Telugu Global
Cinema & Entertainment

విజయ పరంపరలో మలయాళ వెబ్ సిరీస్

మలయాళంలో వెబ్ సిరీస్ జోరందుకుంటున్నాయి. ప్రేక్షకులు వెబ్ సిరీస్ ల మీద వూహించని క్రేజ్ ని పెంచుకుంటున్నారు.

విజయ పరంపరలో మలయాళ వెబ్ సిరీస్
X

మలయాళంలో వెబ్ సిరీస్ జోరందుకుంటున్నాయి. ప్రేక్షకులు వెబ్ సిరీస్ ల మీద వూహించని క్రేజ్ ని పెంచుకుంటున్నారు. ఇది చూసి సినిమాలు రిస్కు అనుకుంటున్న నిర్మాతలు వెబ్ సిరీస్ కోసం మరింత స్వేచ్చతో, మరింత ఆకర్షణనీయమైన కంటెంట్ ని అందించేందుకు ముందుకొస్తున్నారు. వచ్చే నెల కేరళ ప్రభుత్వమే సొంత ఒటీటీని ప్రారంభిస్తున్న తరుణంలో వెబ్ సిరీస్ కి డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో నిర్మాతలు ఉత్సాహంగా వున్నారు. నిర్మాతలే కాదు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు, డబ్బింగ్, ఎడిటింగ్ థియేటర్ల యజమానులూ ఈ ఆకస్మిక అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. గత సంవత్సరం స్ట్రీమింగ్ అయిన ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ అనే క్రైమ్ సిరీస్ కి లభించిన విశేష ఆదరణ ఈ కొత్త పరిణామానికి దారితీసింది.

ఇప్పుడు 2024లో మరిన్ని మలయాళ వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోకి రావడానికి సిద్ధంగా వున్నాయి. సినిమాలకుండే పరిమితుల్ని దాటి వైవిధ్య కనెంట్ ని అందించే మేకర్స్ కి పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఇష్ఠపడుతున్నారు. వెబ్ సిరీస్ కే కాకుండా వివిధ షోలకీ ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తున్న నేపథ్యంలో, తాజాగా కామెడీ డ్రామా షో ‘పెరిల్లూర్’ ప్రీమియర్ లీగ్ ఈ సంవత్సరం మలయాళ షోగా అలరిస్తోంది. మరో మూడు నుంచి నాలుగు షోలు శరవేగంగా తయారవుతున్నాయి.

అసలు కోవిడ్ మహమ్మారి సమయంలోనే ప్రేక్షకులకి వెబ్ సిరీస్ ల పట్ల మోజు పెరిగిందని అంటున్నారు. అప్పట్నుంచే మరిన్ని సిరీస్‌లని నిర్మించాలనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ఆసక్తి, మలయాళంలో మరిన్ని సిరీస్ లని రూపొందించడానికి నిర్మాతల్ని ప్రేరేపించిందని అంటున్నారు, వెబ్ సిరీస్ పట్ల పెరుగుతున్న జనాదరణ వెనుక వున్న ఒక ప్రధాన కారణమేమిటంటే, మౌలికంగా ఓటీటీలే పూనుకుని వాటిని ప్రోత్సహించడం. ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ ని జూన్ 2023లో డిస్నీ+హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్ చేయడం ఈ ఒరవడిలో ఒక మలుపు.

ఈ వెబ్ సిరీస్ కథ 2011లో జరుగుతుంది. స్థానిక లాడ్జి లోని రిసెప్షనిస్ట్ గదిలో ఒక సెక్స్ వర్కర్ మృతదేహాన్ని గుర్తించినప్పుడు ఇదంతా ప్రారంభమవుతుంది. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కురియన్ అవరన్ (లాల్), సబ్-ఇన్‌స్పెక్టర్ మనోజ్ శ్రీధరన్ (అజూ వర్గీస్) లు కలిసి ఐదుగురు పోలీసు అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తారు. హత్య కేసు దర్యాప్తు క్రమంలో వాళ్ళకి అనుమానితుల నకిలీ పేర్లు, నకిలీ చిరునామాలు మాత్రమే దొరుకుతాయి. ఈ ప్రతికూల పరిస్థితిని ఎలా అధిగమించి కేసుని ఛేదించారనేది థ్రిల్లింగ్ గా సాగే కథ. దీనికి అహ్మద్ కబీర్ దర్శకత్వం. రెండవ సీజన్ నిర్మాణంలో వుంది.

దేశంలో మొదటి వెబ్ సిరీస్ 2015లో ప్రారంభమైంది. ఇప్పుడు ఎనిమిదేళ్ళ తర్వాత 2023 లో మలయాళంలో వెబ్ సిరీస్ శకం ప్రారంభమైంది. ఇటీవల ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు ప్రజాదరణ పొందడం వెనుక ప్రేక్షకుల ఆదరణతో పాటు, ఓటీటీ ల నుంచి లభిస్తున్న ప్రచారం, మద్దతూ దన్నుగా వున్నాయి. ఓటీటీలు రెండవ శ్రేణి నగరాలకు విస్తరిస్తూండడంతో, ప్రాంతీయ భాషల్లో మరిన్ని వెబ్ సిరీస్‌లని లైబ్రరీలో కలిగి వుండడం వల్ల చందాదారుల్ని చేర్చుకోవడం సులభమవుతుందని, నాణ్యమైన వెబ్ సిరీస్ కంటెంట్‌కి ఓటీటీలు సినిమాలకంటే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయనీ నిర్మాతలు భావిస్తున్నారు.

వెబ్ సిరీస్‌లకి కూడా ఎక్కువ జీవితకాలం వుంటుంది. ఎలాగంటే వేస్ సిరీస్ లు చాలా వరకు అనేక సీజన్స్ ని కలిగి వుంటాయి. కనుక రెండవ సీజన్ విడుదలైనప్పుడు, ప్రేక్షకులు మొదటిదాన్ని మళ్ళీ చూడవచ్చు జరిగిన కథ కోసం. ఇది వీక్షకుల సంఖ్య ని, వీక్షణ సమయాన్నీ పెంచుతుంది. ఇలా పెరిగే జీవితకాలం ఓటీటీలతో బాటు నిర్మాతలకూ ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేగాక, మొదటి సీజన్ హిట్ అయితే, రెండవ సీజన్ కి అంత మార్కెటింగ్ అవసరం లేదు. ఖర్చులు ఆదా అవుతాయి.

ఇక వెబ్ సిరీస్ తో కళాకారులకి మంచి స్పేస్ లభిస్తుంది. కళా పోషణతో ముద్ర వేయడానికి ఎక్కువ స్క్రీన్ సమయం లభిస్తుంది. అలాగే, సిరీస్ వివిధ భాషల్లో ప్రసారమైతే కళాకారులకి పాన్-ఇండియా వరకూ మైలేజీ పెరుగుతుంది. కళాత్మకంగా సంతృప్తి, కెరీర్ పరంగా అవకాశాలూ పెరుగుతాయి.

ఇంతకి ముందు, చాలా మలయాళ వెబ్ సిరీస్‌లు కామెడీ జానర్‌లో వచ్చాయి. ఇప్పుడు హార్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా షోలూ వస్తున్నాయి. ఇలా మలయాళ వెబ్ సిరీస్‌లు అడ్డంకుల్ని బద్దలు కొట్టి ముందుకు వెళ్తున్న తీరుని ప్రపంచం గమనిస్తోంది.



First Published:  15 Feb 2024 11:39 AM GMT
Next Story