Telugu Global
MOVIE REVIEWS

Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ {1.75/5}

మాస్ మహారాజా రవితేజకి గత ఏడాది కలిసి రాలేదు. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ రెండూ దెబ్బతిన్నాయి. ఈ రెండు డార్క్ యాక్షన్ సినిమాల తర్వాత మళ్ళీ డార్క్ యాక్షన్ తోనే ‘ఈగల్’ ప్రయత్నించాడు.

Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ!
X

చిత్రం: ఈగల్

రచన- దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని

తారాగణం : రవితేజ, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్, వినయ్ రాయ్, నవదీప్ తదితరులు

సంగీతం: డేవ్ జాండ్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ కీ

బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్

విడుదల : ఫిబ్రవరి 9, 2024

రేటింగ్: 1.75/5

మాస్ మహారాజా రవితేజకి గత ఏడాది కలిసి రాలేదు. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ రెండూ దెబ్బతిన్నాయి. ఈ రెండు డార్క్ యాక్షన్ సినిమాల తర్వాత మళ్ళీ డార్క్ యాక్షన్ తోనే ‘ఈగల్’ ప్రయత్నించాడు. రిలీఫ్ ఇవ్వకుండా ఒకే తరహా డార్క్ యాక్షన్ మూవీస్ లో నటించడం ఉద్దేశపూర్వకంగా జరిగిందేమో. అన్నీ వర్గాల ప్రేక్షకుల్నీ యాక్షన్ కామెడీలతో అలరిస్తూ వచ్చిన రవితేజ, ఇలా సీరియస్ డార్క్ యాక్షన్ సినిమాలతో రావడం ఫ్యాన్స్ కే మాత్రం నచ్చుతోందో తెలీదు. ఇప్పుడు దీనికి ప్రముఖ ఛాయాగ్రహకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. 2015 లో నిఖిల్ తో ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే ఫ్లాప్ కి దర్శకత్వం వహించిన పదేళ్ళకి రవితేజ వంటి పెద్ద స్టార్ తో చేసిన ప్రయత్నం ఎలా వుంది? రవితేజ ఫ్లాపుల దశ నుంచి బయటపడ్డట్టేనా? ఇది తెలుసుకుందాం...

కథ

సహదేవ్ (రవితేజ) తలకోన అటవీ ప్రాంతంలో ఓ పత్తి ఫ్యాక్టరీని నడుపుతూంటాడు. ఈ ప్రాంతంలోనే బాక్సైట్ గనులు వుండడంతో ఓ ఎమ్మెల్యే, ఓ వ్యాపారవేత్త అక్కడి పత్తి రైతుల్ని ఖాళీచేయించి ఆ ప్రాంతాన్ని కబ్జా చేయాలని చూస్తారు. అయితే పైకి సామాన్యుడిలా కనిపించే సహదేవ్ వెనుక వేరే చరిత్ర వుంటుంది. ఆ చరిత్రలో అతను ఈగల్ అనే కిల్లర్. ఈ చరిత్ర తెలుసుకోవడానికి నళిని (అనుపమా పరమేశ్వరన్) అనే జర్నలిస్టు ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో అతడ్ని అంతం చేయాలని ‘రా’ సంస్థ, మావోయిస్టులు, టెర్రరిస్టు గ్రూపులూ వేట ప్రారంభిస్తాయి. వీళ్ళు ఎందుకు సహదేవ్ ని ఎందుకు చంపాలని చూస్తున్నారు? అసలు సహదేవ్ గత చరిత్రేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

చాలా బాధాకరంగా వుంది. వరుసగా రవితేజ మూడో సినిమా కూడా మూడ్ చెడగొట్టేలా వుంది. అర్ధం పర్ధం లేని కథతో పీపుల్స్ మీడియా బ్యానర్ కేటాయించిన పదుల కోట్ల బడ్జెట్ ని దర్శకుడు చెల్లాచెదురుగా విసిరేశాడు. దర్శకుడికి కేజీఎఫ్ మేనియా బలంగా పూని దానికి చావకబారు నకలు తీశాడు. కేజీఎఫ్ లోలాగే కథ చెప్తూ చెప్పరాక చేతులెత్తేశాడు. ఎక్కడా లాజిక్ అనేది అడక్కూడదు. రవితేజ ప్రపంచంలోని ఆయుధాలన్నీ అక్రమంగా తలకోనకి ఎలా తరలించి దాచాడో అడక్కూడదు. ఆ అడ్డా మీద ఏకంగా మిలిటరీ దాడి, మళ్ళీ పారిపోకుండా చోద్యంగా నావికా దళం కాపలా, అయినా టెర్రరిస్టులు దాడిచేయడంతో మిలిటరీ వాళ్ళు తప్పుకోవడం... ఇలా అస్తవ్యస్తంగా వుంటుంది కథ.

ఫస్టాఫ్ అంతా రవితేజ గురించి జర్నలిస్టు పాత్ర తెలుసుకునే కథే వుంటుంది. ఆమె అడుగుతున్న వ్యక్తులు చెప్పే ఫ్లాష్ బ్యాకులతో రవితేజ ఎలివేషన్స్ సాగుతూంటాయి కేజీఫ్ టైపులో. సినిమా ప్రారంభమే విధ్వంసం, ఉత్పాతం, విస్ఫోటనం అంటూ డైలాగులు కొడుతూ వూగిపోతూంటాయి పాత్రలు. ఫ్లాష్ బ్యాక్స్ చెప్తూ ఈ పాత్రలు రవితేజ కిచ్చే బిల్డప్పులు, ఎలివేషన్లు మామూలుగా వుండవు. గరుడపురాణం అంటారు, మృగసశిర-మధ్యరాత్రి అంటారు (ఇవి ట్రైలర్ లో కూడా వున్నాయి ఏదో మహోజ్వల గాథ అన్నట్టుగా), పట్టపగలు-పద్ధతైన దాడి అంటారు, ఇంకేదో అంటారు... తీరా చూస్తే ఈ భారీ డైలాగులకీ చూపించే తుస్సుమనే సన్నివేశాలకీ పొంతన కుదరక జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి. ఈ ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోయి కథ కంటిన్యూటీ అర్ధం కూడా కాదు. ఇంటర్వెల్లో ప్రస్తుత ప్రస్తుత కథలోకి వచ్చి ఓ అదరగొట్టే యాక్షన్ సీను వస్తుంది. కథ, కథలో రవితేజ పాత్ర మాత్రం అదరగొట్టవు.

తిరిగి సెకండాఫ్ మరో అదరగొట్టే యాక్షన్ సీను. ఇంతసేపూ రవితేజ ఎవరనే సస్పెన్సుని పోషించిన విధం తేలిపోగా, తీరా రవితేజ చరిత్రని రివీల్ చేసే పోలెండ్ లో అసలు ఫ్లాష్ బ్యాకు వస్తుంది. సెకండాఫ్ లో ఇక విషయం లేకపోవడంతో పోలెండ్ లో ఈ ఫ్లాష్ బ్యాకు హీరోయిన్ కావ్యా థాపర్ తో అతి సుదీర్ఘమైన లవ్ ట్రాక్ తో బోరుకొట్టేలా సాగుతుంది. అందులో పాట కూడా ప్రాణం పోయదు ఫ్లాష్ బ్యాకుకి. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక క్లయిమాక్స్ లో మరో అదరగొట్టే యాక్షన్ ఎపిసోడ్. ఇందులో వాడిన అత్యాధునిక ఆయుధాల్లాగా, సినిమాకి అత్యాధునిక కథ కూడా వాడి వుండాల్సింది. ఇంతకీ ఒక్క ముక్కలో విషయమేమిటంటే- క్రిమినల్ రికార్డున్న హీరో, హీరోయిన్ ప్రేమలో పడతాడు. తన క్రిమినల్ రికార్డు వల్ల ఆమె ప్రాణం పోతే, ఆయుధాలనేవి కాపాడే చేతుల్లోనే వుండాలి కానీ అర్హత లేని వాళ్ళ చేతిలో వుండకూడదని చెప్పడం. ఈ కథకి పార్ట్ 2 కూడా వుంటుందని చివర్లో కార్డు వేశారు.

నటనలు –సాంకేతికాలు

రవితేజ తిరిగి యాక్షన్ కామెడీల గ్లామరస్ పాత్రలతో ఎంటర్ టైన్ చేస్తే మంచిది. డార్క్ యాక్షన్ పాత్రలు తన కేటగిరీ కాదు. కాసేపు కన్పించే సహదేవ్ పాత్రలో లుంగీ కట్టుకుని బావున్నాడు. ఈగల్ పాత్రలో డార్క్ క్యారక్టర్ గా పెద్దగా చేసిందేమీ లేదు. ‘అగ్నిపథ్’ లో అమితాబ్ బచ్చన్ వణికే స్వరంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. డైలాగులు కూడా తక్కువే. మాస్ మహారాజా కిది సూట్ కాలేదు. ఇక ఎమోషన్స్ లేని యాక్షన్ సీన్స్ లో డార్క్ క్యారక్టర్ మరీ చప్పగా తయారైంది.

జర్నలిస్టుగా అనుపమా పరమేశ్వరన్ ఫ్లాష్ బ్యాకులు సాగదీయడానికి పనికొచ్చింది. లవర్ గా కావ్యా థాపర్ కనిపించే కాసేపు యూత్ అప్పీల్ తో గ్లామర్ ని పోషించింది. ‘రా’ చీఫ్ గా మధుబాల, ఏజెంట్ గా అవసరాల శ్రీనివాస్ తాము పట్టుకోవాలనుకుంటున్న ఓ క్రిమినల్ కంటే బలహీనంగా కనిపిస్తారు. విలన్ గా వినయ్ రాయ్, రవితేజ పక్కపాత్రలో నవదీప్ కనిపిస్తే, అజయ్ ఘోష్- శ్రీనివాసరెడ్డి కామెడీ పాత్రలు పోషించారు.

యాక్షన్ ఎపిసోడ్ కి భారీ బడ్జెట్ ని ధారాళంగా ఖర్చు పెట్టేశారు. దర్శకుడితో బాటు మరో ఇద్దరు కెమెరా మాన్లు పనిచేశారు. కెమెరా మాంగా దర్శాకుడు చూపించిన ప్రతిభా కతా కథనాలతో చూపలేకపోయాడు. డైలాగులు కూడా పాత కాలపు డైలాగుల్లా వున్నాయి. ఉన్న రెండు పాటలూ అస్సలు కుదరలేదు. రవితేజకి ఒక హిట్ ఇంకా చాలా దూరంలో వుంది.First Published:  9 Feb 2024 10:10 AM GMT
Next Story