Telugu Global
Cinema & Entertainment

మళ్లీ రాజుకున్న 'లైగర్' చిచ్చు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య నష్టాల భర్తీకి చిన్నపాటి ఒప్పందం కూడా కుదిరింది. కానీ ఇప్పుడీ రచ్చ మరోసారి తెరపైకొచ్చింది.

మళ్లీ రాజుకున్న లైగర్ చిచ్చు
X

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ సినిమా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. రిలీజైన ఏ ఒక్క ప్రాంతంలో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన మొదలైంది. ఆ వెంటనే యూనిట్ కూడా రంగంలోకి దిగింది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటామని నిర్మాతలు చార్మి, పూరి జగన్నాధ్ హామీ ఇచ్చారు.

దీంతో మేటర్ సెటిల్ అయిందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడీ రచ్చ మళ్లీ మొదలైంది. వరుస లీకులతో లైగర్ తెరవెనక వ్యవహారం కాస్తా తెరపైకొచ్చింది. కొన్ని గంటల కిందట డిస్ట్రిబ్యూటర్ వాట్సాప్ ఛాట్ గా చెప్పుకునే స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో లీకైంది.

27వ తేదీన లైగర్ డిస్ట్రిబ్యూటర్లంతా పూరి జగన్నాధ్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని, మిస్ అవ్వకుండా డిస్ట్రిబ్యూటర్లంతా హైదరాబాద్ రావాలి, ఓ 4 రోజులు ఉండేలా ఏర్పాట్లు చేసుకొని రావాలనేది ఆ వాట్సాప్ సందేశం. దీంతో కలకలం మొదలైంది.

దీనికి కొనసాగింపుగా, పూరి జగన్నాధ్ ఆడియోతో మరో క్లిప్ రిలీజైంది. ఆ క్లిప్ లో పూరి జగన్నాధ్ గొంతుతో సున్నితంగా డిస్ట్రిబ్యూటర్లను బెదిరించినట్టు వాయిస్ వినిపిస్తోంది. నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చామని, ఒకవేళ ఎవరైనా ఆందోళనకు దిగితే, అలాంటి వాళ్లకు పైసా ఇచ్చేది లేదని వార్నింగ్ ఇస్తూ ఆ వాయిస్ ఉంది. అలాంటి వాళ్ల లిస్ట్ ప్రిపేర్ చేస్తామని కూడా అందులో ఉంది.

దీంతో లైగర్ వివాదం మరోసారి రచ్చకెక్కింది. దీనిపై అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు పూరి జగన్నాధ్ ఎవ్వరూ ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం లేదు. మరోవైపు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ఓటీటీ సంస్థ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో, సదరు సంస్థలో కొన్ని ఉద్యోగులు ఊడిపోయే పరిస్థితి వచ్చింది.

First Published:  25 Oct 2022 5:36 AM GMT
Next Story