Telugu Global
Cinema & Entertainment

ట్రేడ్ న్యూస్: బుకింగ్స్ తో జవాన్ - సాలార్ డబుల్ ధమాకా!

రాబోయే రెండు ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టార్స్ సినిమాలు యూఎస్ లో భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో తీవ్ర పోటీ పడుతున్నాయి.

ట్రేడ్ న్యూస్: బుకింగ్స్ తో జవాన్ - సాలార్ డబుల్ ధమాకా!
X

రాబోయే రెండు ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టార్స్ సినిమాలు యూఎస్ లో భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో తీవ్ర పోటీ పడుతున్నాయి. రెండు వారాల్లో విడుదల కానున్న ఒకటి, నాల్గు వారాలో విడుదల కానున్న మరొకటీ టికెట్ల అమ్మకాల్లో ఇప్పట్నుంచే బాక్సాఫీసుని షేక్ చేస్తున్నాయి. షారుఖ్ ఖాన్ ‘జవాన్’, ప్రభాస్ ‘సాలార్’ రెండూ కలెక్షన్స్ తో యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘జవాన్’ సెప్టెంబర్ 7న, ‘సాలార్’ సెప్టెంబర్ 28 న విడుదల కాబోతున్నాయి. ‘జవాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ తో రూ. 1.25 కోట్ల మార్క్ ని దాటితే, ‘సాలార్’ రూ. 82 లక్షలతో సత్తా చాటు తోంది.

గదర్ 2, జైలర్, ఓఎంజీ 2, భోళా శంకర్‌ నాలుగూ స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో విడుదలై భారీ కలెక్షన్స్ ని రాబట్టిన పండుగ వాతావరణంలో, ‘జవాన్’, ‘సాలార్’ రెండూ యూఎస్ అడ్వాన్సు బుకింగులతో పండుగ చేసుకుంటున్నాయి. యూఎస్ లో ‘జవాన్’ కి నిన్న మొదటి రోజు దాదాపు 1600 షోలతో 367 లొకేషన్స్ లో బుకింగ్‌లు ఓపెనయ్యాయి. ఉదయమే దాదాపు 1900 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘జవాన్’ షారుఖ్ నటించిన ఇటీవలి సూపర్ హిట్ ‘పఠాన్’ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మించి పోతోంది. అనేక బాయ్ కాట్ ల మధ్య విడుదలై వూహించని విధంగా రూ. 1000 కోట్ల వరకూ వసూలు చేసిన ‘పఠాన్’ క్రేజ్ ఇంకా సమసి పోకుండానే, షారుఖ్ వెంటనే ‘జవాన్’ తో వచ్చేయడం ఫ్యాన్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ సూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి తమిళ దర్శకుడు అట్లీ రూపకర్త. ఇందులో నయనతారతో బాటు విజయ్ సేతుపతి మొదటిసారిగా షారుఖ్ తో జత కడుతున్నారు. ఇంకా సాన్యా మల్హోత్రా, ప్రియమణి కూడా నటించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదల చేసిన మొదటి రెండు పాటలు- ‘జిందా బందా’, ‘చలేయా’ అధ్బుత స్పందన పొందిన తర్వాత ప్రీ-రిలీజ్ బజ్ భారీగా వుంది.

యూఎస్ లో ఇలాంటి బంపర్ బజ్ ని క్రియేట్ చేస్తున్న మరో మూవీ ప్రభాస్ ‘సాలార్’ కి 141 లొకేషన్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నిన్న మొదటి రోజు 363 షోలకి, ఉదయం వరకు దాదాపు 4456 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రూ. 82 లక్షలు వసూలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సాలార్‌’ లో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతీ హాసన్, జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజునటించారు.

ఈ రెండు సినిమాల పెర్ఫార్మెన్స్ ఇలా వుంటే, రజనీకాంత్ ‘జైలర్’ దాని మానాన అది ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కుని అధిగమించి, నిన్నటికి రూ. 523.4 కోట్ల అద్భుత వసూళ్ళని సాధించింది. ఇక ‘గదర్ 2’ అనుకున్నట్టు రూ. 400 కోట్ల మార్కుని దాటేసింది. ఇది బాక్సాఫీసు దగ్గర అల్లకల్లోలం సృష్టిస్తోందని న్యూస్. సన్నీ డియోల్ నటించిన ఈ ఇండో-పాక్ ప్రేమికుల రోమాంటిక్ యాక్షన్ దేశీయంగా రూ. 411 కోట్లు వసూలు చేసి, నిన్నటితో 13 రోజులకి ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు దాటింది. నిన్న 13 వ రోజు కూడా రూ. 10 కోట్లు వసూలు చేసింది. ఈ ప్రక్రియలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ నెలకొల్పిన అన్ని రెవెన్యూ రికార్డులనీ బద్దలు కొట్టిందని ట్రేడ్ పండిట్లు చెప్తున్నారు.

ఇక అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎంజీ 2’ నిన్నటితో 13 రోజులకి 123 కోట్లు వసూలు చేసింది. కాగా నిన్న ‘జవాన్’ కి ‘యూఏ’ సెన్సార్ సర్టిఫికేట్ లభించింది.

First Published:  24 Aug 2023 10:15 AM GMT
Next Story