Telugu Global
MOVIE REVIEWS

Fighter Movie Review: ఫైటర్ మూవీ రివ్యూ {2.75/5}

Fighter Movie Review in Telugu: ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ అనే మరో యాక్షన్ మూవీతో వచ్చేశాడు. హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, అనిల్ తారాగణంగా తీసిన ఈ మూవీని ఇండియన్ ఏర్ ఫోర్స్ కథగా థ్రిల్లింగ్ గా ప్రేక్షకుల ముందుంచాడు.

Fighter Movie Review: ఫైటర్ మూవీ రివ్యూ {2.75/5}
X

చిత్రం: ఫైటర్

రచన- దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్

తారాగణం : హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, అనిల్ కపూర్, రిషభ్ సాహ్నీ తదితరులు

సంగీతం : విశాల్- శేఖర్, ఛాయాగ్రహణం : సత్చిత్ పౌలోస్

బ్యానర్స్ : వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్

నిర్మాతలు : సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్

విడుదల : జనవరి 25, 2024

రేటింగ్: 2.75/5

‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ అనే మరో యాక్షన్ మూవీతో వచ్చేశాడు. హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, అనిల్ తారాగణంగా తీసిన ఈ మూవీని ఇండియన్ ఏర్ ఫోర్స్ కథగా థ్రిల్లింగ్ గా ప్రేక్షకుల ముందుంచాడు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీకి రూ. 21 కోట్లతో ఓపెనింగ్స్ వచ్చాయి. దీని వివరాలు, విశేషాలు తెలుసుకుందాం...

కథ

కాశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలపై దాడి జరిగి 40 మంది జవాన్లు మరణిస్తారు. ఈ దాడిని పాక్ ఉగ్రవాది అజర్ అక్తర్ (రిషబ్ సాహ్ని) జరిపిస్తాడు. దీనికి దీటుగా సమాధానమివ్వాలని వైమానిక దళానికి ఆదేశాలు అందుతాయి. ఈ మిషన్‌ ని అమలు చేయడానికి గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ అలియాస్ రాకీ (అనిల్ కపూర్) తో పాటు అతడి ఎయిర్ డ్రాగన్ యూనిట్ పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోషన్), స్క్వాడ్రన్ లీడర్ మినాల్ రాథోడ్ అలియాస్ మిన్నీ (దీపికా పడుకొనే), స్క్వాడ్రన్ లీడర్ తాజ్ (కరణ్ సింగ్ గ్రోవర్), స్క్వాడ్రన్ లీడర్ బషీర్ ఖాన్ అలియాస్ బాష్ (అక్షయ్ ఒబెరాయ్) లకి బాధ్యతల్ని అప్పగిస్తారు.

ఈ మిషన్‌లో అనేక ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేస్తారు. దీంతో రెచ్చిపోయిన పాకిస్తానీ వైమానిక దళం భారత వైమానిక స్థావరాలపై దాడి చేస్తుంది. దీనికి భారత వైమానిక దళం తగిన సమాధానామిస్తుంది. ఈ ఘర్షణలో పైలట్లు ఇద్దరు తాజ్, బాష్ పాక్ దళాలకి చిక్కుతారు. వీళ్ళని స్క్వాడ్రన్ లీడర్ పాటీ ఎలా విడిపించుకున్నాడన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

2019లో బాలాకోట్ వైమానిక దాడి తర్వాత చాలా సినిమాలు ఎనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా చాలా సినిమాలు ఆగిపోయాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన వైమానిక దాడి నుంచి ప్రేరణ పొందిన 'ఫైటర్' ఆ సంఘటన జరిగిన ఐదేళ్ళ తర్వాత 2024 లో విడుదలైంది. దీనికి ముందు, గత సంవత్సరం విడుదలైన కంగనా రణవత్ నటించిన 'తేజస్' లో కూడా వైమానిక దళపు ధైర్యసాహసాల్ని చూపించారు. తెలుగులో వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్', హిందీలో అక్షయ్ కుమార్ నటిస్తున్న 'స్కై ఫోర్స్' కూడా వైమానిక దళ మిషన్ల పైనే ఆధారపడి వుంటాయని అంటున్నారు.

వార్ మూవీ అంటే పాకిస్థాన్ కి చెందిన విలన్ ఎవరైనా వుండాలి. హీరో మన సైనికుడై వుండాలి. కొన్ని బాధాకరమైన ఫీలింగ్స్ వుండాలి. ఒకట్రెండు ఉత్తేజపర్చే పాటలుండాలి. అంతే, హిందీ సినిమా బాక్సాఫీసు ఫార్ములా తయారైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాల కేటగిరీలో యాక్షన్ సినిమాలే వున్నాయన్నది నిజం. అయితే 'ఫైటర్' ఇలాటి కమర్షియల్ మసాలా కాకుండా ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ కి చెందిన షోరీల్‌ అన్నట్టు తయారైంది. రెండవది, పుల్వామా దాడికి సంబంధించి భిన్నమైన సిద్ధాంతాల్నితొలగిస్తూ, దానిని పాకిస్తాన్ ప్రాయోజిత సంఘటనగా నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది.

గతేడాది 'పఠాన్‌', దీనికి ముందు 'వార్‌' వంటి సూపర్‌ హిట్స్ తీసిన సిద్ధార్థ్‌ ఆనంద్‌, సినిమా కథని నెమ్మదిగా ప్రారంభిస్తాడు. పాత్రల పరిచయాలకే చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు. వైమానిక దళ సభ్యుల జోకులు, విందు వినోదాలు, సరదాలూ రొటీన్ సీన్లుగా సాగుతాయి. ఇంటర్వెల్ కి ముందు మాత్రమే కథ వేగం పుంజుకుంటుంది.

ఈ బలహీన ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ యాక్షన్ ప్రారంభమవుతుంది. ఫైటర్ విమానాలు, హెలికాప్టర్‌లు ఏరోబాటిక్స్ చేస్తూ ఎక్కడ చూసినా, ఆ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుంటాయి. కానీ కథ? నాలుగు-ఐదేళ్ళ తర్వాత మళ్ళీ చూడాలనిపించేలా మాత్రం ఈ సినిమా కథ లేదు. ఈ సినిమా క్లాసిక్ మూవీగా మారడానికి అవసరమైన అన్ని అంశాలూ వున్నాయి. కానీ సినిమా దృష్టి కథ నుంచి తప్పుకోవడంతో, సినిమాలో విషయం కనపడదు. దీనికి రెండు కారణాలు: దీన్ని ఏర్ ఫోర్స్ షో రీలులా తీయడం, కాన్ఫ్లిక్ట్ బలంగా, ఎమోషనల్ గా లేకపోవడం.

ఈ బలహీన కాన్ఫ్లిక్ట్ కి కారణం, ఇద్దరు సాధారణ పైలట్లు -తాజ్, బాష్ లు పాక్ కి పట్టుబడడం. ఇది కథ స్థాయిని పూర్తిగా తగ్గించేసింది. ఇదే వాళ్ళ బాస్ అనిల్ కపూర్ లాంటి స్టార్ అపహరణకి గురైవుంటే కాన్ఫ్లిక్ట్ కి, కథకి అంతెత్తున హైప్ వచ్చేది. అతన్ని విడిపించాలన్న భావోద్వేగ స్థాయి అమాంతం పెరిగేది. దీంతో యాక్షన్ ఆకాశాన్నంటేది!

సెకండాఫ్‌ మధ్యలో కథ డ్రాప్ అయి మళ్ళీ క్లయిమాక్స్ లో లేచినప్పుడు, భారీ యాక్షన్ ఎపిసోడ్ తో లోపాల్ని మరిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 2019 లో విక్కీ కౌషిక్ తో ఆదిత్యా ధార్ తీసిన ‘యూరీ : ది సర్జికల్ స్ట్రయిక్’ ఎన్నో రేట్లు బలంగా వుంటుంది.

నటనలు - సాంకేతికాలు

సినిమాలోని నటీనటులందరి యూనిఫామ్‌లపై వున్న స్టార్లు, మెడల్సు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చెప్పాడు. బహుశా అందుకే ఇద్దరు ఆర్మీ ఆఫీసర్ల మధ్య సినిమా లవ్ లాంటిది ఏమీ లేదని చెప్పడానికి హిట్టయిన సాంగ్ 'ఇష్క్ జైసా కుచ్'ని తొలగించినట్టున్నాడు దర్శకుడు. హృతిక్ రోషన్ నటన, యాక్షన్ కారణంగా సినిమా అద్భుతమనిపిస్తుంది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగే ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌తో యాక్షన్‌ ఎక్కువగానూ, అలాగే దీపికా పదుకొనేతో ఎమోషన్స్‌ ఎక్కువగానూ వున్నాయి. గగనతలంలో ఫైటర్స్ తో వుండాల్సిన ఎమోషన్స్ బలహీన కథ కరణంగా లేక, ఎలా మీద ఎక్కువ డ్రామా వుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొనెలని ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సిద్ధార్థ్ ఆనంద్ విజయం సాధించడమే ఈ సినిమాతో సాధించిన అతిపెద్ద విజయం.

అనిల్ కపూర్ బాగా నటించాడు. రిషబ్ సాహ్ని విలన్ పాత్రలో తక్కువ స్క్రీన్‌స్పేస్‌ని పొందాడు. ఇతను ఏకంగా పాక్ ప్రధానినీ, సైనిక జనరల్ నీ గుప్పెట్లో పెట్టుకుని తానే ప్రభుత్వం నడుపుతున్నట్టు వుండడం చోద్యమే. ఇక కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ సహా మిగిలిన నటీనటులు బాగానే నటించారు.

సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా వుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఎయిర్ ఫోర్స్ విమానాల విన్యాసాల దృశ్యాలు ఉత్కంఠభరితంగా వున్నాయి. ముఖ్యంగా హృతిక్ విమానాన్ని రన్‌వే పైన తలకిందులుగా ఎగరేస్తూ ఆకాశంలో అడ్డంగా నిలబెట్టే సన్నివేశం ఇంతకి ముందు ఏ ఇండియన్ సినిమాలోనూ కనిపించని థ్రిల్. హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్ సమకూర్చిన డైలాగులు పౌరుషం పెల్లుబికే సన్నిఫెశాల్లో పవర్ఫుల్ గా వున్నాయి.

సచిత్ పౌలోస్ ఛాయాగ్రహణం సినిమాకి వన్నె చేకూర్చింది. అయితే ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ షో రీల్ లాంటి సినిమా నిడివిని బాగా తగ్గించి వుండొచ్చు. సంచిత్ - అంకిత్ బల్హారాల నేపథ్య సంగీతం చాలా బలంగా వుంది. ‘మిట్టీ’, ‘దిల్ బనానే వాలే' రెండు పాటలకి విశాల్ - శేఖర్ లు సమకూర్చిన సంగీతం బావుంది. ఈ మూవీ త్రీడీ లో కూడా విడుదలైంది.

First Published:  26 Jan 2024 9:20 AM GMT
Next Story