Telugu Global
MOVIE REVIEWS

బింబిసార మూవీ రివ్యూ

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Bimbisara Movie Review and Rating
X

బింబిసార మూవీ రివ్యూ

చిత్రం: బింబిసార

నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ , వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు

కెమెరా: ఛోటా కె.నాయుడు

పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి

మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్‌, కీరవాణి, వరికుప్పల యాదగిరి

నేప‌థ్య సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె

రచన – ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌

విడుదల తేది: ఆగస్టు 5, 2022

రేటింగ్ - 2.5/5

కొన్ని కథలు భారీతనం కోరుకుంటాయి, వాటికి భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆ లోటు బిగ్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. బింబిసార విషయంలో అదే జరిగింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ సెట్స్, మంచి గ్రాఫిక్స్ కావాలి. ఈ విషయంలో బింబిసారుడు నిరాశపరుస్తాడు. అటు కంటెంట్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, కథనంలో లోపాల కారణంగా అక్కడక్కడ ఇబ్బంది పెడతాడు. ముందుగా కథను సింపుల్ గా చెప్పుకుందాం.

ఇదొక ప్రాపర్ టైమ్ ట్రావెల్ మూవీ. క్రీస్తుపూర్వం 500వ శతాబ్దంలో ఉన్న బింబిసారుడు అతిపెద్ద క్రూరుడు. రక్తదాహంతో 'నేనే దేవుడ్ని' అనే అహంతో ఉన్న బింబిసారుడి జీవితం ఓ శాపం కారణంగా పూర్తిగా మారిపోతుంది. క్రీస్తుపూర్వంలో తంతే, క్రీస్తుశకంలో ఈ కాలంలోకి వచ్చి పడతాడు. అప్పటి బింబిసారుడికి, ఈ కాలంతో సంబంధం ఏంటి? అతడు దాచిన అనంత గుప్తనిధి ఏమైంది? ఇంతకీ బింబిసారుడి శాపం ఏంటి అనేది మిగతా కథ.

తెలుగులో టైమ్ ట్రావెల్ మూవీస్ అంటే ఎవరికైనా ఫస్ట్ ఆదిత్య-369 గుర్తొస్తుంది. అందులో చూపించినట్టుగానే ఇందులో కూడా ఓ టైమ్ ట్రావెల్ మెషీన్ ఉంటుంది. ఆ సినిమాలో ఏకంగా స్పేస్ షిప్ లాంటిది చూపించారు. ఇందులో మాత్రం ఓ మాయా దర్పణాన్ని చూపించారు. అలా కాస్ట్ కటింగ్ ఫాలో అయ్యారన్నమాట. అయితే ఈ సినిమాలో పోలికలు ఇక్కడితో ఆగిపోవు. కొన్ని చోట్ల ఘటోత్కచుడు సినిమా, చాలా చోట్ల బాహుబలి సినిమా గుర్తొస్తుంది. ఇక క్లైమాక్స్ లోనైతే అంజి సినిమాలో స్క్రీన్ ప్లే వాడేశారు.

ఇలా ఎన్నో సినిమాల్ని గుర్తుచేస్తుంది బింబిసార. అయితే ఇలా పాత సినిమాలు గుర్తొస్తున్నప్పటికీ, ఎమోషన్ బిల్డప్ చేయడంలో అక్కడక్కడ బింబిసారుడు ఆకట్టుకుంటాడు. కొత్త దర్శకుడు వశిష్ఠను మెచ్చుకోవాల్సింది ఇక్కడ. టైమ్ ట్రావెల్ ఫాంటసీ అనగానే అంతా సెట్స్, గ్రాఫిక్స్ పై ఆధారపడతారు. కానీ ఈ కొత్త కుర్రాడు మాత్రం ఎమోషన్స్ పై డిపెండ్ అయ్యాడు. అతడి అంచనా నిజమైంది. బింబిసార సినిమా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది.

సినిమాను ఫ్లాట్ గా కాకుండా.. టైమ్ ట్రావెల్ ఎపిసోడ్స్ ను స్క్రీన్ ప్లే పరంగా బ్యాక్ టు బ్యాక్ వచ్చేలా చేసే స్క్రీన్ ప్లే ఎత్తుగడ బాగుంది. ప్రారంభంలో ఓ 20 నిమిషాల పాటు కథతో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి పూర్తిగా కథలో లీనమౌతాడు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇంత భారీ కథను దర్శకుడు ఉన్నంతలో నీట్ గానే ప్రజెంట్ చేసినప్పటికీ.. చాలా చోట్ల తడబడ్డాడు. కాకపోతే కల్యాణ్ రామ్, కీరవాణి సహకారంతో చాలా చోట్లు గట్టెక్కిపోయాడు.

ఈ సినిమాను ఆదుకున్న ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు కల్యాణ్ రామ్, కీరవాణి. తన స్క్రీన్ ప్రజెన్స్ తో కల్యాణ్ రామ్ మెస్మరైజ్ చేశాడు. అనుభవం లేని దర్శకుడు మెగాఫోన్ పట్టుకున్నప్పటికీ, తన అనుభవాన్ని జోడించి సన్నివేశాల్ని రక్తికట్టించాడు. బింబిసార పాత్రలో విలన్ గా కల్యాణ్ రామ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఆ సన్నివేశాలకు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది.

ఇతర నటీనటుల విషయానికొస్తే.. సంయుక్త మీనన్, క్యాథరీన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. వాళ్ల పాత్రలు చాలా పరిమితం. ఇంకా చెప్పాలంటే అతిథి పాత్రల్లా ఉన్నాయి. బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ పాత్ర తేలిపోయింది. శ్రీనివాసరెడ్డికి మంచి క్యారెక్టర్ పడింది.

టెక్నికల్ గా సినిమా మరీ స్థాయిలో లేదు. ఆర్ట్, గ్రాఫిక్స్ విషయంలో బడ్జెట్ పరిమితులు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీతో దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ లోపాలు మాత్రం ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. ఈ కథకు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ కల్యాణ్ రామ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను బాగా తగ్గించినట్టు కనిపించింది.

ఓవరాల్ గా బింబిసార సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. కల్యాణ్ రామ్ నటన, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్స్ గా నిలిచాయి. మైనస్ పాయింట్స్ చూసుకుంటే, సెకెండాఫ్ స్లోగా సాగడం, ఆర్ట్ వర్క్ సరిగ్గా లేకపోవడం, విలన్ వీక్ గా ఉండడం ప్రధానమైన సమస్యలు. అయినప్పటికీ ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. నిరాశపరచదు.

Next Story