Telugu Global
MOVIE REVIEWS

Guntur Kaaram Review: గుంటూరు కారం మూవీ రివ్యూ {2.5/5}

Guntur Kaaram Review: దాదాపు ప‌ద‌మూడేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ మ‌హేష్‌బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదలైంది. చాలా కాలంగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చిన ‘గుంటూరు కారం’ పానిండియాగా మాత్రం విడుదల కాలేదు.

Guntur Kaaram Review: గుంటూరు కారం మూవీ రివ్యూ {2.5/5}
X

చిత్రం: గుంటూరు కారం

రచన- దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

తారాగణం: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్య కృష్ణ, ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావురమేష్, మురళీశర్మ,జయరాం, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం : ఎస్. తమన్, చాయాగ్రహణం: మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్

బ్యానర్ : హారిక & హాసిని క్రియేషన్స్, నిర్మాత : ఎస్. రాధా కృష్ణ

విడుదల : జనవరి 12, 2024

రేటింగ్: 2.5/5

దాదాపు ప‌ద‌మూడేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ మ‌హేష్‌బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదలైంది. చాలా కాలంగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చిన ‘గుంటూరు కారం’ పానిండియాగా మాత్రం విడుదల కాలేదు. 2022 లో ‘సర్కారువారి పాట’ తర్వాత మహేష్ బాబు నటించిన కొత్త సినిమా ఎలా వుంది? గుంటూరు కారం లాంటి పాత్రలో తను ఘాటుగా వున్నాడా, చప్పగా వున్నాడా, ఎలా వున్నాడు? ఇది తెలుసుకుందాం.

కథ

ర‌మ‌ణ (మ‌హేష్‌బాబు) ని చిన్న‌ప్పుడు త‌ల్లి వసుంధర (రమ్యకృష్ణ) వ‌దిలిపెట్టి వెళ్ళిపోతుంది. తండ్రి స‌త్యం (జ‌య‌రామ్‌) ఓ కేసులో జైలు కెళ్తాడు. మేనత్త (ఈశ్వరీబాయి) రమణని పెంచుతుంది. అటు తల్లి ఇంకో పెళ్ళి చేసుకుంటుంది. హైదరాబాదులో సీనియర్ రాజకీయనాయకుడైన తండ్రి వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) అండదండలతో వసుంధర మంత్రిగా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై కన్నేసిన కాటా మధు (రవిశంకర్) అనే ఇంకో నాయకుడు వసుంధర గతాన్ని బయట పెట్టి ఆమె రాజకీయ జీవితాన్ని అంతం చేయాలనుకుంటాడు. దీన్ని అడ్డుకునేందుకు వెంకటస్వామి గుంటూరులో వున్న మనవడు రమణని పిలిపించి, త‌ల్లితో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని సంతకం పెట్టించుకోవాలనుకుంటాడు.

ఈ ప్రయత్నం ఫలించిందా? రమణ సంతకం పెట్టాడా? తండ్రి స‌త్యం ఎందుకు జైలు కెళ్ళాడు? వసుంధర కొడుకు రమణని దూరం పెట్టడానికి అసలు కారణం ఏమిటి? ఆమె తండ్రి వెంకటస్వామి చేసిన కుట్ర లేమిటి? తల్లికి దూరమై బాధపడుతున్న రమణ తల్లి మనసు మార్చడానికి ఏం చేశాడు? చివరికి తల్లీకొడుకులు ఒకటయ్యారా? ఇందులో ఆముక్త (శ్రీలీల‌), రాజీ( మీనాక్షి చౌద‌రి) ల పాత్ర లేమిటి? ... ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఇది సంక్రాంతికి కొత్త పంటేం కాదు. పాత పంటల్నే అదేపనిగా కోస్తూ ఇంకా అందిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. చిన్న‌త‌నంలోనే త‌ల్లికి కొడుకు దూరం కావ‌డం, పాతికేళ్ళ త‌ర్వాత క‌ల‌వ‌డం అనే ఒకే కథతో అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠ‌పుర‌ములో’, పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, పవన్ కళ్యాణ్ తోనే మళ్ళీ ‘అజ్ఞాత‌వాసి’ సినిమాలు తీశాడు. ఇదే పురాతన కథని ఈసారి రాజకీయ రంగాన్ని జోడించి మహేష్ బాబుతో కొత్త కథగా అందించే ప్రయత్నం చేశాడు. అయితే కావచ్చు కానీ, ఈ తల్లీ కొడుకుల కథకి ప్రధానంగా తీసుకున్న- తల్లితో సంబంధం లేదని మహేష్ బాబు సంతకం పెట్టాలనే పాయింటు నమ్మశక్యంగా లేక, లీగల్ గానూ చెల్లక, సినిమా ఫస్టాఫ్ లోనే తేలిపోయే ప్రమాదంలో పడింది.

కేవలం సంతకం పెట్టాలనే స్టోరీ పవర్ లేని సినిమాని మహేష్ బాబు స్టార్ పవర్ తో కమర్షియల్ గిమ్మిక్కులు చేసి నిలబెట్టేందుకు విఫలయత్నం చేశాడు. గుంటూరు- హైదరాబాద్ ల మధ్యే మహేష్ బాబు కారేసుకుని సంతకం పెట్టే పాయింటుతో పదేపదే తిరిగే సీన్లే రిపీటవుతూంటాయి. మధ్యలో లాయర్ కూతురుగా శ్రీలీల మహేష్ బాబు ఇంట్లో మకాం వేసి సంతకం కోసం చేసే కామెడీ ప్రయత్నాలతో ఒక ట్రాకు వుంటుంది. ఈ ట్రాకులో రోమాన్సు పాటలూ వగైరా వుంటాయి. మిర్చీ వ్యాపారం చేసే మహేష్ బాబు ప్రత్యర్ధి పాత్ర జగపతిబాబుతో ఫైట్లు వగైరా వుంటాయి. సంతకం పెట్టక పోతే మహేష్ బాబుని కేసుల్లో ఇరికించే కుట్రలూ రిపీట్ అవుతూ వుంటాయి. ఇదంతా బలహీన కథగా సాగుతూ, ఇంటర్వెల్లో తల్లితో ముఖా ముఖీ అయ్యే సీనుతో బలం పుంజుకుంటుంది సినిమా.

సెకండాఫ్ మళ్ళీ సంతకం గురించి మామూలే. తాత పాత్రలో ప్రకాష్ రాజ్ తో రిపీటయ్యే కొట్లాటలే. ఒక దశకొచ్చేటప్పటికి సెకండాఫ్ విషయం లేక శూన్యమై పోతుంది. చివరికి భారంగా తెలిసిన అన్ని విషయాలూ తేలి, తల్లీ కొడుకులు ఏకమయ్యే పవర్ఫుల్ ఎమోషనల్ సీనుతో ముగుస్తుంది.

తాత చేతిలో పాతికేళ్ళుగా కీలుగా బొమ్మగా మారిన తల్లి సమస్యని గుర్తించి, ఆమెకి విముక్తి కలిగించి సుఖాంతం చేయాల్సిన కథలో మహేష్ బాబు అసలేమీ చేయకపోవడంతో, తను కూడా తాత ఆడించినట్టూ ఆడే పాసివ్ పాత్ర కావడంతో, సినిమా చాలా రిస్కులో పడే ప్రమాదంలో పడింది.

ఎవరెలా చేశారు

ఇది పూర్తిగా మహేష్ బాబు ఒన్ మాన్ షో. తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాకి మంచి గ్లామర్ తీసుకొచ్చాడు. ఇంటర్వెల్ సీనులో, ముగింపులో హృదయాల్ని బరువెక్కించే నటన కనబర్చాడు. మిగతా అంతటా విషయం లేని కథలో ఏం చేస్తున్నాడో తెలియక రకరకాల కామెడీ, యాక్షన్ సీన్లు చేసుకుంటూ పోయాడు. శ్రీలీలతో హత్తుకునే రోమాన్సూ చేయక డాన్సులతో సరిపెట్టాడు. ఎంత సేపూ తల్లి లేని కొడుకుగా ఫీలవ్వడమే తప్ప,అవతల కొడుకులేని తల్లి ఫీలింగ్స్ ని గుర్తించే పని పెట్టుకోలేదు. గుర్తించి వుంటే తగిన హీరోయిజం వచ్చేది. యాక్టివ్ క్యారక్టర్ గా పంజరంలో వున్న తల్లి కోసం ఒక లక్ష్యంతో యాక్షన్ లోకి దిగే వాడు. ఇది సాంతం నవ్విస్తూ పోయే యాక్షన్ కామెడీ అయితే సినిమాని ఇంకో స్థాయికి తీసికెళ్ళి సక్సెస్ చేసేవాడు. కథలో ప్రధాన పాత్రగా లక్ష్యమే లేక పోతే కధేం వుంటుంది. కథ లేకపోతే తనెందుకు.

శ్రీలీలకి ఈ సినిమాలో కూడా పాత్రే లేదు. మరోసారి పాటల్లో డాన్సింగ్ డాల్ గా సరిపెట్టుకుంది. మహేష్ మరదలి పాత్రలో మీనాక్షీ చౌదరిది కొన్ని సీన్లకి పరిమితమైన పాత్ర. ఇక రమ్య కృష్ణ, ఈశ్వరీ రావు, జగపతి బాబు, రావురమేష్, మురళీ శర్మ,జయరాం వెన్నెల కిషోర్ అందరి పాత్రలూ తక్కువే- ఒక్క విలనీతో ప్రకాష్ రాజ్ తప్ప. సునీల్ ప్రారంభంలో ఒక సీనులో కనిపించి, విగ్రహంగా, ఆ తర్వాత విగ్రహం తలగా మారతాడు. చాలా అన్యాయం.

గుంటూరు, హైదరాబాద్ లొకేషన్లు, మిర్చీ గోడౌన్ సెట్, ఇతర ఔట్ డోర్ లొకేషన్స్ కి విజువల్స్ బావున్నాయి. యాక్షన్ సీన్స్ సహా సాంకేతికంగా ఉన్నతంగా వుంది. తమన్ సంగీతంలో పాటలు, వాటి కొరియోగ్రఫీ కూడా బావున్నాయి. బావుండాల్సింది మళ్ళీ తల్లీ కొడుకుల కథతో త్రివిక్రమ్ రాతపని, తీతపని. దీనికి మేష్ బాబు (అగ్రిమెంట్ మీద) సంతకం పెట్టే పని. ఇక ప్రేక్షకుల నుంచి సంతకాల సేకరణే మిగిలింది.

First Published:  12 Jan 2024 7:33 AM GMT
Next Story