Telugu Global
MOVIE REVIEWS

Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్దం భాస్కర్ నారాయణ- రివ్యూ {2.5/5}

Bhoothaddam Bhaskar Narayana Movie Review: మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి ‘చూసీ చూడగానే’, ‘గమనం’ అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు.

Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్దం భాస్కర్ నారాయణ- రివ్యూ {2.5/5}
X

చిత్రం: భూతద్దం భాస్కర్ నారాయణ

రచన- దర్శకత్వం : పురుషోత్తం రాజ్

తారాగణం : శివ కందుకూరి, రాశీ సింగ్, దేవీ ప్రసాద్, వర్శిణీ సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం : గౌతమ్. జి

నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడింబి

విడుదల : మార్చి 1, 2024

రేటింగ్: 2.5/5

మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి ‘చూసీ చూడగానే’, ‘గమనం’ అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు. వీటితో గుర్తింపేమీ రాలేదు. ఇక టైటిల్ రోల్ పోషిస్తేనే గుర్తింపుకి అవకాశం వుండగలదని ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ లో నటించినట్టుంది. ఇది డిటెక్టివ్ పాత్ర. దీని కథకి ప్రయోగాత్మకంగా పురాణ కథతో లింకు పెట్టారు. అదేమిటో చూద్దాం.

కథ

ఆంధ్ర -కర్ణాటక సరిహద్దులోని అడవుల్లో కర్ణాటక వైపు కొన్నేళ్ళుగా స్త్రీల శవాలు బయటపడుతూంటాయి. అవి తలలు తెగి, మొండెమ్మీద దిష్టి బొమ్మలు అమర్చి వుంటాయి. ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని తెలిసిపోతున్నా ఆ సీరియల్ కిల్లరెవరో దొరకడు. తలలు దొరక్కపోవడంతో శవాలెవరివో గుర్తించడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆంధ్రావైపు గ్రామంలో చిన్నతనం నుంచీ డిటెక్టివ్ అవ్వాలన్న కోరికతో భాస్కర్ నారాయణ పెరుగుతాడు. గ్రామంలోనే డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. లుంగీ కట్టుకుని వుంటాడు. ఇతడి తెలివి తేటలకి మెచ్చి పోలీసులు హత్య కేసుల్లో సైతం ఇతడి సాయం తీసుకుంటూ వుంటారు. ఇలా వుండగా, ఈసారి ఆంధ్రా గ్రామం వైపు అడవిలో దిష్టి బొమ్మ అమర్చిన మరో స్త్రీ శవం బయటపడుతుంది. ఇక డిటెక్టివ్ భాస్కర్ ఈ కేసుని పరిశోధించడానికి రంగంలోకి దిగుతాడు.

ఈ శవాలు అసలెవరివి? అజ్ఞాతంగా వుంటున్న సీరియల్ కిల్లరెవరు? ఎందుకీ రకంగా హత్యలు చేస్తున్నాడు? వీణ్ణీ పట్టుకోవడమెలా? పరిశోధన మొదలెట్టిన డిటెక్టివ్ భాస్కర్ తెలుసుకున్న కొత్త సంగతులేమిటి? అసాధ్యుడుగా వున్న సీరియల్ కిల్లర్ని చివరికి పట్టుకోగలిగాడా లేదా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ మధ్య ‘కాంతారా’ హిట్టయినప్పట్నుంచీ డివైన్ జానర్ సినిమాలు ఒక ట్రెండ్ గా వస్తున్నాయి. ‘కార్తికేయ 2’, ‘విరూపాక్ష’, ‘హిడింబ’, ‘మా వూరి పొలిమేర’, ‘మంగళవారం’ ‘హనుమాన్’, ‘ఊరి పేరు భైరవకోన’ లాంటివి. ఈ వరుసలో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చేరింది. అయితే ఒక డిటెక్టివ్ కథకి డివైన్ జానర్ ని కల్పించడం ఇదే తొలిసారి. అదీ పురాణంతో కలిపి. పురాణంలో మహిషాసురుడి కథకి, కథలో జరుగుతున్న హత్యలతో ముడిపెట్టి డిటెక్టివ్ జానర్ లో కొత్త ప్రయోగం చేశారు. దీంతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా తయారయ్యింది.

అయితే విషయం కొత్తగా వున్నా చెప్పడం అంత కొత్తగా లేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. భాస్కర్ డిటెక్టివ్ అవడానికి చిన్నప్పటి సన్నివే శాలు, పెద్దయ్యాక కుటుంబ సభ్యులతో సీన్లు, అతను గాయపడితే వాళ్ళ ఏడ్పులతో డ్రామా, జర్నలిస్టుతో అతడి ప్రేమ, ఇలా డిటెక్టివ్ జానర్ మర్యాదలకి పాత మూస సీన్లు అడ్డుపడుతూ కథ థ్రిల్లింగ్ గా సాగదు. యాక్షన్ తో గాకుండా డైలాగులతో కథ నడపడం ఎక్కువవడంతో ఫస్టాఫ్ నత్త నడక నడుస్తున్నట్టు వుంటుంది.

సెకండాఫ్ లోనే డిటెక్టివ్ కథ ప్రొఫెషనల్ గా సాగుతుంది. జరుగుతున్న హత్యలకి క్లూస్ సంపాదించడం, అవి సీరియల్ కిల్లర్ కి దారితీయించే క్రమంలో ఒకొక్కటే ఇతర పాత్రలు సీరియల్ కిల్లర్ అన్నట్టుగా రివీలవడం, ఈ క్రమంలో ఈ వరస హత్యలకి పురాణంతో సంబంధముందని ఆధారాలు దొరకడంతో కథ మిస్టీరియస్ గా కొత్త మలుపు తిరుగడం... ఇలా సాగుతున్నాక, హంతకుడు శవాలకి తగిలిస్తున్న దిష్టిబొమ్మలు నిజానికి మహిషాసురుడి దిష్టి బొమ్మలని తెలియడంతో ఉత్కంఠ పెరుగుతుంది. ఇక దీంతో హంతకుడికేం సంబంధమనే ప్రశ్నతో చిట్టచివర్లో హంతకుడ్ని పట్టుకుంటే - అతను మొత్తం రివీల్ చేస్తాడు. అయితే పురాణకథని వాడుకోవడం బాగానే వున్నా, ముగింపు మూఢనమ్మకంగా ముగుస్తుంది. డిటెక్టివ్ క్యారక్టర్ ఆ హంతకుడి ఆలోచనలు మూఢనమ్మకమని ఖండించి వుంటే సరైన సందేశం వెళ్ళేది.

నటనలు –సాంకేతికాలు

దృష్టి లోపంతో చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చిన హీరోకి ఆ అద్ధాలతో కలిపి భూతద్దం భాస్కర్ నారాయణ పేరొచ్చింది. డిటెక్టివ్ కి అలంకారం భూతద్దమే కాబట్టి టైటిల్ కూడా ఇలా జస్టిఫై అయింది. గ్రామంలో ఈ డిటెక్టివ్ పాత్ర హాస్య పాత్రే అయినా హీరో శివ కందుకూరి నవ్వించే ప్రయత్నం చేయడు. ఆ పని అసిస్టెంట్ చేస్తాడు. మరొకటేమిటంటే, డిటెక్టివ్ పాత్ర లుంగీ కట్టుకుని తిరగగడం. ఈ పాత్రకి యాక్షన్ తో కూడిన ఫన్నీ సీన్స్ వుండుంటే ఫస్టాఫ్ స్పీడుగా సాగేది. డిటెక్టివ్ కథంటే అద్భుత రసంతో చెప్పాల్సిన కథ అనీ జానర్ మర్యాద మర్చిపోతే ఎలా?

సెకండాఫ్ లో శివ కందుకూరి యాక్షన్ లో కొచ్చి పాత్రని పాక్షికంగా నిలబెడతాడు. ఎలాగంటే డిటెక్టివ్ గా అతడికి ఏ ప్రత్యేకతలుండవు. ఇలాటి పరిస్థితుల్లో ఒక సాధారణ యూత్ ఎలా ప్రవర్తిస్తాడో ఆ లెవెల్లో వుంటాడు. డిటెక్టివ్ అయినందుకు ఇంట్లో వ్యతిరేకతతో బాటు, చిన్నప్పుడు అన్న చావు ఆత్మహత్యకాదనీ, అది హత్య అనీ నిరూపించలేకపోయిన అసమర్ధత, అతడి పర్సనాలిటీలో పట్టుదలని, అసాధారణ స్కిల్స్ నీ కల్పించి వుండాలి. అప్పుడే క్యారక్టర్ పోషించడానికి, అందులో రాణించ డానికీ వీలుంటుంది.

జర్నలిస్టు పాత్రలో రాశీ సింగ్ ది చిన్న పాత్ర. పోలీసు అధికారిగా దేవీ ప్రసాద్ ది క్లయిమాక్స్ ని మలుపు తిప్పే పెద్ద పాత్ర. ఈ పాత్రని సమర్ధవంతంగా పోషించాడు. షఫీ, శివ కుమార్, సురభి సంతోష్ తదితరులు సహాయ పాత్రల్లో కనిపిస్తారు.

శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం, గౌతమ్ జి ఛాయాగ్రహణం మరీ గొప్పగా ఏం లేవు. పరిమిత బడ్జెట్ కి తగ్గట్టున్నాయి. కొన్ని అవసరం లేని షాట్స్ బడ్జెట్ పెరగడానికే పనికొచ్చాయి. ఒక విషయం అడగడానికి హీరో బృందం ఇన్స్ పెక్టర్ ఇంటి దాకా రావడం, అడిగి వెళ్ళి పోవడం అనవసరం లేని సీను. ఫోన్లో అడిగితే సరిపోయేది. ఇక సెకండాఫ్ లో కాస్త కథ, మలుపులు తగ్గిస్తే సినిమా భారంగా వుండేది కాదు. ఈ థ్రిల్లర్ కి రెండు గంటల నిడివి చాలు.

మొత్తానికి ఈ కొత్త ప్రయోగపు డిటెక్టివ్ సినిమా సెకండాఫే కథ అన్నట్టు గాకుండా ఫస్టాఫ్ లో కూడా కాస్త బిగి వున్న కథతో -యూత్ అప్పీల్ తో ప్రొఫెషనల్ గా నడిపివుంటే ఎక్కువ రోజులు ఆడే అవకాశముంటుంది. డిటెక్టివ్ కథలో డిటెక్టివ్ కి కుటుంబ పాత్రలు, సెంటిమెంట్లు, డ్రామాలు ఫీల్ ని చెడగొడతాయి. డిటెక్టివ్ లకి, గూఢచారులకి కుటుంబాలు, కుటుంబ సమస్యలూ వుండవు. ప్రపంచ సమస్యలే ఈ పాత్రల సమస్యలు!

First Published:  4 March 2024 9:53 AM GMT
Next Story