Telugu Global
MOVIE REVIEWS

Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ {2.75/5}

Balagam Movie Review - కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కు ముందే షోలు వేసి మరీ చూపించారు. మరి నిర్మాతల నమ్మకం నిజమైందా? బలగం సినిమా ఎలా ఉంది?

Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ {2.75/5}
X

న‌టీన‌టులు: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జ‌య‌రాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు

బ్యానర్ : దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్

ద‌ర్శ‌క‌త్వం: వేణు ఎల్దండి

నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌

సినిమాటోగ్ర‌ఫీ: ఆచార్య వేణు

కథా విస్తరణ - స్క్రీన్ ప్లే: రమేష్ ఎలిగేటి, నాగరాజు మడూరి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

నిడివి: 2 గంటల 11 నిమిషాలు

సెన్సార్: U

రేటింగ్: 2.75/5

Advertisement

మలయాళం సినిమాలు, తమిళంలో కొన్ని సినిమాలు అత్యంత సహజంగా తెరకెక్కుతాయి. కమర్షియల్ అంశాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాలు తెలుగులో రావంటూ చాలామంది సన్నాయి నొక్కులు నొక్కడం చూస్తూనే ఉంటాం. వాటికి పోటీగా తెలుగులో కూడా అలాంటి సినిమా ఒకటి వచ్చింది. అదే బలగం.

ఈమధ్య కాలంలో ఇంత సహజత్వంతో కూడిన సినిమా ఇంకోటి రాలేదు. ఇది మాత్రం పక్కా. థియేటర్ లో సీట్లో కూర్చొని చూస్తున్నట్టు ఈ సినిమా ఉండదు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరికి మనం కూడా వెళ్లి, ఆ పాత్రల పక్కనే కూర్చొని వాళ్ల బాధలు వింటున్నట్టు, వాళ్లతో పాటు కలిసి నవ్వుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఎంతో గొప్పగా సినిమా తీస్తే తప్ప ఇలా ఫీల్ అవ్వలేం. అలాంటి ఫీలింగ్ ను బలగం అందిస్తుంది.

Advertisement

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, యాస, గోస, కట్టుబాట్లు.. ఇలా సమస్తం ఈ సినిమాలో కనిపిస్తాయి. అలా అని ఇదేదో తెలంగాణ గొప్పదనాన్ని చాటిచెప్పడం కోసం తీసిన సినిమా కాదు. తను అనుకున్న కథకు దర్శకుడు వేణు, తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నాడంతే. గతంలో జయమ్మ పంచాయతీ సినిమా కోసం ఉత్తరాంధ్ర నేపథ్యాన్ని తీసుకున్నట్టే ఇది కూడా. నిజంగా ఎంతో గొప్పగా చూపించాడు, ఎంతో కమ్మగా వినిపించాడు, మరెంతో బాగా మనసుల్ని కదిలించాడు దర్శకుడు వేణు.

ఓ చావు చుట్టూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. కాకపోతే తెలంగాణలో చావు కూడా ఓ సంబరం. ఘనంగా చేస్తారు. ఈ విషయం తెలిసినవాళ్లు బలగంతో మరింత కనెక్ట్ అవుతారు, తెలియని వాళ్లు ఓ కొత్త విషయం తెలుసుకుంటారు.

తెలంగాణలోని సిరిసిల్లకు దూరంగా ఓ పల్లెటూరిలో ఉండే సాయిలు (ప్రియదర్శి)కి పెళ్లి కుదురుతుంది. 2 రోజుల్లో ఎంగేజ్ మెంట్. సాయిలుకు పెళ్లి కంటే, ఆ పెళ్లితో వచ్చే కట్నంపైనే ఎక్కువ దృష్టి. ఎందుకంటే, ఊరంతా అప్పులు చేశాడు, అవి తీర్చాలంటే, కట్నం డబ్బులు కావాలి. అది అతడి ఆలోచన. అంతా సెట్ అనుకున్న టైమ్ లో సాయిలు తాత కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. ఇక అక్కడ్నుంచి అసలు కథ మొదలు.

కొమురయ్య అంటే ఊరిలో అందరికీ బాగా పరిచయం. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు అందర్నీ పలకరిస్తూ ఉంటాడు. అలాంటి కొమురయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య, మొగిలయ్య, ఓ కూతురు లక్ష్మి. లక్ష్మి భర్త నారాయణ (మురళీధర్)కు ఐలయ్య, మొగిలయ్యతో చిన్న గొడవలొస్తాయి. దాంతో భార్యతో కలిసి వెళ్లిపోతాడు. కొమురయ్య మరణంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఇంటికొస్తాడు.

నారాయణ రాకతో అతడికి ఐలయ్య, మొగిలయ్యకు మరోసారి మనస్పర్థలు చెలరేగుతాయి. దీనికితోడు కొమురయ్యకు పెట్టిన పిండాన్ని కాకులు ముట్టవు. మరోవైపు మామయ్య కూతురు సంధ్య (కావ్య కల్యాణ్ రామ్)ను చూసి, అదే చావులో ప్రేమిస్తాడు సాయిలు. ఆగిపోయిన పెళ్లి ఎలాగూ పోయింది, కనీసం సంధ్యను పెళ్లి చేసుకుంటే మామ నుంచి ఆస్తి వస్తుందనేది ఇతడి రెండో ప్లాన్. ఇలా సాగిపోతున్న ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, కథ ఎలా సుఖాంతం అయిందనేది బలగం సినిమా.

బలగం అంటే మనం సంపాదించుకునేది కాదు, మన కుటుంబమే మన బలగం అని చాటిచెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఈ విషయాన్ని దర్శకుడు వేణు (కమెడియన్, జబర్దస్త్ ఫేమ్) బలంగా చెప్పాడు. ఓ కమెడియన్ నుంచి కామెడీ సినిమా వస్తుందని అనుకుంటే, హెవీ ఎమోషనల్ డ్రామా చూపించాడు వేణు. శభాష్ వేణు.

మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ఎమోషన్స్ బలంగా పండాయి. చిన్నప్పుడు చెల్లెలు తప్పిపోతే, అన్నయ్యలు ఎంత గాభరా పడ్డారో చెప్పిన సీన్ గుండెల్ని పిండేస్తుంది. తాతయ్యను తలుచుకుంటూ సాయిలు రియలైజ్ అయ్యే సీన్ మరో హైలెట్. ఇలాంటి కొన్ని సన్నివేశాల్ని అద్భుతంగా తీశాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్ చూస్తే, వేణును ఇన్నాళ్లూ చూసిన కోణం పూర్తిగా మారిపోతుంది.

అత్యంత సహజంగా, అందంగా, మనసుకు హత్తుకునేలా తీసిన ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సహజత్యం కోసం పాకులాడే క్రమంలో సినిమాను సాగతీశారు. చాలా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. దీనికితోడు సహజత్వం కోసం పెట్టిన ఏడుపులు, పెడబొబ్బలు కూడా ఎక్కువయ్యాయి. కమర్షియల్ హంగులు లేకపోయినా ఫర్వాలేదు కానీ, ల్యాగ్స్ ఎక్కువయ్యాయి.

సినిమాలో నటీనటులంతా చాలా బాగా చేశారు. ప్రియదర్శి, వేణు తప్పిస్తే మిగతావాళ్లంతా కొత్తవాళ్లే. అందుకే మనకు యాక్టర్లు కనిపించరు, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ప్రియదర్శి, జయరాం, మురళీధర్, సుధాకర్ రెడ్డి.. ఇలా అంతా చాలా బాగా చేశారు. చివరికి గ్రామస్తుల పాత్రలు పోషించిన ఆర్టిస్టులు కూడా అత్యంత సహజంగా నటించడం విశేషం. చిన్న పాత్రే అయినప్పటికీ కావ్య కల్యాణ్ రామ్ కూడా తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

సినిమాటోగ్రఫీ, భీమ్స్ అందించిన సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కథకు తగ్గట్టు ఉన్నాయి. చివర్లో ఓ పాటలో సినిమా కథ మొత్తాన్ని చెప్పడం బాగుంది. కాకపోతే అక్కడ కూడా ల్యాగ్ కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో, అనుకున్నది అనుకున్నట్టు తీశారు నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత కాంపౌండ్ నుంచి వచ్చిన వీళ్లు, ఇలాంటి సెన్సిబుల్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం మెచ్చుకోదగ్గ విషయం.

ఓవరాల్ గా ఈమధ్య కాలంలో చూసిన అత్యంత సహజమైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది బలగం మూవీ. చెప్పాల్సిన పాయింట్ ను సున్నితంగా ఎలా చెప్పొచ్చో ఈ సినిమాను చూసి నేర్చుకోవచ్చు. పల్లెటూరు, అమాయకమైన పాత్రలు, వాళ్ల ఇగోలు, ప్రేమలు.. ఇలా సహజత్వంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అయితే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. టికెట్ కొని (రేట్లు బాగా తగ్గించారు) థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఎంత మంది చూస్తారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.

Next Story