Telugu Global
Cinema & Entertainment

Tillu Square | టిల్లూతో అలా జోడీ కుదిరింది

Tillu square - మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్, ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు.

Tillu Square | టిల్లూతో అలా జోడీ కుదిరింది
X


యూత్ లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటి. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఇప్పుడు 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ గా 'టిల్లు స్క్వేర్' వస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‌ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్, ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు.

"సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నా మొదటి సినిమా నరుడా డోనరుడా. ఆ తర్వాత అద్భుతం అనే సినిమా చేశాను. మధ్యలో పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ కూడా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. డీజే టిల్లు, అద్భుతం సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు."

అద్భుతం సినిమాకి కూడా కథ తనది కాదని.. ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథకు తను దర్శకత్వం వహించానని.. ఇక నరుడా డోనరుడా కూడా రీమేక్ అని స్పష్టం చేశాడు మల్లిక్ రామ్. కాబట్టి మరో దర్శకుడు తీసిన సినిమా డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ తీయడానికి తనకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదంటున్నాడు.

First Published:  22 March 2024 4:15 PM GMT
Next Story