Telugu Global
MOVIE REVIEWS

Das Ka Dhamki Movie Review: దాస్ కా ధమ్కీ మూవీ రివ్యూ {2.25/5}

Das Ka Dhamki Movie Review: విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Das Ka Dhamki Movie Review: దాస్ కా ధమ్కీ మూవీ రివ్యూ {2.25/5}
X

Das Ka Dhamki Movie Review: దాస్ కా ధమ్కీ మూవీ రివ్యూ {2.25/5}

చిత్రం: దాస్ కా ధమ్కీ

నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పెతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్ తదితరులు..

కథనం-మాటలు-దర్శకత్వం: విశ్వక్ సేన్

నిర్మాత: కరాటే రాజు

బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్

కథ: ప్రసన్న కుమార్ బెజవాడ

డీవోపీ: దినేష్ కె బాబు

సంగీతం: లియోన్ జేమ్స్

ఎడిటర్: అన్వర్ అలీ

రేటింగ్: 2.25/5

కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే, చూస్తున్నంతసేపు బాగున్నట్టు అనిపిస్తాయి, బయటకొచ్చిన తర్వాత మాత్రం ఏదో వెలితి ఆవహిస్తుంది. ఈరోజు రిలీజైన దాస్ కా ధమ్కీ కూడా అలాంటిదే. తన యాక్టింగ్, డైరక్షన్ తో విశ్వక్ సేన్ బాగానే మేనేజ్ చేశాడు. కానీ సినిమా అంతా పూర్తయిన తర్వాత సంతృప్తి కలగదు. దీనికితోడు ఆల్రెడీ చూసేసిన ట్విస్టులు, తెలిసిన కథ కావడంతో.. టైటిల్ లో ఉన్నంత ధమ్కీ, కథలో ఉన్నట్టు అనిపించదు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ధమాకాలో కనిపించిన కొన్ని ట్విస్టులు ఇందులో కూడా ఉంటాయి. అలాగే గౌతమ్ నందలో ఉన్న కాన్ ఫ్లిక్స్ ఇందులో కూడా ఉంది. వీటితో పాటు డీజే టిల్లూ, ఖిలాడీ, అజ్ఞాతవాసి ఇలా చాలా సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అందుకే ధమ్కీ పెద్దగా ఎక్కదు. ఈ పోలికలు పక్కనపెట్టి చూస్తే మాత్రం సినిమా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే, ధమాకాకు ముందు ఈ సినిమా రిలీజై ఉంటే పెద్ద హిట్టయ్యేది.

ఇంతకుముందు చెప్పుకున్న సినిమాల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఇద్దరు హీరోలు. ఒక హీరో ఫుట్ పాత్ బ్యాచ్. హోటల్ లో సర్వర్. మరో హీరో మాత్రం సౌండ్ పార్టీ. పేద హీరో మంచోడు, డబ్బున్న హీరో చెడ్డోడు అన్నమాట. ఓ సమస్య నుంచి బయటపడేందుకు చెడ్డ హీరో, మంచి హీరోను ట్రాప్ చేస్తాడు. చివర్లో మంచి హీరోకు అసలు విషయం తెలుస్తుంది. చెడ్డ హీరోకు బుద్ధి చెబుతాడు. ఇదీ సింపుల్ గా ధమ్కీ కథ.

2006లో వచ్చిన ప్రైస్ లెస్ అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకొని (కాపీ అని కూడా అనుకోవచ్చు) ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ధమ్కీ సినిమా కూడా ఈ లైన్స్ లోనే సాగుతుంది. అక్కడివరకు సినిమా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ కథ నుంచి పక్కకొచ్చి, లాకులు, ట్విస్టులు, పీటముడులు వేయాలని చూశారో అక్కడే కథ బెడిసికొట్టింది.

ఈకాలం మామూలు ట్విస్టులకు జనాలు పడడం లేదు. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు ఉంటేనే ఆహా..ఓహో అంటున్నాడు. రొటీన్ ట్విస్టులుంటే అబ్బే అంటూ లైట్ తీసుకుంటున్నారు. ధమ్కీ ఫస్టాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. హైపర్ ఆది, రంగస్థలం మహేష్ కామెడీ, మంచి పాటలు, హీరోయిన్ తో రొమాన్స్ లాంటివి ఓకే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది.

సెకెండాఫ్ నుంచి సినిమా పట్టాలు తప్పుకుంది. కథ రొటీన్ అనిపించకూడదనే ఉద్దేశంతో దర్శకుడు విశ్వక్ సేన్ (స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఇతడే) పెట్టిన ట్విస్టులు రొటీన్ అనిపిస్తాయి. కేవలం ఒకట్రెండు మాత్రమే ఓకే అనిపిస్తాయి. వీటికి విశ్వక్ రాసుకున్న డైలాగ్స్ (డైలాగ్ రైటర్ కూడా ఇతడే) కూడా ఏమంత మెప్పించవు. ఉన్నంతలో దర్శకుడిగా, హీరోగా విశ్వక్ పూర్తిస్థాయిలో మెప్పించాడు. ఇక పార్ట్ -2 కూడా ఉందంటూ క్లైమాక్స్ చివర్లో చూపించిన 10 నిమిషాల ఎపిసోడ్ కూడా బాగుంది.

తన యాక్టింగ్ తో విశ్వక్ మెస్మరైజ్ చేశాడు. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలో అతడి షేడ్స్ మెప్పిస్తాయి. హీరోయిన్ నివేత పెతురాజ్ క్యారెక్టర్ సర్ ప్రైజ్ అనిపిస్తుంది. రోహిణి, రావు రమేష్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్ గా దాస్ కా ధమ్కీ సినిమా చూస్తే, ఓ 3-4 సినిమాల్ని కలిపి చూసిన ఫీలింగ్ వస్తుంది. సూపర్ హిట్ సాంగ్స్ కోసం, హైపర్ ఆది కామెడీ కోసం, విశ్వక్ సేన్ యాక్టింగ్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

బాటమ్ లైన్ - పైపైన ధమ్కీ

First Published:  22 March 2023 12:53 PM GMT
Next Story