Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు విల్బర్ స్మిత్ నవలల హీరో అయ్యాడు!

ఇంతకీ ఏమిటా విల్బర్ స్మిత్ నవల? ఒక నవల కాదు, ఎనిమిది నవలల సిరీస్. చాలా పెద్ద కథ. అందుకని ఇది రెండు భాగాల సినిమాగా వస్తోంది.

మహేష్ బాబు విల్బర్ స్మిత్ నవలల హీరో అయ్యాడు!
X

ఇంకా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకముందే కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబుతో ఎస్. ఎస్. రాజమౌళి సినిమా గురించి లీకులు వచ్చాయి. లాక్ డౌన్ విరామంలో మహేష్ సినిమా కథ వండుతున్నట్టు రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఆ కథేమిటో చెప్పకుండా, ‘ఇంకా అన్వేషిస్తూనే వున్నాను. రాజమౌళి నేనూ విల్బర్ స్మిత్‌కి పెద్ద ఫ్యాన్స్. ఆఫ్రికా అడవుల్లో బిగ్ కాన్వాస్ మీద అడ్వెంచరస్ కథగా వుంటుంది’ అని మాత్రం చెప్పారు. పోను పోనూ వివరాలు బయటికొస్తూ మొత్తం మీద ఇప్పుడు స్క్రిప్టు సిద్ధమైందన్న వార్తలతో పూర్తి స్పష్టత వచ్చింది.

ప్రసిద్ధ రచయిత విల్బర్ స్మిత్ వేరే నవలలు హాలీవుడ్ సినిమాలుగా తీశారుగానీ ఎనిమిది నవలల సిరీస్ ని ఎవరూ ముట్టుకోలేదు. అలాంటిది తెలుగులో తలపెట్టడం గ్లోబల్ న్యూస్ అవుతోంది. తెలుగులో తలపెట్టినా ఇది గ్లోబల్ మూవీ కూడా అవుతోంది. అందుకని హాలీవుడ్ తో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ‘ఆర్ ఆర్ ఆర్’ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ అయినట్టు, ఇప్పుడు మహేష్ బాబు గ్లోబల్ స్టార్ హోదాని అందుకుంటున్నాడన్న మాట.

ఇంతకీ ఏమిటా విల్బర్ స్మిత్ నవల? ఒక నవల కాదు, ఎనిమిది నవలల సిరీస్. చాలా పెద్ద కథ. అందుకని ఇది రెండు భాగాల సినిమాగా వస్తోంది. విల్బర్ స్మిత్ నాలుగు శతాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ ప్రమేయం గురించి హిస్టారికల్ ఫిక్షన్ రాసిన దక్షిణాఫ్రికా నవలా రచయిత. కాబట్టి కథా వస్తువు ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వివక్ష, దాన్ని ఎదుర్కొనే సాహస గాథగా వుంటుంది.

దక్షిణాఫ్రికాలోని జాంబియాలో జన్మించిన విల్బర్ స్మిత్, ఆఫ్రికన్ ఖండంలో సాహసాల గురించి ఎక్కువ రాశాడు. రాజమౌళి తీస్తున్న కథ విల్బర్ స్మిత్ రాసిన బా లంటైన్ నవలల పేరుతో సిరీస్ కి చెందినది. బాలంటైన్ నవలలు రోడేషియా (ఇప్పుడు జింబాబ్వే) చారిత్రక పరిణామాలకి వ్యతిరేకంగా 1860ల నుంచి 1980ల వరకూ పోరాటం చేసిన బాలంటైన్ వంశపు జీవితాల్ని చిత్రిస్తాయి. కాల్ ఆఫ్ ది రేవెన్ (1800), ఏ ఫాల్కన్ ఫ్లయిస్ (1860), మెన్ ఆఫ్ మెన్ (1870-1890), ది ట్రయంఫ్ ఆఫ్ ది సన్ (1884), కింగ్ ఆఫ్ కింగ్స్ (1887), ది ఏంజెల్స్ వీప్ 1వ భాగం (1890), 2వ భాగం (1977), ది లెపర్డ్ హంట్స్ ఇన్ డార్క్ నెస్ (1980). ఈ 8 నవలల్ని 1980- 2020 మధ్య రాశాడు. 1933 లో జన్మించిన విల్బర్ స్మిత్ 2021 లో మరణించాడు. ఈ సమయంలో విజయేంద్ర ప్రసాద్ కథ వండుతున్నారు. ఇటీవలే నవలల హక్కులు తీసుకున్నారు. అయితే అవెన్ని నవలలో తెలీదు.

శాంపిల్ గా ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ కథ చూస్తే- ఇందులో ప్రేమ, ద్రోహం, ధైర్యం, యుద్ధం చుట్టూ కథ వుంటుంది. 1887 లో కైరోలో ఒక అందమైన సెప్టెంబర్ సాయంకాలం పెర్నోడ్ బాలంటైన్, అతడి కాబోయే భార్య అంబర్ బెన్‌బ్రూక్, చేయి చేయీ పట్టుకుని షికారు చేస్తూంటారు. అందమైన భవిష్యత్తు అంతా తమదే.

కానీ పెర్నోడ్ మీద అసూయతో అతడి మాజీ ప్రేమికురాలు లేడీ అగథా, అతడి క్యారక్టర్ పై అంబర్ కి అనుమానాలు సృష్టిస్తుంది. దాంతో అంబర్ అతడ్ని విడిచిపెట్టి, తన కవల సోదరి సాఫ్రాన్ తో, ఆమె భర్త రైడర్ కోర్ట్నీతో కలిసి అబిస్సినియాకి ప్రయాణిస్తుంది. అక్కడ వెండి గనుల్ని ప్రారంభించే లక్ష్యంతో ముగ్గురూ కొత్త రాజధాని అడిస్ అబాబాకి ప్రమాదకరమైన ప్రయాణం కొనసాగిస్తారు. అక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్ మెనెలిక్ స్వాగతం పలుకుతాడు.

అటు కైరోలో పెర్నోడ్ బాలంటైన్, అంబర్ తనని వదిలేయడాన్ని తట్టుకోలేక మాదకద్రవ్యాలకి అలవాటు పడతాడు. ఇటాలియన్ ఆర్మీలో వున్న అతడి పాత స్నేహితుడు కాపాడి సైన్యంలో చేరమని కోరతాడు. ఈ నేపథ్యంలో ఇటలీ అబిసినియాపై దాడి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్టు పుకార్లు లేస్తాయి. ఇలా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరువైపులా పెర్నోడ్ బాలంటైన్, అంబర్ లు తిరిగి ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

అయితే ఈ సిరీస్ లోని కథల్ని తెలుగుకి ఎలా మార్చారో తెలీదు. ఇంతా చేసి ఈ కథ మహేష్ బాబు ఇంకా విననే లేదు. ఈ కాన్సెప్ట్ మాత్రం సామ్రాజ్యవాదుల దృక్పథాల నుంచి, తండ్రీ కొడుకుల మధ్య ఆవేశం వరకు, ఒక పురుషుడు తన విశ్వాసాలతో స్త్రీ కోసం ఎంతదూరం వెళ్తాడో అదీ, ఇంకా 19వ శతాబ్దపు ఆఫ్రికాని వణికించిన తరాలు- వాటి నాగరికతల విషాద ఘర్షణా, అక్కడ దేవుళ్ళ కోసం, తమ ముందుకి వచ్చిన మనుషుల కోసం పోరాడే యోధులూ వగైరాలతో నిండి వుంటుంది.

First Published:  15 Nov 2023 8:30 AM GMT
Next Story