Telugu Global
Cinema & Entertainment

ఓటీటీల్ని హడలెత్తిస్తున్న జియో సినిమా!

జియో సినిమా (ఓటీటీ) వల్ల ఇతర ఓటీటీలకి పెద్ద సమస్య వచ్చి పడింది. జియో సినిమా ఎడాపెడా ఉచిత కంటెంట్ ని సులభంగా అందుబాటులో వుంచుతోంది.

ఓటీటీల్ని హడలెత్తిస్తున్న జియో సినిమా!
X

ఓటీటీల్ని హడలెత్తిస్తున్న జియో సినిమా!

జియో సినిమా (ఓటీటీ) వల్ల ఇతర ఓటీటీలకి పెద్ద సమస్య వచ్చి పడింది. జియో సినిమా ఎడాపెడా ఉచిత కంటెంట్ ని సులభంగా అందుబాటులో వుంచుతోంది. దీంతో ఇతర ఓటీటీలు చెల్లింపు సభ్యత్వాల్ని పొందడంలో కిందా మీదవుతున్నాయి. జియో సినిమా రాక పూర్వం ఓటీటీలు మంచి బూమ్ ని ఆస్వాదించాయి. మీడియా పార్టనర్స్ ఆసియా అంచనాల ప్రకారం జనవరి 2022 - మార్చి 2023 మధ్య 15 నెలల వ్యవధిలో దేశీయ ప్రేక్షకులు 6.1 ట్రిలియన్ నిమిషాలు లేదా 11 మిలియన్ సంవత్సరాలకి పైగా వీడియోల్ని వీక్షించారు. అయితే మన వాళ్ళు ఉచిత కంటెంట్‌ ని కూడా అమితంగా ఇష్టపడతారు గనుక, ఆ సమయంలో 88 శాతం మంది యూట్యూబ్‌లో గడిపారు. మిగిలిన సమయం ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ యాప్‌ల కోసం వెచ్చించారు.

ఇలా కొన్ని సంవత్సరాలుగా ఈ బూమ్ ని ఆస్వాదిస్తూ వచ్చిన తర్వాత, ఓటీటీలు ఇప్పుడు ఒక సవాలుని ఎదుర్కొంటున్నాయి. ఆన్‌లైన్ వీడియో వీక్షకుల సంఖ్య వేగంగా పెరగడం, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కంటెంట్ బడ్జెట్‌లలో పెరుగుదల తర్వాత, ఓటీటీలు ఖర్చుల్ని హేతుబద్ధీకరించడానికి ప్లాన్ చేస్తున్న సమయంలో, జియో సినిమా రంగ ప్రవేశం చేసి సవాలు విసిరింది. జియో సినిమా రంగ ప్రవేశం చేస్తూ ముందుగా ప్రేక్షకులకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ని ఉచితంగా వీక్షించే సదుపాయం కల్పించిన తర్వాత, దాని ప్రీమియం ఇంగ్లీషు భాషా కంటెంట్‌ ని బలీయం చేయడం ప్రారంభించింది.

హెచ్ బీఓ సిరీస్‌లు, మాక్స్ ఒరిజినల్స్ షోలు, వార్నర్ బ్రదర్స్ తో పాటు డిస్కవరీ కార్యక్రమాలు, వార్నర్ బ్రదర్స్ బ్లాక్‌బస్టర్ సినిమాలతోబాటు ఇతర సినిమాల కోసం, టీవీ సిరీస్‌ల కోసం, ఎన్ బీ సీ యూనివర్సల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రీమియం కంటెంట్ మొత్తాన్నీ ఉచితంగా అందించడం మొదలెట్టింది. దీంతో సంపన్న వినియోగదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తత్ఫలితంగా ఇతర ఓటీటీలు ఆత్మరక్షణలో పడ్డాయి.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో అదే పాత కంటెంట్‌ని స్క్రోల్ చేయడంలో విసిగిన ప్రేక్షకుల కోసం జియో వ్యూహాత్మకంగా ఉచితాలు ప్రకటించింది. అసలే జియో సినిమా అనేది టెలికాం రంగంలో గణనీయంగా పెట్టుబడి పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగం. దీని టెలికాం విభాగం తక్కువ డేటా ధరలతో ఉచిత వాయిస్ కాల్స్ ని అందించడం ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరగడానికి కారణమైంది. ఈ జియో టెలికాం వినియోగ దారులే జియో సినిమా వినియోగ దార్లు అయ్యారు. ఫలితంగా జియో సినిమా ఇప్పుడు 40 కోట్లకి పైగా వినియోగదారుల్ని కలిగి వున్నట్టు లెక్క. ఈ సాటిలేని అత్యంత భారీ వినియోగదార్ల సంఖ్యతో జియో సినిమా అటు కంటెంట్ సృష్టికర్తలకి, ఇటు పంపిణీదారులకీ ఆకర్షణీయమైన వేదికగా మారింది. దీంతో ఇప్పుడు దేశీయ కంటెంట్ స్పేస్‌లో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. ఇలా వుండగా అమెజాన్ ప్రైమ్ తగుదునమ్మాయని ధరల పెంపుని ప్రకటించింది. జియో సినిమా 100 కొత్త సినిమాలు, టీవీ షోలు ఉచిత ప్రసారాలకి కేటాయించడంతో ధరలు పెంచుకుని అమెజాన్ ప్రైమ్ చిక్కుల్లో పడింది. ప్రస్తుతానికి జియో సినిమా ప్రారంభ ఆఫర్ గా ఉచితం. తర్వాత అవకాశం చూసుకుని అంబానీ వడ్డనలు వడ్డించడం ఖాయం.

అసలు ఐపీఎల్ ని ఉచితంగా అందించడంతోనే పరిశ్రమని షాక్‌ కి గురి చేసింది జియో సినిమా. ఇప్పుడు వినియోగదారులకి సరసమైన వినోదాన్ని ఉచితంగా అందించడంలో నిబద్ధతని ప్రదర్శిస్తోంది. పైగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రానున్న షారుఖ్ ఖాన్- నటించిన ‘డుంకీ’, ఆదిల్ హుస్సేన్ నటించిన ‘ది స్టోరీ టెల్లర్’ సహా కొన్ని అద్భుత సినిమాల్ని అప్పుడే ప్రకటించింది జియో సినిమా. ఇవి గాక మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భోజ్‌పురి వంటి స్థానిక భాషల్లో ప్రాంతీయ కంటెంట్‌ని కలిగి వుంది. ఫ్రేక్షకులు వారి మాతృభాషలో వారికి ఇష్టమైన షోలు, సినిమాలు ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.

జియో సినిమా వెనుక వున్న సాంకేతికాల్ని కూడా గమనించాలి. ఏఐ ఆధారిత సిఫార్సు ఇంజిన్ వినియోగదారుల వీక్షణ చరిత్ర ఆధారంగా కంటెంట్‌ ని సూచిస్తుంది. వినియోగదారులు తమకి ఆసక్తి కలిగించే కొత్త షోలు, సినిమాలూ సెర్చి చేసుకోవడాన్ని కూడా ఇది సులభతరం చేస్తుంది.

ఇక నెట్‌ఫ్లిక్స్ విషయానికొస్తే, ఇది ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ వీడియో-ఆన్-డిమాండ్ మార్కెట్‌లో దాని ప్రత్యర్థుల్ని అధిగమించే స్థాయిలో వుంది. కానీ జియో సినిమా ప్రాంతీయ కంటెంట్‌పై దృష్టి సారించడం, 40 కోట్లకి పైగా వినియోగ దార్లని గుత్తగా కలిగి వుండడమూ నెట్ ఫ్లిక్స్ ని పునరాలోచనలో పడేస్తోంది. ఇవన్నీ ప్రేక్షకులకి ఇస్తున్న సందేశమేమిటి? మరిన్ని ఛాయిస్ లు, మరింత వైవిధ్యం, మరింత తక్కువ ఖర్చుతో కూడిన వినోదం జియో సినిమాతో ఒనగూడుతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ధరల పెంపు కొందరి మూడ్ చెడగొడితే, జియో సినిమా ఉచిత కానుకలు, దాని విస్తృత కంటెంట్ లైబ్రరీ ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా మార్చేశాయి. దేశీయ కంటెంట్ స్పేస్‌లో ఆధిపత్య పోరు ముగియలేదు. ఎవరు అగ్రస్థానంలో వుంటారో చూడడమే ఆసక్తికరంగా వుంది.

దేశీయ ఓటీటీ పరిశ్రమకి జియో సినిమా ఒక ప్రమాద ఘంటిక అని చెప్తున్నారు. ఈ స్ట్రీమింగ్ సిగపట్లు ఇప్పట్లో ముగియవు. ముఖేష్ అంబానీ చేతిలో జియో సినిమా వంటి ప్లేయర్ దాని స్థానాన్ని కాపాడుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడంతో, రానురాను పోటీ మరింత తీవ్రంగా కానుందని ఓటీటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First Published:  17 July 2023 10:29 AM GMT
Next Story