Telugu Global
MOVIE REVIEWS

'క్రేజీ ఫెలో' మూవీ రివ్యూ {2/5}

క్రేజీ ఫెలో క్యారక్టర్ ని చాలా లేజీగా నటిస్తున్నట్టు కన్పిస్తాడు ఆది. గెటప్ కొత్తగా ప్రయతించాడు తప్ప నటించడం బద్ధకంగా నటించాడు.

Crazy Fellow Movie Review and Rating
X

చిత్రం: క్రేజీ ఫెలో

రచన- దర్శకత్వం : ఫణి కృష్ణ

తారాగణం : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, వినోదిని, సప్తగిరి, నర్రా శ్రీనివాస్, రవి ప్రకాష్

సంగీతం : ధృవన్, ఛాయాగ్రహణం : సతీష్ ముత్యాల

బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్

నిర్మాత : కెకె రాధా మోహన్

విడుదల : అక్టోబర్ 14, 2022

రేటింగ్ : 2/5


ఆది సాయికుమార్ 2011 లో 'ప్రేమకావాలి' అనే హిట్ తో రంగ ప్రవేశం చేసిన తర్వాత, వరుసగా నటించిన 16 సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినా ఒక్కో కొత్త దర్శకుడు నమ్మకం సడలని ఆశా భావంతో ఆదిని ఆదుకుంటూ, తన రంగ ప్రవేశ హీరోగా సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు. ఈ శ్రేణిలో ఫణి కృష్ణ అనే కొత్త దర్శకుడు కూడా చేరి అదృష్ట పరీక్షకి నిలబడ్డాడు. ట్రైలర్ చూస్తే ఇద్దరు హీరోయిన్లతో ఆది రోమాంటిక్ ఎంటర్టయినర్ గా వుంది. రెండు పాటలు కూడా యూట్యూబ్ లో హిట్టయ్యాయి. మాస్ హీరోగా ఎదగాలని కొన్ని విఫల యత్నాలు చేసిన ఆది, ఈ సారి తిరిగి తన లవర్ బాయ్ పాత్రకి తిరిగి వచ్చాడు. ఇదైనా ఫర్వాలేదన్పించుకుందా, లేక 16 పక్కన ఇంకో అంకె చేరిందా తెలుసుకుందాం...

కథ

తల్లిదండ్రులు చనిపోయిన అభిరామ్ (ఆది) అన్నావదినెల దగ్గర పెరుగుతాడు. వదిన గారాబంతో అల్లరిగా తయారవుతాడు. చెప్పింది పూర్తిగా వినకుండా తొందరపాటు తనంతో పనులు చేసుకుపోయి స్నేహితుల్ని చిక్కుల్లో పడేస్తూంటాడు. ఇలా క్రేజీ ఫెలోగా పేరు తెచ్చుకుంటాడు. ఇతడ్ని దారిలో పెట్టాలని అన్న ఓ కంపెనీలో చేర్పిస్తాడు. అభిరామ్ అక్కడ పని చేసే మధుమతి (దిగంగనా సూర్యవంశీ) తో గొడవ పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య మాటలుండవు. ఇంతలో అక్కడే పని చేసే రమేష్ (నర్రా శ్రీనివాస్) అభిరామ్ కి ఒక యాప్ గురించి చెప్తాడు.. అభిరామ్ అది డౌన్ లోడ్ చేసుకుని సంపూర్ణేష్ బాబు ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని చాటింగ్ చేస్తూంటాడు. అవతల బాలా త్రిపుర సుందరి అనే అమ్మాయి సూర్యకాంతం ఫోటో పెట్టుకుని చాటింగ్ చేస్తూంటుంది. ఇలా పరస్పరం చూసుకోకుండా ప్రేమలో పడ్డాక, పెళ్ళికి ఎలాటి అవాంతరం ఎదురయ్యిందన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

పాత కథే. హీరోని అన్నావదినెలు అల్లారుముద్దుగా పెంచడం, హీరో అల్లరిగా తయారవడం, అన్న దారిలో పెట్టడం లాంటి పాత మూస ఫార్ములాకి, హీరో హీరోయిన్లు పరస్పరం చూసుకోకుండా ప్రేమించుకుని, తర్వాత మిస్టేకెన్ ఐడెంటిటీ టైపు కామెడీని క్రియేట్ చేసే తెలిసిన కథే. పైగా ఇద్దరు హీరోయిన్లతో రొటీన్ ముక్కోణ ప్రేమ కథ కూడా అయింది. రెండు మూడు సినిమాలు కలిపి ఒక సినిమా తీసినట్టుంది.

అయితే సమస్య ఏమిటంటే కామెడీ పేలకపోవడం. హీరోకి ఫ్రెండ్స్ తో గానీ, హీరోయిన్లతో గానీ కామెడీకి సిట్యుయేషన్స్ వున్నా ఉపయోగించుకో లేకపోవడం. తొందరపాటు తనంతో పనులు చేసుకుపోయే హీరో హాస్య పాత్ర చిత్రణతో బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నించడం తప్ప హాస్యం రాసే, తీసే తగిన అనుభవం లేదని కొత్త దర్శకుడు నిరూపించుకో దల్చుకున్నాడేమో.

ఇక ఇద్దరు హీరోయిన్లతో హీరో సమస్య కూడా క్లయిమాక్స్ వరకూ ఆపి, అప్పుడు అయిదునిమిషాల్లో తేల్చేసే లైటర్ వీన్ ప్రేమ సినిమాల ధోరణితో వుంది. అంటే అప్పటిదాకా కథలోకి వెళ్ళకుండా కాలక్షేపం చేసి, చివరి పావుగంటలో కథలో కొచ్చి తేల్చేసే ఫ్లాప్ ప్రేమ సినిమాల ధోరణి. యూత్ కి కనెక్ట్ అవడానికి యాప్ తో సన్నివేశాలు నడపడం తప్ప మిగతాదంతా ఇప్పుడు కాలం చెల్లిన కథా కథనాలే.

నటనలు- సాంకేతికాలు

క్రేజీ ఫెలో క్యారక్టర్ ని చాలా లేజీగా నటిస్తున్నట్టు కన్పిస్తాడు ఆది. గెటప్ కొత్తగా ప్రయతించాడు తప్ప నటించడం బద్ధకంగా నటించాడు. ఈ సినిమా ఇష్టం లేదేమో. మరో కొత్త దర్శకుడి భవిష్యత్తు కూడా తనకి అవసరం లేదేమో. కామెడీలేదు, పాత్రకి డెప్త్ లేకపోవడంతో భావోద్వేగాలూ లేవు. ఇలా హీరోయిజం కుదరక, రెండు భీకర ఫైట్స్ యాడ్ చేశాడు. ఫైట్స్ మాత్రం బాగా చేశాడు. విజయం కోసం ఫ్లాప్స్ తో ఫైట్ చేస్తున్నట్టే వుంది. ఇన్ని ఫ్లాప్స్ నటిస్తున్నా అవకాశాలు వరసగా రావడం ఆశ్చర్యమే. ఇంకో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి.

హీరోయిన్లు ఇద్దరి గురించీ చెప్పుకోవడాని కేమీ లేదు. చెప్పుకోదగ్గ పాత్రలూ కావు. ఇతర నటీనటులూ, కమెడియన్ సప్తగిరి సహా తెర నిండుగా కనిపించడానికి పనికొచ్చారు. అయితే ధ్రువన్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి- వినవే సుకుమారీ, ఎబిసిడిఇఎఫ్ జి - అన్నవి. సతీష్ ముత్యాల కెమెరా పనితనం మాత్రం అతి సాధారణంగా వుంది. ఈ డల్ విజువల్స్ యూత్ సినిమాకెలా వర్కౌట్ అవుతాయనుకున్నారో ఏమో.

కొత్త దర్శకుడు ఫణి కృష్ణ ఈ కాలపు ప్రేమ సినిమాని పాత సినిమా లాధారంగా తీయడం, పాత ధోరణిలోనే రచన- దర్శకత్వం సాగించడం ఈ సినిమాకి చాలా మైనస్. అయితే ఆదికి ఫ్లాపుల సంఖ్య 16 నుంచి 17 కి పెరగడం మాత్రం గ్రోతే. ఈ గ్రోత్ ని ఇలాగే పెంచు కుంటూ పోతాడని ఆశిద్దాం.

First Published:  14 Oct 2022 10:46 AM GMT
Next Story