Telugu Global
MOVIE REVIEWS

MAD Movie Review | మ్యాడ్ - మూవీ రివ్యూ {2.5/5}

MAD Movie Review | జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ, మరో ఇద్దరు హీరోలు రామ్ నితిన్, సంగీత్ శోభన్ లతో కలిపి సితార ఎంటర్ టైంమెంట్స్ తీసిన ‘మ్యాడ్’ ని 'జాతి రత్నాలు' కంటే ఎక్కువ నవ్వించే కామెడీగా ప్రచారం చేశారు నిర్మాతలు.

MAD Movie Review | మ్యాడ్ - మూవీ రివ్యూ {2.5/5}
X

MAD Movie Review | మ్యాడ్ - మూవీ రివ్యూ {2.5/5}

చిత్రం: మ్యాడ్

రచన-దర్శకత్వం: కళ్యాణ్ శంకర్

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతికా సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, అనుదీప్ తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం : షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్

సమర్పణ: సూర్యదేవర నాగవంశీ

నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

విడుదల: అక్టోబర్ 6, 2023

రేటింగ్: 2.5/5

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ, మరో ఇద్దరు హీరోలు రామ్ నితిన్, సంగీత్ శోభన్ లతో కలిపి సితార ఎంటర్ టైంమెంట్స్ తీసిన ‘మ్యాడ్’ ని 'జాతి రత్నాలు' కంటే ఎక్కువ నవ్వించే కామెడీగా ప్రచారం చేశారు నిర్మాతలు. ఇక్కడే ఇంకో సినిమాలాగా తమ సినిమా తీయాలన్న ఆతృత బయట పడిపోతోంది. పోలికల విషయం ఎలావున్నా ‘మ్యాడ్’ 2000 ప్రారంభం నాటి యూత్ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. దీనికి దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ కొత్త దర్శకుడిలో విషయంతో బాటు సమయస్ఫూర్తి ఎలా పనిచేశాయో, ఇవి సినిమా కెలా ఉపయోగపడ్డాయో చూద్దాం...

కథ

అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ముగ్గురి పేర్లలో మొదటి అక్షరాలు తీసుకుంటే ‘మ్యాడ్’ వస్తుంది. ఈ ముగ్గురూ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. అశోక్ మొహమాటస్థుడు, తక్కువ మాట్లాడతాడు. కాలేజీలో జెన్నీ (అనంతికా సనీల్ కుమార్) ని ఏకపక్షంగా ప్రేమిస్తూంటాడు. మనోజ్ శృతి (శ్రీ గౌరీ ప్రియా రెడ్డి) ని చూసి ఇష్టపడతాడు. దామోదర్ కి తనని ఏ అమ్మాయీ ప్రేమించదని బాధ. అలాటి అతడికి వెన్నెల పేరుతో లేఖ వస్తుంది. ఇది తన ఫ్రెండ్స్ ఇద్దరూ ప్రయోగించిన ఫ్రాంక్ అనుకుంటాడు. కానీ ఆమె ఫోన్లో మాట్లాడేససరికి ఆమె ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నాల్లో పడతాడు. ఇంతకీ వెన్నెల ఎవరు? దామోదర్ ఆమెని కలుసుకున్నాడా? కలుసుకుంటే ప్రేమ అనే వరం పొందగలిగాడా? ఇదీ మిగతా కథ

ఎలావుంది కథ

కాలేజీ నేపథ్యంలో యూత్ కామెడీలు 2000-2005 మధ్య లైటర్ వీన్ సినిమాల పేరుతో ఒక ట్రెండ్ గా వచ్చాయి. రామోజీరావు తీసిన ‘చిత్రం’,’నువ్వేకావాలి’ ఈ ట్రెండ్ ని సెట్ చేశాయి. అయితే ఈ రెండు ప్రమ సినిమాల్లాగా గాకుండా, యూత్ సినిమాలు కథ లేకుండా స్టూడెంట్లతో కామెడీలు, ప్రేమలు, జోకులు, ద్వంద్వార్ధాలు, మద్యపానాలూ వంటి సన్నివేశాలతో విమర్శల పాలయ్యాయి. తిరిగి ఇప్పుడు ఇదే ధోరణిలో ‘మ్యాడ్’ తీశారు. అయితే 2007 లో శేఖర్ కమ్ముల తీసిన కాలేజీ కామెడీ ‘హేపీడేస్’ ఒక అర్ధవంతమైన కథతో అతి పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. ‘మ్యాడ్’ ని నిర్మాతలు ‘జాతిరత్నాలు’ కంటే ఎక్కువ నవ్విస్తుందని ప్రచారం చేశారు. కానీ ‘మ్యాడ్’ కథ లేకుండా స్టూడెంట్ కామెడీలు, ప్రేమలు, జోకులు, ద్వంద్వార్ధాలు, తాగుడు సీన్లతో ‘హేపీడేస్’ కీ ‘జాతీరత్నాలు’ కీ మధ్య వూగిసలాడింది.

ముగ్గురు కాలేజీ మేట్స్, వాళ్ళ భిన్న స్వభావాలు, ప్రేమలతో కామెడీలు, ఆ ఫ్రేమల్లో ఒక ప్రేమకి చిన్న ట్విస్టు- ఇంతే కథ. కొత్త దర్శకుడు ఉద్దేశపూర్వకంగా కథ జోలికి వెళ్ళకుండా యూత్ ఎంజాయ్ చేసే కామెడీనే సినిమాకి ప్రధానం చేశాడు. ఎంతసేపూ అవే ప్రేమకథలు తీసి మార్కెట్ ని పోగొట్టుకున్నాక- ప్రేమకథే లేకుండా కామెడీ తీయడం మంచి మార్కెట్ యాస్పెక్ట్ తో కూడిన ఆలోచనే. ఇంకా ఇప్పుడు లొట్టపీసు ప్రేమ సినిమాలు ఎవరిక్కావాలి.

అయితే పచ్చి బూతులు ధారాళంగా ప్రవహించాయి. ఓవర్సీస్ లో విడుదల చేసిన వెర్షన్ లో ఇవి మరీ మితి మీరాయని తెలుస్తోంది. కథ లేకపోయినా ఓ ప్రారంభం, ముగింపులతో గోడచేర్పు వుంది. హోమ్ సిక్ తో వుండే స్టూడెంట్ కాలేజీ అంటే ఇష్టం లేక పారిపోయే దృశ్యంతో ప్రారంభమై, తిరిగి వచ్చి కాలేజీలో చేరే దృశ్యంతో ముగుస్తుంది. ఈ స్టూడెంట్ ని మోటివేట్ చేసేందుకు లడ్డు అనే పాత్రతో పూర్వం జరిగిన కథ వస్తుంది. ఈ కథ అనే పదార్ధంలో కామెడీలు షోకులు సరదాలూ తెలుసుకున్న ఆ స్టూడెంట్, ఇన్స్ ఫైర్ అయి తిరిగి కాలేజీ కెళ్ళడం ముగింపు. బయటి స్నేహాలకంటే కాలేజీ స్నేహాలు మిన్నగా వుంటాయని చెప్పే ప్రయత్నం.

ఈ ప్రారంభానికీ ముగింపుకీ మధ్య జరిగేదంతా కథా కాకర కాయా లేని కామెడీలే. దామోదర్ అనే స్టూడెంట్ కి వెన్నెల అనే అజ్ఞాత లవర్ ఎవరనే లైటర్ వీన్ పాయింటే కథ అనుకోవాలి. ఫస్టాఫ్ పిచ్చి కామెడీలన్నీ చేశాక, సెకండాఫ్ వెన్నెలని వెతికే ప్రయత్నాలతో కామెడీలు, లేడీస్ హాస్టల్లో బూతులూ వగైరా.

ఇక చూడాల్సింది ‘జాతి రత్నాలు’ సక్సెస్ ని రీచ్ అవుతుందా లేదా అనేదే. ‘జాతిరత్నాలు’ బాక్సాఫీసు 20 కోట్లు. దీనికి అప్పటికే పేరు మోసిన నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లాలతో కూడిన ఆకర్షణీయ తారాగణ బలం వుంది. ‘మ్యాడ్’ పూర్తిగా కొత్త హీరో హీరోయిన్ల మీద ఆధారపడింది.

నటనలు -సాంకేతికాలు

హీరోలు ముగ్గుర్లో సంగీత్ శోభన్ ది పైచేయి. గర్ల్ ఫ్రెండ్ లేని అమాయకుడుగా అతడి కామెడీ టైమింగ్, స్పీడ్ డైలాగులు ఈ సినిమాకి బలం. కపిల్ శర్మ షోలో స్పీడ్ డైలాగులు, ఫాస్ట్ కామెడీ గుర్తుకొస్తాయి. నార్నే నితిన్, రామ్ నితిన్ లు ఫర్వాలేదనిపించుకుంటారు. వీళ్ళ కామెడీలకి బలం భిన్న స్వభావాలతో కూడిన పాత్ర చిత్రణలు. దీంతో లాజిక్ లేకపోయినా రోహిత్ శెట్టి ‘గోల్ మాల్’ హిందీ సిరీస్ సినిమాల్లో మైండ్ లెస్ కామెడీల్లాగా చెల్లిపోయింది.

హీరోయిన్ల విషయానికొస్తే షరామామూలుగా చెప్పుకోవడానికేమీ వుండదు. గ్లామర్ బొమ్మల్లా కనిపించడం వరకే. యూత్ సినిమాలంటే ఆ యువప్రేక్షకుల్లో యువతుల కోసం కాదన్నట్టు హీరోయిన్ పాత్రల్ని నిర్లక్ష్యం చేయడం కొంతమేర బాక్సాఫీసు వసూళ్ళని తగ్గించుకోవడమే. కథ చెప్పీ లడ్డూ పాత్రలో విష్ణు చాలా ఈజ్ తో నటించి నవ్విస్తాడు. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ అతిధి పాత్రలో హుషారు పుట్టిస్తాడు. ఇక మిగిలిన నటీనటుల పాత్రలన్నీ కూడా కామెడీ పాత్రలే.

ఆనాడు జంధ్యాల, ఈవీవీ, వంశీ తీసిన కామెడీలు అంటే పూర్తి స్థాయి కామెడీలే. బరువైన సన్నివేశాలు, బాధలు వంటివి వుండవు. ఈ కామెడీ నిర్వచనాన్ని తెలుసుకోకుండా కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తీసి ఏడ్పించే నేటి దర్శకుల్లా గాకుండా, ఈ కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ కామెడీ జానర్ మర్యాదని కాపాడుతూ ఈ కామెడీ తీశాడు.

అయితే పాటల విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. భీమ్స్ సిసిరోలియో పాటలు, నేపథ్య సంగీతం ఈ కామెడీ వున్నంత హుషారుగా లేవు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ ల ఛాయాగ్రహణం మాత్రం మంచి విజువల్స్ తో వుంది. మిగతా నిర్మాణ విలువలు బావున్నాయి.



First Published:  7 Oct 2023 11:56 AM GMT
Next Story