Telugu Global
MOVIE REVIEWS

Kalyanam Kamaneeyam Movie Review: ‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ {2/5}

Kalyanam Kamaneeyam Movie Review: యూవీ క్రియెషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నుంచి ‘కళ్యాణం కమనీయం’ అనే కొత్త దర్శకుడి చిన్న సినిమా సంక్రాంతి భారీ సినిమాల మధ్య విడుదలైంది.

Kalyanam Kamaneeyam Movie Review: ‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ
X

Kalyanam Kamaneeyam Movie Review: ‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ 

చిత్రం: కళ్యాణం కమనీయం

రచన -దర్శకత్వం : అనిల్ కుమార్ ఏ.

తారాగణం : సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దేవీ ప్రసాద్, కేదార్ శంకర్, పవిత్రా లోకేష్, సత్యం రాజేష్, సద్దాం హుస్సేన్ తదితరులు

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని

బ్యానర్: యువి కాన్సెప్ట్స్

నిర్మాతలు: వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి

విడుదల : జనవరి 14, 2023

రేటింగ్: 2/5

యూవీ క్రియెషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నుంచి ‘కళ్యాణం కమనీయం’ అనే కొత్త దర్శకుడి చిన్న సినిమా సంక్రాంతి భారీ సినిమాల మధ్య విడుదలైంది. ఆన్ లైన్ బుకింగ్స్ లేని రోజుల్లో పెద్ద సినిమాల పక్క థియేటర్ లో చిన్న సినిమా విడుదల చేసేవాళ్ళు. క్యూల్లో కుమ్ములాడుకుని పెద్ద సినిమాల టికెట్లు దొరకని ప్రేక్షకులు పక్కన చిన్న సినిమాలో దూరేవాళ్ళు. అలా చిన్న సినిమా కూడా హిట్టయ్యేది. ఆన్ లైన్ బుకింగ్స్ వచ్చాక ఈ పరిస్థితి లేదు. పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాకి మనుగడ లేదు. అయితే యూవీ క్రియెషన్స్ విడుదలకి ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్మేయడంతో థియేటర్స్ లో ఎంత ఆడినా అది లాభమే. ఈ బిజినెస్ మోడల్ కింద విడుదలైన ‘క.క.’ అసలు థియేటర్ సినిమాయేనా, సిల్వర్ స్క్రీన్ మీద ఆనే విషయంతో వుందా, లేక బుల్లితెరకి సరిపోయే షార్ట్ ఫిలిమా ఈ కింద చూద్దాం...

కథ

బీటెక్ చేసిన నిరుద్యోగి శివ (సంతోష్ శోభన్) కి, ఐటీ జాబ్ చేస్తున్న శృతి (ప్రియా భవానీ శంకర్) కీ పెద్దలు పెళ్ళి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో వున్న శివకి ఆర్ధికంగా అండగా వుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా శివకి జాబ్ రాకపోవడంతో అతడి స్కిల్స్ ని అనుమానిస్తుంది శృతి. ఎడమొహం పెడమొహంగా వుండడం మొదలెడు

తుంది. ఒక కన్సల్టెంట్ కంపెనీలో 10 లక్షలు చెల్లిస్తే జాబ్ వచ్చే అవకాశముంటుంది.

ఆ డబ్బు లోన్ తీసుకుని సర్దుతుంది. శివ ఆ డబ్బు డ్రాచేసుకుని వస్తూంటే దొంగ కొట్టేయడంతో ఇరుకున పడతాడు. క్యాబ్ డ్రైవర్ గా చేరి జాబ్ వచ్చిందని శృతికి అబద్ధం చెప్తాడు. అతను క్యాబ్ డ్రైవర్ గా దొరికిపోయే సరికి తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య చెడిన సంబంధం ఎలా బాగుపడిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

సిల్వర్ స్క్రీన్ కి కాక, డైరెక్టు ఓటీటీకి వెళ్ళాల్సిన షార్ట్ ఫిలిం కథ. నిడివి రెండుగంటల లోపే వున్నా వెండి తెరకి తగ్గ కథా బలమే లేకపోవడంతో చూపుకి ఆనదు. సకాలంలో బలమైన సంఘర్షణ సృష్టిస్తే కథ నిలబడేది. ఉన్న చిన్నపాటి సంఘర్షణ ( అతను క్యాబ్ డ్రైవర్ గా దొరికిపోవడంతో తెగతెంపులు చేసుకోవడం) కనీసం ఇంటర్వెల్లో అయినా స్థాపించకుండా సెకండాఫ్ చివర్లో ఏర్పాటు చేయడంతో, అప్పుడు గానీ కథ ప్రారంభం కాలేదు. ఆ చిన్నపాటి సంఘర్షణ కాని సంఘర్షణతో ప్రారంభమయిన కథ చివరి పది నిమిషాల్లో పరిష్కారమై ముగిసిపోతుంది. ఇలా షార్ట్ ఫిలింకి తప్ప సినిమాకి పనికి రాని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది.

ఇది కేవలం డబ్బే అర్హత అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తే దానికి సమాధానం చెప్పే కథానాయకత్వం ఆలోచించకపోవడంతో అతను పాసివ్ క్యారక్టర్ అయ్యాడు. ఆమెకూడా చివరికి తండ్రి హితబోధ చేయడంతో మారిపోవడాన్ని బట్టి పాసివ్ క్యారక్టరే అయింది. కాబట్టి ఇద్దర్లో ఎవరూ ప్ర్రధాన పాత్ర కాక, ఇద్దరూ పాసివ్ క్యారక్టర్లవడంతో ఇది కథ కాలేదు, సినిమాకి పనికిరాని గాథ కూడా అయింది. ప్రేమికుల సమస్య పెద్దలు పరిష్కరించే గాథలు ఒకప్పుడు వర్కౌట్ అయ్యాయి. ప్రేమికులు వాళ్ళు సృష్టించుకున్న సమస్యని స్వావలంబనతో వాళ్ళే పరిష్కరించుకునే పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సులు నేటి యూత్ సినిమాలు.

పైగా ఇది కాలానికి వెనుక బడిన కథ. అతను క్యాబ్ డ్రైవర్ అయితే ఏంటి? ఎంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు దొరక్క క్యాబ్ డ్రైవర్లుగా, ఆఖరికి పనికి ఆహార పథకం కింద కూలీకి వెళ్తున్న దృశ్యాలు లేవు? ఇది వ్యక్తి పరిస్థితి కాదు కించ పర్చడానికి, దేశ పరిస్థితి. ఎలాన్ మస్క్ నుంచీ జెఫ్ బెజోస్ వరకూ ఐటీ జాబులు పీకేస్తున్నారు. మంచి జాబ్ వచ్చిందని మైక్రోసాఫ్ట్ లో రిజైన్ చేసి అప్పాయింట్ లెటర్ పట్టుకుని కెనడా పోతే, అమెజాన్ వాడు పీకేశామన్నాడు. ఇప్పుడతని పరిస్థితేంటి. సినిమా కథలు కాస్త కాలంతో పాటు సాగితే యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది.

నటనలు- సాంకేతికాలు

టాలెంట్ వున్న సంతోష్ శోభన్ కి తగ్గ సినిమాలు చేతికందడం లేదు. గత సినిమా ‘లైక్ సబ్ స్క్రైబ్ అండ్ షేర్’ తో కూడా నిరాశే మిగిలింది. కేవలం నాలుగు పాటలతో తన గంటా 45 నిమిషాల సినిమా కూడా నిలబడదు. సంఘర్షణ లేకపోవడంతో నటనలో బలం కూడా లేదు. 10 లక్షలు దొంగ దోచుకుంటే ఆ విషయం మర్చిపోవడమేనా? అసలు డబ్బు డ్రా చేయాల్సిన అవసరమేమిటి, భార్య ఇచ్చిన చెక్కు కన్సల్టెన్సీ అతనికి ఇచ్చేస్తే పోయేదానికి. తన టాలెంట్ కి ఇలాటి పాత్రలు నటిస్తే ఎప్పటికీ తను మిడిల్ హీరోల రేంజికి రాలేడు.

హీరోయిన్ ప్రియా భవానీకిది తొలి తెలుగు సినిమా. కథ, పాత్ర ఎలా వున్నా కనబడినంత సేపూ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించ గల్గుతుంది. సంతోష్ శోభన్ ఫ్రెండ్ గా కమెడియన్ సద్దాం హుస్సేన్ తో కామెడీ సీన్స్ ఫ్రెష్ గా వున్నాయి. సత్యం రాజేష్ హీరోయిన్ ని వేధించే మేనేజర్ గా వేశాడు. హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవీ ప్రసాద్, పవిత్రా లోకేష్ నటించారు.

శ్రవణ్ భరద్వాజ్ సంగీతంలో పాటలు యూత్ అభిరుచులకి తగ్గట్టు వున్నాయి, కానీ సినిమా కథ, పాత్రలు యూత్ ఫుల్ గా లేవు. ఈ చిన్న సినిమాకి పెద్ద సినిమాలు చేసే కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం చాలా ఎక్కువ. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ కి మాత్రం యూవీ కాన్సెప్ట్స్ వారు బడ్జెట్ కేటాయించి ప్రాక్టికల్స్ చేసుకో నిచ్చినట్టుంది.

First Published:  15 Jan 2023 9:26 AM GMT
Next Story