Telugu Global
MOVIE REVIEWS

Digant Review: ‘దిగంత్’ – సండే స్పెషల్ రివ్యూ!

Digant Konkani Movie Review: గోవా అధికార భాష కొంకణిలో సినిమాల నిర్మాణం 1949 లో ప్రారంభమైనా తగిన మార్కెట్ లేక స్తబ్దుగా వుంది.

Digant Review: ‘దిగంత్’ – సండే స్పెషల్ రివ్యూ!
X

Digant Review: ‘దిగంత్’ – సండే స్పెషల్ రివ్యూ!

గోవా అధికార భాష కొంకణిలో సినిమాల నిర్మాణం 1949 లో ప్రారంభమైనా తగిన మార్కెట్ లేక స్తబ్దుగా వుంది. పాతిక లక్షల మంది మాట్లాడే కొంకణి భాష సినిమాల పరంగా క్షామాన్ని ఎదుర్కొంటోంది. అదే పక్కన అదే పాతిక లక్షల మంది మాట్లాడే కర్నాటకలో తుళు భాషకి ఏకంగా తుళువుడ్ పేర సినిమా పరిశ్రమే వెలసింది. ఈ ఏడు దశాబ్దాల కాలంలో కొంకణిలో నిర్మించింది 40 సినిమాలే. ఈ మధ్యే ఏడాది కొకటి చొప్పున నిర్మిస్తున్నారు. తీసేవి ఆర్ట్ సినిమాలే. వీటిలో మూడిటికి జాతీయ అవార్డులు కూడా లభించాయి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకి 2004 నుంచీ గోవా వేదిక కావడంతో కొంత ఉత్సాహం వచ్చినా, దీంతో అతి స్వల్ప బడ్జెట్ 30 లక్షలతో సినిమా తీసినా, అందులో యాభై శాతం ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చినా, థియేటర్ వసూళ్ళ దగ్గర ఇది కూడా నష్టాలనే తెచ్చిపెడుతోంది. అందుకే డబ్బుకోసం కొంకణి సినిమాలు తీయడం దండగంటాడు ‘దిగంత్’ (2013) దర్శకుడు ధ్యానేష్ మోఘే.

Advertisement

‘దిగంత్’ 43 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఇంకా దేశంలో ఇతర చోట్ల ప్రదర్శనల్లో ప్రశంస లందుకుంది. ఉత్తరాదిలో ధంగర్ కులస్థులుగా పేర్కొనే (తెలంగాణాలో ఉర్దూలో కూడా ఇలాగే పిలుస్తారు) యాదవ గొర్రెల కాపరి అస్తిత్వ సంఘర్షణని ఇందులో చిత్రించాడు దర్శకుడు. స్వేచ్ఛ అంటే ఏమిటి? మనిషి దేన్నైనా సొంతిల్లు అనుకున్నప్పుడే స్వేచ్ఛనీ, దాంతోబాటు భద్రతనీ ఫీలవుతాడు. ఈ సొంతిల్లు నమ్మిన, నచ్చిన వృత్తుల్లో వుంటుంది. అది కులవృత్తి కావొచ్చు, ఇంకేదైనా కావచ్చు.

Advertisement

గొర్రెల కాపరి భాగ్యేకి కులవృత్తితో అడివే ఇల్లు. అడవితో వున్న తరతరాల బాంధవ్యాన్ని వదులుకోలేడు. ఇక్కడే తనకి స్వేచ్ఛా, భద్రతా. అయితే కుటుంబంలోంచి ఒక పాయగా వంశాంకురం విడిపోయి ఇంకెక్కడో కొత్త వృత్తి వెతుక్కుంటే? అక్కడికి తనని వచ్చేయమంటే? అప్పుడేం చేయాలి? ఆధునిక ప్రపంచమా, అనాదిగా వుంటున్న లోకమా? మార్పుని ఎలా జీర్ణించుకోవాలి? భాగ్యేకి ఎదురుచూడని సంకటమిది.

కథ

భాగ్యే (రాజూ పెడ్నేకర్) చక్కగా గోచీ పెట్టుకుని, పచ్చటి అడవిలో కులవృత్తి చేసుకుంటూ భార్య (దీపా మోఘే) తో, కొడుకుతో సుఖంగా వుంటాడు. వూళ్ళో ఒక స్కూలు టీచర్ కొడుకుని చదువుకి పంపమని బలవంతం చేస్తాడు. దీన్ని భాగ్యే వ్యతిరేకిస్తాడు. కులవృత్తే జీవిత పాఠమంటాడు. టీచర్ వదలడు. దీంతో తోటి కులస్థులతో చర్చిస్తాడు భాగ్యే. భార్య కూడా ప్రోత్సహించడంతో ఇక కొడుకుని స్కూలుకి పంపించేస్తాడు.

స్కూల్లో కొడుకు ఇంగ్లీషు దంచి కొట్టి నేర్చుకుంటాడు. చూస్తూండగానే కాలేజీ కెళ్లే యువ ఆశు (ప్రణవ్ భీసే) గా తండ్రి ముందుంటాడు. ఈడ్చి కొట్టి ఫస్ట్ వస్తాడు. చిన్నప్పట్నుంచీ దేశ పటం ముందేసుకుని కాశ్మీరు నుంచి గోవా, గోవా నుంచీ ఇంకెక్కడికో భౌగోళిక కొసల మీద ఆసక్తి చూపిస్తాడు. అది కాస్తా ఇప్పుడు ఆర్కిటెక్చర్ కోర్సు అయికూర్చుంటుంది. అవడమే గాక గోవాలో బిల్డర్ దగ్గర ఆర్కిటెక్ట్ గా ఉద్యోగంలో చేరిపోతాడు. బిల్డర్ కూతురు రుక్మా(సమీక్షా దేశాయ్) ని ప్రేమించేస్తాడు. బిల్డర్ ఆశీర్వదిస్తాడు. ఆ సంబంధం ఇంటికి తీసుకురాగానే గగ్గోలు లేస్తుంది. భాగ్యే ఈ సాంస్కృతిక సంకరానికి అతలాకుతలమైపోతాడు...

ఎలావుంది కథ

ప్రసాద్ లొలేకర్ రాసిన కథకి చిత్రానువాదం. చెట్టు వున్న చోటే వుంటుంది, వ్రేళ్ళని విస్తరించనీయాలనే అర్ధంలో పురోభివృద్ధి కాముక కథ. అస్తిత్వ ప్రమాదాన్ని ఫీలయ్యే భాగ్యే పాత్రతో మెలో డ్రామా లేకుండా, ఇలాటి కథతో ఫార్ములా సినిమాల్లో సాధారణంగా వుండే మూస భావజాలాల ధోరణులు లేకుండా, అత్యంత వాస్తవిక ప్రశ్నల్ని వెర్బల్ గా కాకుండా, విజువల్ గా కళ్ల ముందుంచుతూ, నిర్మించాడు ధ్యానేష్ మోఘే.

పరిధి విస్తరించే కొద్దీ స్వేచ్ఛకి వ్యక్తి నిర్వచనాలు మారిపోతాయి. విస్తరించిన పరిధులు పాత పరిధుల స్వేచ్ఛని పూర్వ పక్షం చేసేస్తాయి. కొత్త స్వేచ్ఛ ప్రాణ ప్రదమవుతుంది. అడవి నుంచి నగరానికి విస్తరించిన కొడుకు ఆశు కిప్పుడు నగరంతోనే కొత్త స్వేచ్ఛ. స్వేచ్ఛ నిల్వ నీరు కాదు, కాలంతో బాటు చలన శీలమైనది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లోకాల్ని కోరుకుంటుంది. అది ఆశు అందుకున్నఅభివృద్ధి కాముక స్వేచ్ఛయితే ఇక వదులుకో బుద్ధి కాదు. నగరాలంటే అడవుల్నుంచీ విస్తరించిన వ్రేళ్ళే. ఎప్పటికీ బాస్ భాగ్యే మహాశయుడే. కానీ నా అడవి నగరమైందనే ఆనందం అనుభవించక పోతే స్వేచ్ఛా వాదాని కర్ధం లేదు.

వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాబర్ట్ స్కల్లర్ తన దగ్గర కొచ్చిన ఒక కేసుని పుస్తకంలో వివరిస్తాడు - ఒక బిల్డర్ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. తను టోటల్ ఫెయిల్యూర్ నని భోరున విలపించాడు. అప్పుడు స్కల్లర్ అంటాడు - నువ్వెలా ఫెయిల్యూర్ వి? అటు చూడు, ఆ బీచి వారగా అపార్ట్ మెంట్ల వరస నీ సక్సెస్సే. ఆ సౌధాల్లో నివసిస్తున్న వందల కుటుంబాల సొంతింటి కలల్ని నిజం చేసిన నీ సక్సెస్సే. నీ సక్సెస్ కళ్లెదుటే వుంటే ఎలా పరాజితుడివి?

చాలా కదిలించే వివరణ ఇచ్చాడు రాబర్ట్ స్కల్లర్. ఇక్కడ నగరంలో ఆశు అనుభవిస్తున్న స్వేచ్ఛ అతడి సక్సెస్ కాదు. అసలు సక్సెస్ అనేదే లేదు. త్యాగాలే వున్నాయి. ఇది ఆశు తండ్రి చేసిన త్యాగం. ఇక్కడ గోవా బిల్డర్ కి ఈ వ్యాపారంతోనే స్వేచ్ఛ, అతడి కూతురికి ఆశు ప్రేమతోనే స్వేచ్ఛ. ఈ స్వేచ్చని బిల్డర్ అడ్డుకోడు. కానీ ఆశు స్వేచ్ఛని తండ్రి భాగ్యే అడ్డుకుంటాడు.

ఇలా కాదని దర్శకుడు అసలు మూలంలోని సొంతమైన స్వేచ్ఛని ముందుకు తెస్తాడు - పోర్చుగీసు ఆధీనంలో వున్న గోవా విముక్తి పోరాటమేరా ఇప్పటి అన్ని స్వేచ్ఛలకీ మూలమని, లేకపోతే నీకూ నాకూ అందరికీ జన్మాంత సంకెళ్ళేరా బాబూ అన్నట్టు - క్లిప్పింగ్స్ వేస్తాడు దర్శకుడు.

పెడ్నేకర్ ప్రకాశించాడు

ఇందులో భాగ్యే పాత్ర పోషించిన రాజూ పెడ్నేకర్ హైలైట్ గా భాసిస్తాడు. అంతర్ సంఘర్షణని వ్యక్తం చేసే ముఖ కవళికలు అతడిలో పుష్కలంగా వున్నాయి. దృశ్యాల్లో దృష్టంతా అతడి మీదే వుంటుంది. కొడుకుతో సంఘర్షణలో ఎక్కడా హద్దు మీరడు. హద్దు మీరింది కొడుకా అన్నది తెలిసేందుకు అతడికే ఒక అనుభవం ఎదురవుతుంది. కొడుకు కోసం గోవా వచ్చినప్పుడు బస చేసిన భవంతిలో బహుశా మొదటి సారి టీవీ చూస్తాడు. టీవీలో మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన యాభై ఏళ్ల వ్యక్తి వార్తకి కంపించి పోతాడు. జీవితంలో కనీవినీ ఎరుగని ఈ దుష్ట చర్యకి నగరం మీద అసహ్యం పుట్టి తన గూటికి తిరిగి వెళ్ళిపోతాడు. ద్వేషించాల్సింది కొడుకుని కాదనీ, నగర సంస్కృతి ననీ తెలుసుకుంటాడు.

బస చేసినప్పుడు తండ్రి తీరుకి కొడుకు ఛీత్కార భావంతో వుంటాడు. కొలనుల్లో జలకాలాడిన వాడు స్నానాల గది నచ్చక ఆవరణలో ఫౌంటెయిన్ లో కూర్చుని నీళ్ళు చిలకరించుకుంటే, బెడ్ మీద పడుకోక కింద పడుకుంటే చాలా అవమానం ఫీలవుతాడు కొడుకు.

కానీ ప్రేమించిన గొప్పింటి కూతురు రుక్మా ఇలా వుండదు. నగర జీవియైనా ఆమె విలువలు మార్చుకోలేదు. ఆశు తండ్రిని అంతస్తు రీత్యా కాకుండా, వయసులో పెద్దవాడనే గౌరవంతో మర్యాదలు చేస్తుంది. ఆమె తండ్రి కూడా ఆదర్శంగా కన్పిస్తాడు. ఆధిపత్య వర్గాలు అణగారిన వర్గాలకి చేయూత నివ్వకపోతే ఆధిపత్య వర్గం అన్న హోదాకే అర్ధం లేదన్నట్టు, అతను మానవ వనరుల అభివృద్ధి కోరుకునే సంపన్నుడన్నట్టు అర్ధమొచ్చేలా దృశ్యాలుంటాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘దిగంత్’ ఒక సామాజిక పరిశీలన. ఒక ఆదర్శ సమాజాన్ని కాంక్షించే, స్వేచ్ఛకి స్వేచ్ఛ నివ్వాలన్న అంతర్లీన సందేశంతో ఒక వెండి తెర రూపం. ఇది యూట్యూబ్ లో ఉచితంగా వుంది. ఈ క్రింద క్లిక్ చేసి చూడొచ్చు.Next Story