Telugu Global
Cinema & Entertainment

నెలకు 20 సినిమాలు రిలీజ్ చేస్తే ఎలా?

ఈ ఏడాది ఏప్రిల్ వరకూ నాలుగు నెలల కాలంలో 80 సినిమాలు విడుదలయ్యాయి. అంటే నెలకి 20 సినిమాలు, వారానికి 5 సినిమాలు. వీటిలో హిట్టయినది ఒకే ఒక్కటి! దీన్నిబట్టి పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

Malayalam Movies: How about releasing 20 movies per month?
X

నెలకు 20 సినిమాలు రిలీజ్ చేస్తే ఎలా?

మాలీవుడ్ పెరుగుట విరుగుట కొరకే సామెతను నిజం చేయబోతోందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇలాగే వుంది. థియేటర్ల మీద తీసుకున్న బ్యాంకు రుణాలు కట్టలేక చేతులెత్తేస్తున్న యాజమానుల కథలు వార్తలుగా వస్తున్నాయి. సినిమా హాళ్ళు జప్తు అవుతున్నాయి. మరో వైపు కుప్ప తెప్పలుగా మలయాళ సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకి దేశవ్యాప్తంగా ఏదో గుర్తింపు వచ్చేసిందని, ఓటీటీ మార్కెట్ కూడా చాలా బావుందని విచ్చలవిడిగా సినిమాలు తీసి పడేస్తున్నారు. ఇన్ని సినిమాలు చూడలేక జనాలు థియేటర్లకే పోవడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ నాలుగు నెలల కాలంలో 80 సినిమాలు విడుదలయ్యాయి. అంటే నెలకి 20 సినిమాలు, వారానికి 5 సినిమాలు. వీటిలో హిట్టయినది ఒకే ఒక్కటి! దీన్నిబట్టి పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

అసాధారణమైన నాణ్యతకి పేరుగాంచిన మలయాళ సినిమాలు ఇప్పుడు లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ ఎదుర్కొన్న అదే కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్ సినిమాల కథలు మార్పులేనివిగా మారాయని ఓ వాదన కూడా వుంది. అయితే ఈ రోజుల్లో అలాంటి ప్రచారాలు లేకుండానే మలయాళం సినిమాలు వరుసగా థియేటర్లలో పరాజయం పాలవుతున్నాయి. అలాగే, ఈ సినిమాలు కూడా మార్పులేనివిగా మారుతున్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మలయాళ సినిమాలు వరుసగా థియేటర్లలో పరాజయం పాలవుతున్నాయి. ఇక్కడి సినీ సంఘాల లెక్కల ప్రకారం 2023 మొదటి నాలుగు నెలల్లో 80 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో విడుదలైన ‘రోమాంచం’ సినిమా మాత్రమే లాభాల్ని ఆర్జించింది. ఫ్లాప్ అయిన సినిమాల జాబితాలో ప్రముఖ సూపర్‌స్టార్లు నటించిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ వున్నాయి. నిర్మాతలకు, థియేటర్ యజమానులకు భయంకరమైన దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం ఏమిటంటే, కఠినమైన కోవిడ్ పరిమితులతో 2022లో లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు తెరిచినప్పుడు, సినిమాలు ప్రదర్శించుకుని ఆర్జించిన ఆర్థిక లాభాలు ఇప్పుడు కనుమరుగైపోవడం!

తెలుగు, కన్నడ, తమిళం వంటి ఇతర దక్షిణాది పరిశ్రమలు ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త మార్కెట్లని కైవసం చేసుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూండగా, మలయాళ సినిమాలు మాత్రం ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించుకునేందుకే యాతన పడుతున్నాయి.

ఇక సూపర్ స్టార్స్ సహా నటీనటులందరూ తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కోరేదాకా పరిస్థితి వెళ్లింది. ఒక నిర్మాత తాను కోట్ల పెట్టుబడి పెట్టిన సూపర్ స్టార్ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే మొత్తం లక్షా 60 వేలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయని వాపోయాడు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే దాని విజయాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేస్తారు. ఇప్పుడు కేకులు కాదుకదా కాఫీలకి కూడా డబ్బుల్లేవు.

కారణాల తోరణాలు

మలయాళ సినిమాల పరాజయానికి, హాళ్లలో ప్రేక్షకులు లేకపోవడానికీ నిర్మాతలు, మరో వైపు ప్రేక్షకులు వివిధ కారణాలని ఆపాదిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన 30 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు విడుదల కావడం, విడుదలైన మొదటి రోజునే యూట్యూబ్‌లో సినిమాల్ని సమీక్షించే రివ్యూ కర్తలూ కారణమని థియేటర్ యజమానులు ఆరోపిస్తున్నారు. యూట్యూబ్ లో సినిమా రివ్యూలు చెప్పే కల్చర్ ఈ మధ్య ప్రారంభమైంది. అదే రోజు మధ్యాహ్నం కల్లా వెబ్సైట్లలో రివ్యూలు రావడం వేరు. అవి నెటిజనులు మాత్రమే చూస్తారు. కానీ యూట్యూబ్ లో బస్తీల్లో మాస్ ప్రేక్షకులు కూడా చూసేస్తారు. ఇక ఫీల్ గుడ్ పేరుతో తీస్తున్న సినిమాల్లో వాస్తవికత అతిగా వుంటూ బోరు కొట్టిస్తోందని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. యాక్షన్, కామెడీ, హారర్, ఫ్యామిలీ డ్రామా సినిమాలే కాకుండా ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల్లో వాస్తవికతని అతి చేసి సోషల్ మీడియాలో వెక్కిరింపులకి గురవుతున్నారు మలయాళ దర్శకులు. ఈ వాస్తవికత పైత్యంగా మారింది.

సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన 30 రోజుల్లోనే వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విడుదల చేయడాన్ని థియేటర్ యజమానులు విమర్శిస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లలో రన్ అవుతూనే ఓటీటీ లో విడుదలయ్యే విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. మొత్తం కలిపి థియేట్రికల్, ఓటీటీ విడుదలలు నియంత్రణ లేకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

థియేటర్లలో సినిమాలు ఫెయిల్ కావడానికి ఇంకో కారణం, వాటిలో రియల్ కంటెంట్ లేక, వెండితెరపై దర్శకులు తమకు వ్యక్తిగతంగా తెలిసిన జీవితాన్ని చూపిస్తూంటే పరమ బోరు కొడుతోందని ప్రేక్షకుల వాదన.

పానిండియా లేని పేదరికం

మలయాళంలో పానిండియా సినిమాలు అందించలేని పేదరికం కూడా వుంది. సృజనాత్మకత పరంగా పేదరికం. ఇతర దక్షిణ భారత భాషల్లో లాగా మాలీవుడ్‌లో విడుదలైన పాన్-ఇండియా సూపర్‌హిట్ సినిమాలనేవీ లేవు. మాలీవుడ్ ఇతర పరిశ్రమల తరహాలో వందల కోట్ల క్లబ్‌లలో స్థానం సంపాదించాలంటే మలయాళంలో అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు వుండాలనే వాదన బలంగా వినిపిస్తోంది. దేశంలోని రీమేక్ సినిమాల్లో ఎక్కువ భాగం బహుశా మలయాళ పరిశ్రమకి చెందినవే. అలాటి మలయాళ సినిమాల నాణ్యత, తారల అద్భుత నటనా నైపుణ్యం ఇప్పుడు కాగడా వేసి వెతికినా కనపడవు. అందుకే పానిండియా సినిమాల కొరత.

నిజానికి మాలీవుడ్ భాషా పరిధుల్ని దాటి విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి వుంది. ఈ మధ్యకాలంలో ఇది పూర్తిగా విస్మరించారు దర్శకులు. లోకల్ కంటెంట్ తో వ్యక్తిగత అనుభవాల్ని సినిమాలుగా తీస్తూ చాదస్తనికి పోతున్నారు. ఇలా ఒకప్పటి లాగా కేరళని దాటించి మలయాళ సినిమాల్ని తీసికెళ్ళ లేకపోతున్నారు.

ఇక రుణాలు చెల్లించడంలో విఫలమవడంతో ఐదు సినిమా హాళ్ల ఆస్తుల్ని బ్యాంకులు జప్తు చేశాయి. మరో 15 సినిమా హాళ్లని ఆర్థిక సంస్థలు స్వాధీనం చేసుకునే పరిస్థితిలో వున్నాయి. రుణాలు తీసుకున్న థియేటర్ యజమానుల్లో 25 శాతం మంది మాత్రమే చెల్లించగలిగారు. నిర్మాణ, ప్రదర్శన రంగాలు రెండూ ఇలా సంక్షోభంలో వుండగా, 80 సినిమాల్లో ఒకటే హిట్టిచ్చినా కూడా ఎవరికివారే యమునా తీరే అని విచ్చలవిడిగా తీసి మార్కెట్లో గుమ్మరిస్తూనే వున్నారు. రేపు మే 5 న నాల్గు విడుదలవుతున్నాయి.

First Published:  4 May 2023 6:30 PM GMT
Next Story