Telugu Global
Cinema & Entertainment

హనుమాన్‌గా చిరంజీవి.. రాముడిగా మహేష్‌..– దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆలోచన అదే!

‘జై హనుమాన్‌’ చిత్రంలో హనుమంతుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీరాముడి పాత్రలో మహేష్‌బాబు తమ మనసులో ఉన్నారని దర్శకుడు ప్రశాంత్‌వర్మ చెప్పారు.

హనుమాన్‌గా చిరంజీవి.. రాముడిగా మహేష్‌..– దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆలోచన అదే!
X

‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న ఆసక్తికర అంశంతో ‘జై హనుమాన్‌’పై ఆసక్తి పెంచేసిన ‘హను–మాన్‌’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.. ఆ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అంశం ఒక రేంజ్‌లో ప్లాన్‌ చేస్తూ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికర అంశంగా ఉంది. స్టార్‌ హీరోనే ఈ పాత్రలో నటిస్తారని చెబుతూ వస్తున్న ప్రశాంత్‌ వర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను వెల్లడించారు.

చూడగానే భక్తిభావం కలిగేలా...

ఇంతకీ అదేంటంటే.. ‘జై హనుమాన్‌’ చిత్రంలో హనుమంతుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీరాముడి పాత్రలో మహేష్‌బాబు తమ మనసులో ఉన్నారని దర్శకుడు ప్రశాంత్‌వర్మ చెప్పారు. ఈ చిత్రం స్కేల్‌ చాలా పెద్దదని, హనుమంతుడి పాత్రలో ఆయన శక్తులను వివరంగానే చూపిస్తామని తెలిపారు. కాబట్టి ఆ పాత్రలో నటించే వ్యక్తి చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలిగేలా ఉండాలని చెప్పారు. హనుమాన్‌ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్‌ నటులు ఆసక్తి చూపారని, అయితే, ఆన్‌ స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ సరిపోవాలని తెలిపారు. ఆ జాబితాలో చిరంజీవి గారు కూడా ఉండవచ్చని ఆయన చెప్పారు.

చిరంజీవికి పద్మవిభూషణ్‌ వచ్చిన తర్వాత కలవలేదని, ఆయన ఇంటి వద్ద అంతా కోలాహలంగా, వేడుకగా ఉందని ప్రశాంత్‌ వర్మ తెలిపారు. అదంతా కాస్త సద్దుమణిగాక వెళ్లి కలుస్తానని, అన్నీ కుదిరితే చిరంజీవి గారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు.. చెప్పలేం అని వివరించారు. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేష్‌బాబు అని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో ఆయన్ని రాముడిగా క్రియేట్‌ చేసిన ఫొటోలను తాను చూశానని, తమ ఆఫీసులో కూడా తాము రాముడి పాత్రను ఆయన ముఖంతో రీక్రియేట్‌ చేసి చూసుకున్నామని తెలిపారు.

పెద్ద హీరో అయినా.. స్క్రిప్టులో మార్పులు చేయబోం...

తాము అనుకున్న ఇండియన్‌ సూపర్‌ హీరోల కథలన్నీ సినిమాలుగా తీస్తామని, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ప్రశాంత్‌ వర్మ చెప్పారు. ఒకవేళ పెద్ద హీరోతో సినిమా చేయాల్సి వచ్చినా స్క్రిప్ట్‌లో మార్పులు చేయబోమని, కొన్ని పరిమితులకు లోబడి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. వారి ఆలోచనలు నచ్చితే, పరిశీలిస్తామని, ఏదైనా అంతిమ నిర్ణయం చిత్ర బృందానిదేనని స్పష్టం చేశారు. కొన్ని కథలను కేవలం కొత్త నటీనటులతో చేస్తామని, మహిళా ప్రాధాన్యం ఉన్న మూవీలో సమంత చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ’జై హనుమాన్‌’ పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని, కథ సిద్ధంగా ఉందని, ఎలా తీయాలన్నదానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారు. వీఎఫ్‌ఎక్స్‌ సహా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హను–మాన్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం.

First Published:  31 Jan 2024 3:32 AM GMT
Next Story