Telugu Global
Cinema & Entertainment

సీక్వెలా? మూడేళ్ళు వెయిట్ చేయండి!

‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2, అంటే సీక్వెల్ గురించి ప్రకటన వెలువడింది. సినిమా ముగింపు లోనే ఈ సినిమా ముగియలేదనీ, ఇంకా వుందనీ సూచిస్తూ ‘టు బి కంటిన్యూడ్‌...’ అనే లైను వేశారు.

సీక్వెలా? మూడేళ్ళు వెయిట్ చేయండి!
X

‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2, అంటే సీక్వెల్ గురించి ప్రకటన వెలువడింది. సినిమా ముగింపు లోనే ఈ సినిమా ముగియలేదనీ, ఇంకా వుందనీ సూచిస్తూ ‘టు బి కంటిన్యూడ్‌...’ అనే లైను వేశారు. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహాభారత పురాణం ప్లస్ సైన్స్ ఫిక్షన్ల జానర్ బెండింగ్ మెగా మూవీ జూన్ 27 న విడుదలై విజయదుందుభి మోగిస్తున్న విషయం తెలిసింది. ఈ సంరంభం వుండగానే దర్శకుడు నాగ్ అశ్విన్ నుంచి సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. మొదటి భాగాన్ని 2020 ఫిబ్రవరిలో ప్రకటించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా షూటింగ్ 2021 జులైలో ప్రారంభమైంది. 2024 మే నెలలో నిర్మాణపనులు పూర్తయ్యాయి. అంటే మొత్తం నిర్మాణానికి మూడేళ్ళూ పట్టింది. కాబట్టి ఇప్పుడు సీక్వెల్ కూడా మూడేళ్ళు తీసుకుంటుందని, కనుక మూడేళ్ళ వరకూ ప్రేక్షకులు వేచి చూడాల్సిందేననీ ప్రకటన సారాంశం.

మరి కథేమై వుంటుంది? మొదటి భాగం ముగింపులోనే రెండో భాగం కథ వుంది. మొదటి భాగం ముగింపు ఇక్కడ చెప్పుకుంటే స్పాయిలర్ అవుతుంది. వీకీపీడియాలో మొదటి భాగం సినిమా కథ మొత్తం బ్యానర్ తరపున సినిమా విడుదలైన జూన్ 27 సాయంత్రమే ఇచ్చేసినా మనం ఇక్కడ చెప్పుకోవడం లేదు. అయితే రెండో భాగం కథ మాత్రం మొదటి భాగాన్ని బట్టి - కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ దుష్టపాత్రతో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ పాత్రల ఇంకా ముగియని పోరాటంగానే వుంటుందని చెప్పుకోవచ్చు. గర్భంలో కల్కిని మోస్తున్న- దీపికా పదుకొనే పాత్ర సుమతిని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం.

‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ తో ప్రేక్షకుల నిరాశ కూడా ఓ పక్క వుంది. ఇంతా చేసి ప్రభాస్ కల్కి అవతారం కాదా అనే నిరాశ. కల్కి అవతారమైతే ఆ కథ వేరేగా వుంటుంది. పుట్టబోయే కల్కిని కాపాడే కథే మొదటి రెండు భాగాల ఇతివృత్తం. పోతే ఈ సినిమా స్టార్ వార్స్, డ్యూన్, బ్లేడ్ రన్నర్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ వంటి ఎన్నో హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాల్ని కలిపి కొట్టిన మసాలా అనే విమర్శలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా జేమ్స్ కామెరూన్ నిర్మించిన ‘అలిటా’ పోలికలు కనిపిస్తాయి.

‘అలిటా’ లో మహాయుద్ధం తర్వాత 2563 లో, భూమ్మీద శిథిలావస్థలోంచి పునర్నిర్మాణమవుతుంది గజిబిజి ఐరన్ సిటీ (కల్కి లో 2898 లో శిథిలమైన కాశీ లాగా) ఇక్కడ డాక్టర్ ఇడో (క్రిస్టాఫ్ వాల్జ్) అనే సైబర్ సైంటిస్టు వుంటాడు. ఇతను రాత్రిపూట నేరస్థుల్ని పట్టుకునే హంటర్ వారియర్ గా కూడా వుంటాడు ( ప్రభాస్ బౌంటీ హంటర్ పాత్ర లాగా). ఇతడికి జంక్ యార్డ్ లో మొండెం లేని తలతో వున్న సైబోర్గ్ దొరుకుతుంది. దాని మెదడు సజీవంగా వుందని తెలుసుకున్న అతను, సైబర్ బాడీని అతికిస్తాడు. అప్పుడా అమ్మాయికి చనిపోయిన తన కూతురు అలీటా పేరు పెడతాడు. అలీటా (రోసా సలాజర్) కళ్ళు తెరచి కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. కానీ తానెవరో గుర్తుకు రాదు. డాక్టర్ ఇడో సంరక్షణలో వుంటుంది. ఆమె హ్యూగో (కీన్ జాన్సన్) అనే మోటార్ బాల్ ఆటగాడితో ప్రేమలో పడుతుంది. ఆమెకి అతను నగరం పైన వేలాడుతున్న ఊర్ధ్వ లోకం సాలెం సిటీ ని చూపిస్తాడు. (కల్కిలో కమల్ హాసన్ కాంప్లెక్స్ సిటీ లాగా) అక్కడికి చేరుకోవడం ఎవరి వల్లా కాదంటాడు. ఆమెకి అక్కడికి చేరుకోవాలన్న కోరిక బలంగా పుడుతుంది (ప్రభాస్ కి కాంప్లెక్స్ లో నివసించాలన్న లక్ష్యం లాగే). మరి అలీటా అక్కడికి చేరుకుందా? అందుకు ఏ ప్రయత్నాలు చేసింది? ఎవరామెని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు? అసలు పైన సాలెం సిటీలో ఏముంది? ఆమెకి తన గతమేంటో తెలిసిందా? అసలు తనెవరు? ...ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానాలే 'అలీటా' మిగతా కథ.

అయితే కావచ్చు కానీ ఇండియన్ ప్రేక్షకులకి ఇండియన్ సినిమా 'కల్కి' లో చూపించిన ఫాంటసీ అంతా కొత్త. ఇండియన్ నటులతో, ఇండియన్ కథని కలిపిన కొత్తదనం. కాకపోతే 'ఆర్ ఆర్ ఆర్' లాగా ఆస్కార్ అవార్డుల పోటీకి వెళ్ళే అవకాశముంటుందా అన్నదే సందేహం. ఎందుకంటే ఆస్కార్ అవార్డులకి హాలీవుడ్ సినిమాల్లాగా తీసిన విదేశీ సినిమాలని అనుమతించరు. ఆ దేశపు నేపథ్యంలో ఆ దేశ కథతోనే వుండాలి అవి. మన దేశపు స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' కథ వుంది. 'కల్కి 2898' లో మాహాభారత కథ వున్నా హాలీవుడ్ సినిమాల అనుకరణలతో సైన్స్ ఫిక్షన్ కథ కలిసింది. కాబట్టి ఇప్పుడు ఎలాటి అభ్యతరాలుంటాయో ఒకవేళ ఆస్కార్ కి వెళ్తే తెలుస్తుంది.

First Published:  29 Jun 2024 10:26 AM GMT
Next Story