Telugu Global
Cinema & Entertainment

కాపీ కథలతో కొరటాల వెతలు

కొరటాల శివ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని శరత్ చంద్ర వాదం. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ల దగ్గర నుంచీ వెన్నెల కిషోర్ పాత్ర వరకూ, కథాంశం మొదలుకొని స్థలాలు, కంపెనీల పేర్లు కూడా తన నవలలోనివేననీ, ఆఖరికి దేవరకొండ అనే వూరి పేరు కూడా యధాతథంగా వాడుకున్నాడనీ, కొరటాల శివ తన కథ అని చెప్పుకుంటున్న దాన్ని రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయలేదనీ ఆరోపించాడు.

కాపీ కథలతో కొరటాల వెతలు
X

సినిమా రంగంలో సీనియర్ రచయిత పోసాని కృష్ణ మురళికి శిష్యుడుగా ప్రవేశించి, మాటల రచయితగా ‘ఒక్కడున్నాడు’, ‘మున్నా’, ‘బృందావనం’, ‘ఊసర వెల్లి’ వంటి స్టార్ సినిమాలకి పనిచేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కొరటాల శివ, 2013 లో ప్రభాస్ నటించిన ‘మిర్చీ’ తో దర్శకుడుగా మారాడు. ‘మిర్చీ’ సూపర్ హిట్ అవడంతో, 2015 లో మహేష్ బాబుతో ‘మహర్షి’ అనే మరో సూపర్ హిట్ తీశాడు. ఇక్కడే, ఈ రెండో సినిమాకే కాపీ కథ ఆరోపణలతో కోర్టు కష్టాలు మొదలయ్యాయి. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ఎదురు దెబ్బలే తిన్నాడు. జనవరి 30, 2024 న సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఇప్పుడు దోషిగా శిక్షా ప్రాంగణంలో నిలబడ్డాడు.

ఇదే కాదు, ఇంకో రెండు సార్లు ఇవే ఆరోపణల్ని ఎదుర్కొన్నాడు. ‘మహర్షి’ మీద కేసు వుండగానే, తిరిగి 2018 లో మహేష్ బాబుతోనే తీసిన 'భరత్‌ అనే నేను' కథ మీద కూడా రూమర్లు వచ్చాయి. అసలు ఈ కథ కొరటాల శివదే కాదని, రూ. కోటి ఇచ్చి ఓ రచయిత దగ్గరి నుంచి కొనుక్కున్నాడనీ ప్రచారం జరిగింది. అంతేకాదు, హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారనే టాక్ కూడా వినిపించింది. 1995లో మైకేల్ డగ్లస్ నటించిన ‘ది అమెరికన్ ప్రెసిడెంట్’ సినిమా కథ నుంచి కాపీ కొట్టారని విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే అదంతా రూమర్‌ అని కొట్టిపడేశాడు. తమ కథని ఎలా సిద్ధం చేశామో చెప్పుకొచ్చాడు. కెరీర్ తొలినాళ్ళలో తన రూంమేట్, దర్శకుడు శ్రీహరి ఓ ఐడియా ఇచ్చాడనీ, ఓ సీఎం పాత్ర అంటూ అతనిచ్చిన ఆలోచన అద్భుతంగా వుందనీ, అది తెగ నచ్చి అందులో ఓ లైన్ తో కథ తయారు చేసుకున్నాననీ స్పష్టం చేశాడు. అది పూర్తిగా తన సొంత కథగా చెప్పుకొచ్చి, ఐడియా ఇచ్చినందుకు టైటిల్ కార్డులో రూమ్మేట్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాననీ వివరిస్తూ రూమర్లకి తెర దించాడు. అయితే రూమ్మేట్ విషయంలో న్యాయం చేసినా, హాలీవుడ్ సినిమాతో పోలికల విషయం మాత్రం తేల్చలేదు.

ఇక మూడోది- 2022 లో తన దర్శకత్వంలో చిరంజీవి- రామ్ చరణ్ లు నటించిన ‘ఆచార్య’ కథ. 'ఆచార్య' కథని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి కాపీ కొట్టిన కొరటాల శివ!’ అని హెడ్డింగులు వెలువడ్డాయి. సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచీ వివాదం ముదరడం మొదలైంది. ఈ సినిమా కథ తనదేనని, కొరటాల శివ కాపీ కొట్టి సినిమా తీస్తున్నాడని రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపించాడు. ఒక ఎమ్మెల్యే ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ కి కథ చెప్పానని, కథ చెప్పినప్పుడు దీని ఆడియో రికార్డింగ్ కూడా తన దగ్గరుందనీ, దీన్ని కొరటాల శివ లాంటి పెద్ద దర్శకుడు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారనీ, కానీ తర్వాత ఇదే కథ కొరటాల శివ కాపీ కొట్టి 'ఆచార్య' తీశాడనీ ఆరోపించాడు. టీవీ ఛానళ్ళలో చర్చల్లో కూడా పాల్గొని తన వాదాన్ని వినిపించాడు. కొరటాల శివ ఈ వివాదాన్ని కోర్టు వెలుపల సెటిల్ చేసుకోవడంతో సద్దుమణిగింది. కానీ తన ఇమేజి బాగా దెబ్బతినిపోయింది.

ఇప్పుడు ‘శ్రీమంతుడు’ కేసుతో విశ్వసనీయత పూర్తిగా ప్రమాదంలో పడింది. ఇది ఏడేళ్ళ సుదీర్ఘ న్యాయపోరాటం. దీని స్క్రిప్టు తన ప్రకారం సాగలేదు. అసలు రచయిత స్క్రిప్టు అంత బలంగా వుంది. అసలు రచయిత శరత్ చంద్ర కాపీరైట్ ఉల్లంఘన కేసు పెట్టాడు. 2012 లో ‘స్వాతి’ మాస పత్రికలో ప్రచురితమైన తన నవల ‘చచ్చేంత ప్రేమ’ కొరటాల శివ కాపీ కొట్టాడని శరత్ చంద్ర (ఆర్‌డి విల్సన్) అనే రచయిత 2017లో నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో కేసు పెట్టాడు. మళ్ళీ దీనికి కూడా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్సే. వీరితో పాటు మహేష్ బాబు మీద పెట్టిన కేసుల్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే కొరటాల శివపై కేసుని స్వీకరించింది. విచారణ అనంతరం హైకోర్టు రచయితకి అనుకూలంగా తీర్పు నిచ్చింది. కొరటాల శివ సుప్రీం కోర్టుకి పోతే అక్కడా ఎదురు దెబ్బే తగిలింది. కొరటాల శివపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలని ఆదేశించింది.

కొరటాల శివ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని శరత్ చంద్ర వాదం. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ల దగ్గర నుంచీ వెన్నెల కిషోర్ పాత్ర వరకూ, కథాంశం మొదలుకొని స్థలాలు, కంపెనీల పేర్లు కూడా తన నవలలోనివేననీ, ఆఖరికి దేవరకొండ అనే వూరి పేరు కూడా యధాతథంగా వాడుకున్నాడనీ, కొరటాల శివ తన కథ అని చెప్పుకుంటున్న దాన్ని రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయలేదనీ ఆరోపించాడు.

ఈ కేసు ఏడేళ్ళు ఎందుకు పట్టిందో కూడా ప్రశ్నించాలని, ఇంతకాలం ఎవరూ పోరాడరనీ, మహేష్ బాబు- నిర్మాత నవీన్‌లపై మళ్ళీ కేసు పెడతాననీ, వారు కూడా బాధ్యులనీ చెప్పాడు. తన పోరాటం డబ్బు కోసం కాదనీ, కొరటాల శివ బహిరంగ క్షమాపణలు చెప్తే చాలనీ స్పష్టం చేశాడు.

అచ్చులో నవల ప్రపంచానికి అంత స్పష్టంగా కనిపిస్తూండగా, కొరటాల శివ పదేపదే ఎలివేషన్లు ఇచ్చుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం దాకా ఎందుకు వెళ్ళాడో ఎవరికీ అర్ధంగాని విషయం. ఇంకేం ఎలివేషన్ వుందో తెలియదు. ఉంటే అంతర్జాతీయ న్యాయస్థానమే వుంటుంది. ‘ఆచార్య’ విషయంలోలాగా గుట్టు చప్పుడవకుండా సెటిల్ చేసుకోవాల్సింది. అయినా అంత పెద్ద దర్శకుడు ఒకదానితర్వాత ఒకటి కథా చౌర్యం చేయడమేమిటి? చేసినా నవల్లో ఏదీ మార్చకుండా పేజీకి పేజీ దించెయ్యడమేమిటి?

గుర్తుపట్టకుండా సృజనాత్మకత ప్రదర్శించడానికయినా బద్ధకమేనా?

ఇప్పుడు ఎన్టీఆర్ తో దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ విషయంలో నెగెటివ్ ప్రచారాలు జరగకుండా బయటికి వచ్చి ప్రకటన చేయాల్సిన అవసరముంది. తను రచయితగానే వచ్చాడు. పెద్ద దర్శకుడయ్యాడు. కానీ రచయితల్ని ప్రోత్సహించాల్సిన పెద్దరికం వదిలి దోచుకకుంటే -ఇలా ఫీల్డు దృష్టిలో, ప్రేక్షకుల దృష్టిలో దోషిలా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అవసరమా?

First Published:  4 Feb 2024 9:54 AM GMT
Next Story