Telugu Global
Cinema & Entertainment

Mosagallaku Mosagadu: హౌస్ ఫుల్స్ తో వస్తున్నాడు మోసగాళ్లకు మోసగాడు!

Mosagallaku Mosagadu Movie: పాత సినిమాల రీరిలీజుల ట్రెండ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఈ నెల 31 వ తేదీ విడుదలవుతోంది.

Mosagallaku Mosagadu: హౌస్ ఫుల్స్ తో వస్తున్నాడు మోసగాళ్లకు మోసగాడు!
X

Mosagallaku Mosagadu: హౌస్ ఫుల్స్ తో వస్తున్నాడు మోసగాళ్లకు మోసగాడు!

పాత సినిమాల రీరిలీజుల ట్రెండ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఈ నెల 31 వ తేదీ విడుదలవుతోంది. మే 31 హీరో కృష్ణ జయంతి సందర్భంగా నివాళిగా ఈ పునర్ విడుదల. 52 ఏళ్ళ క్రితం ఆగస్టు 27, 1971 న విడుదలైన, పద్మాలయా బ్యానర్ పై కృష్ణ నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఆనాడే పానిండియా కాదు, తొలి పాన్ వరల్డ్ మూవీగా పెను సంచలనం సృష్టించింది.


జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో, కౌబాయ్ హీరోగా కృష్ణ నటించిన ఈ ఔట్ డోర్ యాక్షన్- ఇటు ఒకవైపు తెలుగు ప్రేక్షకుల్ని శత దినోత్సవం దాకా ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని అటు నూట పాతిక దేశాల్లో ‘ట్రెజర్ హంట్’ గా డబ్బింగై రికార్డులు సృష్టించింది! ఇదీ పాన్ వరల్డ్ దెబ్బ అంటే!


‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదలై రెండు తరాలు గడిచిపోయాయి. మూడో తరం నడుస్తోంది. కనీసం రెండు తరాల ప్రేక్షకులు దీన్ని చూసి వుండరు. చూసి వుంటే కొందరు బుల్లి తెర మీద చూసి వుండొచ్చు. ఇప్పుడు 1971 తర్వాత మళ్ళీ వెండి తెర మీద చూసే భాగ్యం ఇప్పుడే లభిస్తోంది. రీమాస్టర్ చేసిన, డోల్బీ సౌండ్ తో 4 కే రిజల్యూషన్ తో థ్రిల్ చేసేందుకు అప్ గ్రేడ్ అయి విడుదలవుతోంది.

‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ (1965), ‘ది గుడ్, ది బాడ్ అండ్ ది అగ్లీ’ (1966),’మెకెన్నాస్ గోల్డ్’ (1969) వంటి హాలీవుడ్ క్లాసిక్స్ నుంచి ప్రేరణ పొంది హీరో కృష్ణ చేసిన ప్రయోగమిది. తెలుగు నేలపై గుర్రాల మీద తిరుగుతూ ఎవరూ కన్పించరు. మరి దీన్ని సినిమాగా తీసి ఎలా ఒప్పించాలి? అమెరికన్ కౌబాయ్ లు తెలుగునాట తుపాకులు పేలుస్తూ ఎలా తిరుగుతారు? తిరిగేలా చేసి ఒప్పించారు ప్రసిద్ధ కవి, రచయిత ఆరుద్ర. ‘ఏక్ నిరంజన్ ‘ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపిస్తే నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా, తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు. అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ‘ఓన్’ చేసేసుకున్నారు!

దురదృష్టవశాత్తూ ఇందులో నటించిన నటీనటులెవరూ జీవించి లేరు జ్యోతిలక్ష్మి తప్ప. హీరో హీరోయిన్లు కృష్ణ, విజయనిర్మల సహా భారీగా కొలువుదీరిన తారాగణంలో గుమ్మడి, సత్యనారాయణ, ముక్కామల, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, రావు గోపాలరావు, త్యాగరాజు, జగ్గారావు, నగేష్ వంటి దివంగత నటీనటుల్ని మళ్ళీ ఒకసారి నిండుగా వెండి తెర మీద చూసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ రీరిలీజ్.

1966-2000 మధ్య 112 యాక్షన్ సినిమాలకి దర్శకత్వం వహించిన కె ఎస్ ఆర్ దాస్ టెక్నికల్ గా దీన్ని హాలీవుడ్ కి సమానా స్థాయిలో నిబట్టేందుకు కృషి చేశారు. సరికొత్త యాంగిల్స్ లో చిత్రీకరించిన వీఎస్ ఆర్ స్వామి కెమెరా వర్క్ ఆనాడు చర్చనీయాంశమైంది. పి. ఆదినారాయరావు సంగీతంలో 5 పాటలున్నాయి. కృష్ణని ఎడారిలో కట్టి పడేసి- నాగభూషణం ఎంజాయ్ చేసే- ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా సాంగ్ ఇప్పుడూ ఎంజాయ్ చేయవచ్చు.

పద్మాలయా బ్యానర్ పై కృష్ణ సోదరులు జి. ఆదిశేషగిరి రావు, జి. హనుమంతరావు నిర్మాతలు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో కూడా బుకింగ్స్ భారీగా వున్నాయి. ఇటీవల రీరిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘సింహాద్రి’ వసూళ్లని కూడా ‘మోసగాళ్లకు మోసగాడు’ క్రాస్ చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ స్వర్గం నుంచి కూడా సూపర్ స్టారే!!



First Published:  29 May 2023 7:04 AM GMT
Next Story