Telugu Global
MOVIE REVIEWS

Avatar 2 Movie Review: 'అవతార్-2' మూవీ రివ్యూ {4/5}

Avatar 2 Movie Review: ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022) అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం 2009 లో సంచలన ‘అవతార్’ కి సీక్వెల్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తారాగణం సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, జోయెల్ డేవిడ్ మూర్, గియోవన్నీ రిబిసి, దిలీప్ రావ్ లు ‘అవతార్’ లోని తమ పాత్రల్ని రిపీట్ చేస్తూ నటించారు.

Avatar 2 Movie Review: ‘అవతార్-2’ మూవీ రివ్యూ {4/5}
X

Avatar 2 Movie Review: ‘అవతార్-2’ మూవీ రివ్యూ {4/5}

చిత్రం : అవతార్-2

దర్శకత్వం : జేమ్స్ కామెరూన్

స్క్రీన్ ప్లే : జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమండా సిల్వర్

తారాగణం : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్

సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్, ఛాయాగ్రహణం : రస్సెల్ కార్పెంటర్

బ్యానర్స్ : లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్జీ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ

విడుదల : డిసెంబర్ 16, 2022

బడ్జెట్ : 350-400 మిలియన్ డాలర్లు

రేటింగ్ : 4/5


'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (2022) అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం 2009 లో సంచలన 'అవతార్' కి సీక్వెల్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తారాగణం సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, జోయెల్ డేవిడ్ మూర్, గియోవన్నీ రిబిసి, దిలీప్ రావ్ లు 'అవతార్' లోని తమ పాత్రల్ని రిపీట్ చేస్తూ నటించారు. కొత్త తారాగణంలో జేమ్స్ కామెరూన్ 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్ స్లెట్ ఓ కీలక పాత్ర పోషించింది. అప్పట్లో 'అవతార్' హిట్టయితే సీక్వెల్ నిర్మించాలనుకుంటున్నట్టు ప్రకటించిన కామెరూన్, అక్షరాలా పదమూడేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత, వాగ్దానం చేసిన సీక్వెల్ కోసం కళ్ళు కాయలు చేసుకున్న ప్రపంచ ప్రేక్షకుల్ని కనికరించాడు. మరో మూడు సీక్వెల్స్ జోడింపు కూడా వుంటుందని చెప్పాడు. ఇవి వచ్చేనాటికి ప్రేక్షకులు ముసలి వాళ్ళయి పోతారేమో. అండర్ వాటర్ కెమెరా వర్క్ కోసం కొత్త సాంకేతికాల్ని అభివృద్ధి చేయవలసిన అవసరం వల్ల ఈ జాప్యం తప్పలేదన్నాడు. సినిమా చరిత్రలోనే లేనంత 350–400 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సీక్వెల్ ఇంతకీ ఎలా వుంది? నిరీక్షణకి తగ్గ ఫలం అందించిందా? ఇది తెలుసుకుందాం...

కథ

'అవతార్' లో చూపించిన సంఘటనలు జరిగి దశాబ్ద కాలానికి పైగా గడిచిపోయాక ఇప్పుడు - జేక్ సల్లీ ( సామ్ వర్తింగ్టన్ ), నేత్రి( జో సల్దానా) తోటి నావీలతో కలిసి సంతోషంగా నివసిస్తూంటారు. వీరికి పెద్ద కుమారుడు నెటేయం, చిన్న కుమారుడు లోయాక్, కుమార్తె టుక్, దత్తపుత్రిక కిరీ, స్పైడర్ అనే మానవ బాలుడూ కుటుంబంగా వుంటారు. ఇలా కుటుంబమంతా అనుబంధాలూ ఆత్మీయతలతో ఆనందంగా గడుపుతున్న వేళ, ఒక రోజు ముప్పు ముంచుకొస్తుంది. ఈ పండోరా గ్రహాన్ని మరోసారి వలసరాజ్యం చేసుకోవడానికి భూమ్మీద నుంచి 'అవతార్' లో ఓడిపోయిన మానవ బృందం తాలూకు 'స్కై పీపుల్' మళ్ళీ దిగుతుంది భీకర యంత్ర, ఆయుధ సంపత్తితో.

బృంద నాయకుడు క్వారిచ్ ప్రధాన ఆపరేటింగ్ స్థావరాన్ని నిర్మించేస్తాడు. ఇది తెలుసుకుని జేక్ గెరిల్లా ఆపరేషన్ కి పూనుకుని స్థావరాన్ని ధ్వంసం చేసేస్తాడు. రైల్వే మార్గాన్ని పేల్చేస్తాడు. పైప్ లైన్లు బద్దలు చేస్తాడు. దీంతో జేక్ ని చంపేయమని దళాన్ని ఎగదోస్తాడు క్వారిచ్. జేక్ పిల్లలు దళానికి చిక్కుతారు. దీంతో జేక్, అతడి భార్య నేత్రీ వచ్చి దాడి జరిపి పిల్లల్ని విడిపించుకుని వెళ్లిపోతారు- స్పైడర్ ని తప్ప. మానవ బాలుడు స్పైడర్‌ తన కుమారుడే అని గుర్తించిన క్వారిచ్, అతనితో ఎక్కువ సమయం గడిపి జేక్ కుటుంబ సమాచారం లాగాలనుకుంటాడు. స్పైడర్ క్వారిచ్‌కి నావీ సంస్కృతి గురించి నేర్పుతూంటాడు.

అటు స్పైడర్‌ వల్ల తమ ఆచూకీ తెలిసిపోతుందని అనుమానించిన జేక్, కుటుంబాన్ని తీసుకుని పండోరా తూర్పు సముద్రంలో వేరే తెగకి చెందిన ద్వీపానికి చేరుకుంటాడు. ఈ తెగ సముద్రాన్ని పూజిస్తారు. వీరి శరీరాలు జలచరాల్లాగా నీటి అడుగున జీవించడానికి అనుకూలంగా వుంటాయి. ఇప్పుడు మనుగడ కోసం ఈ అననుకూల జీవన విధానానికి జేక్ కుటుంబం ఎలా తమని మల్చుకుని, దండెత్తిన శత్రువుల్ని ఎదుర్కొన్నారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

22 వ శతాబ్దంలో అంటే- 2154 లో భూమి మీద సహజ వనరులు అంతరించి పోవడంతో, వనరుల అభివృద్ది విభాగం (ఆర్డీయే), ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలానికి చంద్రుడైన పండోరా గ్రహంపై విలువైన ఖనిజం యునోబ్టానియంని మైనింగ్ చేస్తుంది. పండోరా విష వాయువులతో కూడిన గ్రహం. ఇక్కడ నావి అనే మానవరూప జాతి నివసిస్తూంటుంది. ఈ పండోరా గ్రహం మీదికి మైనింగ్ బృందాల్నినావితో సంకరం చేసిన హ్యూమన్ హైబ్రిడ్‌లుగా పంపుతారు శాస్త్రవేత్తలు. వీటికి 'అవతార్' లని పేరు పెడతారు. అలాటి ఒక అవతార్ జేక్ సల్లీ ఇక్కడికి వచ్చి, నావీలలో కలిసిపోయి పండోరా ఆక్రమణని ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో ప్రత్యర్ధి క్వారిచ్ చనిపోతాడు. ఇదీ మొదటి 'అవతార్' కథ. అప్పట్లో 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 2,923 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు వచ్చింది!

పై మొదటి 'అవతార్' కథకి కొనసాగింపుగా రెండో 'అవతార్'. ఇందులో మొదటి 'అవతార్' లో చచ్చిపోయిన విలనే మెమరీని ఇంప్లాంట్ చేసుకుని అవతార్ గా తిరిగి వస్తాడు. ఈ కథని కేవలం దండెత్తి వచ్చిన మానవ జాతి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే సాధారణ హీరో కథగానే చూపించారు. మిగతా సహజ వనరుల ధ్వంసం, ప్రకృతీ, పర్యావరణాల నాశనం వంటి అంశాల జోలికి ఉద్దేశపూర్వకంగానే పోలేదని సినిమా చూస్తే తెలుస్తోంది.

అందుకని పెట్టుబడి దారీ వ్యవస్థకి వ్యతిరేకమైన ఎలాటి చిత్రణా చేయలేదు. గ్రహాల్ని కూడా వలస రాజ్యాలుగా చేసుకుని దోచుకుంటాం, అక్కడున్న వారు ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోవలసిందే అన్న అంతరార్ధం ఈ సినిమాలో గోచరిస్తోంది. జేమ్స్ కామెరూన్ గత మూవీ 'అలీటా' లో కూడా ఇదే భావజాలం కన్పిస్తుంది. ఆస్కార్ అవార్డు వచ్చేది కూడా ఇలా వుంటేనే. 2019లో కొరియన్ మూవీ 'పారసైట్' ని కూడా శ్రామిక పోరాటానికి వ్యతిరేకంగా వుంటేనే ఆస్కార్ తో సత్కరించారు.

దీంతో అవతార్ హీరో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగత కారణాలకి పరిమితమై, మొత్తం పండోరా గ్రహం శ్రేయస్సు కోసం పోరాడాలన్న విశాల దృక్పథాన్ని పక్కన బెట్టేశాడు. ఫలితంగా కథ డొల్లగా మారింది. కథ లేనందువల్లే కథ జోలికి పోలేదు. ఉద్దేశించిన భావజాలం నుంచి దృష్టిని మళ్ళించేందుకే కాబోలు- ఫాదర్ అనే వాడు కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడన్న డైలాగు ప్రారంభంలో వేశారు, మళ్ళీ ముగింపులో వేశారు. ఇలా కథకి సంబంధించి ఫాదర్ మీదికే దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఫాదర్ తిరుగుతూంటే డైలాగుతో ఈ మెసేజ్ బాగానే వుంటుంది. మొదటి నుంచీ ఫాదర్ (హీరో) ని కుటుంబంతో అన్యోన్యంగా చూపిస్తూనే ఈ డైలాగు ఏమిటి? 'మనం ఎక్కడున్నా మన కుటుంబం కోటలాంటిది' అని భార్యతో అంటాడు. పండోరా గ్రహమే లేకపోతే పండంటి కోట ఎక్కడుంటుంది. ఇలా పర్యావరణం గురించి కాక కుటుంబం గురించి డైలాగు వచ్చిన ప్రతి సారీ భావజాలాన్ని దాచే కామెరూన్ తాపత్రయం బయటపడుతూంటుంది. కుటుంబం గురించి కాదు- తీయాల్సిన సినిమా వనరుల దోపిడీ గురించి! సముద్ర జీవుల్ని, తిమింగలాల్నీ కూడా విచ్చలవిడిగా చంపేస్తూ చూపించారు.

ఇక కథనం విషయానికొస్తే, హీరో విలన్ మీద ఎదురుదాడి చేసి కుటుంబంతో వేరే ద్వీపానికి చేరుకునే సరికి గంట సినిమా గడుస్తుంది. అక్కడ కొత్తగా సముద్రగర్భంలో విహారం, జీవనం, ఓ తిమింగలంతో స్నేహం- ఈ మూడు అంశాలే సుమారు గంటన్నర సేపు కథ లేకుండా సాగుతాయి. చివరి 45 నిమిషాల్లో విలన్ బృందం దిగడంతో క్లయిమాక్స్ యాక్షన్ మొదలవుతుంది. ఇలా ప్రారంభంలో కథ ప్రారంభించి వదిలేశాక, క్లయిమాక్స్ లోనే ప్రారంభించిన కథ వచ్చి కలుస్తుంది. మధ్యలో గంటన్నర పాటు కథలేని సముద్ర విహారాలే వుంటాయి.

ఇంకోటేమిటంటే, హీరో విలన్ కి ఏదో నష్టం చేసి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు. మళ్ళీ విలన్నీ ఎదుర్కొనే ఆలోచనే లేదు. అస్త్రసన్యాసం చేసి వెళ్ళిపో

యాడు. అలాంటప్పుడు విలన్ పగబట్టి చంపాలని ఎందుకు వెతకాలి. ఇలా హీరో పాత్ర చిత్రణ, విలన్ పాత్ర చిత్రణ రెండూ కన్విన్సింగ్ గా లేవు. హీరో గ్రహాన్ని కాపాడుకోవడం కోసం నిలబడితే కథనంలో, పాత్ర చిత్రణల్లో తప్పులు తొలగిపోతాయి.

కాబట్టి కథ పట్టించుకోకుండా, కథ లేకపోయినా విసుక్కోకుండా కనువిందు చేసే విజువల్ వండర్ గా దీన్ని ఆనందించవచ్చు. ఎమోషన్స్ లేని విజువల్ వండర్ గా గుర్తుంచుకోవచ్చు. కామెరూన్ కంటెంట్ విషయంలో 'అలిటా' తో పట్టు కోల్పోవడంతోనే 'అవతార్ 2' పై అనుమానం కలిగింది. ఇది నిజమైంది.

సాంకేతిక ప్రతిభ

కామెరూన్ తన శ్రమనంతా మునుపెన్నడూ లేని అద్భుత సాంకేతిక మాయాజాల సృష్టి మీద పెట్టాడు. ప్రామాణిక 24fpsకి, హై-ఫ్రేమ్-రేట్ 48fps కూడా జతచేసిన కెమెరా వర్క్ తో మరిచిపోలేని విజువల్స్ సృష్టించాడు. ఛాయాగ్రాహకుడు రస్సెల్ కార్పెంటర్ దీని వెనుక హస్తం. ఒక అందమైన దృశ్యకావ్య ఫీల్ ఈ సైన్స్ ఫిక్షన్ తో అందించాడు కామెరూన్. అతనెప్పుడూ విజువల్స్ కి మాస్టరే. ఏది సీజీ, ఏది నిజం తెలియనంతగా పాత్రలు, ప్రదేశాలు కలిసిపోయాయి. అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ సహా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దివ్యంగా దృశ్యమానమయ్యాయి. జస్ట్ ఇది మాటలకందని విజువల్ మ్యాజిక్ అంతే, సంగీతాన్ని కలుపుకుని.

First Published:  16 Dec 2022 9:08 AM GMT
Next Story