Telugu Global
MOVIE REVIEWS

Mahaveerudu Movie Review: మహావీరుడు మూవీ రివ్యూ {2/5}

Mahaveerudu Movie Review | మహావీరుడు (Mahaveerudu)ఫాంటసీ పాత్రకి తెలుగులో రవితేజ వాయిసోవర్ ఇస్తే తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చాడు.

Mahaveerudu Movie రివ్యూ | మహావీరుడు మూవీ రివ్యూ {2/5}
X

Mahaveerudu Movie రివ్యూ | మహావీరుడు మూవీ రివ్యూ {2/5}

చిత్రం: మహావీరుడు

రచన – దర్శకత్వం: మడోన్ అశ్విన్

తారాగణం: శివకార్తికేయన్, అదితీ శంకర్, సరిత, సునీల్, మిస్కిన్, యోగిబాబు, మిస్కిన్, సరిత తదితరులు

సంగీతం: భరత్ శంకర్, ఛాయాగ్రహణం : విధు అయ్యన్న

బ్యానర్: శాంతి టాకీస్

నిర్మాత: అరుణ్ విశ్వ

విడుదల: జులై 41, 2023

రేటింగ్: 2/5

తెలుగులో ‘జాతిరత్నాలు’ సూపర్ హిట్ తీసిన దర్శకుడు అనుదీప్, తమిళంలో శివకార్తికేయన్ తో తీసిన ‘ప్రిన్స్’ పరాజయం పాలైన తర్వాత, తమిళ స్టార్ శివకార్తికేయన్ ‘మండేలా’ ఫేమ్ దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ‘మావీరన్’ నటించాడు. ఇది తెలుగులో ‘మహావీరుడు’ గా డబ్ అయింది. ఏషియన్ ఫిలిమ్స్ విడుదల చేసింది. తమిళంలో దీనికి మంచి స్పందన్ వస్తోంది. ‘ప్రిన్స్’ తో నిరాశచెందిన తమిళ ఫ్యాన్స్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో ‘మరోచరిత్ర’ సరిత్ర ఒక ముఖ్య పాత్ర పోషించింది. అలాగే దర్శకుడు మిస్కిన్ విలన్ గా నటించాడు. ఇందులో ‘మహావీరుడు’ ఫాంటసీ పాత్రకి తెలుగులో రవితేజ వాయిసోవర్ ఇస్తే తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చాడు. ఏదో వొక వెరైటీ సినిమాతో ముందుకొస్తున్న శివకార్తికేయన్ ఈసారి ఏ విభిన్న పాత్రతో వచ్చాడు? దీన్ని దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేశాడు? ఇది శివకార్తికేయన్ కి తెలుగులో ఇవి తెలుసుకుందాం...

కథ

ఓ దినపత్రికలో సత్య (శివకార్తికేయన్) చిత్రకారుడుగా ‘మహావీరుడు’ అనే బొమ్మల కథ వేస్తూంటాడు. సత్య మహా భయస్థుడు. ఆత్మవిశ్వాసం అస్సలుండదు. సుబ్బారావు పేరుతో బొమ్మల కథ వేసి ఇంకో వ్యక్తికి అమ్మి తెర చాటున వుండిపోతాడు. బొమ్మల కథని దిన పత్రికకి అమ్మి సొమ్ములు చేసుకుంటున్న వ్యక్తిని డబ్బులడిగి తన్నులు కూడా తింటుంటాడు సత్య. ఇలాటి సత్య మురికివాడలో తల్లి ఈశ్వరి (సరిత) తో, చెల్లెలితో నివసిస్తూంటాడు. ఇతడికి అదే దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసే చంద్రముఖి (అదితీ శంకర్) పరిచయమై, వెట్టి నుంచి విముక్తి కల్గించి, నేరుగా పత్రికలో ఆర్టిస్టు పోస్టు ఇప్పిస్తుంది.

ఇంతలో మురికివాడలో నివసిస్తున్న సత్యతో బాటు మిగతా ప్రజలందర్నీ సంక్షేమ పథకంలో భాగంగా నిర్మాణమైన ఫ్లాట్స్ లోకి తరలిస్తుంది ప్రభుత్వం. పిడబ్ల్యీవ్ డి మంత్రి జయసూర్య (మిస్కిన్) ఆధ్వర్యంలో ఈ ‘ప్రజాభవనం’ నిర్మాణంలో భారీ అవినీతి జరిగి, ముట్టుకుంటే గోడలు పెచ్చులూడి పోతూంటాయి. తలుపులు, కిటికీలు వూడిపో

తూంటాయి. దీన్ని ప్రశ్నించే ధైర్యముండదు సత్యకి. సర్దుకుపోవాలంటాడు. తల్లి ఈశ్వరి ఇలా కాదు. తెగువగలది. ఈమె కాంట్రాక్టర్ మీదికి గొడవకిపోతుంది. ఆ కాంట్రాక్టర్ సత్య చెల్లెలితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సత్యకి ఇక పౌరుషం లేచి వచ్చి ఆ కాంట్రాక్టర్ ని కొట్టడానికి వెళ్ళి, కొట్టలేక పారిపోయి వచ్చేస్తాడు. దీంతో తల్లి వేసుకుంటుంది. దాంతో ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు తలకి బలమైన దెబ్బ తగిలి, చెవుల్లో వేరే వాయిస్ విన్పిస్తూంటుంది. ఎవరిదీ వాయిస్? ఏం చెప్తోంది? అది విని ఏం చేశాడు సత్య? ఫ్లాట్స్ ని నమ్ముకుని ఎటూ గాకుండా పోయిన పేదలకి సత్య మంత్రితో ఎలా పొరాడి న్యాయం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఫాంటసీ జానర్ లో యాక్షన్ కామెడీ ఈ కథ. ఓ పిరికివాడు తను వేసిన బొమ్మల కథలోని మహావీరుడి పాత్రతో క్లాసు పీకించుకుని ధైర్యవంతుడిగా మారే కథ. దర్శకుడు మడోన్ అశ్విన్ దీనికిముందు కమెడియన్ యోగిబాబుతో ఓటు హక్కు గురించి తీసిన రియలిస్టిక్ కామెడీ ‘మండేలా’ కి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఇందులో వివక్షకి గురైన సగటు బార్బర్ పాత్ర విజయం చూపించాడు. ఇప్పుడు సగటు ఆర్టిస్టు పాత్రతో వ్యవస్థ మీద పోరు చూపించాడు. అయితే దీన్ని ఫాంటసీతో కమర్షియల్ ఫార్ములా కథగా తీశాడు. తొలి సగమంతా పైన చెప్పుకున్న విధంగా కథని సెటప్ చేయడానికే తీసుకుని, మలిసగంలో అసలు కథలో కొచ్చాడు. ఈ అసలు కథలో శివకార్తికేయన్ పాత్ర కంటే అతడికి చెవుల్లో వినపడే రవితేజ వాయిసోవరే హీరోలా తయారయ్యింది. ఎంత వద్దనుకున్నా వాయిసోవర్ తో అదృశ్యంగా వున్న రవితేజే కన్పిస్తూంటాడు. ఇది శివకార్తికేయన్ ని దెబ్బ కొట్టి సెకండాఫ్ పెచ్చులూడేలా చేసింది.

మహావీరుడు (రవితేజ) మాటలు విని శివకార్తికేయన్ మంత్రితో తలపడే కామెడీలు కొంత సేపే బావుంది ఆ తర్వాత తేలిపోతాయి. పైగా మధ్యలో శివకార్తికేయన్ మళ్ళీ పిరికివాడిగా మారిపోతాడు. ప్యాచ్ వర్కర్ గా యోగిబాబుతో శివ కార్తికేయన్ కామెడీ ఒక్కటే కాస్త ఊరట. ఇక సెకండాఫ్ నిడివి కూడా చాలా ఎక్కువ. సినిమా నిడివి రెండు గంటలా 45 నిమిషాల్లో సెకండాఫ్ నిడివి గంటా 45 నిమిషాలు! ఇది భారంగా పరిణమించింది. క్లయిమాక్స్ చాలా చులకన చేసి తీసినట్టుంది.

నటనలు- సాంకేతికలు

వెరైటీ పాత్రలు నటిస్తున్న శివకార్తికేయన్ ఈసారి రవితేజ వాయిసోవర్ డామినేషన్ తో తలపడే రిస్కులో పడి అసలుకే మోసం తెచ్చుకున్నాడు. ఫస్టాఫ్ లో పిరికివాడుగా వరకూ ఫర్వాలేదు. ఈ నటనలో సున్నిత కామెడీని పండించాడు. ఇదంతా తమిళ ఫ్యాన్స్ కి నచ్చేసింది కాబట్టి అక్కడ హిట్టవచ్చు,

హీరోయిన్ అదితీ శంకర్ జర్నలిస్టుగా సింపుల్ గా నటిస్తే, శివకార్తికేయన్ తల్లిపాత్రలో సరిత ఓవర్ మాస్ యాక్షన్ చేసింది. యోగిబాబు మాత్రం తనదైన బ్రాండ్ కామెడీని ప్రదర్శించి సన్నివేశాల్ని నిలబెట్టాడు. మంత్రిగా దర్శకుడు మిస్కిన్, కార్యదర్శిగా సునీల్ కాస్త వెరైటీ గెటప్పుల్లో కన్పిస్తారు.

సంగీతం సాధారణంగా వుంటే ఛాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలు భారీ ఖర్చుతో కూడుకుని వున్నాయి. అయితే ‘మండేలా’ లో ఎన్నికల రాజకీయాల్ని అపూర్వమైన క్రియేటివిటీతో లోతుగా స్పృశించి అర్ధవంతమైన సెటైర్ గా సృష్టించిన దర్శకుడు మడోన్ అశ్విన్ ఈసారి రొటీన్ ఫార్ములా ఫాంటసీతో ఓ మెట్టు కిందికి దిగాడు.



First Published:  15 July 2023 3:01 PM GMT
Next Story