Telugu Global
Cinema & Entertainment

చిరంజీవితో సినిమా ఛాన్స్‌ వస్తే.. రిజెక్ట్‌ చేస్తా.. - ‘పొలిమేర–2’ డైరెక్టర్‌

మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ వస్తే మాత్రం తాను రిజెక్ట్‌ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందుకు కారణం కూడా ఆయన వివరించారు.

చిరంజీవితో సినిమా ఛాన్స్‌ వస్తే.. రిజెక్ట్‌ చేస్తా.. - ‘పొలిమేర–2’ డైరెక్టర్‌
X

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్‌ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని చాలా మంది డైరెక్టర్లకు కోరిక ఉంటుంది. ఆ అవకాశం వస్తే అదొక పెద్ద అచీవ్‌మెంట్‌గా భావిస్తారు. కానీ, ‘పొలిమేర–2’ చిత్ర దర్శకుడు డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ మాత్రం చిరుతో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే తాను రిజెక్ట్‌ చేస్తానని చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కోవిడ్‌ సమయంలో ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి కొనసాగింపుగా తాజాగా ‘పొలిమేర–2’ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్ టాక్‌తో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. నవంబర్‌ 3న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్ర డైరెక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి గురించి మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచి మెగాస్టార్‌ చిరంజీవికి పెద్ద అభిమానినని తెలిపారు. తనను మించిన అభిమాని ఆయనకు మరొకరు ఉండరేమోనని చెప్పారు. ఆయనంటే తనకు చెప్పలేనంత అభిమానమ‌ని, తాను డైరెక్ట్‌ చేసిన సినిమాను చిరంజీవి చూసి.. బాగుంది అని అభినందిస్తే చాలు.. ఆ మాటతోనే సినిమాలు తీయడం ఆపేస్తానని చెప్పారు. తనకు అదొక అచీవ్‌మెంట్‌ అని ఆయన తెలిపారు. తనకు ఆ గౌరవం దక్కితే చాలని, ఏ అవార్డులు, రివార్డులు వద్దని చెప్పారు. భవిష్యత్తులో ‘పొలిమేర’కు మించిన సినిమా తప్పకుండా తీస్తానని అనిల్‌ విశ్వనాథ్‌ తెలిపారు.

కానీ, మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ వస్తే మాత్రం తాను రిజెక్ట్‌ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందుకు కారణం కూడా ఆయన వివరించారు. సాధారణంగా డైరెక్టర్‌ అనేవాడు షూటింగ్‌ సమయంలో ఏది బాగుందో.. ఏది బాగోలేదో చెప్పాలని, కానీ చిరంజీవి విషయంలో ఆయన ఏం చేసినా తనకు నచ్చుతుందని వెల్లడించారు. అలాంటప్పుడు కెమెరా ముందు ఆయన యాక్టింగ్‌ని చూసి తాను జడ్జ్‌ చేయలేనన్నారు. కాబట్టి ఆయన అవకాశం ఇచ్చినా.. తాను చేయలేనని చెబుతానని వివరించారు. చిరు నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటి వరకు ఆ సినిమాను 70 సార్లు చూశానని చెప్పారు.

First Published:  14 Nov 2023 7:30 AM GMT
Next Story