Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ సంక్రాంతికి చిరు, బాలయ్య సై!

ఇద్దరూ ఒకే బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలతో సంక్రాంతిని శోభాయమానం చేయబోతున్నారు- ‘వాల్తేర్ వీరయ్య’ తో చిరంజీవి, ‘వీర సింహా రెడ్డి’ తో బాలకృష్ణ.

మళ్ళీ సంక్రాంతికి చిరు, బాలయ్య సై!
X

తెలుగు సినిమాల క్యాలెండర్ ని సంక్రాంతి నుంచి సంక్రాంతికి మార్చుకోవాలి. తెలుగు సినిమాల కొత్త సంవత్సరం సంక్రాంతి నుంచే ప్రారంభమవుతుంది. జనవరిలో సంక్రాంతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త సినిమాల విడుదలలు పోటాపోటీగా వుంటాయి.

ఈ పోటీలో 'ఎవరు సంక్రాంతి హీరో' అన్న శీర్షికతో ఇంటర్నెట్ కి పూర్వం ప్రింట్ మీడియాలో ఆసక్తిగా ఎదురు చూసేలా కథనాలు వెలువడేవి. సినిమా చరిత్రలో మొదటి సంక్రాంతి హీరో ఎవరంటే పోటీ లేకుండా సోలోగా ఎన్టీఆరే. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలై హిట్టయ్యాయి. 28 సంక్రాంతుల్లో 28 సినిమాలు విడుదల చేసిన ఘనత ఎన్టీఆర్ దే.

1954 లో 'చంద్రహారం' తో మొదలు పెడితే 1981 లో 'ప్రేమ సింహాసనం' వరకూ -మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, వెంకటేశ్వర మహాత్మ్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం, గులేబకావళి కథ, గుడి గంటలు, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, తల్లా పెళ్లామా, శ్రీకృష్ణ విజయం, సతీ సావిత్రి మొదలైన చిరస్మరణీయమైన 28 సినిమాల శ్రేణి కనిపిస్తుంది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు అడపా దడపా సంక్రాంతి సినిమాలతో వచ్చినా అవి తక్కువే. ఎప్పుడూ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సంక్రాంతి సినిమాలతో ముఖా ముఖీ అయింది లేదు. తర్వాత ఎక్కువ సంక్రాంతి సినిమాలు చేసింది హీరో కృష్ణ. తనుకూడా సోలోగానే వచ్చేవారు (వివరంగా రేపు మరో వ్యాసంలో చూద్దాం). ఇక చిరంజీవి రంగప్రవేశం చేశాక ఆయన సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఢమాల్మన్నాయి. 1983 సంక్రాంతికి విడుదలైన 'ప్రేమ పిచ్చోళ్లు' (హిందీ 'షౌకీన్' రీమేక్) సంక్రాంతికి విడుదలైన చిరంజీవి మొదటి చలన చిత్రం. ఆ పరాజయం తర్వాత, సంక్రాంతికి విడుదలైన మరో రెండు సినిమాలు హిట్ కాలేదు. అలాగే 1996లో బాలకృష్ణ నటించిన మొదటి సంక్రాంతి సినిమా 'వంశానికొక్కడు' హిట్ కాలేదు.

1997 చరిత్రాత్మక సంవత్సరం. ఇద్దరి మధ్య సంక్రాతి సినిమాల పోటీ ప్రారంభమైన సంవత్సరం. చిరంజీవి 'హిట్లర్' తో, బాలకృష్ణ 'పెద్దన్నయ్య' తో తలపడి ఇద్దరూ సంక్రాంతి హీరోలయ్యారు. దీని తర్వాత 1999 లో చిరంజీవి 'స్నేహం కోసం' తో, బాలకృష్ణ 'సమర సింహారెడ్డి' తో వచ్చి బాలకృష్ణ సంక్రాంతి హీరో అయిపోయారు. 'సమరసింహా రెడ్డి' ఆయనకి అతి పెద్ద తొలి బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత నుంచే మునుపెన్నడూ వూహించని చిరంజీవి -బాలకృష్ణ ల సంక్రాంతి సినిమాల రేసు అనే కొత్త పోటీ మొదలైంది. ఇద్దరి మధ్య ఎవరు సంక్రాంతి హీరో అన్న టైటిల్ కింద టాప్ చైర్ కోసం క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లాగా పోరాటం మొదలైంది. తర్వాతి రెండు సంక్రాంతి సంగ్రామాల్లో కూడా చిరంజీవే క్షతగాత్రుడిగా మిగిలారు. 2001 లో చిరంజీవి 'మృగరాజు' తో, బాలకృష్ణ 'నరసింహానాయుడు' తో బరిలోకి దిగి బాలకృష్ణే సంక్రాంతి హీరోగా నిలిచారు. మళ్ళీ 2004 లో 'అంజి' తో చిరంజీవి, 'లక్ష్మీనరసింహా' తో బాలకృష్ణ పోటీ పడితే, బాలకృష్ణే సంక్రాంతి హీరోగా టాప్ చైర్ ని అందుకున్నారు.

'మృగరాజు' లో చిరంజీవి సింహాన్ని మచ్చిక చేసుకోవడం బ్యాక్‌డ్రాప్‌గా వున్న కథ. బాలకృష్ణ 'నరసింహా నాయుడు' మునుపటి బ్లాక్‌బస్టర్ హిట్ 'సమరసింహా రెడ్డి' తరహాలో ఫ్యాక్షనిస్ట్ నేపథ్య కథ. గ్రాఫిక్స్ తో 'మృగరాజు' కంటే ఫ్యాక్షన్ తో 'నరసింహా నాయుడు' పండుగ ప్రేక్షకులకి నచ్చింది. ఈ రెండు ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య ఇమేజియే మారిపోయింది. రౌద్రరసం పండించగల పవర్ఫుల్ స్టార్ గా 2021 లో 61 ఏళ్ళ వయసులోనూ 'అఖండ' ని అఖిలాండ బ్రహ్మాండం చేశారు.

మళ్ళీ ఇద్దరూ 2004 లో సిగపట్లకి దిగారు. రెండు చిరు వర్సెస్ బాలయ్య సినిమాలు. 'అంజి' తో చిరు మరో గ్రాఫిక్స్, 'లక్ష్మీ నరసింహా' తో బాలయ్య మాస్ పోలీస్ యాక్షన్. ఈ సారి కూడా పండుగ ప్రేక్షకులకి గ్రాఫిక్స్ నచ్చక, బాలయ్యనే సంక్రాంతి హీరోగా చేశారు. ఇలా వరుసగా మూడు సంక్రాంతులు బాలకృష్ణ వశమయ్యాయి.

దీని తర్వాత 2017 లోనే తిరిగి ఇద్దరూ సంక్రాంతి రేసులోకి వచ్చారు. చిరంజీవి 'ఖైదీ నెం 150' తో, బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' తో. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించిన సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల్ని వెర్రెత్తిస్తూ మాస్ ఎంటర్ టైనర్ తో, బాలకృష్ణ 2014 లో 'లెజండ్' అనే సూపర్ హిట్ ఇచ్చాక, 'లయన్', 'డిక్టేటర్' అనే రెండు ఫ్లాప్స్ తర్వాత చారిత్రికంతో. ఇద్దరూ సంక్రాంతి హీరోలయ్యారు.

ఇప్పుడు ఐదేళ్ళ విరామం తర్వాత 2023 లో నువ్వా నేనా అన్నట్టు దిటవు గుండెలతో నిలబడ్డారు. విశేషమేమిటంటే, ఇద్దరూ ఒకే బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలతో సంక్రాంతిని శోభాయమానం చేయబోతున్నారు- 'వాల్తేర్ వీరయ్య' తో చిరంజీవి, 'వీర సింహా రెడ్డి' తో బాలకృష్ణ. రెడ్డి, నాయుడు లేకపోతే బాలకృష్ణకి నడవదు. దీంతో ఇద్దరి అభిమానులు సంక్రాంతికి ఎవరి సినిమా పైచేయి సాధిస్తుందో అంచనాలు, జోస్యాలు మొదలు పెట్టేశారు. రెండు సినిమాల ప్రచారం అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ ప్రారంభమై పోయింది. ఇప్పటికే చిరంజీవి 'బాస్ పార్టీ', బాలకృష్ణ 'జై బాలయ్య' ప్రమోషనల్ సాంగ్స్ రెండూ యూట్యూబ్‌లో వైరల్ అయి వెర్రెత్తిస్తున్నాయి.

తిరిగి ఇద్దరూ 2017 లాగా సంక్రాంతి సక్సెస్ ని సమంగా పంచుకుంటారా అనేదే సస్పెన్స్. పంచుకునే అవకాశాలే ఎక్కువున్నాయి- ఎందుకంటే రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్ ఆకర్షణలతో, హీరోయిజాలతో వున్నవే. రెండూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినవే. పానిండియా మూవీస్ కాకపోవచ్చు, సంక్రాంతి కోడి పందాలకే మాత్రం తీసిపోవు.

First Published:  3 Jan 2023 7:44 AM GMT
Next Story