Telugu Global
MOVIE REVIEWS

Prathinidhi 2 Movie Review: ప్రతినిధి 2- రివ్యూ! {1.5 /5}

దాదాపు ఆరేళ్ళు తెరమరుగైన నారావారి హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ తో తిరిగి తెరపై కొచ్చాడు. 2014 లో ‘ప్రతినిధి’ అనే హిట్ లో నటించి 2018 వరకూ వరుసగా 16 సినిమాలూ నటించేసి విశ్రమించిన రోహిత్, ఇప్పుడు అదే ‘ప్రతినిధి’ హిట్ టైటిల్ ని రక్షక కవచంగా ధరించి సీక్వెల్ గా అందిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి టీవీ5 మూర్తి దర్శకుడు.

Prathinidhi 2 Movie Review: ప్రతినిధి 2- రివ్యూ! {1.5 /5}
X

చిత్రం: ప్రతినిధి 2

రచన -దర్శకత్వం ; టీవీ 5 మూర్తి

తారాగణం : నారా రోహిత్, సిరి లెల్ల, జిషూ సేన్‌గుప్తా, సచిన్ ఖేడ్‌కర్, దినేష్ తేజ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, ప్రధ్వీ రాజ్, సప్తగిరి తదితరులు

సంగీతం: మహతి స్వర సాగర్, ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి

నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్ర నాథ్ బొల్లినేని

విడుదల : మే 10, 2024

రేటింగ్: 1.5 /5

దాదాపు ఆరేళ్ళు తెరమరుగైన నారావారి హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ తో తిరిగి తెరపై కొచ్చాడు. 2014 లో ‘ప్రతినిధి’ అనే హిట్ లో నటించి 2018 వరకూ వరుసగా 16 సినిమాలూ నటించేసి విశ్రమించిన రోహిత్, ఇప్పుడు అదే ‘ప్రతినిధి’ హిట్ టైటిల్ ని రక్షక కవచంగా ధరించి సీక్వెల్ గా అందిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి టీవీ5 మూర్తి దర్శకుడు. కాబట్టి సహజంగానే ఇది జర్నలిస్టు గురించిన సినిమా. కొత్త విషయమేమీ ఇందులో టచ్ చేయలేదు. జర్నలిస్టు అవినీతిని బయట పెట్టడం, ఒక రాజకీయ హత్యని పరిశోధించడం వంటి నలిగిన విషయమే. దీని చిత్రీకరణ మరీ అమెచ్యూరిష్ గా వుంది. ఇది రివ్యూ కూడా అవసరం లేదనిపించే సినిమా.

ఒక మాజీ జర్నలిస్టు (ఉదయభాను) విదేశాల్లో బాగా సంపాదించి చానెల్ పెట్టాలని వస్తుంది. మీడియాలో నిజాలు చెప్పే ఛాన్స్ లేదు గాబట్టి నిజాల్ని బయటికి తీసేందుకు చానెల్ పెడతానంటుంది. ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్టు చేతన్ అలియాస్ చే (నారా రోహిత్) ని చానెల్ సీఈఓ గా నియమించుకుంటుంది. చే ఆర్ధిక మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) అవీనీతిని బయట పెడతాడు. దీంతో ప్రజాశ్రేయస్సు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖెడేకర్) గజేంద్రని బర్తరఫ్ చేస్తాడు. జగ్గయ్యపేట ఉపఎన్నిక వస్తుంది. ఆ ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్ధిగా నిలబడ్డ పారిశ్రామికవేత్త నరసింహ (పృథ్వీ) అక్రమాల్ని కూడా చే బయటపెడతాడు. ఇంతలో క్యాంప్ ఆఫీసులో బాంబు పేలి ముఖ్యమంత్రి ప్రజాపతి మరణిస్తాడు. దీంతో అతడి కొడుకుని సీఎం చేయాలని ప్రయత్నాలు మొదలవుతాయి. అయితే ముఖ్యమంత్రి ప్రజాపతిని చంపిందెవరు? ఎందుకు చంపారు? ఎలా పట్టుబడ్డారు? ఈ కుట్రని చే ఎలా బయట పెట్టాడు? ఇదీ మిగతా కథ.

కథగా చూస్తే ఇందులో ఏమీ కనిపించదు. విషయమే లేని నలిగిపోయిన కథ. దీన్ని సినిమాగా తీయడమెందుకో అర్ధంగాదు. ఫస్టాఫ్ రెండు ఆవినీతి కేసులు, ఉపఎన్నికలో హీరో ఓటు విలువ గురించి ఉపన్యాసం, హీరో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్, తర్వాత ముఖ్యమంత్రి హత్యతో ఇంటర్వెల్. ఈ బిట్లతో కథ చెప్తున్నట్టు కూడా వుండదు.

ఇక సెకండాఫ్ సీబీఐ ఇన్వెస్టిగేషన్, కుట్రదారులతో జర్నలిస్టు చే పోరాటం, రాజకీయ వ్యవస్థలో జర్నలిజం ఎలా వుండాలనే దాని గురించి మెసేజ్, తర్వాత శుభం. ఫస్టాఫ్ లో విషయం లేదనుకుంటే, సెకండాఫ్ హత్యతో కూడా బలహీన డ్రామా. అసలు చాలా లాజిక్కులు సైతం లక్ష్యపెట్టక చుట్టేసిన విధానం. అలాగని ఇది ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీకి మద్దతుగా తీసిన సినిమా కూడా కాదు. అసలు సినిమాలకుండే ఏ లక్షణాలూ కనిపించవు. ఫస్టాఫ్ లో మారువేషం లో రైతుగా హీరో ఎంట్రీ, ఫైటింగ్, గ్రూప్ సాంగ్ - ఇదొక్కటే సినిమా చూస్తున్నట్టు వుంటుంది. మిగిలినదంతా టీవీ5 మూర్తి జర్నలిజం పట్ల అభిరుచి ఎంతటిదో చాటుతుంది. దర్శకత్వ ప్రతిభని పక్కన బెట్టి చూస్తే, కొన్ని ఆలోచింప జేసె డైలాగులు రాయడంలో మాత్రం టీవీ5 మూర్తి సక్సెస్ అయ్యాడు.

ఇక నారా రోహిత్ ఏకోశానా జర్నలిస్టుగా లేడు. కమర్షియల్ మాస్ హీరోగా వుండాలని చాలా ప్రయత్నించాడు. ఫస్టాఫ్ అంతా సిరి లెల్ల వుంటుంది గానీ, సెకండాఫ్ లోనే ఆమె హీరోయిన్ అని అర్ధమవుతుంది. ఇందులో సంగీతం గురించి, సాంకేతికాల గురించీ చెప్పుకోనవసరం లేదు. సినిమా రెండు గంటలకి మించి వుండకపోవడమే ప్లస్ పాయింట్.



First Published:  11 May 2024 3:01 PM GMT
Next Story