Telugu Global
MOVIE REVIEWS

Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం – రివ్యూ!

Bhaje Vaayu Vegam Review: ‘ఆరెక్స్ 100’ తర్వాత సరైన విజయాలు లేని కార్తికేయ ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నం చేశాడు. రెండు సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నా మళ్ళీ విలన్ గా నటించకుండా హీరోగానే నటిస్తూ ఇటీవల ‘బెదుర్లంక’ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. దీనితర్వాత ఇప్పుడు ‘భజే వాయువేగం’ అనే యాక్షన్ మూవీని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో నటించాడు.

Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం – రివ్యూ!
X

చిత్రం: భజే వాయువేగం

రచన - దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి

తారాగణం : కార్తికేయ, ఐశ్వర్యా మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు.

సంగీతం : రథన్ (పాటలు), కపిల్ కుమార్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ఛాయాగ్రహణం : ఆర్.డి రాజశేఖర్

నిర్మాణం : యూవీ కాన్సెప్ట్స్

విడుదల : మే 31, 2024

రేటింగ్: 2/5

‘ఆరెక్స్ 100’ తర్వాత సరైన విజయాలు లేని కార్తికేయ ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నం చేశాడు. రెండు సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నా మళ్ళీ విలన్ గా నటించకుండా హీరోగానే నటిస్తూ ఇటీవల ‘బెదుర్లంక’ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. దీనితర్వాత ఇప్పుడు ‘భజే వాయువేగం’ అనే యాక్షన్ మూవీని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో నటించాడు. ఇంతకీ ఈ మూవీ అయినా కార్తికేయని గట్టెక్కిస్తుందా? తెలుసుకుందాం.

కథ

వెంకట్‌(కార్తికేయ), రాజు ( రాహుల్ టైసన్) అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి లక్ష్మయ్య (తనికెళ్ళ) వీళ్ళ ఆసక్తులు గమనించి కొంత పొలం అమ్మేసి హైదరాబాద్ పంపిస్తాడు. వెంకట్ క్రికెట్ లో, రాజు సాఫ్ట్ వేర్ లో చేరడానికి వస్తారు. కానీ వెంకట్‌ క్రికెట్‌లో సెలక్ట్ అవాలంటే పది లక్షలు కట్టాలి. మరోవైపు రాజు జాబ్ లో చేరాలంటే అయిదు లక్షలు కట్టాలి. దీంతో రాజు ఓ స్టార్ హోటల్‌లో సర్వెంట్‌గా చేరతాడు. ఇంతలో వూళ్ళో తండ్రి ఆరోగ్యం చెడి పది లక్షలు అవసరపడతాయి. ఈ డబ్బు కోసం వెంకట్ క్రికెట్ బెట్టింగ్స్ కి పాల్పడతాడు. అందులో 40 లక్షలు గెలిచినా బెట్టింగ్ మాఫియా మోసం చేసి 40 లక్షలు ఎదురు కట్టాలంటాడు. ఆ డబ్బు కోసం రాజు డేవిడ్ ని కలుస్తాడు. హోటల్ ఓనర్ డేవిడ్ (రవిశంకర్‌) మేయర్‌ తమ్ముడు. డేవిడ్ బెట్టింగ్ మాఫియానే సపోర్టు చేయడంతో వెంకట్, రాజు అతడి కారు తీసుకుని పారిపోతారు అమ్ముకుందామని.

ఆ కారులో శవముంటుంది, డబ్బు వుంటుంది, వేరే వేల కోట్ల హవాలా డబ్బుకి సంబంధించి పాస్ కోడ్ గా 500 రూపాయల నోటు వుంటుంది. ఇప్పుడేం జరిగింది? ఇంత క్రైమ్ లో ఇరుక్కున్న అన్నదమ్ములు హాస్పిటల్లో వున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఏం చేశారు? కారుకొసం వెంటబడ్డ ముఠాలు కారుని దక్కించుకున్నాయా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

సాధారణ ఫార్ములా కథే. 2022 లో హాలీవుడ్ మూవీ ‘అంబులెన్స్’ ఇలాటిదే కథ. భార్య సర్జరీకి డబ్బు కావాల్సి వచ్చి, తమ్ముడితో కలిసి బ్యాంకుని దోచుకుని అంబులెన్స్ లో పారిపోయే కథ. ఇది పూర్తి స్థాయి యాక్షన్ జానర్లో కొచ్చే కథ. భార్య సర్జరీ కోసం డబ్బులు అనే నిస్సహాయులైన అన్నదమ్ముల భావోద్వేగాల్ని కేంద్రంగా చేసుకుని అల్లిన యాక్షన్ కథ. కానీ తెలుగులో యాక్షన్ తక్కువ, సెంటిమెంటల్ డ్రామాలు ఎక్కువ. తండ్రితో అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అంతా ఒకటే సీన్లు, డైలాగులు, కన్నీళ్లు, కష్టాలు. హైదరాబాద్ లో అన్నదమ్ముల బాధలు, వూళ్ళో తండ్రి శోకాలు. ఇలా ఫస్టాఫ్ కథ ముందుకు కదలక, ఎంతో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప ఎమోషనల్ డ్రైవ్ సాధ్యం కాదన్నట్టు నడిపాడు దర్శకుడు. దీని వల్ల యాక్షన్ సినిమా ఫీల్ చెడింది. యాక్షన్ తో వుండే యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ ఆ మేరకు సన్నగిల్లాయి.

తండ్రికి ఆపరేషన్ డబ్బుల కోసం మాఫియా కారులో పారిపోయే సెకండాఫ్ కథతో యాక్షన్లో కొస్తుంది మూవీ. వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఫాదర్ సెంటిమెంట్లోకే తిరగబెడుతుంది. ఇది చాలదన్నట్టు తమ్ముడి పాత్ర ఎప్పుడు చూసినా ఏడుస్తూనే వుండడం. ముందుకెళ్ళే అన్నకి బ్రేకులు వేసే ఏడ్పులు. ఇలా అన్నదమ్ముల అనుబంధం, తండ్రితో అన్నదమ్ముల అను బంధం ఇవే ప్రధానమై సెకండాఫ్ లో కూడా యాక్షన్ తగ్గింది. టైటిల్ ప్రకారం వుండాల్సిన వాయువేగం దొరక్కుండా పారిపోయే కారు ఛేజింగ్స్ తో వుండాల్సిన కథ, కథకుడి అభద్రతా భావం వల్ల భారీ సెంటిమెంటల్ డ్రామాగా మారింది. దీనివల్ల హీరో హీఓయిన్ల మధ్య యూత్ అప్పీల్ తో వుండాల్సిన లవ్ ట్రాక్ కూడా బలైంది.

కారులో శవం, నగదు, హవాలా నోటు- దీంతో విలనీ కూడా పాత స్టయిల్లోనే వుంది ముగింపు సహా. 1993 లో మహా దర్శకుడు రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ‘థెల్మా అండ్ లూయిస్’ లో ఇద్దరు యువతులు రేప్ చేయబోయిన వాణ్ని చంపి కారులో పారిపోయే కథ -వెంటాడే పోలీసులతో యాక్షన్ కథే. ఈ యాక్షన్ కథలో బాధని ఎక్కడా చూపించకుండా సేవ్ చేసి, ముగింపులో ఆ ఇద్దరు యువతులు తీసుకునే నిర్ణయంతో ఒకేసారి గుండె పగిలేలా చేస్తాడు దర్శకుడు. ఇదీ స్టోరీ డైనమిక్స్ అంటే. ఇందుకే ఈ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలాటి సినిమాలు చూసి తెలుగు సినిమాల గ్రాఫు పెంచాలి, కథంటే ఏమిటో తెలుసుకుని.

నటనలు –సాంకేతికాలు

కథని బట్టి కార్తికేయ హీరోయిజం తక్కువ, పాసివ్ నెస్ ఎక్కువ. ఇక హీరోయిన్ తో రోమాన్సే లేదు. తండ్రి రుణం తీర్చుకునే సెంటిమెంట్ల భారం ఎక్కువై పోయి- యాక్షన్ తగ్గి యూత్ ని నిరాశపర్చే ప్రమాదం తెచ్చుకున్నాడు. తమ్ముడుగా రాహుల్ టైసన్ అయితే వీపింగ్ డాల్ లా ఆద్యంతం ఏడ్పిస్తాడు ఏడ్పు ఇష్టపడే ప్రేక్షకులకి. డిటో తనికెళ్ళ భరణి. హీరోయిన్ ఐశ్వర్యాది ఫార్ములా టర్నింగ్ ఇచ్చే రోటీన్ పాత్ర. ఇక విలన్ వేషధారులు వాళ్ళ డైలాగులతో వాళ్ళు మహానుభావులు.

కెమెరా, సంగీతం, లొకేషన్లు, యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఏమీ వుండవు. ఓపికగా కూర్చుని పాత్రల బాధలు, గాథలు బాధపడకుండా చూడాల్సిన సినిమా.


First Published:  1 Jun 2024 1:06 PM GMT
Next Story