సందర్భానుసారం వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ వున్నాయి. 'పెళ్ళి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ రాసిన మాటలు కామెడీ సీన్లకి బావున్నాయి. విషాద దృశ్యాల్లో, మదర్ సెంటిమెంట్లతో ఒక ఆత్రేయ ఏమీ కన్పించలేదు. కెమెరా వర్క్, కళాదర్శకత్వం, 1998 నాటి దృశ్యాల లొకేషన్స్ ఉన్నతంగా వున్నాయి. టైమ్ మెషీన్ బయల్దేరే సీన్లు సీజీతో పకడ్బందీగా వున్నాయి.

చివరిగా, ఫస్టాఫ్ ఫన్, సెకండాఫ్ సీరియస్ అనుకుని ఈ సైన్స్ ఫిక్షన్ చూసేస్తే ఏ ప్రమాదం లేదు, శర్వానంద్ గత ఆరు సినిమాల్లాగా గాకుండా.

First Published:  9 Sep 2022 10:11 AM GMT
Next Story