Telugu Global
MOVIE REVIEWS

Bubblegum Movie Review | బబుల్ గమ్- మూవీ రివ్యూ {2/5}

Bubblegum Movie Review | యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ హీరో అయ్యాడు. ప్రమోషన్స్ లో చాలా హీరోయిజాన్ని ప్రదర్శించాడు మాటలతో. కాస్త ఓవర్ కూడా అయింది. నటించిన ‘బబుల్ గమ్’ గురించి చాలా హైప్ ఇచ్చాడు.

బబుల్ గమ్- మూవీ రివ్యూ {2/5}
X

చిత్రం: బబుల్ గమ్

రచన- దర్శకత్వం: రవికాంత్ పేరేపు

తారాగణం: రోషన్ కనకాల, మానసా చౌదరి, చైతూ జొన్నలగడ్డ, హర్షవర్ధన్, బిందూ చంద్రమౌళి, అనూ హాసన్ తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం : సురేష్ ఆర్

బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్, నిర్మాత : పి. విమల

విడుదల: డిసెంబర్ 29, 2023

రేటింగ్: 2/5

యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ హీరో అయ్యాడు. ప్రమోషన్స్ లో చాలా హీరోయిజాన్ని ప్రదర్శించాడు మాటలతో. కాస్త ఓవర్ కూడా అయింది. నటించిన ‘బబుల్ గమ్’ గురించి చాలా హైప్ ఇచ్చాడు. ఈ హైప్ దర్శకుడు రవికాంత్ పేరేపుకి కూడా చాలా అవసరం. రెండు సినిమాల దర్శకుడు రవికాంత్, అడివి శేష్ తో ‘క్షణం’ అనే హిట్టయిన థ్రిల్లర్, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ అనే హిట్టయిన రోమాంటిక్ ఓటీటీ మూవీ తీశాడు. ఈసారి యూత్ లవ్ సినిమా మీద దృష్టి పెట్టి రోషన్ హీరోగా మూడో ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఫలించిందా, రోషన్ కిది హిట్టిచ్చే ఎంట్రీయా తెలుసుకుందాం...

కథ

మధ్యతరగతికి చెందిన మటన్ షాపు యాదగిరి కొడుకు ఆది (రోషన్ కనకాల). ఇతడికి డీజే అవ్వాలని కలలు కంటాడు. ఇందుకు ఓ పబ్‌లో ప్రయత్నాలు చేస్తూంటాడు. అదే పబ్ కి ఉన్నత తరగతికి చెందిన జాను (మానసా చౌదరి) వస్తుంది. ఈమె ఫారిన్ వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసే ఆలోచనతో వుంటుంది. చూడగానే ప్రేమలో పడిపోతాడు ఆది. జాను కూడా చూపులు కలుపుతుంది. ఈమె అబ్బాయిల్ని ఆటబొమ్మలా వాడుకుని పారేసే రకం. అలాటి ఆటబొమ్మగా అది దొరుకుతాడు. అతడ్ని వెంటేసుకుని షికార్లు, రోమాన్సులు, గోవా టూర్లూ కానిచ్చి, బాగా డబ్బూ కారూ ఇచ్చి కింగ్ లా ఫీలయ్యేట్టు చేసి, తోసి పారేద్దామనుకుంటుంది. కానీ తనే ప్రేమలో పడుతుంది. పడ్డాక ఓ పార్టీలో ఘోరంగా అవమానిస్తుంది. దీంతో రోడ్డున పడ్డ ఆది ఈ ప్రేమకాదని, తన కలలు ముఖ్యమని దీజే అవడం మీద దృష్టి పెడతాడు. తిరిగి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఎలా కుదిరిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఈమధ్య బాగా హిట్టయిన ‘బేబీ’ లాగా యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన మరో ‘ఏ’ సర్టిఫికేట్ అడల్ట్ మూవీ ఇది. నేటి యూత్ కల్చర్ అన్నట్టు లిప్ లాకులు, బూతులు యదేచ్ఛగా వాడేశారు. రోషన్ ఎంట్రీ మూవీని ఇలా మొరటుగా ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళడం ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టుంది. దీనికి ‘అర్జున్ రెడ్డి’ టచ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కలిసి మొదటి సినిమాలోనే రోషన్ అతి నటన, మాస్ హీరోయిజం, యాంగ్రీ యంగ్ మాన్ వయసుకి మించిన డామినేషన్ తో వాయించేశాయి.

ఈ కథ కూడా ఎప్పుడో కాలం చెల్లిన యూత్ సినిమాల ట్రెండ్ లోంచి వూడి పడ్డట్టు వుంది. 2000-2005 మధ్య ‘చిత్రం’, ‘నువ్వే కావాలి’ యూత్ సినిమాల ప్రభావంతో కొత్త కొత్త దర్శకులతో, కొత్త కొత్త హీరో హీరోయిన్లతో ‘లైటర్ వీన్ రోమ్ కామ్’ పేరు పెట్టి కుప్పలు తెప్పలుగా తీసి పడేసిన యూత్ సిసిమాల తరహాలోనే వుంది ఈ తాజా యూత్ సినిమా. అప్పటి ట్రెండ్ లో రెండే రకాల బలహీన కథలు- అయితే అపార్ధాలతో విడిపోవడం, కాకపోతే ప్రేమించానని చెప్పలేకపోవడం. ఇప్పటి కథ ఇద్దరి మధ్య ఇగోల బలహీన కథ, రొటీన్ సన్నివేశాలు, అతి బలహీన చిత్రీకరణ.

ఫస్టాఫ్ ఇద్దరూ ప్రేమలో పడడం, విడిపోవడం, విడిపోవడానికి ఇగోల కారణం, హీరోకి అవమానం డల్ గా సాగి, సెకండాఫ్ లో ప్రేమని కాదనుకున్న హీరో కలల మీద దృష్టి పెట్టడం, హీరోని కాదనుకున్న హీరోయిన్ అతడి ప్రేమ కోసం వెంటబడడం... ఇలా పాతబడిన అమెచ్యూర్ కథా కథనాలతో ఓపికని పరీక్షిస్తుంది. చివరికి ముగింపు బావుందనిపించేలా వున్నా, అప్పటికి కథతో నశించిన ఓపికకి అదేమంత రిలీఫ్ నివ్వదు.

కథా కథనాలు కాదు- ‘ఏ’ సర్టిఫికేట్ కి న్యాయం చేసే చేష్టలు, పచ్చి బూతులు ఇవే సినిమాకి సరిపోతాయనుకుని చేసిన ఒక తెలివిలేని ప్రయత్నమిది. హైదరాబాదీ హీరో క్యారక్టర్ హైదరాబాదీ ఉర్దూలో పచ్చి బూతులు వాడితే తెలుగు ప్రేక్షకులకి వాటి అర్ధం పెద్దగా తెలియదని సినిమాల్లో వాడేస్తున్నారు. ఇవే ఉర్దూ బూతుల్ని తెలుగులో వాడే దమ్ములుండక ఈ దారి అట్టారు. ట్రైలర్ లోనే ఈ బూతులతో సినిమా ఏమిటో చెప్పేశారు.

నటనలు –సాంకేతికాలు

ఇలాగే వుంటే వచ్చే సినిమాల్లో రోషన్ కలకాల నటనని భరించడం కష్టం. అతడి అతి అతడికే శాపమవుతుంది. ఇంతకంటే చెప్పుకోవడానికేమీ లేదు. ఇతడి కంటే ఇతడి తండ్రి పాత్ర వేసిన చైతూ జొన్నలగడ్డ అసలు నటిస్తున్నట్టే అన్పించకుండా నటించేశాడు. నటనలో ఇది నేర్చుకోవాలి రోషన్.

తెలుగు హీరోయిన్ మానసా చౌదరి అందంగా వుంది. తనకి బరువైన పాత్రలిస్తే కూడా ఈజీగా నటించేలావుంది. సెకండాఫ్ లో పాత్రకి బరువుంది గానీ పరువు లేదు. మిగిలిన పాత్రల్లో హర్షవర్ధన్, బిందూ చంద్రమౌళి, అనూ హాసన్ తదితరులు కనిపిస్తారు. వైవా హర్ష కామెడీ మాత్రం పేలవం.

పాటలు, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతికాల విషయంలో మాత్రం కొంత కృషి జరిగింది. కంటెంట్ తో జరగాల్సిన కృషి జరగలేదు. ఇలాటి కంటెంట్ కి కృషి కూడా అవసరం లేదు.

First Published:  30 Dec 2023 6:53 AM GMT
Next Story