Telugu Global
MOVIE REVIEWS

LGM Movie Review | ఎల్ జీ ఎం మూవీ రివ్యూ {1.5/5}

LGM Movie Review in Telugu | టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యాపారాల్ని సినిమా రంగానికి విస్తరించి తమిళంలో నిర్మించిన మూవీ ‘ఎల్ జీ ఎం’ (లేటజ్ గెట్ మేరీడ్), ఇదే పేరుతో తెలుగులో డబ్ అయింది.

LGM Movie Review | ఎల్ జీ ఎం మూవీ రివ్యూ
X

LGM Movie Review | ఎల్ జీ ఎం మూవీ రివ్యూ

చిత్రం: ఎల్ జీ ఎం

రచన- దర్శకత్వం : రమేష్ తమిళ్మణి

తారాగణం : హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు

సంగీతం : రమేష్ తమిళ్మణి

ఛాయాగ్రహణం : విశ్వజిత్ ఒదుక్కత్తిల్

బ్యానర్ : ధోనీ ఎంటట్రైన్మెంట్

నిర్మాత : సాక్షి సింగ్ ధోనీ

విడుదల : ఆగస్టు 4, 2023

రేటింగ్: 1.5/5

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యాపారాల్ని సినిమా రంగానికి విస్తరించి తమిళంలో నిర్మించిన మూవీ ‘ఎల్ జీ ఎం’ (లేటజ్ గెట్ మేరీడ్), ఇదే పేరుతో తెలుగులో డబ్ అయింది. తమిళంలో గత వారం విడుదలైన ఈ మూవీ ‘బ్రో’ కారణంగా తెలుగులో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదలైంది. రమేష్ తమిళ్మణి దర్శకుడు. సీనియర్ నటి నదియా ముఖ్యపాత్ర పోషించింది. మరి నిర్మాతగా సినిమాల విషయంలో క్రికెటర్ ధోనీ అభిరుచేమిటో, అదెలా వుందో ఓ సారి చూద్దాం...

కథ

ఒక కంపెనీలో పనిచేస్తున్న గౌత‌మ్ (హ‌రీష్ క‌ళ్యాణ్‌), మీరా (ఇవానా) రెండేళ్ళుగా ప్రేమ‌లో వుంటారు. గౌత‌మ్ తో కుదురుతుందో లేదో టెస్ట్ చేసేందుకు ఈ రెండేళ్ళూ టైమ్ తీసుకుంటానని ఆమే కండిషన్ పెట్టింది. ఇప్పుడు గౌతంతో ఫర్వాలేదనుకున్నాక పెళ్ళికి ఒప్పుకుంటుంది. అయితే పెళ్ళి తర్వాత అత్తగారితో కలిసివుండనని, వేరు కాపురం పెడదామనీ ఇంకో కండిషన్ పెడుతుంది. దీంతో తల్లి లీలా (నదియా) ని వొంటరిగా వదిలేయడం ఇష్టం లేని గౌతమ్ విడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే తనకి కాబోయే అత్తగారు ఎలాటిదో తెలుసుకోవడానికి ఆమెతో ఒక టూరు ప్లాన్ చేస్తానంటుంది మీరా. ఈ టూరులో కాబోయే అత్తగారు నచ్చితే పెళ్ళికి ఒప్పుకుంటానంటుంది. గౌతమ్ ఆ టూరు ప్లాన్ చేస్తాడు.

ఇప్పుడు ఈ టూర్లో ఏం జరిగింది? మీరాకి లీలా నచ్చిందా? కాబోయే అత్తాకోడళ్ళు ఒకర్నొకరు అర్ధం జేసుకుని కలిసిపోయారా? మధ్యలో గౌతమ్ ఎలా నలిగిపోయాడు? టూరు వెళ్ళిన కూర్గ్ నుంచి గౌత‌మ్‌కి చెప్పకుండా లీలా, మీరా గోవా ఎందుకు వెళ్ళారు? గోవా నుంచి తిరిగి వస్తూ ఏ చిక్కుల్లో ప‌డ్డారు? చివరికెలా ముగిసిందీ టూరు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

హీరోయిన్ పాత్ర మీరా మనస్తత్వం ఎలా వుందో లాగే వుంది ఈ కథ అవకతవకగా. కొత్త కోడళ్ళు అత్తతో కలిసి వుండలేని నేటి కాలపు సమస్యకి పరిష్కారం చూపాలనుకున్న కథ పులి చేత ప్రేక్షకుల్ని కరిపించేట్టుంది. చాలా కాలం క్రితం హిందీలో గోవిందా - టబులతో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ‘హవా’ విడుదలైంది. అందులో గోవిందా- టబు ల మధ్య సైకలాజికల్ థ్రిల్లర్ గా సాగే తల్లి (టబు) పాత్ర కథ కాస్తా, సెకండాఫ్ లో ఆ తల్లి పిల్ల (కూతురు) తో హార్రర్ కథగా మారిపోతుంది. ఇలా తల్లి కథ పిల్ల కథగా మారినట్టు అత్తాకోడళ్ళ కథ పులి కథగా మారిపోయింది. ‘ఎల్ జీ ఎం’ దర్శకుడు తమిళ్మణి మహాశయుడు టూరెళ్ళిన కాబోయే అత్తాకోడళ్ళ కథని కాస్తా అడవిలో వాళ్ళని తినేసే పులి కథగా, థ్రిల్లర్ గా మార్చి పారేశాడు ధోనీ తొలిసారిగా సినిమాకి పెట్టిన డబ్బులన్నీ పోయేట్టు.

కథా కథనాలే కాకుండా, పాత్ర చిత్రణలు కూడా అవకతవకగా వున్నాయి. హీరో తగిన మొగుడవుతాడో లేదో పరీక్షించాలనుకున్న హీరోయిన్, అతడి తల్లిని కూడా అదే సమయంలో టెస్ట్ చేసి చూసుకుంటే సరిపోయేడానికి, హీరో నచ్చాక మళ్ళీ తల్లిని టెస్ట్ చేయాలనడం నకరాలు చేస్తున్నట్టే వుంది. ఇందుకు ఒప్పుకునే హీరో పెద్ద అమాయకుడే గాక, అతడి తల్లి కూడా తలూపడం హీరోయిన్ చేతిలో కీలుబొమ్మలన్నట్టుగా వుంది. తల్లి పాత్ర ఏ మాత్రం ఆత్మాభిమానం లేకుండా తనని తాను పరీక్షకి పెట్టుకోవడం సిల్లీగా వుంది.

ఇలావుంటే విహారయాత్రలో కాబోయే అత్తాకోడళ్ళు మానసికంగా దగ్గరవుతున్న ఛాయలు కనపడవు. కథ ప్రకారం చూపించాల్సిన వాళ్ళని మానసికంగా ఏకం చేసే కథనాన్నే మర్చిపోయాడు దర్శక మణి. మర్చిపోయి వాళ్ళిద్దర్నీ కిడ్నాపర్ కి అప్పజెప్పాడు. ఆ కిడ్నాపర్ ఎత్తుకుపోతే వాళ్ళు పులి బారిన పడ్డారు. ఇక పులి బారినుంచి వాళ్ళని హీరోగారు ఎలా కాపాడుకున్నదన్నది మిగిలిన కథ! ఈ పిచ్చి కథతో పులి గాట్లు పడకుండా తప్పించుకోగల్గే ప్రేక్షకులే అదృష్టవంతులు! రెండున్నర గంటల పాటు సాగే సినిమా నిడివితో శిక్ష మరోవైపు పొంచి వుంటుంది. ఇదీ సినిమాల పట్ల మహేంద్రసింగ్ ధోనీ అభిరుచి!

నటనలు - సాంకేతికాలు

హీరో హరీష్ కళ్యాణ్ ఎప్పుడో గానీ కనపడని అతిధి పాత్రలా వుంటాడు. కనపడినప్పుడు ఫేసులో ఎక్స్ ప్రెషన్స్ వుండవు. అంటే నటించడం రాదు. త‌ల్లికి, ప్రేయసికి మధ్య సర్ది చెప్పలేక తిప్పలు పడే సరైన డ్రామా దర్శకుడు క్రియేట్ చేయలేక పోయినట్టే, హాస్యభరితంగా నటించే ఈజ్ లేక హీరో కూడా చేతులెత్తేశాడు.

డిటో హీరోయిన్ ఇవానా, తల్లి పాత్ర నటించిన నదియా. ఇద్దరికీ ఇదేం కథో, ఏం పాత్రలు నటిస్తున్నామో చిన్న క్లూ దొరక్క చిటపటలాడే ఫేసులతో సరిపెట్టేశారు. ఇక కమెడియన్ యోగిబాబు కామెడీకి కథతో సంబంధం లేదు. ఎప్పుడొస్తాడో, ఎందుకొస్తాడో కాసేపు ఏదో నవ్వించే ప్రయత్నం చేసి వెళ్ళిపోతాడు.

దర్శకుడే సంగీత దర్శకుడు. అవి అద్భుతమైన పాటలు. టీవీ సీరియల్ లాగా సినిమా తీయడానికి ఛాయాగ్రహకుడు కూడా దర్శకుడితో చాలా కష్టపడ్డాడు. అస్థిరమైన కలర్ టోన్ (డీఐ), చిత్ర విచిత్ర కెమెరా యాంగిల్స్, అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశారా అన్న సందేహం. ఇక గ్రాఫిక్స్ పులి చెప్పనవసరం లేదు. అది కాగితం పులి. దాన్ని చూసి ఇవానా, నదియా ఎందుకంత భయపడతారో తెలీదు - తాము కాగితపు పాత్రలైనప్పుడు. దర్శకుడి చేతిలో వుండాల్సిన కాగితాలు సరిగా లేక ధోనీ కరెన్సీ కర్సయి పోయింది.



First Published:  4 Aug 2023 11:03 AM GMT
Next Story