Telugu Global
Cinema & Entertainment

2024 బడ్జెట్ లో ‘కల్కి 2898 AD’ టాప్!

2024 వేసవిలో అత్యంత ఖరీదైన పానిండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘కల్కి 2898 AD’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్! ఎంత ఖరీదైనది అంటే, దీని బడ్జెట్ కి సాలార్, యానిమల్, డంకీ మూడిటి బడ్జెట్లు కలిపినా సరిపోదు.

2024 బడ్జెట్ లో ‘కల్కి 2898 AD’ టాప్!
X

2024 వేసవిలో అత్యంత ఖరీదైన పానిండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘కల్కి 2898 AD’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్! ఎంత ఖరీదైనది అంటే, దీని బడ్జెట్ కి సాలార్, యానిమల్, డంకీ మూడిటి బడ్జెట్లు కలిపినా సరిపోదు. ఇది అన్ని బాక్సాఫీసు రికార్డుల్ని- అంటే ట్రిపులార్, బాహుబలి వసూళ్ళ రికార్డుల్ని సైతం బద్దలు కొట్టవచ్చు. 2024 లో అనేక పానిండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కొన్ని మెగా చలనచిత్రాలు నిజంగా పెద్ద బడ్జెట్ తోనే వున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విడుదలైన అతిపెద్ద సినిమాలని కూడా ఇవి మరుగుజ్జు చేసేస్తాయి. అయితే వీటన్నిటికీ మించి అత్యంత ఖరీదైన భారతీయ చలన చిత్రంగా ‘కల్కి 2898 AD’ మాత్రమే నిలుస్తుందని, ఇది కొత్త బాక్సాఫీసు రికార్డులని కూడా సృష్టించగలదనీ ట్రేడ్ పండితులు విశ్లేషి స్తున్నారు.

‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తయారవుతున్న ‘కల్కి 2898 AD’ ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం రూ. 600 కోట్ల సూపర్ మెగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది ఇటీవలి మూడు పానిండియాల మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ. సాలార్ రూ. 270 కోట్లు, యానిమల్ రూ. 100 కోట్లు, డుంకీ రూ. 140 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించారు. ఈ మొత్తం కలిపితే రూ 510 కోట్లే. కల్కి బడ్జెట్ రూ. 600 కోట్లు! ఈ బడ్జెట్ బ్రహ్మాస్త్ర రూ. 350 కోట్లు, బాహుబలి రూ. 250 కోట్లు కలిపితే సరిపోయేంత!

‘కల్కి 2898 AD’ గురించి ఇంకా చెప్పాలంటే ఆదిపురుష్, ట్రిపులార్ ల బడ్జెట్స్ కంటే పెద్దది. ఈ రెండూ ఒక్కొక్కటి రూ. 550 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించారు. అయితే ఆదిపురుష్ బడ్జెట్‌ ని రూ. 700 కోట్లుగా పేర్కొన్న సందర్భం కూడా వుంది. అంటే ‘కల్కి 2898 AD’ రెండవ స్థానంలో వుండవచ్చు. ఆదిపురుష్ బడ్జెట్లో ఫైనల్ గా మార్కెటింగ్ ఖర్చులు కలిపి రూ. 700 కోట్లుగా పేర్కొన్నారని, ‘కల్కి 2898 AD’ బడ్జెట్ కి కూడా ఫైనల్ గా మార్కెటింగ్ ఖర్చులు కలిపితే ఆదిపురుష్ ని మించవచ్చని అంటున్నారు.

అయితే ‘కల్కి 2898 AD’ ట్రిపులార్, బాహుబలిల బాక్సాఫీసు రికార్డుల్ని బీట్ చేయగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న! ‘కల్కి 2898 AD’ లో ప్రభాస్, దీపికా పడుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో బలమైన సమిష్టి తారాగణంగా వున్నారు. ఈ మూవీ అత్యాధునిక VFX, CGI ఎఫెక్ట్స్ తో అప్ లోడవుతోంది. దీని తారాస్థాయి మేకింగ్, తారల తారాగణ బలం దృష్ట్యా, ఇది 2024లో అత్యంత ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మూవీగా వుంది. ట్రేడ్ పండితులు ఇది కొత్త బాక్సాఫీసు రికార్డులనే నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి సాలార్‌తో ప్రభాస్ తిరిగి ఫామ్‌లోకి వచ్చిన తర్వాత. ఈ తాజా మూవీ తెలుగు మార్కెట్‌లో సరికొత్త కలెక్షన్ల రికార్డుల్నినెలకొల్పడంతోపాటు హిందీ, తమిళ మార్కెట్‌లలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

అంటే అన్ని విషయాలు సవ్యంగా సాగితే ట్రిపులార్ సాధించిన రూ. 1300 కోట్ల గ్రాస్, బాహుబలి 2 సాధించిన రూ. 1600 కోట్ల గ్రాస్‌లని అధిగమించే అవకాశముందని భావించ వచ్చని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు.

ఇది ఖచ్చితంగా దేశీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్ లో ఒకటిగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మౌత్ టాక్ ఎంత బావుంటుందనే అంశాలపై బాక్సాఫీసు అంకెలు ఆధారపడి వుంటాయి. ట్రిపులర్ కంటే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నప్పుడు ట్రిపులార్ లాగే ఆస్కార్ అవార్డులకి పోటీపడే ప్రమాణాలతో వుంటుందా అన్నది కూడా సహజ ప్రశ్న. ప్రస్తుతం విడుదల తేదీ రాలేదు గానీ ట్రైలర్‌ ని మార్చి 31న ఆవిష్కరిస్తున్నారు. సమ్మర్ లో విడుదలయ్యే అవకాశముంది.

First Published:  3 Jan 2024 7:46 AM GMT
Next Story