Telugu Global
MOVIE REVIEWS

Rorschach Movie Review: 'రోషాక్' – మలయాళం థ్రిల్లర్ రివ్యూ

Mammootty's Rorschach Movie Review: తాజా ప్రయోగాత్మకం ‘రోషాక్’ (సైకలాజికల్ టెస్ట్) నవంబర్ 11 నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వివిధ భాషల్లో విడుదలైంది.

Rorschach Movie Review: ‘రోషాక్’ – మలయాళం థ్రిల్లర్ రివ్యూ
X

Rorschach Movie Review: ‘రోషాక్’ – మలయాళం థ్రిల్లర్ రివ్యూ

ఐదు దశాబ్దాలుగా మలయాళ సినిమాలతో మెగాస్టార్ గా ఎదిగిన మమ్ముట్టి, 70 ఏళ్ళు దాటిన వయస్సులో ప్రయోగాత్మక సినిమాలు నటిస్తున్నాడు. తాజా ప్రయోగాత్మకం 'రోషాక్' (సైకలాజికల్ టెస్ట్) నవంబర్ 11 నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వివిధ భాషల్లో విడుదలైంది. ఇది ఫారెస్ట్ నేపథ్యంలో సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. దీన్ని ఓపికగా చూస్తే దీన్లోని అర్ధం, థ్రిల్ ఆకట్టుకునే విధంగా వుంటాయి. సమీర్ అబ్దుల్ రాసిన కథతో నిసాం బషీర్ దర్శకత్వం వహించాడు. సంగీతం మిథున్ ముకుందన్ అందిస్తే, ఛాయాగ్రహణాన్ని నిమీష్ రవి సమకూర్చాడు. మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పై మమ్ముట్టి స్వయంగా నిర్మించిన ఈ డార్క్ థ్రిల్లర్ కేరళ నేటివిటీని ప్రతిబింబిస్తుంది. పూర్తిగా ఫారెస్ట్- రూరల్ వాతావరణంలో హార్రర్ ఎలిమెంట్స్ ని కూడా కలుపుకుని ఉత్కంఠ భరితంగా కథ సాగుతుంది.

ఆంటోనీ ఎందుకొచ్చాడు?

ఆంటోనీ (ముమ్ముట్టి) దుబాయ్ కి చెందిన ఎన్నారై. విహారయాత్రకి కేరళ వస్తాడు. పోలీస్ స్టేషన్ కెళ్ళి తన భార్య సోఫియా కనిపించడం లేదని కంప్లెయింట్ ఇస్తాడు. అడవిలో కారు యాక్సిడెంట్ అయి స్పృహ తప్పానని, కళ్ళు తెరిచి చూస్తే సోఫియా లేదనీ, అంతటా వెతికి వచ్చాననీ చెప్తాడు. పోలీసులు అడవిలో అన్వేషణ మొదలు పెదరారు. ఆమె చెప్పులు దొరుకుతాయి గానీ ఆమె దొరకదు. కొన్ని రోజులు గాలించి ఇక లాభంలేదని, అడవి జంతువేదో తినేసి వుంటుందనీ భావిస్తారు.

అయితే ఆంటోనీ భార్య దొరికేదాకా వెళ్ళనని, ఇక్కడే వుండి వెతుక్కుంటాననీ చెప్పి, అమ్మకానికున్న ఒక ఇల్లు కొనుక్కుంటాడు. ఆ ఇల్లు అమ్మి డబ్బు తీసుకుని వెళ్ళిన వ్యక్తి హత్యకి గురవుతాడు. డబ్బు మాయమవుతుంది. అందరూ ఆంటోనీనే అనుమానిస్తారు. తర్వాత మరికొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ ఆంటోనీ వల్లే జరుగుతున్నాయని నమ్మడం ప్రారంభిస్తారు. అసలు ఆంటోనీ భార్యతో వచ్చింది నిజమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆంటోనీకి భార్య వుందా? లేకపోతే ఎందుకొచ్చాడు? ఇక్కడేం చేస్తున్నాడు? ఇదంతా అంతు చిక్కని మిస్టరీగా వుంటుంది అందరికీ.

మిస్టరీ వీడేది ముగింపులోనే

1950 లలో స్విట్జర్లాండుకి చెందిన హెర్మన్ రోషాన్ అనే మనో వైజ్ఞానికుడు అసలు మనుషులు ఎలా ఆలోచిస్తారు, ఆలోచనలకి ఎలా ప్రభావితమవుతారు, భావోద్వేగాల సంచలనా లెలా వుంటాయీ తెలుసుకునేందుకు మనుషుల మీద ఇంక్ బ్లాట్ అనే పరీక్షలు జరిపాడు. దీన్ని ఆధారంగా తీసుకుని ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తీశారు.

కథాంశం పురోగమిస్తున్న కొద్దీ, ఆంటోనీ అసలు ఉద్దేశం వెల్లడవుతూ వుంటుంది. పూర్తిగా చివర్లో మాత్రమే కథేమిటో అర్ధమవుతుంది. కథాక్రమంలో తలెత్తే ప్రశ్నలకి జవాబులు చివర్లోనే. ఇల్లు కొన్న తర్వాత ఆంటోనీ చుట్టూ వున్న పాత్రల నిజస్వరూపాలు ఒకటొకటే బయటపెడుతూ పోతాడు ఆంటోనీ. తన భార్యతో సంబంధమున్న నిజస్వరూ

పాలు. ఇందులో బిజినెస్ యాంగిల్, షేర్ల అమ్మకం వ్యవహారం కూడా వుంటాయి. అతీంద్రి

య శక్తుల హార్రర్ కోణంలో ఆత్మలేమిటి, మోక్షమేమిటి- అన్నవి కూడా ముగింపులో కథని వివరిస్తాయి. ఒక కుటుంబంలో మరుగున పడిన రహస్యాలు థ్రిల్లింగ్ డ్రామాతో వెల్లడయ్యే ఈ కథకి పొరలు చాలా వున్నాయి.

మమ్ముట్టి షో ఓన్లీ

ఇది పూర్తిగా మమ్ముట్టి వన్ మాన్ షో. తనలాంటి కమర్షియల్ స్టార్ ఇలాటి పాత్రలో కనిపించడం విశేషమే. దీన్ని అక్కడి ప్రేక్షకులు ఆమోదిస్తారు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేశాడు మమ్ముట్టి. ఒక సైకలాజికల్- ఎమోషనల్ బలమున్న ఆంటోనీ పాత్రని వంక పెట్ట లేనివిధంగా పోషించాడు. మమ్ముట్టి పలికే డైలాగులు, డబ్బింగ్ చెప్పిన వాయిస్ అత్యుత్తమంగా వున్నాయి.

ఇన్స్ పెక్టర్ పాత్రలో జగదీష్, ఇల్లమ్మిన బాలన్ పాత్రలో మణి, ఇతడ్ని కోల్పోయిన భార్య సుజాత పాత్రలో గ్రేస్ నటించారు. సాంకేతికంగా సౌండ్ ఎఫెక్ట్స్ కట్టి పడేస్తాయి. మిథున్ ముకుందన్ నేపథ్య సంగీతం ప్రత్యేకాకర్షణ. అలాగే నిమీష్ రవి ఛాయాగ్రహణం.

సమీర్ అబ్దుల్ రచన, నిసాం బషీర్ దర్శకత్వం- వీటితో మొదటి అరగంట నెమ్మదిగా సాగే బోరు కొట్టే వ్యవహారమే. తర్వాత నుంచి సస్పెన్స్ ప్రారంభమై పరుగులు పెడుతుంది. ఇది ఎండ్ సస్పెన్స్ కథయినా పూర్తి కథ ఎండ్ లో విప్పే సస్పెన్స్ కాకుండా, క్లూస్ అందిస్తూ పోతూ చివర్లో వాటిని కలిపి ముక్తాయించే కథ కావడంతో ఫ్లాప్ కాలేదు.

Next Story