Telugu Global
MOVIE REVIEWS

Bomma Blockbuster Review: 'బొమ్మ బ్లాక్ బస్టర్' - రివ్యూ

Bomma Blockbuster Movie Review: నందు విజయ్ కృష్ణ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. సహాయ పాత్రలు కూడా నటిస్తున్నాడు. తన దగ్గర ఏ పాత్రయినా నటించగల టాలెంట్ వుంది గానీ మంచి అవకాశాలు రావడం లేదు. ఇటీవల 'సవారీ' లో హీరోగా నటించాడు గానీ అది మరీ బి గ్రేడ్ సినిమాలాగా వుంది

Bomma Blockbuster Review: బొమ్మ బ్లాక్ బస్టర్ - రివ్యూ
X

రచన -దర్శకత్వం : రాజ్ విరాట్

తారాగణం : నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరీటి దామరాజు, రఘు కుంచె తదితరులు

సంగీతం: ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ్

నిర్మాతలు: ప్రవీణ్, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి

విడుదల : నవంబర్ 4, 2022

రేటింగ్ : 1.5/5


నందు విజయ్ కృష్ణ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. సహాయ పాత్రలు కూడా నటిస్తున్నాడు. తన దగ్గర ఏ పాత్రయినా నటించగల టాలెంట్ వుంది గానీ మంచి అవకాశాలు రావడం లేదు. ఇటీవల 'సవారీ' లో హీరోగా నటించాడు గానీ అది మరీ బి గ్రేడ్ సినిమాలాగా వుంది. తిరిగి ఇప్పుడు 'బొమ్మ బ్లాక్ బస్టర్' అంటూ వచ్చాడు. ఇందులో యాంకర్ రేష్మీ గౌతమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన రాజ్ విరాట్ కొత్త దర్శకుడు. ఈ ముగ్గురూ కలిసి టైటిల్ తో పోటీపడుతూ బ్లాక్ బస్టర్ బొమ్మ తీశారా లేదా చూద్దాం...

కథ

మత్స్యకారుడైన పోతురాజు (విజయ్ కృష్ణ) దర్శకుదు పూరీ జగన్నాథ్ వీరాభిమాని. కథ రాసి పూరీ జగన్నాథ్ చేత సినిమా తీయించాలని పగటి కలలు కంటూ వుంటాడు. ఆ కథ పట్టుకుని పోతూ యాక్సిడెంట్ కి గురవుతాడు. ఆ కథ ఓ నిర్మాత చేతిలో పడుతుంది. అతను చదువుతాడు. అది పోతురాజు కథ.

పోతురాజు వూళ్ళో నేస్తాలని వేసుకుని వీధి పోరాటాలు చేస్తూ ఆవారాగా తిరుగుతూంటాడు. నయాపైసా కట్నం లేకుండా ప్రేమిస్తున్న వాడితో చెల్లెలి పెళ్ళి జరిపిస్తాడు. వాణి (రేష్మీ గౌతమ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈమెకి ఎవరైనా కొట్టుకుంటూ వుంటే చూసి ఆనందించడం సరదా. ఈమె కోసం జనాలని కొట్టడం ప్రారంభిస్తాడు. ఇంతలో ఒకడు డాన్సింగ్ స్కిల్స్ చూపించే సరికి వాడి వెంట పడుతుంది వాణి. వాడి సంగతి చూస్తాడు. మరింతలో గతంలో తన తండ్రి చనిపోయిన కారణం తెలుస్తుంది పోతురాజుకి. దీంతో తండ్రిని చంపిన వాళ్ళ మీద పగబడతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ

అర్ధం పర్ధం లేని కథ. బొమ్మ బ్లాక్ బస్టర్ కాదుకదా అట్టర్ ఫ్లాప్ అవడానికి కూడా కొన్ని అర్హతలుంటాయి. షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకులతో ఇదే సమస్య. రెండు గంటల నిడివిగల కథ చేసుకోలేరు. పైగా ఈ కొత్త దర్శకుడు సినిమా అనగానే ఇంకా అరిగిపోయిన మూస ఫార్ములా కథనే తయారు చేసుకున్నాడు. అందర్నీ కొట్టే ఆవారా హీరో, నిస్సహాయ తండ్రి, చెల్లెలి పెళ్ళి, హీరోయిన్ తో లవ్ ట్రాక్, తండ్రి మరణానికి రివెంజ్... ఇదీ వరస!

ఇంకా విచిత్రమేమిటంటే, ఆవారా హీరో రాసుకున్న ఈ ఆత్మకథ నిర్మాతకి నచ్చి రికమెండ్ చేయడానికి పూరీ జగన్నాథ్ దగ్గరికి వెళ్ళడం! అయితే పూరీ జగన్నాథ్ బ్రతికిపోయాడు. నిర్మాత ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళగానే, ఆయన పర్మిషన్ ఇవ్వలేదేమో, అందుకని కట్ చేసి శుభం వేసేశాడు దర్శకుడు.

కథ కోసం క్రియేట్ చేసిన రూరల్ వాతావరణం, మత్ష్యకారుల జీవితం, సంస్కృతి, కుల దైవాలు, వీటి తాలూకు సంగీతం...ఇవి మాత్రం చక్కగా చిత్రీకరించాడు. ఇంకోటేమిటంటే దృశ్యాల టేకింగ్ కూడా రెగ్యులర్ సినిమాల్లాగా గాకుండా, నోయర్ జానర్ లో ఆఫ్ బీట్ సినిమా శైలిలో చేశాడు. తనకి ఏదో కొత్త టెక్నిక్ ని ఫాలో అవ్వాలన్న ఉత్సాహముంది. అయితే మోడరన్ టెక్నిక్ కి పాత చింతకాయ కథ వల్ల ఫలితం తారుమారైంది.

ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ వరకూ హీరో అల్లరి, ఫైట్లు, ప్రేమలు ఇవే వుంటాయి. కథే ప్రారంభం కాదు. సెకండాఫ్ సగంలో తండ్రి ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమై, హత్య, రివెంజీ వీటితో ముగిసిపోతుంది. తండ్రి మరణానికి ఒక పూర్తి విషాద గీతం వేశాడంటే ఏ కాలంలో వున్నాడో అర్ధం జేసుకోవచ్చు.

నటనలు-సాంకేతికాలు

రఫ్ ఆవారా పాత్రలో విజయ్ కృష్ణ నటన చూస్తే ఏ పాత్రయినా నటించేయగలడనేది స్పష్టమవుతుంది. అయితే ఆవారా కదాని మరీ ఓవరాక్షన్ కూడా చేశాడు. ఈ పాత్ర పూరీ జగన్నాథ్ అభిమాని అయినప్పుడు, పూరీ జగన్నాథ్ తీసిన సినిమాల్లో వివిధ హీరోల యాక్టింగ్ ని ఇమిటేట్ చేసినా బావుండేది వినోదానికి.

విషయాల్ని తేలికగా తీసుకుని ఎంజాయ్ చేసే పాత్రలో రేష్మీ గౌతమ్ మంచి ఈజ్ తో నటించింది. తన వల్ల సీన్లకి గ్లామర్ వచ్చింది. ఇంకా ఒకరిద్దరు తప్ప నటీనటులందరూ కొత్త వాళ్ళే. అందరూ రూరల్ శ్రామిక వర్గ పాత్రల్ని సహజంగా నటించేశారు.

పైన చెప్పుకున్నట్టు, కంటెంట్ లేకపోయినా టెక్నికల్ గా ప్రయోగం చేయాలన్న ప్రయత్నం వరకూ సఫలమైంది. ప్రశాంత్ విహారి సంగీతం, సుజాతా సిద్ధార్థ్ ఛాయాగ్రహణం, ఎడిటింగ్, యాక్షన్ సీన్స్ వగైరా కొత్తదనాన్ని ప్రదర్శించాయి. అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడానికి ఇవి చాలవు. సినిమాలోనే నిర్మాత పాత్ర చేత దర్శకుడు తనే చెప్పించినట్టు- కథ, బలమైన కథ కావాలి!

First Published:  5 Nov 2022 1:19 PM GMT
Next Story