Telugu Global
Cinema & Entertainment

పరాయి హిట్‌లతోనే మాలీవుడ్ మనుగడ?

కేరళలో కోవిడ్ లాక్ డౌన్ ల తర్వాత తిరిగి ప్రారంభమయిన సినిమా థియేటర్లు రెండేళ్ళుగా ఆడించుకోవడానికి తగిన మలయాళ సినిమాలు లేక వెలవెలబోతూ వున్నాయి.

పరాయి హిట్‌లతోనే మాలీవుడ్ మనుగడ?
X

కేరళలో కోవిడ్ లాక్ డౌన్ ల తర్వాత తిరిగి ప్రారంభమయిన సినిమా థియేటర్లు రెండేళ్ళుగా ఆడించుకోవడానికి తగిన మలయాళ సినిమాలు లేక వెలవెలబోతూ వున్నాయి. ఈ సంవత్సరం ఓనం పండక్కే థియేటర్లు తిరునాళ్ళ లాగా కళకళ లాడాయి. అదీ మలయాళం సినిమాలతో కాదు, బయటి హిట్స్ తో. దీంతో కేరళ సినిమా థియేటర్ యజమానులు ఉల్లాసంగా ఓనం జరుపుకున్నారు. నిజానికి సినిమా థియేటర్ యజమానుల అదృష్టం నాలుగు డల్ గా సాగిన ఓనం సీజన్ల తర్వాత వచ్చింది. ఈ సంవత్సరం ఓనం పండుగ ఉత్సవాలు ఆగస్టు 20-31 మధ్య జరుపుకున్నారు. తమిళంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ ఆగస్టు 10 న విడుదలైంది. ఇదే ఓనం పండగకి కూడా పెద్ద ఉత్సాహాన్ని నింపింది.

ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఫెయువోక్) గణాంకాల ప్రకారం, ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ రోజుల తరబడి హౌస్‌ఫుల్ షోలతో నడుస్తూ ఓనం పండక్కి కూడా కనకవర్షం కురిపించింది. మలయాళం డబ్బింగుగా విడుదలైన ‘జైలర్’ గ్రాస్ కలెక్షన్ రూ. 50 కోట్లని దాటింది. ఇవి కేరళలో విడుదలైన మలయాళయేతర సినిమాల వసూళ్ళలో అత్యధిక వసూళ్ళు.

అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ మలయాళ వెర్షన్, ‘కేజీఎఫ్2’ మలయాళ వెర్షన్ రెండూ గత సంవత్సరం విడుదలయ్యాయి. ఇవి ఒకొక్కటి రూ 40 కోట్లకి పైగా వసూలు చేశాయి. ఈ సంవత్సరం మలయాళ సినిమాల పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో ‘రోమాంచమ్’, మేలో ‘2018’ రెండు విజయాల తర్వాత, ఆగస్టు 25 న ఓనం కి విడుదలైన ‘ఆర్డీక్స్’ హిట్టయింది. కానీ ఆగస్టు 24 న విడుదలైన దుల్కర్ సల్మాన్ పెద్ద సినిమా ‘కింగ్ ఆఫ్ కోతా’ తోబాటు మరో మూడు చిన్న సినిమాలు ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 న విడుదలైన మమ్ముట్టి నటించిన ‘కన్నూర్ స్క్వాడ్’ మాత్రమే హిట్టయ్యింది. అంటే ఈ సంవత్సరం అక్టోబర్ వరకూ కేవలం 4 మలయాళం సినిమాలే హిట్టయ్యాయి. విడుదలైన సినిమాలు మాత్రం 150 పైనే వుంటాయి.

‘జైలర్’ విడుదలకి ముందు కేరళలోని చాలా థియేటర్లు తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వాటిలో కొన్ని మూసివేత ముప్పులో కూడా పడ్డాయి. కానీ ‘జైలర్’ హిట్ కారణంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది మొత్తం 177 సినిమాలు విడుదలైతే కొన్ని మాత్రమే లాభాల్ని ఆర్జించాయి. ఈ సంవత్సరం విడుదలలు మరింత ఎక్కువయ్యాయి. ఆగస్టు చివరి వరకు ఈ ఏడాది మొత్తం 150 మలయాళ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో నాలుగే హిట్టయ్యాయి.

మలయాళ ప్రేక్షకుల అభిరుచులు బాగా మారిపోయాయని అక్కడ భారీ స్థాయిలో హిట్టవుతున్న పరభాషా బిగ్ బడ్జెట్ సినిమాలే నిరూపిస్తున్నాయి. రజనీకాంత్ ‘జైలర్’ కి ముందు జనవరిలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కూడా భారీ కలెక్షన్లు కురిపించింది. తొలి వారంలోనే రూ. 9.4 కోట్లు వసూలు చేసింది. సెప్టెంబర్ లో విడుదలైన షారుఖ్ ఖాన్ ‘జవాన్’ కూడా రెండు వారాల్లో రూ. 12.9 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్ లో దసరాకి విడుదలైన విజయ్ నటించిన తమిళం ‘లియో’ అయితే నిన్నటితో ఒక వారంలోనే రూ. 40 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పర్చింది!

అంటే కేరళలో మలయాళ సినిమాల కంటే పరభాషా పెద్ద బడ్జెట్ సినిమాలే హిట్టవుతున్నాయి. ప్రేక్షకులు వీటినే అదరిస్తున్నారు. తమిళం, హిందీ, కన్నడతో బాటు తెలుగు సినిమాలు కూడా కేరళలో ఈ రెండు సంవత్సరాలుగా రాజ్యమేలుతున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’, ‘పుష్ప’ తెలుగు పానిండియాలు ఈ లిస్టులో వున్నాయి. మాలీవుడ్ (మలయాళ సినిమా పరిశ్రమ) రూ. 100 కోట్లు చవిచూసిన మలయాళ సినిమా అందించి ఏడేళ్ళూ గడిచిపోయాయి. 2016 లో మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ రూ. 100 కోట్లు దాటి వసూలు చేసిన మొదటి మలయాళ సినిమాగా నిలబడింది. ఆ తర్వాత ఈ సంవత్సరం ‘2018’ భారీగా రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఈ రెండూ తప్ప మరో మలయాళ సినిమా రూ. 100 కోట్ల మార్కుని టచ్ చేయలేకపోయింది.

మలయాళ సినిమాలు వాటి విభిన్నమైన, ప్రత్యేకమైన కంటెంట్‌ కి ప్రసిద్ధి చెందాయి నిజమే. ఈ ప్రత్యేకతనే నిలబెట్టుకోలేక పోతున్నాయి. ఈ ప్రత్యేకతని నిలబెట్టుకుని విజయవంతంగా కొనసాగింది కూడా ఇతర భాషల సినిమాల తాకిడి లేని కాలంలోనే. కోవిడ్ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ పానిండియాల తాకిడి పెరగడంతో తట్టుకుని నిలబడడానికి అసలంటూ పేరుబడ్డ మలయాళ వైవిధ్యన్నే ప్రదర్శించడం లేదు. ఎవరెవరో వచ్చేసి వందల సంఖ్యలో ఏవేవో పనికి మాలిన సినిమాలు తీసి వెళ్ళిపోతున్నారు.

దీంతో ఏర్పడ్డ శూన్యాన్ని పరభాషా సినిమాలు భర్తీ చేస్తున్నాయి. బిగ్ స్టార్స్ తో, తళుకుబెళుకుల గ్లామర్ హీరోయిన్లతో, ఇంకా బిగ్ కాన్వాస్ తో, తెలుగు తమిళ హిందీ కన్నడ సినిమాల్లాగా, వందల కోట్ల బడ్జెట్లతో భారీ కమర్షియల్ సినిమాలు తీస్తే స్థోమత మలయాళంలో లేదు. ప్రేక్షకులు వీటికి ఆకర్షితులై పోతున్నారు. ఇక మలయాళ వైవిధ్యం, ప్రత్యేకత కాలం చెల్లిన పదాలైపోయాయి.

ఇక నవంబర్, డిసెంబర్ లలో షారుఖ్ ఖాన్ ‘డుంకీ’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, రణబీర్ కపూర్ ‘యానిమల్’, వెంకటేష్ ‘సైంధవ్’, ప్రభాస్ ‘సాలార్’, కార్తీ ‘జపాన్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’... వచ్చే 2024 ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున్ “పుష్ప2’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, కమల్ హాసన్ ‘ఇండియన్2’, సూర్య ‘కంగువ’, విక్రమ్ ‘తంగలన్’, ప్రభాస్ ‘కల్కి -2898 ఏడీ’ పానిండియాలు కూడా వచ్చి కేరళలో పడితే భయానకంగా వుంటుంది మాలీవుడ్ పరిస్థితి!

First Published:  25 Oct 2023 9:25 AM GMT
Next Story