Telugu Global
Cinema & Entertainment

కైకాల సత్యనారాయణ కన్నుమూత

Kaikala Satyanarayana: దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.

కైకాల సత్యనారాయణ కన్నుమూత
X

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఈరోజు ఉదయం 4 గంటలకు తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.

తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి లెజెండ్స్ ఎలాగైతే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారో.. వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్ లో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు కైకాల. 770పైగా చిత్రాల్లో నటించిన ఆయన, తిరుగులేని నటుడు అనిపించుకున్నారు.

1935న కృష్ణా జిల్లాలో జన్మించారు కైకాల సత్యనారాయణ. చిన్నప్పట్నుంచి నాటకాల పిచ్చి. అదే ఆయన్ను సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది. దీనికి మరో కారణం కూడా తోడైంది. అప్పుడే సినిమాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశించారు. కొన్ని హిట్స్ కూడా కొట్టారు.

ఎన్టీఆర్ పోలికలతో ఉన్న కైకాలను సినిమాల్లోకి వెళ్లమని అంతా ప్రోత్సహించారు. అలా మద్రాసు రైలెక్కిన కైకాలను ఇండస్ట్రీ కూడా ఎన్టీఆర్ పోలికలతో ఉన్న నటుడిగా గుర్తించింది. అలా నిర్మాత డీఎల్ నారాయణ చలవతో సిపాయి కూతురు అనే సినిమాలో వేషం వేశారు కైకాల. అయితే ఆ సినిమా ఫెయిలైంది.

సినిమా ఫ్లాప్ అయినా తెరపై కైకాల చాలామందిని ఎట్రాక్ట్ చేశారు. గంభీరమైన రూపం, కంచు కంఠం ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. హీరోగా మాత్రమే సినిమాలు చేయాలనే ఆలోచన లేని కైకాల వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. నటించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అదే ఆయన్ను స్టార్ ను చేసింది. ఎస్వీ రంగారావు తర్వాత అంతటి స్థాయి ఉన్న నటుడిగా మార్చింది.

విఠలాచార్య తీసిన కనకదుర్గ పూజామహిమ సినిమా కైకాల కెరీర్ ను మలుపుతిప్పింది. తొలిసారిగా అందులో విలన్ గా నటించారు కైకాల సత్యనారాయణ. ఆయన విలనీ సూపర్ హిట్టయింది. అప్పట్నుంచి టాలీవుడ్ లో తిరుగులేని విలన్ గా మారిపోయారు. వందల సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించారు.

ఆ తర్వాత కైకాలలోని క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా వెలుగులోకి వచ్చాడు. కేవలం విలనీ కాకుండా.. సానుభూతి పంచే తండ్రి, తాత పాత్రలు పోషించారు. ఇదే క్రమంలో ఆయన కామెడీ కూడా పండించి తనకుతానే సాటి అనిపించుకున్నారు. ఇలా సాంఘిక పాత్రలతో పాటు పౌరాణికాల్లో కూడా తనకు తిరుగులేని నిరూపించుకున్నారు కైకాల. అప్పట్లో కృష్ణుడు, రాముడు పాత్రలకు ఎన్టీఆర్ ఎంత ఫేమస్ అయ్యారో.. యముడు, ఘటోత్కచుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలతో కైకాల కూడా అంతే పాపులర్ అయ్యారు. అంతెందుకు, ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ యముడు పాత్ర అంటే కైకాల మాత్రమే. ఆ స్థాయిని ఎవ్వరూ అందుకోలేకపోయారు.

కెరీర్ లో కైకాల పోషించని పాత్ర లేదు, కలిసి నటించని నటుడు లేడు. ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు నుంచి.. ఆ తర్వాత తరమైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు తరాల నటులకు వారధిగా నిలిచారు. ఆ తర్వాత కూడా మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ లాంటి ఎంతోమంది ఈతరం నటులతో ఆయన నటించారు.

కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కైకాల పాపులర్ అయ్యారు. చిరంజీవి నటించిన కొదమసింహం సినిమాకు నిర్మాత ఈయనే. ఆయన నిర్మించిన బంగారు కుటుంబం సినిమాకు నంది అవార్డ్ కూడా వచ్చింది. రమా ఫిలిం ప్రొడక్షన్ అనే బ్యానర్ స్థాపించి దానిపై ముద్దుల మొగుడు, ఇద్దరు దొంగలు లాంటి కొన్ని సినిమాల్ని నిర్మించారు.

దశాబ్దాల తన కెరీర్ లో 200 మందికిపైగా దర్శకులతో వర్క్ చేశారు కైకాల. 770కి పైగా సినిమాల్లో నటించారు. లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. కరోనా కారణంగా సినిమాలకు దూరమైన లెజండరీ నటుడు, ఈరోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

First Published:  23 Dec 2022 3:03 AM GMT
Next Story