Telugu Global
Cinema & Entertainment

ఈవారం ఓటీటీ : 17 సినిమాలు, సిరీసులు షోలు!

OTT Telugu Movies releases this week: ఈ వారం బాలీవుడ్ నటులు రితీష్ దేశ్‌ముఖ్, సోనాక్షీ సిన్హా, సాకీబ్ సలీం లు నటించిన ‘కాకుడా’ అనే హార్రర్ కామెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈవారం ఓటీటీ : 17 సినిమాలు, సిరీసులు షోలు!
X

ఈ వారం బాలీవుడ్ నటులు రితీష్ దేశ్‌ముఖ్, సోనాక్షీ సిన్హా, సాకీబ్ సలీం లు నటించిన ‘కాకుడా’ అనే హార్రర్ కామెడీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా ‘వైల్డ్ వైల్డ్ పంజాబ్‌’ అనే మైండ్ లెస్ కామెడీ, బాలీవుడ్ పోటీ ప్రపంచవు తెర వెనుక కథల్ని చెప్పే, ఇమ్రాన్ హష్మీ నటించిన ‘షోటైమ్’ మొదటి సీజన్ రెండవ భాగం కూడా ప్రసారమవుతోంది. ఇంకా ఇంగ్లీషు, జపనీస్ సినిమాలు, షోలు, సిరీసులు, యానిమేషన్లు సమృద్ధిగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఈ క్రింద...

1. కమాండర్ కరణ్ సక్సేనా (జూలై 8) - డిస్నీ+ హాట్‌స్టార్‌

ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రా’ ఏజెంట్ కమాండర్ కరణ్ సక్సేనా (గుర్మీత్ చౌదరి) కథ చెప్తుంది. అతను రాజకీయ కుట్రలతో, గూఢచర్యంతో కూడిన ప్రమాదకర మిషన్ ని చేపడతాడు. ఇండియా- పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, జాతీయ భద్రతకి ముప్పు కలిగించే కుట్రని వెలికితీసేటప్పుడు, బలీయమైన శత్రువులు అతడిమీద తెగబడతారు. ఈ షో అమిత్ ఖాన్ సృష్టించిన పాత్ర ఆధారంగా తయారైంది. ఇందులో ఇక్బాల్ ఖాన్, హృతా దుర్గులే కూడా కీలక పాత్రల్లో నటించారు.

2. సన్నీ (జూలై 10) -ఆపిల్ ప్లస్ టీవీ

శక్తివంతమైన నగరం క్యోటోలో జరిగే ఈ పది-ఎపిసోడ్ల మిస్టరీ థ్రిల్లర్ సుజీ (రషీదా జోన్స్)ని పరిచయం చేస్తుంది. ఆమె భర్త, కొడుకు ఒక విమాన ప్రమాదంలో కనిపించకుండా పోయినప్పుడు, ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితం కల్లోలమవుతుంది. తదనంతర పరిణామాల్లో ఆమెకు ఆమె భర్త పనిచేసిన ఎలక్ట్రానిక్ కంపెనీ అందించిన సన్నీ అనే డొమెస్టిక్ రోబో తోడవుతుంది. దాని సాయంతో క్రమంగా ఆమె భర్త, కొడుకు అదృశ్యం చుట్టూ వున్న చిక్కుముడిని విప్పుతుంది.

3. వైల్డ్ వైల్డ్ పంజాబ్ (జూలై 10) - నెట్ ఫ్లిక్స్

ఇది తెగ నవ్వించే కామెడీ. రాజేష్ ఖన్నాఅనే అతని చుట్టూ తిరుగుతుంది. అతను గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన బాధతో వుంటాడు. ఆ మాజీ ప్రియురాలి పెళ్ళిలో ఆమె సంగతి తేల్చుకోవాలని నిశ్చయించుకుని, ముగ్గురు మిత్రులతో ప్రయాణం కడతాడు. ప్రతీకారం కోసం తలపెట్టిన ఆ ప్రయాణం త్వరలో వూహించని మలుపులతో కల్లోల యాత్రగా మారుతుంది. దారి పొడవునా వివిధ వ్యక్తులతో ఘర్షణలతో, పోరాటాలతో మాజీ ప్రియురాలి మీద ప్రతీకారం కాస్తా హాస్య ప్రహసనంగా, ప్రశ్నార్ధకంగా మారుతుంది.

4. డివోర్స్ ఇన్ ది బ్లాక్ (జూలై 11)- అమెజాన్ ప్రైమ్

(మీగన్ గుడ్) అనే బ్యాంక్ ప్రొఫెషనల్, భర్త డల్లాస్ (కోరీ హార్డ్ రిక్) అకస్మాత్తుగా విడాకులు కోరడంతో దిక్కు తోచనిస్థితిలో పడుతుంది. ఈ బాధతోనే వుంటూ, భర్త డల్లాస్ చేసిన పని వెనుక వున్న నిజాన్ని వెలికితీయాలని నిశ్చయించుకుంటుంది. అప్పుడు అతను పాల్పడింది వ్యక్తిగత ద్రోహాలు మాత్రమే కాదని, అంతకి మించి ఆమె జీవితాన్ని సర్వ నాశనం చేసే పెద్ద పథకమనీ తెలుసుకున్నప్పుడు కథ నాటకీయ మలుపు తీసుకుంటుంది.

5. సాసేజ్ పార్టీ: ఫుడ్టోపియా (జూలై 11) – అమెజాన్ ప్రైమ్

ఈ యానిమేషన్ 2016 లో విడుదలైన ‘సాసేజ్ పార్టీ’కి సీక్వెల్. ఇందులో ఆంత్రోపోమోర్ఫిక్ ఫుడ్ తో వికారమైన అసంబద్ధ ప్రపంచం తిరిగి దర్శనమవుతుంది. ఈ కథ ఫ్రాంక్ ది సాసేజ్, బ్రెండా బన్సన్, స్యామీ బాగెల్ జూనియర్‌ల తుంటరి పాత్రల్ని అనుసరిస్తుంది.తారాగణంలో సేత్ రోజెన్, క్రిస్టెన్ విగ్, మైఖేల్ సెరా, ఎడ్వర్డ్ నార్టన్, విల్ ఫోర్టే, సామ్ రిచర్డ్ సన్ లున్నారు.

6. వైకింగ్స్: వల్హల్లా సీజన్ 3 (జూలై 11)- నెట్ ఫ్లిక్స్

వైకింగ్స్: వల్హల్లా మూడవ సీజన్లో, ఫ్రైడిస్ ఎరిక్స్ డోటర్ (ఫ్రిదా గుస్తావ్సన్) పాగన్ జోమ్స్ బోర్గ్ లీడర్ గా వుంటుంది. లీఫ్ ఎరిక్సన్ (సామ్ కార్లెట్), హెరాల్డ్ సిగుర్డ్సన్ (లియో సూటర్)ఇద్దరూ అప్పటికే కాన్స్టాంటినోపుల్‌లో పేరు పొందిన యోధులుగా వుంటారు. అయినా వీళ్ళందరి విజయాలు కొత్త పరీక్షల్ని, సవాళ్లనీ ఎదుర్కొంటాయి . ఈ సీజన్‌లో కింగ్ కానూట్ (బ్రాడ్లీ ఫ్రీగార్డ్), క్వీన్ ఎమ్మా (లారా బెర్లిన్), ఎర్ల్ గాడ్విన్ (డేవిడ్ ఓక్స్) వంటి కీలక పాత్రలు కూడా తిరిగి వస్తాయి.

7. డేస్ (జూలై 12)-సోనీలివ్

నేహా శర్మ ఈ థ్రిల్లర్‌లో ఫరా అనే పాత్రలో నాయకత్వం వహిస్తుంది. ఆమె సమీపంలో నివసించే వారి జీవితాల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆమె రాకతో మనుషుల మధ్య సంబంధాలు, వాటిలో దాగి వున్న నిజాలూ బయటపడతాయి. ఇవి విషాదకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనల శ్రేణికి దారి తీస్తాయి. ఇందులో పూరబ్ కోహ్లీ, శృతీ సేథ్, చందన్ రాయ్ సన్యాల్, అమృతా ఖాన్విల్కర్, షరీబ్ హష్మీ, షెర్నాజ్ పటేల్ కూడా నటించారు.

8. డా. డెత్ సీజన్ 2 (జూలై 12)- లయన్స్ గేట్ ప్లే

డా. డెత్ రెండవ సీజన్ వైద్య పద్ధతులకి ప్రసిద్ధి చెందిన సర్జన్ డా. పాలో మచియారిని (ఎడ్గార్ రెమిరేజ్) భయపెట్టే రియల్ స్టోరీపై దృష్టి సారిస్తుంది. కృత్రిమ అవయవాలతో తన అద్భుతమైన వైద్య విధానాలతో ‘మిరాకిల్ మ్యాన్’ గా పేరుపొందాడు. అయితే పరిశోధనాత్మక జర్నలిస్టు బెనిటా అలెగ్జాండర్ (మాండీ మూర్) అతడి వైద్యం వెనుక కుతంత్రం వెలికి తీయడం ప్రారంభించినప్పుడు, డాక్టర్ మాకియారిని జీవితం, కెరీర్ చీకటి మలుపు తీసుకుంటాయి. బెనిటా తన పరిశోధనలో లోతుగా వెళ్తున్న కొద్దీ అతడి మోసాల పరిధి పెరిగి పాపం పండుతుంది.

9. ఎక్స్ ప్లోడింగ్ కిటెన్స్ (జూలై 12) -నెట్ ఫ్లిక్స్

జనాదరణ పొందిన కార్డ్ గేమ్ ఆధారంగా, ఈ అడల్ట్ యానిమేటెడ్ కామెడీ సిరీస్ దేవుడి కథ చెప్తుంది. గాడ్‌క్యాట్ మానవత్వంతో మళ్ళీ కనెక్ట్ అవడానికి భూమికి వస్తుంది. ఈ కొత్త భూసంబంధమైన మిషన్ లో దానికి డెవిల్‌క్యాట్ ఎదురై పోరాటం తీవ్ర మొదలవుతుంది.

10. కాకుడా(జూలై 12) -జీ5

ఉత్తరప్రదేశ్‌లోని రాటోడి అనే విచిత్రమైన గ్రామంలో భయానక కామెడీ ఇది. ఒక విచిత్రమైన స్థానిక ఆచారాన్ని ఇక్కడ పాటిస్తారు. ప్రతి మంగళవారం రాత్రి 7:15 గంటలకి ప్రతి ఇంటి తలుపు తెరవాలని, లేదా ఒక రహస్య వ్యక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాలనీ ఆదేశాలుంటాయి. తరతరాలుగా తమ ఇళ్ళను పీడిస్తున్న ఈ భయంకర శాపంతో గ్రామస్థులు అల్లాడుతున్నప్పుడు, సైన్స్ టీచర్ ఇందిర (సోనాక్షి సిన్హా) రంగ ప్రవేశం చేస్తుంది. అయితే ఆమె స్థానిక నివాసి సన్నీ (సాకిబ్ సలీమ్)ని వివాహం చేసుకున్న తర్వాత చాలా గందరగోళంలో చిక్కుకుంటుంది.

11. మీ (జూలై 12) -ఆపిల్ టీవీ ప్లస్

బెన్ వాసనీ 12 ఏళ్ళ మధ్యతరగతి విద్యార్ధి. కౌమారదశలో అల్లకల్లోలమైన ఆలోచనలతో తనకు ఆకారాల్ని మార్చే సూపర్ పవర్స్ వున్నాయని తెలుసుకుంటాడు. తన సవతి సోదరి మాక్స్ తో కలిసి తన చుట్టూ సమాజంలోని రహస్యాల్నీ, విషాదాల్నీ విప్పడానికి తన ఉపయోగించుకోవడం నేర్చుకుంటూ పోతాడు.

12. పిల్ (జూలై 12) -జియో సినిమా

డాక్టర్ ప్రకాష్ (రితేష్ దేశ్‌ముఖ్) వైద్య పరిశ్రమలోని గజిబిజి లోకంలో తన వైద్య విధానాలలో నైతికతని పాటించే వైద్య నిపుణుడు. ఒక దశలో ఇతను శక్తివంతమైన ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫరెవర్ క్యూర్‌ని ధైర్యంగా ఎదుర్కొనే పోరాటాన్ని ప్రారంభిస్తాడు.



13. షోటైమ్ సీజన్ 1 భాగం 2 (జూలై 12) -డిస్నీ+ హాట్‌స్టార్‌

ఈ సీజన్ 1, 2 వ భాగం ‘షోటైమ్’ బాలీవుడ్ పోటీ ప్రపంచపు తెరవెనుక రహస్యాల్ని విప్పుతుంది. రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మీ) తన ప్రొడక్షన్ హౌస్‌ ఐటీ దాడికి గురై, భవిష్యత్తు ప్రణాళికలు ప్రమాదంలో పడినప్పుడు కుదేలైపోతాడు. ఇంతలో సాజన్ (విజయ్ రాజ్) రఘుతో సంబంధాలు తెంచుకుని, మహికా (మహిమా మక్వానా)తో జతకట్టడానికి ప్రయత్నిస్తాడు. మందిర (శ్రియా శరణ్), అర్మాన్ (రాజీవ్ ఖండేల్‌వాల్) ల సంబంధం సవాళ్ళని ఎదుర్కోవడం ఒక వైపు, యాస్మిన్ (మౌనీ రాయ్) తన గర్భం గురించి రఘు ఖన్నాతో గొడవపడడం ఒక వైపూ జరిగి, తీవ్ర సంఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తుతాయి.

వినోదాలు మరికొన్ని!

నెట్ ఫ్లిక్స్ లో

14. రిసీవర్ (సిరీస్)- జులై 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

15. మాస్టర్ మైండ్ (సిరీస్)- జులై 10

16. అగ్నిసాక్షి (థ్రిల్లర్ సిరీస్)- జులై 12

మనోరమా మ్యాక్స్ లో

17. మందాకిని (మలయాళం)- జులై 12

First Published:  8 July 2024 2:47 PM GMT
Next Story