Telugu Global
MOVIE REVIEWS

Bhuvana Vijayam Movie Review, Rating: భువన విజయమ్ మూవీ రివ్యూ, రేటింగ్ {2.25/5}

Bhuvana Vijayam Movie Review, Rating: సునీల్ ఒక్కడే కాస్త నవ్విస్తాడు. జ్ఞాపక శక్తి కోల్పోయిన స్టార్ గా గజినీ టైపు క్యారక్టర్ తో కామెడీ ఫర్వాలేదు.

Bhuvana Vijayam Movie Review, Rating: భువన విజయమ్ మూవీ రివ్యూ, రేటింగ్ {2.25/5}
X

చిత్రం: భువన విజయమ్

రచన-దర్శకత్వం : యలమంద చరణ్

తారాగణం: సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సోనియా చౌదరి, స్నేహల్ కామత్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, ధనరాజ్, వైవా హర్ష తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : సాయి

బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా

నిర్మాతలు: ఉదయ్ కిరణ్, శ్రీకాంత్

విడుదల : మే 12, 2023

రేటింగ్: 2.25/5

చిన్న సినిమాలు అరుదుగా కొత్త ఐడియాలతో వస్తాయి. వచ్చినప్పుడు అవి మంచి టాక్ తో థియేటర్లలో నిలబడేలోగా అదృశ్యమైపోతూంటాయి. మంచి టాక్ తో నిలబడే దాకా సినిమాని థియేటర్లలో వుంచే కాలం కాదిది. చిన్న సినిమా మార్నింగ్ షోకే హిట్ టాక్ తో వైరల్ అవకపోతే ఇక అవకాశం వుండదు. అలాటి వైరల్ అయ్యే అవకాశమున్న ‘భువన విజయమ్’ ఈ వారం విడుదలైంది. ఓ పది మంది కమెడియన్ పాత్రల కథతో సినిమా అంటే ఎంత కామెడీ ప్రధానంగా వుంటుందో తెలిసిందే. ఒక కొత్త అయిడియా గల సినిమాని ఇంతమంది కమెడియన్లు కలిసి వైరల్ చేయాల్సిందే. మరి కొత్త దర్శకుడు తన తొలి ప్రయత్నంతో ఏం చేశాడు? ఇది తెలుసుకుందాం...

కథ

ఆటో డ్రైవర్ యాదగిరి (ధనరాజ్) అనేవాడు భూమ్మీద నూకలు చెల్లి చనిపోతాడు. ఇద్దరు యమభటు లొచ్చి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే అవతల ఇంకొకడికి కూడా చావుతో అపాయింట్ మెంటుంది. వాణ్ణి కూడా పట్రమ్మని చిత్ర గుప్తుడు ఆజ్ఞాపించ

డంతో, యమ భటులు యాదగిరి ఆత్మని వెంటబెట్టుకుని, రెండో వాడి ఆత్మకోసం వెళ్తారు. అదొక జాతకాల పిచ్చిగల సినిమా నిర్మాత చలపతి (గోపరాజు రమణ) ఆఫీసు. ఈయన నిర్మించిన సినిమాలతో ప్రియతమ్ కుమార్ (సునీల్) అనే వాడు టాప్ స్టార్ అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఈయనతో మరో సినిమా తీయాలి. అందుకని కథలు వినే కార్యక్రమం పెట్టుకుంటాడు. ఏడుగురు రచయితలు వచ్చి కథలు విన్పిస్తారు. ఈ రచయితల్లో ఒకడు చలపతి కారు డ్రైవర్, ఇంకొకడు రైటర్ గా మారిన దొంగ. ఈ ఏడుగురూ అద్భుతమైన కథలు చెప్పడంతో ఏ కథ తీసుకోవాలో తేల్చుకోలేక పోతాడు చలపతి. నాకెవరి కథ ఇస్తారో మీరే తేల్చుకోండి, ఆ కథకి పది లక్షలిస్తానంటాడు చలపతి. ఈ ఏడుగురు రచయితల్లోనే ఒకడికి చావుతో అపాయింట్ మెంటుంది. వాడి ఆత్మకోసమే వెయింటింగులో వున్నారు యమభటులు

పైన యమలోకం, కింద ఆఫీసులో భువన విజయమ్ అనే మందిరం. ఈ మందిరంలోకి మంతనాలాడుకోవడానికి ప్రవేశిస్తారు రచయితలు. నిర్మాత డ్రైవర్ బతిమాలుకుంటాడు- తన కూతురు ఆస్పత్రిలో వుందని, బ్రతికించుకోవాలంటే 8 లక్షలు కావాలనీ, కనుక తన కథని ఆమోదించమని ఏడ్చేస్తాడు.

ఆమోదించడానికి మిగతా రచయితలు సిద్ధపడ్డారా? రచయితల్లో చావబోయే రచయిత ఎవరు? కథ కోసం ఇంత మేధోమధనం జరుగుతూంటే, అవతల స్టార్ హీరో ప్రీతమ్ కుమార్ జ్ఞాపక శక్తి కోల్పోవడంతో నిర్మాత చలపతి కథ తీసుకున్నాడా? చలపతి డ్రైవర్ సమస్య ఎలా పరిష్కారమైంది? ...వీటికి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

శ్రీకృష్ణ దేవరాయలి ఆస్థానం ‘భువనవిజయం’ లో అష్ట దిగ్గజ కవులు కొలువుదీరే వారన్న ఆలోచనని తీసుకుని ఈ కథ చేశాడు కొత్త దర్శకుడు చరణ్. ట్రైలర్ లో ఇదే చెప్పాడు. అయితే ఎనిమిది మంది కవుల స్థానంలో 7 గురు రచయితల్ని సృష్టించి కథ నడిపాడు. ఇంకో రచయిత వున్నా మతిస్థిమితం లేని అతను రచయిత కాలేడు. ఇక ఈ కథ ఎలా నడపాలన్న దాని విషయంలో మాత్రం తప్పటడుగు వేశాడు. కమెడియన్లే రచయితలైనప్పుడు కథని పూర్తి స్థాయి పగలబడి నవ్వించే కామెడీతో నడపకుండా, అక్కడక్కడ మాత్రమే నవ్విస్తూ, విషయ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకో లేకపోయాడు. ఇదే ఈ సినిమాని వైరల్ కాకుండా ఆపింది. చిన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే హిట్ టాక్ రాకపోతే, ఇంకా తర్వాత దాని పరిస్థితి దైవా ధీనమే. దీనికంటే చిన్న చిన్న హార్రర్ కామెడీలు బాగా ఆడాయి. ఎందుకంటే అవి కామెడీ ప్రధానమే కాబట్టి.

ఈ కథలో ఇంకో సమస్య ప్రధాన పాత్ర లేకపోవడం. స్టార్ హీరోగా వేసిన సునీల్ ప్రధాన పాత్ర కాలేడు. సునీల్ కి కథ ఇవ్వడానికి వచ్చిన రచయితలతోనే ఈ సినిమా కథ అయినప్పుడు, రచయితల్లో ఒకరు ప్రధాన పాత్రగా వుండాలి. కానీ నిర్మాత డ్రైవరుగా వున్న రచయితకి, కూతురి వైద్య చికిత్స కారణం చెప్పి భావోద్వేగ భరిత కథ చేశారు. ఇతను ప్రధాన పాత్ర అనుకున్నా లాజిక్ అడ్డొస్తుంది. నిర్మాత డ్రైవర్ అయిన తను నిర్మాతకి సమస్య చెప్పుకుంటే కూతురి వైద్యం చేయించేస్తాడు. అతడికి కథే అమ్మి డబ్బు సంపాదించడానికి పోటీ పడనవసరం లేదు.

ప్రధాన పాత్ర లేకపోవడం, కమెడియన్లతో ప్రేక్షకులాశించే కామెడీని బలహీనం చేసి గంభీరంగా కథ చెప్పబోవడం, ఆ కథ కూడా అంతంత మాత్రంగా వుండడం కొత్త దర్శకుడి టాలెంట్ ని బయట పెట్టాయి. భువనవిజయంలో తెనాలి రామకృష్ణుడ్ని కూడా మర్చిపోయాడు కొత్త దర్శకుడు.

నటనలు- సాంకేతికాలు

సునీల్ ఒక్కడే కాస్త నవ్విస్తాడు. జ్ఞాపక శక్తి కోల్పోయిన స్టార్ గా గజినీ టైపు క్యారక్టర్ తో కామెడీ ఫర్వాలేదు. అయితే సినిమా షూటింగులో దెబ్బతగిలి జ్ఞాపక శక్తిని కోల్పోయిన తనని, కర్రతో కొడితే జ్ఞాపక శక్తి రావడమనే పాత చింతకాయ చిట్కా ఇబ్బంది పెట్టే విషయం. ఎనిమిదో రచయితగా మూగవాడి పాత్రలో వెన్నెల కిషోరే ఈ సినిమాకి ఆకర్షణ. పెద్ద రచయితగా పృథ్వీరాజ్, అతడి అసిస్టెంట్ గా పనిచేసి అతడికే పోటీ రచయితగా మారిన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, దొంగోడైన రైటర్ గా వైవా హర్ష నటించారు. నిర్మాతగా గోపరాజు రమణ, రొమాంటిక్ పాత్రల్లో సోనియా చౌదరి, స్నేహల్ కామత్ కని పిస్తారు.

ఈ సినిమాలో పాటల్లేవు. నిడివి కూడా రెండు గంటలలోపే. ఫస్టాఫ్ నత్తనడక నడిచినా సెకండాఫ్ కథ ఎంపిక గురించి చేసే కామెడీలు కొన్ని నవ్విస్తాయి. ఒకే ఇంట్లో సింగిల్ లొకేషన్లో ఈ కథంతా జరుగుతుంది. అయితే సింగిల్ లొకేషన్ సినిమాలు బోరు కొట్టకుండా, సీను సీనుకీ మారిపోయే పరిస్థితి తో వేగంగా సాగే కథనం ఎలా చేయాలో ఇలాటి హాలీవుడ్ సినిమాల్లో తెలుస్తుంది. కొత్త దర్శకుడు రీసెర్చి చేసుకోలేదు. ఊహించని మలుపులు లేకుండా సినిమా సాగుతుంది. క్లయిమాక్స్ ఏం జరుగుతుందో ముందే తెలిసి పోతుంది.

ఇంతమంది కమెడియన్లతో కామెడీ తీయడానికి కొత్త దర్శకుడి అనుభవం సరిపోలేదు. అనుభవమున్న రచయితల తోడ్పాటు తీసుకుంటే తప్ప ‘భువన విజయమ్’ కి సరైన విజయం అంత సులభం కాదు.

Next Story