Telugu Global
Cinema & Entertainment

స్టార్ హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన లీకులు

తాజాగా రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోని ఒక ఆడియో సాంగ్ లీకై ఆన్‌లైన్‌ వేదికల్లో ప్రత్యక్షమైంది. దీంతో ఆ సాంగ్ ట్విట్టర్, ఇన్ స్టా, యూట్యూబ్‌లలో వైరల్‌గా మారింది.

స్టార్ హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన లీకులు
X

టాలీవుడ్ స్థాయి ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది. దేశంలో అత్యధిక బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు ఎక్కువగా ఇక్కడే రూపొందుతున్నాయి. అయితే మేకర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ దృశ్యాలు, వీడియోలు లీకై మేకర్లను దెబ్బతీస్తున్నాయి. ఈ లీకుల వల్ల కథ ఏంటి, సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయాలు ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోతున్నాయి.

రాజమౌళి ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాడంటే ఎన్నో నిబంధనలు పెడతారని టాలీవుడ్‌లో టాక్ ఉంది. చివరికి తన సినిమాలో హీరోలుగా నటిస్తున్నవారు కూడా మొబైళ్లు సెట్‌లోకి తేకుండా రాజమౌళి జాగ్రత్తపడతారు. అలాంటిది ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు కూడా లీక్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ టైంలో ఎన్టీఆర్ పులితో తలపడే సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఆ మధ్య బయటకు వచ్చింది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అల్లు అర్జున్ - సుకుమార్ మూవీ, ప్రభాస్ - మారుతి మూవీ, రామ్ చరణ్ - శంకర్ మూవీలకు లీకుల బెడద ఎక్కువైంది. పుష్ప సినిమాకు సంబంధించి నది ఒడ్డున లారీల్లో ఎర్రచందనం తరలించే సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది.

అలాగే ప్రభాస్ - మారుతి సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన వీడియో లీకైంది. తాజాగా రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోని ఒక ఆడియో సాంగ్ లీకై ఆన్‌లైన్‌ వేదికల్లో ప్రత్యక్షమైంది. దీంతో ఆ సాంగ్ ట్విట్టర్, ఇన్ స్టా, యూట్యూబ్‌లలో వైరల్‌గా మారింది. చిత్ర బృందం వెంటనే రంగంలోకి దిగి ఆ సాంగ్ లింక్‌లను తొలగించే పనులు చేపట్టడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా వరుసగా పలు సినిమాలకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు లీకవుతుండటంపై సినీ మేకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


First Published:  17 Sep 2023 7:17 AM GMT
Next Story