Telugu Global
Cinema & Entertainment

కేరళలో యూట్యూబ్ రివ్యూయర్లపై కేసులు!

కేరళలో యూట్యూబ్ సినిమా రివ్యూయర్లపై కేసులు నమోదయ్యాయి. ఒక సినిమా నిర్మాత కోరిన డబ్బు ఇవ్వలేదని యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో నెగెటివ్ రివ్యూలు పోస్ట్ చేసినందుకు ఏడుగురు రివ్యూయర్లపై ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు.

కేరళలో యూట్యూబ్ రివ్యూవర్లపై కేసులు!
X

కేరళలో యూట్యూబ్ రివ్యూవర్లపై కేసులు!

కేరళలో యూట్యూబ్ సినిమా రివ్యూయర్లపై కేసులు నమోదయ్యాయి. ఒక సినిమా నిర్మాత కోరిన డబ్బు ఇవ్వలేదని యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో నెగెటివ్ రివ్యూలు పోస్ట్ చేసినందుకు ఏడుగురు రివ్యూయర్లపై ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. ఏడుగురు రివ్యూయర్లతో బాటు యూట్యూబ్, ఫేస్ బుక్ సోషల్ మీడియా వేదికల్ని కూడా నిందితులుగా పేర్కొన్నారు. అక్టోబరు 13న థియేటర్లలో విడుదలైన ‘రాహెల్ మకాన్ కోరా’ అనే మలయాళ సినిమాపై కోరిన డబ్బు ఇవ్వలేదని ఉద్దేశపూర్వకంగా అసభ్యంగా, నెగెటివ్ రివ్యూలు పోస్ట్ చేశారని దర్శకుడు ఉబైనీ ఇబ్రహీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై చట్టపరంగా ముందుకు వెళితే సినిమాకు మరింత నష్టం కలగజేస్తామని కూడా బెదిరించారని ఉబైనీ పేర్కొన్నారు.

ఏడుగురు నిందితుల్లో ప్రముఖ యూట్యూబర్ అశ్వంత్ కోక్, ఫిల్మ్ ప్రమోషన్ కంపెనీ హైన్స్ యజమాని, యూట్యూబర్స్ అరుణ్ తరంగ, ఎన్‌వి ఫోకస్, ట్రెండ్ సెక్టార్ 24x7, ట్రావెలింగ్ సోల్‌మేట్స్ - ఫేస్‌బుక్ ఖాతా యజమాని అనూపను 6165 వున్నారు. సినిమా విడుదల రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య రివ్యూలు, అసభ్యకర కామెంట్‌లు పోస్ట్ చేశారని, ఉద్దేశపూర్వకంగానే సినిమా గురించి చెడుగా ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్ 14న పోస్ట్ చేసిన తన యూట్యూబ్ వీడియోలో, నిందితుల్లో ఒకరైన అశ్వంత్ కోక్, ఆ వారం విడుదలైన ‘రాహెల్ మకాన్ కోరా’ సహా ఆరు మలయాళ సినిమాల గురించి మాట్లాడాడని, ఈ ఆరు సినిమాల్లో ఏ ఒక్కటీ తాను చూడలేదని వ్యంగ్యంగా చెప్పాడనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 385 (దోపిడీకి పాల్పడే క్రమంలో గాయపడిన వ్యక్తిని భయపెట్టడం), 34 (ఉమ్మడి లక్ష్యంతో అనేక మంది వ్యక్తులు పాల్పడ్డ చర్యలు), కేరళ పోలీసు చట్టం సెక్షన్ 120 (పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన) ప్రకారం కేసు నమోదు చేశారు.

దీనికి ముందు ఇదే అక్టోబర్ లో కేరళలో ‘ఆరోమాలింటే ఆద్యతే ప్రణయం’ సినిమా దర్శకుడు ముబీన్ రవూఫ్ కోర్టు కెక్కారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లు, సినిమా రివ్యూ బ్లాగర్లు తన సినిమాపై కనీసం ఏడు రోజుల పాటు ఎలాంటి రివ్యూలని పోస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతూ కేరళ హైకోర్టుని ఆశ్రయించారు. అనాలోచిత ప్రతికూల సమీక్షల కారణంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైతే, అది పరిశ్రమలో ఎందరివో జీవనోపాధులపై నేరుగా ప్రభావం చూపుతుందని పిటిషనర్ వాదించారు.

ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ కోసం స్పష్టమైన, పారదర్శక మార్గదర్శకాల్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై - కేరళ హైకోర్టు కేంద్ర సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి నోటీసులు జారీ చేసింది.

ఇది తెలిసి కూడా పైన పేర్కొన్న రివ్యూయర్ల దుశ్చర్యకి పాల్పడ్డారు. కేరళలోనే ఇటీవల ఇంకో పరిణామం కూడా చోటు చేసుకుంది. యూట్యూబ్ మూవీ రివ్యూయర్ల థియేటర్లలోకి రాకుండా కేరళ ఫిల్మ్ ఛాంబర్ నిషేధించింది. ఫిబ్రవరి 8న, ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఫెయువోక్) కూడా ఆన్‌లైన్ మీడియాని బైట్స్ తీసుకోవడానికి థియేటర్ ప్రాంగణంలోకి రాకుండా నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకులనుంచి బైట్స్ తీసుకోవడం సినిమా కలెక్షన్లని ప్రభావితం చేస్తోందని ఫెయువోక్ పేర్కొంది.

ఆన్‌లైన్ మీడియా సినిమాల గురించి తప్పుడు రివ్యూలు ఇస్తున్నందున, సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల అభిప్రాయాన్ని పొందడానికి ఆన్‌లైన్ మీడియాని థియేటర్ ఆవరణలోకి రాకుండా నిషేధిస్తున్నామని, సినిమా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ రివ్యూలు కూడా చేస్తున్నారనీ, ఇలాంటి రివ్యూలు సినిమా కలెక్షన్లని దారుణంగా ప్రభావితం చేస్తున్నాయనీ పేర్కొంది.

యూట్యూబ్ ఛానెల్‌లు సినిమాల ఫస్ట్ షో- ఫస్ట్ టాక్ పై ప్రేక్షకుల స్పందనలు తీసుకోవడం మంచిదా కాదా అనే దానిపై కేరళ సినిమా పరిశ్రమలో కొంతకాలంగా చర్చ సాగుతోంది. యూట్యూబ్ సమీక్షకులు కొన్ని సినిమాల గురించి ప్రతికూలంగా మాట్లాడడానికి డబ్బు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కొందరు దర్శకులు ఫిర్యాదు కూడా చేశారు. అయితే యూట్యూబ్ రివ్యూయర్ల గురించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే విషయంపై కేరళ ప్రభుత్వంతో మాట్లాడాలని కేరళ ఫిల్మ్ ఛాంబర్ యోచిస్తోంది.

మొత్తానికి యూట్యూబ్ రివ్యూయర్లపై కేసు నమోదవడం ఇదే మొదటిసారి. సోషల్ మీడియాలో అందరూ రివ్యూ రైటర్లే. సోషల్ మీడియా లేని కాలంలో ప్రింట్ మీడియాలో పత్రికల్లో రాసే సినిమా సమీక్షకులు కొందరే వుండేవాళ్ళు. సోషల్ మీడియా అందుబాటులో కొచ్చాక సినిమాల గురించి తెలియని నెటిజన్లు రివ్యూయర్ల అయిపోతున్నారు. సినిమా విడుదల రోజు తెల్లారే సినిమా చూస్తూ ట్వీట్లు చేయడం దగ్గర్నుంచీ, యూట్యూబ్ లో సమీక్ష చెప్పి పారేయడం వరకూ వృత్తి జర్నలిస్టులకంటే యుద్ధ ప్రతిపదికన చేసేస్తున్నారు. ఇది ముదిరి నిర్మాతల్ని బెదిరించి డబ్బు లాగేదాకా పోతున్నారు.

First Published:  26 Oct 2023 10:25 AM GMT
Next Story