Telugu Global
Cinema & Entertainment

పైరసీలో మనం టాప్- కొత్త చట్టానికి సవాల్!

మన దేశంలో పైరసీ సైట్స్ ని సందర్శిస్తున్న వీక్షకుల సంఖ్య ఆందోళనకరంగా 7 వందల కోట్లకి చేరుకుని, అంతర్జాతీయంగా ఇండియాని మూడో స్థానంలో నిలబెడుతోంది.

పైరసీలో మనం టాప్- కొత్త చట్టానికి సవాల్!
X

మన దేశంలో పైరసీ సైట్స్ ని సందర్శిస్తున్న వీక్షకుల సంఖ్య ఆందోళనకరంగా 7 వందల కోట్లకి చేరుకుని, అంతర్జాతీయంగా ఇండియాని మూడో స్థానంలో నిలబెడుతోంది. తాజాగా వెలువడిన గ్లోబల్ అడ్వైజరీ సంస్థ అంకురా నివేదిక ప్రకారం, 2022లో టొరెంట్ సైట్‌ల ద్వారా 7 బిలియన్లకి పైగా సందర్శనలతో, కంటెంట్ పైరసీ వెబ్‌సైట్‌లని సందర్శించిన అత్యధిక వీక్షకుల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో వుంది. ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ 2022లో మన దేశంలో అత్యధిక పైరసీ చేసిన చలన చిత్రం కాగా, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అత్యంత పైరసీ చేసిన సిరీస్. అలాగే ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’, ‘ఆర్ ఆర్ ఆర్’ లు అత్యంత పైరసీకి గురైన లోకల్ సినిమాలు.

సంగీతం, చలనచిత్రాలు, సాఫ్ట్ వేర్, పుస్తకాలూ మొదలైన వాటి సృజనాత్మక కంటెంట్ పైరసీని ట్రాక్ చేసిన అంకురా- వ్యక్తులు, వ్యవస్థీకృత సమూహాలు టెలిగ్రామ్, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా అటువంటి కంటెంట్‌ ని సరఫరా చేస్తున్నారని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా, 2021తో పోలిస్తే 2022లో పైరసీ సైట్‌ల సందర్శనలలో 21.9% పెరుగుదల వుంది, సందర్శనల సంఖ్య 116.24 బిలియన్ల నుంచి 141.7 బిలియన్లకి పెరిగింది.

2022లో టొరెంట్ సైట్‌ల ద్వారా కంటెంట్ పైరసీ వెబ్‌సైట్‌లని సందర్శించిన వీక్షకుల్లో అమెరికా, రష్యాల తర్వాత మన దేశం 7 బిలియన్ల సందర్శనలతో మూడవ అత్యధిక కంట్రిబ్యూటర్‌గా ర్యాంక్ పొందిందని నివేదిక పేర్కొంది. పాలకుల చలవ వల్ల ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ, భావస్వాతంత్ర్యం, ఆకలి దప్పులు వంటి అన్ని అంతర్జాతీయ సూచికల్లో మన దేశం పతనావస్థకి చేరుకోగా లేనిది- మేమేం తక్కువ తిన్నామా అంటూ ప్రజలు పైరసీకి పట్టం గట్టి ఇండియాని టాప్ రేంజిలో పడగొట్టారు.

దేశంలో ఆన్‌లైన్ కంటెంట్ పైరసీ పెద్ద సమస్యగా మారింది. సినిమా పరిశ్రమ, సంగీత పరిశ్రమ పైరసీని తట్టుకోలేక పోతున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు అధిక సంఖ్యలో వున్నారు. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పైరేటెడ్ కంటెంట్‌ ని యాక్సెస్ చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయింది.

పైరసీ అనేది వ్యక్తుల ద్వారా, లేదా వ్యవస్థీకృత సమూహాల ద్వారా జరుగుతోందనీ, వీరు స్క్రీన్ గ్రాబ్‌ల ద్వారా, లేదా సినిమా థియేటర్లలో ఫోన్‌లలో రికార్డ్ చేయడం ద్వారా కంటెంట్‌ ని క్యాప్చర్ చేసి పంపిణీ చేస్తున్నారనీ నివేదిక పేర్కొంది. అత్యధిక భాగం పైరసీ కంటెంట్ టెలిగ్రామ్, వాట్సాప్ ల వంటి మెసేజింగ్ యాప్‌లలో అందుబాటులో వుందని తెలిపింది.

దేశంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (ఓటీటీలు) పైరసీ వల్ల మొత్తం రాబడిలో 25-30% నష్టపోతున్నాయని గతంలో ఒక వ్యాసంలో పేర్కొన్నాం. ఓటీటీల్లో ఏ కంటెంట్ స్ట్రీమింగ్ ప్రారంభించినా కొన్ని గంటల్లో అది పైరసీ సైట్స్ కి చేరిపోతోంది. అంటే సినిమా పరిశ్రమే కాదు, ఓటీటీ పరిశ్రమ సైతం పైరసీ పాలబడుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లాగా అన్పించే నకిలీ- రోగ్ వెబ్‌సైట్‌లు కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసి వీక్షకుల ట్రాఫిక్ ని మళ్ళించుకుంటున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ వంటి విదేశీ ఓటీటీలు పాస్‌వర్డ్ షేరింగ్‌ సదుపాయాన్ని తొలగించడంతో పైరసీ సవాళ్ళు మరింత తీవ్రమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2022 లో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ మన దేశంలో అత్యధికంగా పైరసీకి గురైన సినిమా (25%). తర్వాతి స్థానాల్లో ‘ది బ్యాట్‌మ్యాన్’ (15%), ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ (14%), ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’ (12%), ‘ఆర్ ఆర్ ఆర్’ (6%), ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ (6%), ‘బీస్ట్’ (6%), ‘పుష్ప: ది రైజ్-పార్ట్ వన్’ (5%) వున్నాయి.

త్వరలో యాంటీ పైరసీ బిల్లు

పైరసీలో మన దేశం మూడో స్థానాన్ని ఆక్రమించిన సన్నివేశమిలా వుండగా, కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నష్టాలకు దారి తీస్తున్న సినిమాల పైరసీని అరికట్టేందుకు ఉద్దేశించిన కొత్త సినిమాటోగ్రాఫ్ బిల్లుని వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం వుంది. ఇటీవలే ఈ బిల్లు కేబినెట్ ఆమోదం పొందింది. చాలా కట్టుదిట్టమైన నిబంధనలతో ఈ సరికొత్త చట్టం వుండబోతోందని చెప్తున్నారు.

బిల్లు రూపకల్పనకి ముందు అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతలతో, భారతీయ చలనచిత్ర పరిశ్రమతో ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు జరిపింది. తద్వారా బిల్లులో అత్యుత్తమ అంతర్జాతీయ నిబంధనల్ని ప్రభుత్వం చేర్చింది. చట్టవిరుద్ధంగా కంటెంట్‌ ని రికార్డ్ చేసే లేదా ఆన్‌లైన్‌లో ప్రసారం చేసే రోగ్ వెబ్‌సైట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

రచయిత నుంచి వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఒక చలనచిత్రాన్ని గానీ, లేదా దాని భాగాన్ని గానీ కాపీగా తయారు చేయడానికి, లేదా ప్రసారం చేయడానికి ఈ కొత్త చట్టం అనుమతించదు. ప్రదర్శనా స్థలంలో ఏ వ్యక్తి ఏ ఆడియో-విజువల్ రికార్డింగ్ పరికరాన్నీ ఉపయోగించడాన్నీ ఈ చట్టం నిరోధిస్తుంది. పైరసీకి పాల్పడిన వారికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు భారీ జరిమానా సహా, ఆరు నెలల నుంచి మూడేళ్ళ వరకు జైలు శిక్ష తప్పదు.

అయితే ఈ కొత్త చట్టంలో వినియోగదార్లకి సంబంధించి నిబంధనల వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి మాత్రం వినియోగదార్లు లైసెన్స్ లేని కంటెంట్ స్ట్రీమ్‌ ని చూస్తున్నట్లయితే, సాంకేతికంగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు. కానీ కంటెంట్ ని డౌన్‌లోడ్ చేసినా, లేదా తామే షో చేసినా, లేదా హోస్ట్ చేసినా కటకటాలు తప్పవు.

First Published:  30 May 2023 7:25 AM GMT
Next Story